అంతస్స్రావ్య వ్యవస్థలో విలక్షణమైన కణజాలాలు లేదా అవయవాలు ఉంటాయి. వీటినే అంతస్స్రావ్య గ్రంథులు అంటారు. వీటికి నాళాలు ఉండవు. కాబట్టి వీటినే వినాళగ్రంథులు అని కూడా అంటారు. వీటి స్రావకాలనే హార్మోన్‌లుగా పేర్కొంటారు.
హార్మోన్‌లు నేరుగా రక్తం లేదా శోష రసాల్లోకి విడుదలై శరీరంలో ప్రసరణ చెందుతూ వాటి లక్ష్యకణాలు లేదా కణజాలాలు లేదా అవయవాలను చేరుకుంటాయి.
ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం హార్మోన్‌లు కణాంతర వాహకాలుగా పనిచేసి, అతి స్వల్ప ప్రమాణంలో ఉత్పత్తి అయ్యే పోషక పదార్థం కాని రసాయన పదార్థాలు.
స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించారు.
గాస్ట్రిన్, సోమటోస్టాటిన్ మొదలైన స్థానిక హార్మోన్‌లు తప్ప మిగిలినవన్నీ అవి ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండే లక్ష్య అవయవాలపై ప్రభావం చూపిస్తాయి.
హార్మోన్‌లు ఉత్తేజపరచడం లేదా నిరోధించడం లాంటి చర్యల ద్వారా శరీరధర్మక్రియలను సమన్వయం చేస్తుంటాయి.
హార్మోన్‌లన్నీ చాలావరకు నిర్దిష్ట అవయవాలపై ప్రభావం చూపిస్తాయి.కానీ థైరాక్సిన్, సొమటోట్రోపిక్ హార్మోన్ లాంటి హార్మోన్‌లు దాదాపు అన్ని దైహిక కణాలపై వాటి ప్రభావాన్ని చూపిస్తాయి.
హార్మోన్‌ల జీవితకాలం తక్కువ కాబట్టి ఇవి విచ్ఛిన్నం చెంది పైత్యరసం, మూత్రం ద్వారా విసర్జితమవుతాయి.
హార్మోన్‌ల అధిక ఉత్పత్తి లేదా అల్ప ఉత్పత్తి వల్ల కొన్ని అపస్థితులు ఏర్పడతాయి.
అంతస్స్రావ్య వ్యవస్థలో పీయూష, పీనియల్Â, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఎడ్రినల్, థైమస్ లాంటి వినాళగ్రంథులు; అంతస్స్రావ్య కణజాలాలు ఉండే క్లోమం, బీజకోశాలు, మూత్రపిండాలు లాంటి అవయవాలు ఉంటాయి.
పీయూష గ్రంథి: పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని కూడా అంటారు. ఇది బఠానీ గింజ పరిమాణంతో హైపోథలామస్ కింది భాగానికి ఒక వృంతం సహాయంతో అతికి ఉంటుంది. పీయూష గ్రంథి ఆరు ముఖ్య పెప్టైడ్ నిర్మిత ప్రోటీన్‌లను స్రవిస్తుంది.
పెరుగుదల హార్మోన్: దీన్నే సోమటోట్రోపిన్ అని కూడా అంటారు. ఇది జీవుల దేహ పెరుగుదలకు సాయపడుతుంది.
ప్రోలాక్టిన్: దీన్ని లాక్టోజెనిక్ హార్మోన్ లేదా ల్యూటియోట్రోపిక్ హార్మోన్ లేదా ల్యూటియోట్రోపిన్ అని కూడా అంటారు. ఇది స్త్రీలలో క్షీరగ్రంథుల పెరుగుదలకు, క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది.
థైరోట్రోపిన్: దీన్ని థైరాయిడ్ ప్రేరక హార్మోన్ అంటారు. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ, విడుదలకు సాయపడుతుంది.
ఎడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్: దీన్నే కార్టికో ట్రోపిన్ అని కూడా అంటారు. ఇది అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకో కార్టి కాయిడ్‌లు అనే స్ట్టెరాయిడ్ హార్మోన్‌ల సంశ్లేషణకు, వాటి విడుదలకు తోడ్పడుతుంది.
ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్: స్త్రీలలో స్త్రీబీజకోశ పుటికల పెరుగుదల, అభివృద్ధిని ఇది ప్రేరేపిస్తుంది. పురుషుల్లో ఆండ్రోజెన్‌లతో కలిసి శుక్రజననాన్ని నియంత్రిస్తుంది.
ల్యూటినైజింగ్ హార్మోన్: స్త్రీలలో అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తుంది. పురుషుల్లో ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసి, విడుదల చేస్తుంది.
ఇతర గ్రంథులు - స్రవించే హార్మోన్‌లు
పార్స్ ఇంటర్మీడియా అనే భాగం మెలనోసైట్ ప్రేరక హార్మోన్ అనే ఒకే ఒక హార్మోన్‌ను స్రవిస్తుంది. మానవులలో దీని ప్రభావం అంతగా ఉండదు. కానీ ఇతర సకశేరుకాల్లో ఇది చర్మంలోని మెలనోసైట్‌లపై ప్రభావం చూపి, చర్మం రంగును నియంత్రిస్తుంది.
పారాపిట్యూటరీ హార్మోన్‌లను న్యూరోహైఫోఫైసిస్ ఉత్పత్తి చేస్తుంది.
హైపోథలామస్
ఇది ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఇవి నాడీస్రావకాలు.
ఆక్సిటోసిన్ శరీరపు నునుపు కండరాలు సంకోచించేలా చేస్తుంది. ఇది స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భాశయ నునుపు కండరాల్లో బలమైన సంకోచాలు కలిగించి, సుఖ ప్రసవమయ్యేలా చేస్తుంది. ప్రసవం తర్వాత క్షీర ఉత్పత్తికి తోడ్పడుతుంది.
వాసోప్రెసిన్ మూత్రపిండంపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అధిక గాఢత గల మూత్రం ఉత్పత్తి అవుతుంది. అధిక మూత్ర విసర్జనను నియంత్రిస్తుంది. అందుకే దీన్ని డైయూరెటిక్ హార్మోన్ అంటారు.
హైపోథలామస్ హార్మోన్‌లు పిట్యూటరీ గ్రంథిపై ప్రభావం చూపి, దాని ద్వారా దేహంలోని ఇతర వినాళ గ్రంథుల చర్యలన్నింటిని నియంత్రిస్తాయి. ఈ కారణంగా హైపోథలామస్‌ను ‘‘మాస్టర్ నియంత్రణ కేంద్రం’’ అంటారు. అదే సమయంలో పిట్యూటరీ గ్రంథి తన ట్రోపిక్ హార్మోన్‌ల ద్వారా వివిధ అంతస్స్రావక గ్రంథులను, భాగాలను నియంత్రిస్తుంది. అందుకే దీన్ని ‘‘మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టం’’ అంటారు.
పీనియల్ గ్రంథి
పీనియల్ గ్రంథి లేదా ఎపిఫైసిస్ ద్వారగోర్ధపు పృష్టతలంలో ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ఇది మానవ శరీరంలో 24 గంటల దినప్రవర్తన లేదా సర్కేడియన్ లయ క్రమంగా ఉండేలా చేస్తుంది.
మానవుల్లో నాలుగు పారాథైరాయిడ్ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి వెనుక వైపున, ప్రతీ లంబికలోనూ ఒక జత చొప్పున ఉంటాయి. ఇవి పారాథైరాయిడ్ హార్మోన్ లేదా పారాథార్మోన్ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ప్రసరణ ద్రవాల్లోని కాల్షియం అయాన్ (Ca+2) స్థాయి పారాథార్మోన్ స్రావకాన్ని నియంత్రిస్తుంది. దీన్నే హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని కూడా అంటారు.
d - విటమిన్ (కాల్సిఫెరాల్) కాల్సిట్రయాల్ అనే హార్మోన్ స్తబ్ధరూపం. కాల్సిట్రయాల్ జఠరాంత్ర నాళం నుంచి కాల్షియం శోషణను ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో కాల్షియం స్థాయిని అధికం చేస్తుంది.
