• facebook
  • whatsapp
  • telegram

అంటార్కిటికా

 జనాలు.. వనాలు లేని ఖండం!

భూగోళానికి అదొక అంచు. అంతా అత్యంత మందమైన మంచు ఫలకాలతో నిండి ఉంటుంది. వృక్షాలు ఉండవు. మనుషులు నివసించరు. అయినా ఎంతో కీలకమైన ప్రాంతం. ఎందుకంటే అక్కడి వైవిధ్య పరిస్థితులే ప్రపంచ వాతావరణాన్ని, సముద్ర ప్రవాహాలను నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణకు సాయపడతాయి. భూగ్రహ చరిత్ర, భవిష్యత్తుకి సంబంధించిన అంశాలను అర్థం చేసుకోడానికి దోహదపడతాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు, అతి తీవ్ర తుపానులు సంభవించే ఆ ఖండం వివరాలను, విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

దక్షిణార్ధ గోళంలో ‘అంటార్కిటిక్‌’ వలయం లోపల దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న విశాల ప్రదేశాన్ని ‘అంటార్కిటికా ఖండం (టెర్రా ఆస్ట్రాలిస్‌)’ అని పిలుస్తారు. ఇది అయిదో అతిపెద్ద ఖండం. ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతం ఇక్కడ నమోదవుతాయి, అతి తీవ్రమైన తుపానులు సంభవిస్తాయి. దీని సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండాల కంటే ఎక్కువ. ఇక్కడి మంచు కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు సుమారు 55 మీటర్ల ఎత్తు పెరుగుతాయి, తీర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు నీట మునిగిపోతాయి. ఆ మంచు పొరల ఎత్తు గరిష్ఠంగా 4,500 మీటర్లు, కనిష్ఠంగా 3,000 మీటర్లు. ఇది ప్రపôచంలోకెల్లా అత్యంత శుష్క ప్రాంతం. దీనిని మంచు భూమి అని పిలుస్తారు. అంటార్కిటికాలో సుమారు 98% ఉపరితలాన్ని ప్రపంచంలోనే అత్యంత దళసరి, అతిపెద్ద  మంచుపొర కప్పి ఉంటుంది. భూగోళంలోని దాదాపు 90% మంచు, 75% మంచినీరు ఈ ఖండంలోనే ఉన్నాయి. అతిపెద్ద హిమానీ నదాలైన లాంబార్డ్, బియర్డ్‌ మోర్‌ ఇక్కడే కనిపిస్తాయి. ఇది మానవ సంచారం, వృక్షాలు లేని ఖండం. 

ట్రాన్స్‌ అంటార్కిటికా పర్వతాలు అంటార్కిటికాను రెండుగా విభజిస్తున్నాయి. ఈ ఖండాన్ని చేరిన మొదటి వ్యక్తి రోల్డ్‌ అముడ్సన్‌ (1911). 1959లో ఏర్పడిన అంటార్కిటికా ట్రీటీ సిస్టమ్స్‌లో (ఏటీఎస్‌) భారత్‌ 1983లో చేరింది. అంటార్కిటికా వలయాన్ని దాటిన మొదటి వ్యక్తి జేమ్స్‌ కుక్‌. ఈ ఖండంలో ఎత్తయిన శిఖరం విన్సన్‌ మాసిఫ్‌ (4892 మీ.). అది ట్రాన్స్‌ అంటార్కిటికా పర్వతాల్లో ఉంది.

అంటార్కిటికాలో లోతైన ప్రాంతం బెన్‌ట్లీ ట్రెంచ్‌. ఈ ఖండంలోని క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్‌ ఎరిబస్‌. ప్రపంచంలో అతల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఓస్టాక్‌/జివోష్టాక్‌. ఇక్కడ 1960, ఆగస్టు 24న -88.3ా ల ఉష్ణోగత్ర నమోదైంది.

* అంటార్కిటికాలో పొడవైన పర్వత శ్రేణి క్వీన్‌ మౌడ్‌రేంజ్‌. 

* శుష్క లోయల్లో ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది.

