• facebook
  • whatsapp
  • telegram

జీర్ణగ్రంథులు-స్రావాలు-ఉపయోగాలు

అరుగుదల జరిపే కర్మాగారాలు!


మానవ జీర్ణవ్యవస్థల్లో జీర్ణ గ్రంథులు అంతర్భాగం. ఇవి జీర్ణరసాలు, ఎంజైమ్‌లను స్రవించే అవయవాలు. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇవే ముఖ్యపాత్ర పోషిస్తాయి. జీర్ణవ్యవస్థలోని వివిధ భాగాల్లో ఉన్న జీర్ణ గ్రంథులు, వాటి పనులు, ప్రదర్శించే రసాయనిక ధర్మాలు, ఉపయోగాలు, అంతిమ ఫలితాల గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. కాలేయం, క్లోమం వంటి అతిపెద్ద గ్రంథుల నుంచి నాలుక కింద ఉండే అతిచిన్న లాలాజల గ్రంథుల వరకు వివరాల, పనితీరు, వాటికి వచ్చే వ్యాధులు, అందుకు కారణాలపై అవగాహన పెంచుకోవాలి.


జీర్ణ వ్యవస్థ ప్రధాన విధుల్లో జీర్ణక్రియ ఒకటి. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారడం, శోషితంకాలేని పదార్థాలు శోషితమయ్యే విధంగా రూపొందడమే జీర్ణక్రియ. నోటిలోని దంతాలు ఆహారాన్ని బాగా నమిలి సాయపడి దాన్ని చిన్న పరిమాణంలోకి మారుస్తాయి. ఎంజైమ్‌లు ఆ ఆహార పదార్థాలపై పనిచేసి, వాటిని రసాయనికంగా మార్పు చెందించి జీర్ణమయ్యేలా చేస్తాయి.జీర్ణగ్రంథులు నోటి నుంచి చిన్న పేగు వరకు వివిధ భాగాల్లో ఉండి జీర్ణరసాలను స్రవిస్తాయి.


లాలాజల గ్రంథులు: ఇవి బహిస్స్రావ గ్రంథులు. అంటే ఒక నాళం ద్వారా లాలాజలాన్ని నోటిలోకి విడుదల చేస్తాయి. మానవుడిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి

 1) పెరోటిడ్‌ గ్రంథులు 

2) అథోజిహ్వికా గ్రంథులు 

3) అథోజంబిగా గ్రంథులు


1) పెరోటిడ్‌ గ్రంథులు: ఇవి అతిపెద్ద లాలాజల గ్రంథులు. చెవి కింద ఉంటాయి. మిక్సోవైరస్‌ పెరటోడిస్‌ అనే వైరస్‌ వల్ల వీటికి కలిగే వ్యాధి గవద బిళ్లలు (మమ్స్‌).


2) అథోజిహ్వికా గ్రంథులు(sublingual glands):  ఇవి అతిచిన్న లాలాజల గ్రంథులు. నాలుక కింద ఉంటాయి.


3) అథోజంబికా గ్రంథులు(sub mandibular glands): ఇవి మధ్య పరిమాణంలో, దవడ కింది భాగంలో ఉంటాయి.


లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. అందులో నీరు, ఎంజైమ్‌లు, ఎలక్ట్రోలైట్లు, మ్యూకస్‌ ఉంటాయి.మ్యూకస్‌ ఆహారానికి జిగురునివ్వడానికి ఉపయోగపడుతుంది. ఎంజైమ్‌లలో లైసోజైమ్‌ ఎంజైమ్‌ ఆహారంలోని బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. లాలాజలంలో ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్‌ లాలాజల ఎమైలేజ్‌.దీనినే టయలిన్‌ అని కూడా అంటారు. ఇది పిండిపదార్థాలపై పనిచేసి మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది. ఈ విధంగా ఆహారం జీర్ణమవడం నోటిలో ప్రారంభమవుతుంది. నోటిలో మొదట జీర్ణమయ్యేది పిండిపదార్థం. లాలాజల pHదాదాపుగా 6.8గా ఉంటుంది.