థైమస్ గ్రంథి: దీన్ని బాలగ్రంథి అని కూడా అంటారు. ఇది రొమ్ముభాగంలో ఉరోస్థికి కిందగా, గుండెమూల మహాధమని పృష్టతలంలో ఉంటుంది. దీనిలో రెండు లంబికలు ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది థైమోసిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ఇది T - లింఫోసైట్‌ల విభేదనంలో పాల్గొని, కణనిర్వర్తిత రోగనిరోధకతకు సహాయపడుతుంది.
థైమస్ గ్రంథి శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి, పెరిగేకొద్దీ పెద్దదవుతూ యవ్వనారంభంలో గరిష్ఠ పరిమాణానికి చేరుతుంది. ప్రౌఢదశలో కుంచించుకుపోయి పుట్టినప్పుడు ఉన్న పరిమాణానికి చేరుతుంది. వయోవృద్ధుల్లో ఇది క్షీణించి థైమోసిన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది.
హార్మోన్‌లలో రకాలు
రసాయనికంగా హార్మోన్‌లను అమైన్ హార్మోన్‌లు; పెప్టైడ్, ప్రొటీన్ హార్మోన్‌లు, స్టెరాయిడ్ హార్మోన్‌లు అని మూడు వర్గాలుగా విభజించవచ్చు.
1) అమైన్ హార్మోన్‌లు: ఇవి ఎమైనో ఆమ్లపు ఉత్పన్నకాలు. ఉదా: ఎ) థైరాక్సిన్ హార్మోన్ - టైరోసిన్ ఉత్పన్నకం బి) మెలటోనిన్ హార్మోన్ - ట్రిప్టోఫాన్ ఉత్పన్నకం
2) పెప్టైడ్, ప్రోటీన్ హార్మోన్‌లు: ఇవి ఎమైనో ఆమ్లాల పాలిమర్‌లు. పెప్టైడ్ హార్మోన్‌కు ఉదాహరణ - ఆక్సిటాసిన్. ఇన్సులిన్, గ్లూకాగాన్, పారాథార్మోన్ మొదలైనవి ప్రోటీన్ హార్మోన్‌లు.
3) స్టెరాయిడ్ హార్మోన్‌లు: ఇవి కొలెస్ట్రాల్ ఉత్పన్నకాలు. ఉదా: కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ మొదలైనవి.
థైరాయిడ్ గ్రంథి
ఇది మెడ కింద స్వరపేటిక వాయునాళ కూడలి వద్ద, వాయు నాళానికి ఇరువైపులా అమరి ఉండే ద్విలంబికా గ్రంథి. ఈ రెండు లంబికలు ఈస్తమస్ అనే సంధాయక కణజాలంతో అనుసంధానమై ఉంటాయి. రెండు లంబికల పైభాగం స్వరపేటిక పార్శ్వ అంచుల వెంబడి పైకి పాకడం వల్ల థైరాయిడ్ గ్రంథి వాయునాళానికి ఇరువైపులా H ఆకారంలో లేదా రెక్కలు చాపిన సీతాకోకచిలుకలాగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, కాల్సిటానిన్ అనే రెండు హార్మోన్‌లను స్రవిస్తుంది.
థైరాయిడ్ హార్మోన్‌లు T3, T4. ఇవి ఉష్ణోత్పాదక హార్మోన్‌లు. ఇవి ఆధార క్రియారేటును పెంచుతాయి. T3 అంటే ట్రై ఐడోథైరోనిన్. T4 అంటే టెట్రాఐడోథైరోనిన్. ఇవి రెండూ ఒకే విధమైన అంతస్స్రావ విధులను నిర్వర్తిస్తాయి.
