రెండు రకాలు.. తొమ్మిది వర్గాలు!
జీవ పరిణామ క్రమంలో జంతువుల ఆవిర్భావం తొలుత ఏక కణ జీవులుగా, ఆ తర్వాత బహుకణ జీవులుగా జరిగింది. అవే అకశేరుకాలుగా, సకశేరుకాలుగా రూపాంతరం చెందాయి. వేటికవే వైవిధ్య లక్షణాలతో మనుగడ సాగిస్తున్నప్పటికీ సంఖ్యాపరంగా అకశేరుకాలే అధికం. ఇవి పరిమాణంలో చిన్నగా ఉంటాయి. వీటిలో కొన్ని జీవులు మనుషుల్లో వ్యాధులకు కారణమవుతుంటాయి. వాటి గురించి పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి.
భూమిపై ఉన్న సకల జీవరాశుల్లో జంతువులు ప్రత్యేకమైనవి. వీటి శరీర నిర్మాణంలో, జీవక్రియల్లో అనేక రకాల వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి జంతువులైన క్షీరదాలు మేధస్సు పరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. మానవుడు కూడా క్షీరద విభాగానికి చెందినవాడే. జంతువులన్నింటినీ జంతురాజ్యంలో ఉంచారు. వీటిని తిరిగి అకశేరుకాలు (వెన్నెముక లేని జంతువులు), సకశేరుకాలు (వెన్నెముక ఉన్న జంతువులు)గా విభజించారు.
జంతు సామ్రాజ్యంలో అధిక జీవులు అకశేరుకాలు. వీటిని 9 వర్గాలుగా విభజించారు. అవి.. ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనెలిడా, ఆర్ద్రోపొడా, మొలస్కా, ఇఖైనోడర్మేటా.
ప్రోటోజోవా: ఇవి ఏక కణ నిజకేంద్రక జీవులు. జంతురాజ్యంలో అత్యంత ప్రాథమిక జీవులు. వీటి అధ్యయనాన్ని ప్రోటోజువాలజీ అంటారు. శ్వాసక్రియ శరీర ఉపరితలం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల్లో జరుగుతుంది.
ఉదాహరణలు - ప్రత్యేకతలు:
* అమీబా - దీనికి నిర్ణీత ఆకారం ఉండదు, మిథ్యా పాదాలతో చలిస్తుంది.
* పారామీషియం - ఇది కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు.
* వర్టిసెల్లా - బెల్ యానిమల్ క్యూల్ అంటారు.
* కొన్ని ప్రోటోజోవా జీవులు మానవుడిలో వ్యాధులను కలగజేస్తాయి.
ఉదా: ప్లాస్మోడియం - మలేరియా వ్యాధి,
ఎంటమీబా హిస్టోలైటికా - అమీబియాసిస్,
ట్రిపనోసోమా గాంబియన్సి - ట్రిపనో సోమియాసిస్
పొరిఫెరా: రంధ్రాలున్న జీవులను ఈ విభాగంలో చేర్చారు. ఇవి ఎక్కువగా సముద్రాల్లో, కొన్ని మంచినీటిలో నివసిస్తాయి. స్థానబద్ధ జీవులు. నీటిలో రాళ్లకు, కర్పరాలకు అతుక్కొని ఉంటాయి. వీటిలోని జీవులను సాధారణంగా స్పంజికలు అంటారు. స్పంజికల అధ్యయనాన్ని పారాజువాలజీ అంటారు. స్పంజికలు పునరుత్పత్తిని చూపిస్తాయి.
ఉదాహరణలు - ప్రత్యేకతలు:
* యూస్పాంజియా - దీన్ని బాత్‌స్పాంజ్ అంటారు. వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు.
* సైకాన్ - క్రౌన్ స్పాంజ్ అంటారు.