జఠర గ్రంథులు: జీర్ణాశయంలోని గ్రంథులను జఠర గ్రంథులు అంటారు. ఇవి 3 రకాలు 


1) కార్డియాక్‌ గ్రంథులు 


2) పైలోరిక్‌ గ్రంథులు 


3) ఫండిక్‌ గ్రంథులు 


ఇవన్నీ కలిసి విడుదల చేసిన వాటిని జఠర రసం అంటారు. రోజూ 2 నుంచి 3 లీటర్ల జఠర రసం విడుదలవుతుంది. జఠర గ్రంథుల్లో కార్డియాక్, పైలోరిక్‌ గ్రంథులు జిగురు (మ్యూకస్‌)ను స్రవిస్తాయి. మ్యూకస్‌ జీర్ణాశయానికి రక్షణనిస్తుంది. జఠర రసంలోని హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం జీర్ణాశయ గోడలకు హాని కలిగించకుండా మ్యూకస్‌ రక్షణ కల్పిస్తుంది. జఠర గ్రంథులైన ఫండిక్‌ గ్రంథుల్లో 3 రకాల కణాలుంటాయి. అవి

 1) పెప్టిక్‌ కణాలు

 2) ఆక్సిన్‌టిక్‌ కణాలు 

3) గ్లోబ్‌లెట్‌ కణాలు


1) పెప్టిక్‌ కణాలు: ఇవి జీర్ణ ఎంజైమ్‌లైన పెప్సినోజెన్, ప్రొరెనిన్, లైపేజ్‌లను స్రవిస్తాయి. వీటిలో పెప్సినోజెన్, ప్రోరెనిన్‌లను ప్రోఎంజైమ్‌లు అంటారు. నిష్క్రియా రూపంలో ఉంటాయి. ఇవి నిజమైన ఎంజైమ్‌లకు ముందు ఉండే రూపాలు. వీటిపై హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం పనిచేయడం వల్ల పెప్సినోజెన్‌ అనేది క్రియారూపమైన పెప్సిన్‌ ఎంజైమ్‌గా, ప్రోరెనిన్‌ అనేది క్రియారూపమైన రెనిన్‌గా మారతాయి.


పెప్సిన్‌ ఎంజైమ్‌ ప్రొటీన్లపై పనిచేసి వాటిని పెప్టైడ్‌లుగా మారుస్తుంది. రెనిన్‌ ఎంజైమ్‌ పాలపై పనిచేసి పెరుగుగా మారుస్తుంది (పాల స్కంధన ప్రక్రియకు తోడ్పడుతుంది).. లైపేజ్‌ ఎంజైమ్‌ కొవ్వులపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది.


ఆక్సిన్‌టిక్‌ కణాలు: వీటినే పెరైటల్‌ కణాలు అంటారు. ఇవి హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని, ఇన్‌ట్రిన్సిక్‌ కారకాన్ని స్రవిస్తాయి. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఉండటం వల్ల జఠర రస pH 1.2  1.8 వరకు ఉంటుంది. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఎంజైమ్‌లను ఉత్తేజితం చేయడానికి, బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. ఇన్‌ట్రిన్సిక్‌ కారకం విటమిన్‌ - బి12 లాంటి సూక్ష్మపోషకాల శోషణకు ఉపయోగపడుతుంది.


గోబ్లెట్‌ కణాలు: ఇవి మ్యూకస్‌ను స్రవిస్తాయి. జీర్ణాశయం జఠర రసం కాకుండా ఆకలిని నియంత్రించడానికి కావాల్సిన గ్యాస్టిన్‌ లాంటి హార్మోన్లను కూడా స్రవిస్తుంది.


కాలేయం: శరీరంలో అతిపెద్దదైన గ్రంథి. ఈ గ్రంథి జీర్ణాశయానికి ఎదురుగా ఉంటుంది. కాలేయం గురించి చేసే అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు. కాలేయానికి హెపటైటిస్‌ A, B, C, D, E  వైరస్‌ల వల్ల హెపటైటిస్‌A, B, C, D, E వ్యాధులు కలుగుతాయి.  అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. యి. కాలేయానికి అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అంటే దీనిలో కొంతభాగం తీసివేసినా కొద్ది రోజుల్లో అది పూర్వస్థితికి చేరుకుంటుంది. కాలేయం సుమారు 1.5 కిలోల బరువు ఉంటుంది. దీనిని అతిపెద్ద జీవరసాయన కర్మాగారం అంటారు. పలు రసాయనాలను స్రవిస్తుంది. వాటిలో ఒకటి హెపారిన్‌. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టక పోవడానికి కారణం హెపారిన్‌.


