• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధిత అంశాలు - వ్యాధులు

ప్రాణ వాయువు ర‌వాణాలో ప్ర‌త్యేక క‌ణ‌జాలం! 



రక్తాన్ని ద్రవరూప కణజాలం అని కూడా అంటారు. శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువు సహా అవసరమైన పోషకాల రవాణాలో దానిదే ప్రధాన పాత్ర. రక్తంలోని హిమోగ్లోబిన్‌తో పాటు ఎరుపు, తెలుపు కణాలు నిర్ణీత స్థాయికి మించి పెరిగినా, తగ్గినా వ్యాధులు కలుగుతాయి. గుండె జబ్బులన్నీ రక్తానికి, రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినవే. శరీరంలో నిరంతరం జరిగే రక్త పంపిణీ గుండె, రక్తనాళాలను ప్రభావితం చేసే ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడు, ఏ కారణాలతో తలెత్తుతాయో పోటీ పరీక్షార్థులు ప్రాథమికంగా తెలుసుకోవాలి. పోషకాహార లోపంతో పాటు జీవనశైలి కారణంగా పెరుగుతున్న రక్తహీనత, గుండె సంబంధ వ్యాధుల్లోని రకాలు, వాటి నివారణ మార్గాలు, చికిత్సా విధానాలు, ఉపయోగించే పరికరాల గురించి పరీక్ష కోణంలో చదువుకోవాలి.
 

రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడాన్ని రక్తహీనతగా పిలుస్తారు. కొన్నిసార్లు ఎర్ర రక్తకణాల సమస్యలు, వ్యాధులను కూడా రక్తహీనతగా పిలుస్తారు. ఇందులోనూ రకాలుంటాయి. 


1) పోషకాహార రక్తహీనత (న్యూట్రిషనల్‌ ఎనీమియా): ఇది అతిసాధారణ రక్తహీనత వ్యాధి. ఆహారంలో ఇనుము లోపం వల్ల వస్తుంది. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ ఏర్పడటానికి ఇనుము అవసరం. ఇది హిమోగ్లోబిన్‌లో అనుఘటకంగా ఉంటుంది. అందుకే ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గుతుంది. ఇనుము ఎక్కువగా ఉండే కాలేయం, ఆకుకూరలు, ఎండిన పండ్లను తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు.


2) పెరినీషియస్‌ ఎనీమియా: ఇది విటమిన్‌- బి12 లోపం వల్ల కలుగుతుంది. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోయి, అభివృద్ధి కుంటుపడుతుంది. విటమిన్‌-బి12  అధికంగా ఉండే ఆహార పదార్థాలైన మాంసం, పాలు, గుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు.


3) మాక్రోసైటిక్‌ ఎనీమియా: దీనినే మెగాలోబ్లాస్టిక్‌ ఎనీమియా అని అంటారు. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాల జీవితకాలం తగ్గి, పరిమాణం పెరిగి విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది. ఫోలిక్‌ ఆమ్లం లోపం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. దీని నివారణకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.


4) కొడవలి కణరక్తహీనత (సికిల్‌సెల్‌ ఎనీమియా): ఇది జన్యు సంబంధ అనువంశిక వ్యాధి. ఒకతరం నుంచి మరొక తరానికి సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలో మారతాయి. దీనివల్ల రక్తనాళాల్లో ఎర్రరక్త కణాల గుచ్ఛం ఏర్పడి ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చు.


5) థలసేమియా: ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్‌లో ఉండే బీటా పాలీపెప్టైడ్‌ శృంఖలం ఏర్పడదు. అంటే హిమోగ్లోబిన్‌ నిర్మాణంలో లోపం ఉంటుంది. దీనివల్ల ఆక్సిజన్‌ రవాణాలో అడ్డంకులు ఏర్పడతాయి. ఇది జన్యులోపం వల్ల కలిగే అనువంశిక వ్యాధి. ఈ వ్యాధిగ్రస్థులకు తరచుగా రక్తం ఎక్కించాలి. ఎముక మజ్జ మార్పిడి ద్వారా ఈ వ్యాధిని కొంత నియంత్రించవచ్చు.


6) హీమోలైటిక్‌ ఎనీమియా: ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. దాంతో రక్తహీనత ఏర్పడుతుంది. దీన్నే హీమోలైసిస్‌ అంటారు.


7) సెప్టిక్‌ ఎనీమియా: రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ పెరిగి విషపూరితంగా మారుతుంది. దానిని సెప్టిక్‌ ఎనీమియాగా పిలుస్తారు.


8) ఎప్లాస్టిక్‌ ఎనీమియా: ఈ వ్యాధిలో ఎముక మజ్జ ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయదు. దాంతో రక్తంలో వాటి సంఖ్య తగ్గిపోతుంది.