* స్పాంజిల్లా - మంచినీటి స్పాంజి
* హయలోనీమా - గ్లాస్ స్పాంజ్
* యూప్లెక్టెల్లా - వీనస్ ప్లవర్ బాస్కెట్
సీలెంటరేటా: ఈ వర్గాన్ని నిడేరియా అని కూడా పిలుస్తారు. సీలెంటరేటా అంటే కుహరం ఉన్న జీవులని అర్థం. ఇవన్నీ జలచర జీవులు. కొన్ని మంచినీటిలో, మరికొన్ని సముద్రాల్లో నివసిస్తాయి. నోటిని ఆవరించి ఉండే సన్నని స్పర్శకాలు ఆహార సేకరణ, రక్షణ, గమనానికి ఉపయోగపడతాయి. సీలెంటరేటా జీవులను స్టింగింగ్ ఎనిమల్ క్యూల్స్ అంటారు. ఈ విభాగంలోని జెల్లీ చేపలు విషపూరితమైనవి. ప్రవాళాలు, సీఅనిమోన్ జీవులు సీలెంటరేటాకు చెందినవి.
ఉదాహరణలు - ప్రత్యేకతలు:
* హైడ్రా - మంచినీటి పాలిప్
* అరేలియా - మూన్ జెల్లీ చేప. ఇది మిథ్యా చేప.
* మెట్రిడియమ్, ఆడామ్‌సియా - వీటిని సీఅనిమోన్‌లని అంటారు.
* పెన్నాట్యులా - సీ పెన్
* కొరాల్లియమ్ - రెడ్ కోరల్
* హీలియోపోరా - బ్లూ కోరల్
ప్లాటిహెల్మింథిస్: బల్లపరుపు పురుగులను ఈ విభాగంలో చేర్చారు. ఇవి త్రిస్తరిత జీవులు. చాలావరకు పరాన్నజీవులుగా నివసిస్తాయి. బద్దె పురుగులు లాంటివి కొన్ని మానవుడిలో వ్యాధులు కలగజేస్తాయి. వీటి విసర్జక వ్యవస్థలో జ్వాలా కణాలు ఉంటాయి. ఆహారనాళం అసంపూర్ణంగా ఉంటుంది.
ఉదాహరణలు - ప్రత్యేకతలు
* టీనియా సోలియం - పోర్క్ టేప్‌వార్మ్
* టీనియా సాజినేటా - బీఫ్ టేప్‌వార్మ్
పై రెండు బద్దెపురుగులు మానవుడిలో టీనియాసిస్ వ్యాధిని కలిగిస్తాయి.
* ఇఖైనోకోకస్ గ్రాన్యులోసస్ - డాగ్ టేప్‌వార్మ్ అంటారు. ఇవి హైడటిడ్ వ్యాధికి కారకం.
* సిస్టోసోమా హిమటోబియమ్ - బ్లడ్ ఫ్లూక్ అంటారు. సిస్టోసోమియాసిస్ వ్యాధి కారకం.
* ఫాషియోలా హెపాటికా - లివర్ ఫ్లూక్ అంటారు.
నిమాటిహెల్మింథిస్: దారం పోగుల్లాంటి జీవులు ఈ విభాగంలో ఉంటాయి. శరీరం రెండు చివరలు మొనదేలి ఉంటుంది. కొన్ని జీవులు మానవుడిలో పరాన్నజీవులుగా ఉంటాయి.
ఉదాహరణలు - ప్రత్యేకతలు:
* వుచరేరియా బాంక్రాఫ్టి - దీన్ని ఫైలేరియా వార్మ్ అంటారు. వీటి వల్ల మానవుడిలో ఏనుగు కాలు లేదా బోదకాలు వ్యాధి వస్తుంది.
* డ్రాకన్‌క్యులస్ - దీన్ని గునియా వార్మ్ అంటారు. ఇది మానవుడిలో గునియావార్మ్ వ్యాధి/ డ్రాకన్‌క్యులియాసిస్‌ను కలిగిస్తుంది. ఈ జీవి కలుషిత నీటి ద్వారా ప్రత్యేకంగా దిగుడు బావి నీటి ద్వారా వ్యాపిస్తుంది.
* ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ - దీన్ని ఇంటస్టైనల్ రౌండ్ వార్మ్ అంటారు. ఇది మానవుడిలో ఆస్కారియాసిస్ వ్యాధిని కలిగిస్తుంది.