థైరాక్సిన్ హార్మోన్ స్థాయిలో అసమతౌల్యత కారణంగా మానవుల్లో గాయిటర్ అనే అపస్థితి ఏర్పడుతుంది. థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి వల్ల హైపర్ థైరాయిడిజమ్ కలుగుతుంది. ఈ స్థితిలో జీవక్రియా రేటు పెరుగుతుంది. కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్లు ఉబ్బి, ముందుకు పొడుచుకుని వస్తాయి. ఈ స్థితిని ఎక్సాప్తాల్మిక్ గాయిటర్ అంటారు.
ఆహారంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి, హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీన్నే సరళ గాయిటర్ లేదా సామాన్య గాయిటర్ అని కూడా అంటారు. గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపించి, క్రెటినిజం అనే అపస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల పెరుగుదల లోసం, మానసిక మాంద్యం, చెవిటి-మూగ లాంటి లక్షణాలు కలుగుతాయి. ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజం వల్ల రుతుచక్ర క్రమం తప్పుతుంది.
థైరాయిడ్ గ్రంథిలోని పారాఫాలిక్యులార్ కణాలు కాల్సిటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీన్నే థైరో కాల్సిటోనిన్ అని కూడా అంటారు. ఇది రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయులను నియంత్రిస్తుంది. ఇది రక్తంలో అధికంగా ఉండే కాల్షియంను ఎముకల్లో జమచేయడం ద్వారా తగ్గించి, పారాథార్మోన్ ప్రభావాన్ని వ్యతిరేకిస్తుంది. రక్తంలో ప్లాస్మాలోని అధిక కాల్షియం స్థాయి కాల్సిటోనిన్‌ను స్రవించేలా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది.
అధివృక్క వల్కలం
అధివృక్క వల్కలం ఉత్పత్తి చేసే హార్మోన్‌లను కార్టికాయిడ్‌లు అంటారు. ఇవి స్టెరాయిడ్ హార్మోన్‌లు.
కార్బోహైడ్రేట్‌ల జీవక్రియల్లో పాల్గొనే కార్టికాయిడ్‌లను గ్లూకోకార్టికాయిడ్‌లు అంటారు. ఇవి దేహంలో నీరు, ఎలక్ట్రోలైట్‌ల తుల్యతను సాధిస్తాయి. వీటినే మినరలోకార్టికాయిడ్‌లు అని కూడా అంటారు.
‘ఆల్డోస్టెరాన్’ మన దేహంలో ఉండే ప్రధాన మినరలోకార్టికాయిడ్. ఇది శరీరంలో నీరు-లవణాల తుల్యతను క్రమపరుస్తుంది. ఇది మూత్రనాళికలపై పనిచేసి మూత్రం నుంచి సోడియం అయాన్‌ల పునఃశోషణను పెంచుతుంది. అదే సమయంలో పొటాషియం అయాన్‌లు, ఫాస్ఫేట్ అయాన్‌లను మూత్రంలోకి స్రవించేట్లు చేస్తుంది.
ఆల్డోస్టెరాన్ Na+ లను శోషించి, K+ లను విసర్జించడంలో తోడ్పడుతుంది. శరీరంలో K+ గాఢత పెరిగితే చాలా హానికరం.
అధివృక్క గ్రంథిని తొలగించినా లేదా ఆల్డోస్టెరాన్ విడుదలను నిరోధించే వ్యాధులు వచ్చినా మానవుడు మరణిస్తాడు.
మానవ దేహంలో ఉండే ప్రధాన గ్లూకోకార్టికాయిడ్‌లు కార్టిసాల్ లేదా హైడ్రోకార్టిసోన్. ఇది కార్బోహైడ్రేట్‌ల జీవక్రియలో పాల్గొంటుంది.