* అంటార్కిటికా తీర ప్రాంతాల్లో వీచే అతి తీవ్రమైన, దట్టమైన చలిగాలులను ‘కెటబాటిక్‌ పవనాలు’ అంటారు. 

* ప్రపంచంలో అతి తీవ్రమైన మంచు తుపానులను ‘బ్లిజార్డ్స్‌’ అంటారు. 

* దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు సెప్టెంబరు 23న ఉదయించి, మార్చి 21న అస్తమిస్తాడు. 

* అంటార్కిటికా చలికాలంగా పిలిచే 6 నెలల చీకటి సమయాలు కొద్దిగా వెలుతురును ప్రసరిస్తూ, ఆకాశంలో రంగుల చారలను ప్రదర్శిస్తాయి. ఈ కాంతి పుంజాలను ‘అరోరా ఆస్ట్రాలిస్‌’ అంటారు. 

* నాలుగు వందల రకాల పాకుడు జాతి మొక్కలు, నాచు, గడ్డి పెరుగుతాయి.

* సీల్, నీలి తిమింగలాలు, పెంగ్విన్‌ పక్షులు ముఖ్యమైనవి. పెంగ్విన్‌ పక్షుల గుంపులను ‘రూకరీలు’ అంటారు. పెంగ్విన్‌ పక్షులు అంటార్కిటిక్‌ పక్షి సంతతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

* సముద్ర జలాల్లో రొయ్యని పోలిన జంతువు క్రిల్‌. ఆ జంతువులు ఈ ఖండంలోని మొదటి క్షీరదాలు అని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 

* ఖండంలో నేలబొగ్గు, రాక్‌ఫాస్ఫేట్, యాంటిమొనీ, క్రోమియం, ఫెర్రో మాంగనీస్‌ ఖనిజాలు లభిస్తాయి.

* అభివృద్ధి చెందిన దేశాలు 1957-58 నుంచి ఈ ఖండంలో పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.

* భారత్‌ అంటార్కిటికాలోకి 1981లో ప్రవేశించింది. మనం ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రాలు 1) దక్షిణ గంగోత్రి (1983)  2) మైత్రి (1989)  3) భారతి (2012).

* ప్రస్తుతం అమల్లో ఉన్న ‘అంటార్కిటికా సంధి’ అని పిలిచే అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఈ ఖండం రాబోయే 50 ఏళ్ల వరకు ప్రకృతి సాధించిన అతిపెద్ద ‘సహజ పరిశోధనాగారం’గా ఉంటుంది.

* రోల్డ్‌ అముడ్సన్‌ (నార్వే) 1911, డిసెంబరు 14న దక్షిణ ధ్రువంపై కాలుమోపారు.

* అంటార్కిటికాలో జన్మించినట్లు (1978, జనవరి 7న) నమోదైన (డాక్యుమెంటెడ్‌) మొదటి మానవుడు ఎమిలియో మార్కోస్‌ పాల్మా.

* అంటార్కిటికా సాధారణంగా అయిదు వేల మందికి ఆతిథ్యం ఇస్తుంది. వేసవి, శీతాకాలాల్లో మసక బారినప్పుడు చాలా స్టేషన్లు పూర్తిగా జనాభాతో ఉంటాయి. 

* శీతాకాలం సమయంలో అంటార్కిటికా జనాభా సుమారు 1000 మందికి తగ్గిపోతుంది. 

* అడవులు లేని ఖండం అంటార్కిటికా. 


ముఖ్యాంశాలు

* భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే, ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. అందుకే ఈ ప్రాంతంలో శాశ్వతంగా నివసించే ప్రజలంటూ ఎవరూ ఉండరు. 

* 14 మిలియన్ల చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం తమదే అని ఏడు దేశాలు పోటీ పడుతున్నాయి. వాటిలో పొరుగునే ఉన్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్‌ దేశాలు సహా సుదూరంలోని ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్‌ ఉన్నాయి.

* అంటార్కిటికాలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసి సార్వభౌమాధికారం ప్రకటించిన తొలిదేశం అర్జెంటీనా. 1904లోనే అర్జెంటీనా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ మనుగడలో ఉన్న అత్యంత పురాతన ‘ది అర్కడాస్‌ బేస్‌’ ఆ దేశానిదే.

* దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమ దక్షిణ ప్రావిన్స్‌లు టేర్రా డెల్‌ ప్యూగో, మాల్వినాస్, సౌత్‌  జార్జియా, సౌత్‌ సాండ్‌విచ్‌ ఐలాండ్స్‌కు కొనసాగింపుగా భావిస్తోంది.

* ఇక్కడ ఉన్న కొన్ని ద్వీపాలు బ్రిటన్‌ అధీనంలో ఉన్నాయి. దీంతో 1908లోనే ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదేనని బ్రిటన్‌ ప్రకటించింది. మరోవైపు 1940లో చిలీ కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. చిలీ సార్వభౌమాధికారం ప్రకటించిన ప్రాంతాల్లో కొన్ని అర్జెంటీనా, బ్రిటన్‌ కింద ఉన్నాయి. 

* ఇక్కడ జర్మనీ, బ్రెజిల్, చైనా, అమెరికా, భారత్, రష్యా సహా 35 దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేశాయి.

* 1959, డిసెంబరు 1న ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన ఏడు దేశాలతోపాటు మరో అయిదు దేశాలు బెల్జియం, అమెరికా, జపాన్, రష్యా, దక్షిణాఫ్రికా మధ్య ‘ది అంటార్కిటిక్‌ ట్రీటీ ఒప్పందం’ కుదిరింది. ప్రపంచ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అంటార్కిటికాను శాంతియుత మార్గాలకు, అంతర్జాతీయ పరిశోధనల కోసం ఉపయోగించుకుంటామని ఈ ఒప్పందంలో తీర్మానించారు. క్రమంగా ఆ ఒప్పందంపై 42 దేశాలు సంతకాలు చేశాయి. వీటిలో 29 దేశాలు మాత్రమే ఇక్కడ పరిశోధనలు చేపడుతున్నాయి. అంటార్కిటికా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడంలో ఈ దేశాలకు ఓటింగ్‌ హక్కులు ఉన్నాయి. ముఖ్యంగా పరిశోధనేతర కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఆ దేశాలు తీర్మానించాయి.


* జర్నలిస్టు మాథ్యుటెల్లర్‌ అంటార్కిటికాపై పరిశోధన చేశారు. ఈయన ప్రకారం శాస్త్రవేత్తలు భూవిజ్ఞానంపై ఎక్కువగా దృష్టి సారించడానికి కారణం ఈ ఖండంలోని మంచు కింద ఎంతో విలువైన సహజ సంపదలు ఉండటం. అంటార్కిటికా కింద దాదాపు రెండు లక్షల మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇది కువైట్‌ అబుదాబిలో ఉన్నదాని కంటే చాలా ఎక్కువ అని మాథ్యుటెల్లర్‌ తెలిపారు.

* అంటార్కిటిక్‌ సముద్రం కూడా భారీ మత్స్య సంపదకు నిలయం. ఇక్కడ చేపల వేటను ‘కమిషన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ అంటార్కిటిక్‌ మెరైన్‌ లివింగ్‌ రిసోర్సెస్‌’ నియంత్రిస్తుంది. 

* 2016లో 59 కి.మీ. సముద్ర ప్రాంతంపై ‘యూఎన్‌ కమిషన్‌ ఆన్‌ ది లిమిట్స్‌ ఆఫ్‌ ది కాంటినెంటల్‌ షెల్ఫ్‌’ హక్కులను పొందింది.

* అంటార్కిటికాలో గడ్డకట్టిన మంచు రూపంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత మంచినీరు ఉంది. 

* అంతరిక్ష పరిశోధనలకు ఉపగ్రహాలపై నిఘా పెట్టడానికి ఇది చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ చైనా ఏర్పాటు చేసిన తియాషన్‌ స్థావరాన్ని నిఘా కోసం ఉపయోగించుకుంటున్నారని ఆస్ట్రేలియా 2014లోనే తెలిపింది. ఇది అన్ని రకాల సహజ వనరులకు నిలయం.

రచయిత: జయకర్‌ సక్కరి

Posted Date : 03-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