కాలేయం విటమిన్‌A, విటమిన్‌-D, విటమిన్‌-B12, ఇనుము, రాగి, కొవ్వు, గ్లైకోజన్‌ లాంటి వాటిని నిల్వ చేస్తుంది. ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని కుఫర్‌ కణాలు ఫాగోసైటాసిస్‌ను చూపుతాయి. అంటే బ్యాక్టీరియాను కణ భక్షణ ద్వారా చంపుతాయి. కాలేయంలోని ఉన్న కెరోటినేజ్‌ ఎంజైమ్‌ వల్ల క్యారెట్, బొప్పాయి లాంటి వాటిలో ఉన్న కెరోటిన్‌ (ప్రో విటమిన్‌A) విటమిన్‌A గా మారుతుంది. శరీరంలో ఎక్కువైన అమైనో ఆమ్లాలు కాలేయంలో యూరియాగా మారతాయి. ఆల్కహాల్‌ అధికంగా తీసుకోవడం, కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల కాలేయంపై కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీలివర్‌ స్థితి కలుగుతుంది. ఇది చివరి దశలో కాలేయ సిర్రోసిస్‌ వ్యాధిని కలిగిస్తుంది. దీంతో కాలేయం గట్టిగా రాయిలా మారుతుంది.


కాలేయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. ఇదొక నాళం ద్వారా ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్‌లు ఉండవు. కాని పైత్యరస వర్ణకాలు, పైత్యరస లవణాలు ఉంటాయి. పసుపు రంగులో ఉండే బిలిరూబిన్, ఆకుపచ్చ రంగులో ఉండే బిలివర్డిన్‌ అనేవి పైత్యరస వర్ణకాలు. సోడియం గ్లైకో కోలేట్, సోడియం టారోకోలేట్‌ అనేవి పైత్యరస లవణాలు.


పైత్యరసం కొవ్వుల ఎమల్సీఫికరణానికి తోడ్పడుతుంది. అది తాత్కాలికంగా పిత్తాశయం(gal bladder) లో నిల్వ ఉంటుంది. ఇది సంకోచించడం వల్ల పైత్యరసం నాళం ద్వారా ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం, అడ్డంకులు, ఇతర కారణాల వల్ల పైత్యరస వర్ణకాలు రక్తంలో ఎక్కువవుతాయి. ఈ స్థితినే కామెర్లుగా పిలుస్తారు.

క్లోమం: శరీరంలో రెండో అతిపెద్ద గ్రంథి. జీర్ణరస ఎంజైమ్‌లు, హార్మోన్లను విడుదల చేస్తుంది. అందుకే దీనిని మిశ్రమ గ్రంథి అంటారు. జీర్ణాశయానికి కింద ఆంత్ర మూలపు వంపులో ఉండి నాళం ద్వారా క్లోమ రసాన్ని ఆంత్రమూలంలోకి విడుదల చేస్తుంది. క్లోమరసం క్షారయుతంగా ఉండి అనేక ఎంజైములతో ఉంటుంది 


1) క్లోమరస అమైలేజ్‌: ఈ ఎంజైమ్‌ పిండి పదార్థాలపై పనిచేసి వాటిని మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది.


2) ట్రిప్సిన్‌: ఇది మొదట ట్రిప్సినోజెన్‌ అనే నిష్క్రియా రూపంలో విడుదలవుతుంది. దీనిపై ఆంత్రమూలం నుంచి విడుదలైన ఎంటిరోకైనేజ్‌ అనే ఎంజైమ్‌ పనిచేయడం వల్ల అది ట్రిప్సిన్‌ అనే చైతన్యవంతమైన స్థితిలోకి మారుతుంది. ట్రిప్సిన్‌ ఎంజైమ్‌ ప్రొటీన్లపై పనిచేసి వాటిని పెప్టైడ్‌లుగా మారుస్తుంది.


3) కైమోట్రిప్సిన్‌: ఇది మొదట కైమోట్రిప్సినోజెన్‌ అనే నిష్క్రియా రూపంలో విడుదలవుతుంది. దీనిపై ట్రిప్సిన్‌ అనే ఎంజైమ్‌ పనిచేయడం వల్ల అది కైమోట్రిప్సిన్‌ అనే చైతన్యవంతమైన రూపంలోకి మారుతుంది. కైమోట్రిప్సిన్‌ ప్రొటీన్లపై పనిచేసి వాటిని పెప్టైడ్‌లుగా మారుస్తుంది.