గ్లూకోకార్టికాయిడ్‌లు అత్యవసర పరిస్థితుల్లో గ్లూకోనియోజెనిసిస్ ద్వారా గ్లూకోజ్‌ను సంశ్లేషణ చేసి, రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ కారణంగా వీటిని ప్రాణరక్షక హార్మోన్‌లు అంటారు.
హృదయ ప్రసరణ వ్యవస్థ, మూత్రపిండాల విధులను కార్టిసాల్ నియంత్రిస్తుంది. ఇది రోగనిరోధక ప్రతిస్పందనలను అణచివేస్తుంది. ఇది ఒత్తిడిపై పోరాట హార్మోన్‌గా కూడా పని చేస్తుంది.
అధివృక్క దవ్వ
ఇది రెండు అమైనో హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. అవి ఎడ్రినల్ లేదా ఎపినెఫ్రిన్, నార్‌ఎడ్రినలిన్ లేదా నార్‌ఎపినెఫ్రిన్. ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా విడుదలవుతాయి. కాబట్టి వీటిని అత్యవససర హార్మోన్‌లు లేదా పోరాట లేదా పలాయన హార్మోన్‌లు అంటారు.
ఈ హార్మోన్‌లు అప్రమత్తత, కంటిపాప విస్ఫారం, భయంతో లేదా కోపంతో ఉన్నప్పుడు దేహంపై వెంట్రుకలు అనియంత్రితంగా నిక్కబొడుచుకోవడం, చెమట పట్టడం, సూక్ష్మశ్వాస నాళికలు విస్ఫారం చెందడం లాంటి క్రియలను అధికం చేస్తాయి.
ఈ హార్మోన్‌లు హృదయ స్పందన రేటును - సంకోచబలాన్ని, శ్వాసక్రియ రేటును అధికం చేస్తాయి. కాటెకోలమైన్‌లు గ్లైకోజన్ విచ్ఛిత్తిని ప్రేరేపించి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. అంతేకాకుండా ఇవి కొవ్వులు, ప్రోటీన్‌ల విచ్ఛిత్తిని ప్రేరేపిస్తాయి.
ఇన్సులిన్
ఇది ఒక పెప్టైడ్ హార్మోన్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికమైనప్పుడు ఇది విడుదలవుతుంది. ఇది ప్రధానంగా కాలేయ కణాలు, కొవ్వు కణాలు, అస్థికండర కణాలపై ప్రభావం చూపి, దేహకణాల్లో గ్లూకోజ్ అంతర్‌గ్రహణం, వినియోగాన్ని అధికం చేస్తుంది.
ఇది కణాల్లోని గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మార్చి, గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇన్సులిన్‌ను హైపోగ్లైసీమిక్ హార్మోన్ అని కూడా అంటారు.
గ్లూకగాన్, ఇన్సులిన్ హార్మోన్‌లు పరస్పరం ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తంలోని గ్లూకోజ్ సమతాస్థితిని సాధించడంలో సాయపడతాయి.
క్లోమ గ్రంథి స్రవించే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయితే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఈ స్థితి ఎక్కువ కాలం కొనసాగితే డయాబెటిస్ మెల్లిటస్ అనే వ్యాధి కలుగుతుంది.
ఈ వ్యాధిలో గ్లూకోజ్ మూత్రం ద్వారా విసర్జితం అవుతుంది. దీన్నే గ్లైసూరియా అంటారు. ఈ స్థితి వల్ల హానికర సమ్మేళనాలైన కీటోన్ దేహాలు ఏర్పడతాయి.
శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగినా ప్రమాదమే. ఇది అధికంగా ఉత్పత్తి అయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీన్ని ఇన్సులిన్ షాక్ అంటారు. దేహంలోకి అధికంగా ఇన్సులిన్‌ను ఎక్కించడం వల్ల ఇది కలుగుతుంది. దీని వల్ల మెదడు కణాలు దెబ్బతిని, ప్రాణం పోవొచ్చు.
