• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బడ్జెట్‌ 

సామాన్య ప్రజల నుంచి శాస్త్రవేత్తల వరకు, వినియోగదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు, అన్ని రకాల పన్ను చెల్లింపుదారులు ఇలా అన్ని వర్గాల వారు కేంద్ర బడ్జెట్‌ కోసం ఎదురుచూస్తారు. ఏటా ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. తర్వాత అందులోని అంశాలను చదివి ప్రజలకు తెలిసేలా చేస్తారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన అంశాలు ప్రజలందరినీ సంతృప్తి పరచకపోవచ్చు. అయినా ప్రభుత్వాల ప్రాధామ్యాలు; అందుబాటులో ఉన్న వనరులు; ప్రస్తుతకాల సమస్యలు, సంక్షోభాలు బడ్జెట్‌ ద్వారా వెల్లడవుతాయి. బడ్జెట్‌ కేవలం కాగితాల్లో రాసే లెక్కలు కాదు. ఇది దేశానికి సంబంధించిన దీర్ఘకాల దేశ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని స్వల్పకాల కార్యాచరణను నిర్దేశిస్తుంది.


ఆవిర్భావం
పాత ఫ్రెంచ్‌ భాషలోని బొగేట్  (bougette) అనే పదం నుంచి బడ్జెట్‌ (budget) ఆవిర్భవించింది. ‘బొగేట్‌’ అంటే తోలు సంచి (leather bag) అని అర్థం. 18వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ఈ సంచిలోనే బడ్జెట్‌కు సంబంధించిన పేపర్లు పెట్టి పార్లమెంట్‌కి తెచ్చేవారు. క్రమంగా బడ్జెట్‌ అంటే ఆర్థిక లెక్కలు అనే భావన స్థిరపడింది. అదే ఆధునిక కాలంలో అన్ని దేశాల్లో అలవాటైంది. 
* భారత్‌లో బ్రిటిష్‌పాలన కాలంలో 1860, ఫిబ్రవరి 18న జేమ్స్‌ విల్సన్‌ మొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 


పత్రాలు  (Documents) 
ఏటా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్‌ డివిజన్‌ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు) కావాల్సిన బడ్జెట్‌ను రూపొందిస్తుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌ పత్రాల్లో ఆర్థికమంత్రి ప్రస్తావించిన మాటలతో పాటు మరో 12 అంశాలు ఉంటాయి. అవి:
* సంవత్సర విత్త ప్రకటన
* డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్స్‌  ః ఫైనాన్స్‌ బిల్‌
* కోశ జవాబుదారీ, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (FRBM) ద్వారా తప్పనిసరి అయినవి
ఎ) స్థూల ఆర్థిక ఫ్రేంవర్క్‌ ప్రకటన
బి) మధ్యకాలిక విత్త విధాన ప్రకటన
* వ్యయాల బడ్జెట్‌   
* ఆదాయాల బడ్జెట్‌
* వ్యయాల ప్రొఫైల్‌ 
* బడ్జెట్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ 
* విత్త బిల్లులోని అంశాల వివరణతో మెమొరాండం
* ఔట్‌పుట్‌ ఔట్‌కమ్‌ మానిటరింగ్‌ ఫ్రేంవర్క్‌ 
* గత బడ్జెట్‌లో ప్రకటించిన అంశాల అమలు
* ప్రస్తుత బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు


సంవత్సర విత్త ప్రకటన
అధికరణ 112 కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020 - 21) అంచనాలతో పోలుస్తూ, వచ్చే ఏడాదికి (2021 - 22) రాబడి, వ్యయాల అంచనాలు ఇందులో ఉంటాయి. అంతకు ముందు సంవత్సర (2019 - 20) వాస్తవిక వ్యయాలు చూపిస్తారు.
కేంద్రప్రభుత్వ ఆదాయ వ్యయాలను మూడు ప్రధాన నిధుల నుంచి నిర్వహిస్తారు. అవి

 

ఎ) కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా: ప్రభుత్వ రోజువారీ వసూళ్లు, వ్యయాల కోసం దీన్ని నిర్వహిస్తారు.
బి) కంటిన్‌జెన్సీ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా: పార్లమెంట్‌ అనుమతి లేకుండా అత్యవసర అవసరాల కోసం రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ నిధి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో రూ.500 కోట్లు ఉన్నాయి.
సి) పబ్లిక్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఇండియా: ఇది ప్రజలకు సంబంధించింది. ప్రావిడెంట్‌ ఫండ్, చిన్న మొత్తాల పొదుపు పథకాల నిధులు ఇందులో జమవుతాయి. ప్రభుత్వాలు తిరిగి ప్రజలకు చెల్లించాల్సి ఉంటుంది.


డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్స్‌
* ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యయాన్ని ఒక డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్‌గా పరిగణించి ఆమోదం కోసం లోక్‌సభలో ప్రవేశపెడతారు. 2021 - 22 బడ్జెట్‌లో మొత్తం 101 డిమాండ్లు ఉన్నాయి.
* ప్రతి డిమాండ్‌లోనూ ఒక పనికి అవసరమైన అన్ని రకాల ఖర్చులు ఉంటాయి. రెవెన్యూ, మూలధన ఖాతాలో అవసర నిధులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు, ఇతర రుణాలను ఇందులో చేరుస్తారు.


ఫైనాన్స్‌ బిల్‌
పన్నులకు సంబంధించిన మార్పులు, చేర్పులు; కొత్త పన్ను విధింపు, పాతపన్నుల తొలగింపు లాంటి అంశాలను ఇందులో పేర్కొంటారు. ఆర్టికల్‌ 110 కింద వచ్చే ద్రవ్య బిల్లులన్నీ ఇక్కడ ఉంటాయి.

 

FRBM చట్టం కింద ప్రకటనలు 
* కోశ జవాబుదారీ, బడ్జెట్‌ నిర్వహణ చట్టం - 2003 కింద తప్పనిసరి అయిన స్థూల ఆర్థిక ఫ్రేంవర్క్‌ ప్రకటన ఉంటుంది. దేశ స్థూల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ, అంచనాలు ఇందులో ఉంటాయి. అలాగే కోశ విధానం ద్వారా ఆరు అంశాలకు చెందిన లక్ష్యాలను మూడేళ్లకు నిర్ధారిస్తారు. కోశ విధానం అవసరాన్ని వివరిస్తారు. అవి:
1. విత్త లోటు    2. రెవెన్యూ లోటు  
3. ప్రాథమిక లోటు   4. పన్ను రాబడి  
5. పన్నేతర రాబడి     6. కేంద్ర అప్పులు 


వ్యయాల బడ్జెట్‌
* బడ్జెట్‌లోని అంశాలపై మరింత అవగాహన కోసం ప్రభుత్వం వివరణాత్మక డాక్యుమెంట్లను జతచేస్తుంది. ఒక్కో మంత్రిత్వ శాఖ ఒక పథకం లేదా కార్యక్రమంపై చేసే వ్యయాన్ని రెవెన్యూ, మూలధన ఖాతాల్లో కలిపి ఒకే చోట ఉంచుతారు. వ్యయాలను రెండు రకాలుగా చూపిస్తారు. అవి: 1. కేంద్ర వ్యయం 
2. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల బదిలీలు
కేంద్ర వ్యయం మూడు రకాలు. అవి:
1. కేంద్ర వ్యవస్థాపిత వ్యయాలు
2. కేంద్ర పథకాలు
3. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, స్వతంత్ర సంస్థలపై వ్యయాలు రాష్ట్రాలు బదిలీ చేసే నిధులను మూడు అంశాలుగా చూపిస్తారు.
1. కేంద్ర ప్రాయోజిత పథకాలకు బదిలీ
2. ఫైనాన్స్‌ కమిషన్‌ బదిలీలు
3. ఇతర బదిలీలు


వసూళ్ల బడ్జెట్  (Receipt budget) 
* ఇందులో రాబడికి సంబంధించిన అంశాలను వివరంగా పేర్కొంటారు. పన్ను, పన్నేతర, మూలధన వసూళ్ల గురించి తెలుపుతారు. ప్రభుత్వాల అప్పులు, ఇతరులకు ఇచ్చిన హామీలు, బాండ్ల జారీ, విదేశీ సాయాలను చూపిస్తారు.