* ఎంకైలోస్టోమా డుయోడినీల్ - దీన్ని హుక్‌వార్మ్/ కొంకిపురుగు అంటారు. ఎంకైలోస్టోమియాసిస్ వ్యాధి కారకం. పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
* లోవా-లోవా- దీన్ని ఆఫ్రికా కంటి పురుగు అంటారు. కెలబార్ స్వెల్లింగ్ వ్యాధికి కారణమవుతుంది.
అనెలిడా: శరీరంలో వలయాలు ఏర్పడిన జీవులను ఈ విభాగంలో చేర్చారు. మొదటి బంధిత రక్తప్రసరణ ఉన్న జీవులు ఇవే. వీటిలో జీర్ణగ్రంథులుంటాయి. విసర్జన క్రియ వృక్కాల ద్వారా జరుగుతుంది. రక్తంలో ఎర్రరక్త కణాలుండవు. హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉంటుంది. ఈ రక్తాన్ని హీమోలింఫ్ అంటారు. కొన్ని జీవుల్లో శ్వాసక్రియ చర్మం ద్వారా జరుగుతుంది.
ఉదాహరణలు - ప్రత్యేకతలు:
* నీరిస్ - దీన్ని శాండ్‌వార్మ్ అంటారు
* జలగ - ఇది సాంగ్వివోరస్ (రక్తాన్ని పీల్చే) జంతువు. దీని లాలాజలంలో హిరుడిన్ అనే రక్తస్కంధన నిరోధక రసాయనం ఉంటుంది.
* వానపాము - దీని శాస్త్రీయనామం ఫెరిటిమా పోస్తుమా. వీటి పెంపకాన్ని వెర్మికల్చర్ అంటారు. ఇవి నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. వానపామును రైతుల నేస్తం అంటారు.
ఆర్ద్రోపోడా: వీటిని కీలు కాళ్ల జంతువులు అంటారు. జంతురాజ్యంలో అతిపెద్దవర్గం ఆర్ద్రోపోడా. ప్రపంచంలో జంతువుల సంఖ్యలో ఎక్కువశాతం ఆర్ద్రోపోడాకు చెందినవే. ఇవి భూమిపై ఉన్న అన్ని ఆవాసాల్లో నివసిస్తాయి. శరీరంపై కైటిన్ అనే పదార్థంతో ఏర్పడిన కవచం బాహ్య అస్థిపంజరంగా పనిచేస్తుంది. ఈ విభాగంలో ఉన్న జలచర జీవుల్లో.. తేలు మొప్పలతో, సాలెపురుగు పుస్తకాకార ఊపిరితిత్తులతో, కీటకాలు వాయు నాళాలతో శ్వాసక్రియ జరుపుతాయి. అంతస్రావ్యత అభివృద్ధి చెందిన మొదటి జీవులు ఇవే. విసర్జన క్రియకు మాల్ఫీజియన్ నాళికలు, హరిత గ్రంథులు, కోక్సల్ గ్రంథులు ఉంటాయి.
ఉదాహరణలు - ప్రత్యేకతలు:
* కీటకాలు - వీటి అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు. వీటిలో ఉండే హార్మోన్‌లను ఫిరోమోన్‌లు అంటారు.
* సిల్వర్ ఫిష్ - ఇది మిథ్యా చేప.
* పెరిపేటస్ - అనిలెడా, ఆర్ద్రోపోడా వర్గాలకు అనుసంధానంగా ఉంటుంది.
* లిమ్యులస్ - రాచపీత అని, సజీవ శిలాజం అని అంటారు.
* స్కోలోపెండ్రా, స్కూటిగెరా - శతపాదులు అంటారు.
* జులాస్ - సహస్రపాది అంటారు.