డయాబెటిస్ మెల్లిటస్ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరగడాన్ని పరీక్షించొచ్చు. అయితే, డయాబెటిస్ ఇన్‌సిపిడస్ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరగదు.
ముష్కాలు
మానవుడిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ముష్కాలుగా పేర్కొంటారు. ఒక జత ముష్కాలు ఉదరం లోపల ముష్కగోణుల్లో ఉంటాయి. ముష్కాల్లో శుక్రోత్పాదక నాళికలు, మధ్యాంతర కణజాలం ఉంటాయి.
శుక్రోత్పాదక నాళికల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. వీటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మధ్యాంతర కణాలు ఉంటాయి. వీటినే లీడిగ్ కణాలు అంటారు. ఇవి ఆండ్రోజన్‌లు అనే పురుష లైంగిక హార్మోన్‌లను స్రవిస్తాయి. వీటిలో ముఖ్యమైంది టెస్టోస్టిరాన్.
పురుష అనుబంధ లైంగిక అవయవాలైన ఎపిడైడిమిస్, శుక్రవాహిక, శుక్రాశయాలు, ప్రొస్టేట్ గ్రంథి, ప్రసేకం మొదలైన వాటి అభివృద్ధి, పరిణతి, నిర్వహణకు ఆండ్రోజన్‌లు అవసరం. ఈ హార్మోన్‌లు కండరాభివృద్ధి, గడ్డం రావడం, ఉగ్రప్రవర్తన (కోపం), పురుష ప్రత్యేక కంఠస్వరం మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తాయి.
ఆండ్రోజన్‌లు శుక్రజననాన్ని ప్రేరేపిస్తాయి. ఇవి కేంద్ర నాడీవ్యవస్థపై పనిచేసి పురుష లైంగిక ప్రవర్తనను కలిగిస్తాయి. ఈ హార్మోన్‌లు ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్‌ల జీవన చర్యల్లో పాల్గొని, సంశ్లేషణ లేదా నిర్మాణాత్మక ప్రభావాలను కలిగిస్తాయి.
క్లోమం
ఇది బహిస్స్రావక (ఎక్సోక్రైన్), అంతస్స్రావక (ఎండోక్రైన్) గ్రంథుల్లా పనిచేసే సంయుక్త గ్రంథి. ఇది పొడవుగా ఉండి, ఆంత్రమూలం శిక్యంలో అమరి ఉంటుంది.
క్లోమ ఎసినస్‌లో ఉండే గ్రంథి ఉపకళ ఒక బహిస్స్రావక భాగం. క్లోమంలో అంతస్స్రావక భాగం 1 2 మిలియన్ల లాంగర్‌హాన్స్ పుటికలను కలిగి ఉంటుంది. వీటిలో ఆల్పా (
) , బీటా (
) అనే రెండు రకాల కణాలు ఉంటాయి.
కణాలు గ్లూకగాన్ హార్మోన్‌ను,
కణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తాయి. క్లోమ అంతస్స్రావక భాగం 1 2% ఉంటుంది.
గ్లూకగాన్ పెప్టైడ్ హార్మోన్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు ఇది విడుదల అవుతుంది. ఇది కాలేయ కణాలపై ప్రభావం చూపి, గ్లైకోజెనాలసిస్ లేదా గ్లూకోనియోజెనిసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ లక్షణాన్ని హైపర్‌గ్లైసీమియా అంటారు.
గ్లూకగాన్ హార్మోన్ ఎమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలను గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియను గ్లూకోనియోజెనిసిస్ అంటారు. గ్లూకగాన్ కణస్థాయిలో గ్లూకోజ్ సంగ్రహణం, వినియోగాన్ని నిరోధిస్తుంది. దీని ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అందుకే దీన్ని హైపర్‌గ్లైసీమిక్ హార్మోన్ అంటారు.