లైపేజ్‌: ఈ ఎంజైమ్‌ లిపిడ్‌లపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది.


న్యూక్లియేజ్‌లు: ఇవి కేంద్రకామ్లాలపై పనిచేసి వాటిని న్యూక్లియోటైడ్‌లుగా మారుస్తాయి.

----------------


మాదిరి ప్రశ్నలు


1. కింది ఏ లాలాజల గ్రంథులకు వైరస్‌ సంక్రమణ వల్ల గవద బిళ్లల వ్యాధి కలుగుతుంది?

1) పెరొటిడ్‌ గ్రంథులు      2) అథోజంబికా గ్రంథులు

2) అథోజిహ్వికా గ్రంథులు   4) బ్రన్నర్‌ గ్రంథులు


 

2. లాలాజలంలో ఉండే కింది ఏ ఎంజైమ్‌ పిండిపదార్థాలపై చర్య జరిపి వాటిని మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది? 

1) ట్రిప్సిన్‌  2) అమైలేజ్‌  3) లైపేజ్‌  4) న్యూక్లియేజ్‌

 


3. నోటిలో లాలాజలం వల్ల జీర్ణమయ్యే ఆహార పదార్థం?

1) కొవ్వులు  2) ప్రొటీన్లు  3) పిండిపదార్థం 4) విటమిన్లు


 

4. జీర్ణాశయంలో ఉత్పత్తయ్యే జఠర రసంలో ఉన్న హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం విధి- 

1) ఎంజైమ్‌లను ఉత్తేజితం చేయడం  2) పిండిపదార్థాలను జీర్ణం చేయడం

3) కొవ్వులను జీర్ణం చేయడం        4) ప్రొటీన్లను జీర్ణం చేయడం

 


5. జఠర రసంలో కింది ఏ ఎంజైమ్‌ ఉండదు?

1) లైపేజ్‌  2) రెనిన్‌  3) అమైలేజ్‌  4) పెప్సిన్‌



6. జఠర రసంలో నిష్క్రియా రూపంలో ఉన్న పెప్సినోజెన్‌పై కింది ఏది చర్య జరపడం వల్ల అది క్రియావంతమైన పెప్సిన్‌గా మారుతుంది?

1) ఎంటిరోకైనేజ్‌  2) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం   3) ట్రిప్సిన్‌  4) ప్రోరెనిన్‌



7. కిందివాటిలో కాలేయం ప్రత్యేకతలు- 

1) ఇది మన శరీరంలో అతిపెద్ద గ్రంథి

2) అత్యధిక పునరుత్పత్తిని చూపే అవయవం.

3) విటమిన్‌  -A, D, B12,, ఇనుము లాంటి వాటిని నిల్వ చేస్తుంది.

4) పైవన్నీ



8. కిందివాటిలో కాలేయానికి సంబంధించిన వాక్యాల్లో సరికానిది ఏది? 

1) కాలేయానికి కలిగే వ్యాధి సిర్రోసిస్‌

2) కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది

3) కాలేయం ఎంజైమ్‌లను స్రవించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

4) కాలేయాన్ని అతిపెద్ద జీవరసాయనిక కర్మాగారం అంటారు.



9. కాలేయం స్రవించే పైత్యరస విధి-

1) పాలను పెరుగుగా మారుస్తుంది.

2) కొవ్వులను ఎమల్సిఫీకరిస్తుంది.

3) ప్రొటీన్లను జీర్ణం చేస్తుంది.

4) కార్బోహైడ్రేట్‌లను జీర్ణం చేస్తుంది.



10. కిందివాటిలో క్లోమం ప్రత్యేకతలు-

1) ఇది మానవ శరీరంలో రెండో అతి పెద్ద గ్రంథి

2) దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు

3) ఇది క్లోమ రసాన్ని స్రవిస్తుంది

4) పైవన్నీ

 

 

జవాబులు: 1-1; 2-2; 3-3; 4-1; 5-3; 6-2; 7-4; 8-3; 9-2; 10-4..

 


రచయిత:డాక్టర్ బి . నరేష్

 

 

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