రక్తకణాలకు సంబంధించిన వ్యాధులు: రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాలు, రక్త ఫలకికలు ఎక్కువ/తక్కువ కావడం వల్ల వ్యాధులు వస్తాయి.


1) థ్రాంబోసైటోపీనియా: ఈ వ్యాధిలో రక్తఫలకికల సంఖ్య తగ్గుతుంది.


2) థ్రాంబోసైటోసిస్‌: ఈ వ్యాధిలో రక్తఫలకికల సంఖ్య పెరుగుతుంది.


3) ల్యూకోపీనియా: ఈ వ్యాధిలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గుతుంది. 


4) ల్యుకేమియా: దీన్నే బ్లడ్‌ క్యాన్సర్‌ అంటారు. ఈ వ్యాధిలో తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.


5) పాలిసైథీమియా: ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.


6) ఎరిథ్రోసైటోపీనియా: ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల ఎనీమియా (రక్తహీనత) కలుగుతుంది.


గుండె సంబంధ వ్యాధులు: గుండె కొట్టుకోవడం ఎక్కువ/తక్కువ కావడం; పరిమాణం పెరగడం, హృదయ కవాటాల్లో మార్పులన్నీ ఈ కోవలోకి వస్తాయి.


1) బ్రాడీకార్డియా: గుండె కొట్టుకునే వేగం తగ్గడం.


2) టకీకార్డియా: గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.


3) కార్డియో మెగాలి: గుండె పరిమాణంలో పెద్దదిగా పెరగడం.


4) బ్లూబేబీ: పుట్టుకతోనే శిశువు గుండెలో లోపం వల్ల కలిగే స్థితి. దీనిలో గుండెలోని గదులను వేరు చేసే విభాజకం (సెప్టమ్‌)  పూర్తిగా ఏర్పడదు.


5) రూమటాయిడ్‌ హార్ట్‌ డిసీజ్‌: ఈ వ్యాధిలో గుండెలోని కవాటాలు దెబ్బతింటాయి. బ్యాక్టీరియా స్రవించిన విషపదార్థాలు దీనికి కారణం.

రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు: రక్తనాళాలైన ధమనులు, సిరల్లో అడ్డంకులు; రక్తనాళాలు సన్నగా కావడం లాంటివి వీటికి ఉదాహరణ.


1) అథిరోస్ల్కీరోసిస్‌: రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడంతో అవి సన్నగా మారడం వల్ల వచ్చే వ్యాధి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళమైన కరోనరి ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి కరోనరి ఆర్టరీ వ్యాధి వస్తుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాదు. ఫలితంగా అది గుండెపోటుకు దారితీస్తుంది.


2) ఆర్టీరియోస్ల్కీరోసిస్‌: ఈ వ్యాధిలో ధమనులు గట్టిపడి మందంగా తయారవుతాయి. దీనివల్ల అవయవాలకు తగినంత రక్తసరఫరా జరగదు. దీనికి కారణం ధమనుల్లో కాల్షియం పేరుకుపోవడం, పెరిగే వయసు, మధుమేహం, కొవ్వు పేరుకుపోవడం లాంటివి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థితినే అథిరోస్ల్కీరోసిస్‌ అంటారు. ఇది ఆర్టీరియోస్ల్కీరోసిస్‌లో ఒక రకంగా చెప్పవచ్చు.


3) వెరికోస్‌ వీన్స్‌: సిరల్లో ఉండే కవాటాలు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి.


యాంజియోగ్రామ్‌: రక్తనాళాల్లోని అడ్డంకులను గుర్తించేందుకు ఉపయోగపడే పరీక్ష.


కరోనరీ యాంజియోగ్రామ్‌: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలైన కరోనరి ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును లేదా అడ్డంకులను గుర్తించేందుకు ఉపయోగపడే పరీక్ష.


యాంజియోప్లాస్టి: ధమనుల్లో పేరుకుపోయిన అడ్డంకులను లేదా కొవ్వును తొలగించడం.


కరోనరి యాంజియోప్లాస్టీ: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరి ధమనుల్లో అడ్డంకులను, కొవ్వును తొలగించడం.

 

హీమోసైటోమీటర్‌: ఎర్రరక్తకణాల సంఖ్యను గుర్తించడానికి ఉపయోగపడే పరికరం.


 హిమటోక్రిట్‌: (ప్యాక్డ్‌ సెల్‌వాల్యూం): రక్తంలో ఎర్రరక్త కణాల నిష్పత్తిని తెలిపే పరీక్ష.


 హీమోమీటర్‌: రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని తెలిపేందుకు ఉపయోగపడే పరికరం.