మొలస్కా: మెత్తని శరీరం ఉన్న జీవులను ఈ విభాగంలో చేర్చారు. మొలస్కా జీవుల అధ్యయనాన్ని మెలకాలజీ అంటారు. ఇది జంతురాజ్యంలో రెండో అతిపెద్ద విభాగం. కొన్ని జీవులకు కాల్షియం కార్బొనేట్‌తో కూడిన బాహ్య కవచం (కర్పరం) ఉంటుంది. ఈ కర్పరాల అధ్యయనాన్ని కాంకాలజీ అంటారు. హీమోసయనిన్ శ్వాసవర్ణకంగా ఉంటుంది. దీనిలో రాగి అంతర్భాగంగా ఉంటుంది. విసర్జన క్రియ నాళికాయుత అంత్య వృక్కాల వల్ల జరుగుతుంది. సాధారణంగా వీటిని మూత్రపిండాలంటారు.
ఉదాహరణలు - ప్రత్యేకతలు
* నత్త - దీని నాలుకపై రాడ్యులా అనే నిర్మాణం ఉంటుంది.
* ముత్యపుచిప్ప - దీని కర్పరం, ముత్యాలు రసాయనికంగా కాల్షియం కార్బొనేట్ నిర్మితాలు.
* ఆక్టోపస్ - దీన్ని డెవిల్ ఫిష్, మిథ్యా చేప అంటారు.
* జెయింట్ స్క్విడ్ - అకశేరుకాల్లో అతిపెద్ద జంతువు.
* సిపియా - దీన్ని కటిల్ ఫిష్ అంటారు.
* టెరిడో - దీన్ని వుడ్ బోరర్, షిప్‌వార్మ్ అంటారు. ఇది పడవలకు నష్టం కలిగిస్తుంది.
ఇఖైనోడర్మేటా: శరీరంపై ముళ్ల లాంటి నిర్మాణాలున్న జీవులు. అన్నీ సముద్రపు జీవులు. జలప్రసరణ వ్యవస్థ ఉంటుంది. శరీరభాగాలు స్వయం ఛేదనం, పునరుత్పత్తిని కలిగి ఉంటాయి.
ఉదాహరణలు - ప్రత్యేకతలు
* ఎస్టిరియాస్ - దీన్ని స్టార్‌ఫిష్ అంటారు. ఇది మిథ్యా చేప.
* ఇఖైనస్ - దీన్ని సీ అర్చిన్ అంటారు.
* ఏంటిడాన్ - దీని సిలిల్లీ లేదా ఫెదర్‌స్టార్ అంటారు.
* బ్రిటిల్‌స్టార్ - సీ కుకుంబర్‌లు
మాదిరి ప్రశ్నలు
1. ప్రోటోజోవా విభాగంలో ఏ జీవి కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది?
1) అమీబా 2) పారామీషియం 3) వర్టిసెల్లా 4) యుగ్లీనా
2. ప్రోటోజోవా జీవుల్లో మానవుడిలో పరాన్నజీవులుగా ఉండే జీవులు?
1) ప్లాస్మోడియం 2) ఎంటమీబా హిస్టోలైటికా
3) ట్రిపనోసోమా గాంబియన్సీ 4) పైవన్నీ
3. అకశేరుకాల్లో ఏ జీవులను సాధారణంగా స్పంజికలని పిలుస్తారు?
1) ప్రోటోజోవా 2) సీలెంటరేటా 3) పొరిఫెరా 4) ఇఖైనోడర్మేటా
4. సీలెంటరేటా విభాగంలో కింది ఏ జీవులు విషపూరితంగా ఉంటాయి?
1) జెల్లీ చేప 2) హైడ్రా 3) సైకాన్ 4) యుగ్లీనా
5. కోరల్స్ (పగడపు జీవులు) ఏ విభాగానికి చెందుతాయి?
1) ప్లాటి హెల్మింథిస్ 2) నిమాటి హెల్మింథిస్ 3) సీలెంటరేటా 4) అనెలిడా
6. ఏ ప్లాటిహెల్మింథిస్ జీవిని పోర్క్ టేప్‌వార్మ్ అంటారు?
1) టీనియా సోలియం 2) టీనియా సాజినేటా 3) ఇఖైనోకోకస్ 4) సిస్టోసోమా
జవాబులు: 1-2 2-4 3-3 4-1 5-3 6-1.
రచయిత: డాక్టర్ బి.నరేశ్