 


రక్తస్కంధన నిరోధకాలు: రక్తాన్ని గడ్డకట్టనీయకుండా చేసే పదార్థాలను రక్తస్కంధన నిరోధకాలు అంటారు. వీటికి ఉదాహరణలు ఉన్నాయి.


1) హెపారిన్‌: మన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి కారణం హెపారిన్‌.


2) హిరుడిన్‌: జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు విడుదల చేసే రసాయనం హిరుడిన్‌.


3) హీమోలైసిన్‌: జంతువులు/మానవుల రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు కీటకాలు విడుదల చేసే ఉండే రసాయనం.


4) సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్, ఈథైల్‌ డై అమైన్‌ టెట్రా ఎసిటిక్‌ ఆమ్లం (EDTA) లను రక్తనిధి కేంద్రాల్లో (బ్లడ్‌ బ్యాంక్స్‌) రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు రక్తానికి కలుపుతారు.


5) వార్‌ఫారిన్‌: టోంకాబీన్‌ మొక్క నుంచి లభించే రసాయనం.



మాదిరి ప్రశ్నలు
 


1. కింది ఏ సూక్ష్మపోషక లోపం వల్ల పోషకాహార రక్తహీనత కలుగుతుంది?

ఎ) ఇనుము     బి) విటమిన్‌-బి12    సి) ఫోలిక్‌ ఆమ్లం    డి) ప్రొటీన్‌



2. ఫోలిక్‌ ఆమ్లం లోపం వల్ల కలిగే రక్తహీనతను ఏమంటారు?

ఎ) పెరినీషియస్‌ ఎనీమియా    బి) మాక్రోసైటిక్‌ ఎనీమియా 

సి) న్యూట్రిషనల్‌ ఎనీమియా    డి) సికిల్‌ సెల్‌ ఎనీమియా



3. హిమోగ్లోబిన్‌ నిర్మాణంలో మార్పు వల్ల, ఆక్సిజన్‌ రవాణా సరిగా జరగకపోవడం అనేది ఏ వ్యాధిలో కనిపిస్తుంది?

ఎ) సెప్టిక్‌ ఎనీమియా బి) హీమోలైటిక్‌ ఎనీమియా సి) థలసేమియా డి) సికిల్‌సెల్‌ ఎనీమియా



4. కిందివాటిలో జన్యుసంబంధ రక్తహీనత వ్యాధి?

ఎ) ఎప్లాస్టిక్‌ ఎనీమియా బి) మెగాలోబ్లాస్టిక్‌ ఎనీమియా

సి) మాక్రోసైటిక్‌ ఎనీమియా డి) థలసేమియా



5. రక్తంలో రక్తఫలకికల సంఖ్య తగ్గడాన్ని ఏమని పిలుస్తారు?

ఎ) థ్రాంబోసైటోసిస్‌ బి) థ్రాంబోసైటోపీనియా సి) ల్యూకోపీనియా డి) ల్యుకేమియా



6. తెల్ల రక్తకణాల సంఖ్య ఎక్కువగా పెరిగితే వచ్చే ఏ వ్యాధిని బ్లడ్‌ క్యాన్సర్‌ అని పిలుస్తారు?

ఎ) ఎరిథ్రోసైటోపీనియా    బి) ఎరిథ్రీమియా   సి) ల్యుకేమియా    డి) ల్యూకోపీనియా



7. పాలిసైథీమియా అంటే ఏమిటి? 

ఎ) రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడం.

బి) రక్తంలో రక్త ఫలకికల సంఖ్య పెరగడం.

సి) రక్తంలో కొవ్వు కణాలు పెరగడం.

డి) రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరగడం.



8. గుండె కొట్టుకునే వేగం తగ్గడాన్ని ఏమని పిలుస్తారు? 

ఎ) బ్రాడీకార్డియా   బి) టకీకార్డియా   సి) కార్డియోమెగాలి   డి) అథిరోస్ల్కీరోసిస్‌



9. కింది దేనివల్ల గుండెపోటు వస్తుంది?

ఎ) బ్లూబేబీ సిండ్రోమ్‌          బి) గుండె కవాటాలు దెబ్బతినడం

సి) కరోనరి అథిరోస్ల్కీరోసిస్‌      డి) సెప్టిక్‌ ఎనీమియా



10. కిందివాటిలో మొక్కల నుంచి లభించే ఏ రసాయనం రక్త స్కంధన నిరోధకంగా పనిచేస్తుంది? 

ఎ) హెపారిన్‌   బి) హిరుడిన్‌    సి) హీమోలైసిన్‌    డి) వార్‌ఫారిన్‌



సమాధానాలు: 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-బి, 6-సి, 7-డి, 8-ఎ, 9-సి, 10-డి.

 

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌


 

 

Posted Date : 03-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