వ్యయాల ప్రొఫైల్‌ 
గతంలో ఉన్న ప్రణాళిక - ప్రణాళికేతర వ్యయ విభజనను ప్రస్తుతం పాటించడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని రకాల  వ్యయాలను కలిపి ఇందులో చూపిస్తున్నారు. వివిధ మంత్రిత్వశాఖల మధ్య జరిగే లావాదేవీల చెల్లింపులు మినహా నికర వ్యయాలను గుర్తిసారు. గతేడాది బడ్జెట్‌ అంచనాల రివైజ్డ్‌ వ్యయాలను పేర్కొంటూ కారణాలను సంక్షిప్తంగా వివరిస్తున్నారు. జెండర్‌ బడ్జెటింగ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు, పిల్లల పథకాల కేటాయింపులను పేర్కొంటారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై సవివరమైన నివేదిక ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ల ద్వారా నడిపే రైల్వేలు లాంటి శాఖల పనితీరును ప్రత్యేక సెక్షన్‌లో చూపిస్తారు. 2017 - 18 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెడుతున్నారు. రక్షణశాఖ, ప్రభుత్వేతర సంస్థలకు ఇచ్చిన నిధులను ప్రత్యేకంగా వివరిస్తారు. 


బడ్జెట్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ 
ఇది సూక్ష్మంగా కేంద్రప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తెలిపే నివేదిక. కేంద్ర ఆదాయాలు, వ్యయాలు, ఇతరులకు నిధుల బదిలీల తీరు, విత్తలోటు, రుణాల గురించి తెలుపుతుంది. 


విత్తబిల్లులో అంశాల వివరణతో మెమొరాండం
ఫైనాన్స్‌ బిల్లులోని పన్నుల ప్రతిపాదనలు, వాటి ప్రభావాలు అర్థం చేసుకునేలా పూర్తి వివరణ ఉంటుంది. 


ఔట్‌పుట్‌ ఔట్‌కమ్‌ మానిటరింగ్‌ ఫ్రేంవర్క్‌
కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల వ్యయాలు, వీటి వల్ల సాధించిన ఫలితాలను ప్రతి మంత్రిత్వ శాఖ తయారు చేసి పార్లమెంట్‌కు సమర్పిస్తుంది.


గత బడ్జెట్‌లో ప్రకటించిన అంశాల అమలు
గతేడాది బడ్జెట్‌లో ప్రకటించిన అంశాలు ఏ మేరకు అమలయ్యాయో ఈ విభాగంలో వివరిస్తారు.


2021 - 22 బడ్జెట్‌ ప్రధాన అంశాలు
* దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాన అంశాల్లో తీసుకున్న విధాన చర్యలు, ప్రభుత్వ ఆర్థిక విజన్‌ ఇక్కడ తెలుస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకునే ప్రధాన ప్రతిపాదనలు పేర్కొంటారు.
* కొవిడ్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవమే ప్రధాన లక్ష్యంగా ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. దేశమే ముందు అనే సంకల్పాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రగతికి ఆరు మూల స్తంభాలను గుర్తించారు. అవి:
ఆరోగ్యం - శ్రేయస్సు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమ్మిళిత వృద్ధి, మానవ వనరులు, పరిశోధనలు, కనిష్ఠ ప్రభుత్వ ప్రమేయం - గరిష్ఠ పాలన.
* మొత్తం బడ్జెట్‌ రూ.34.83 లక్షల కోట్లు. ఇందులో రెవెన్యూ వసూళ్లు రూ.17.88 లక్షల కోట్లు. సుమారు లక్ష కోట్లు తక్కువగా మూలధన వసూళ్లు ఉన్నాయి.
* మొత్తం వ్యయంలో రెవెన్యూ ఖాతాలో రూ.29.29 లక్షల కోట్లు కాగా, మూలధన ఖాతాకు కేవలం రూ.5.54 లక్షల కోట్లు కేటాయించారు.
* కొవిడ్‌ కట్టడికి చేపట్టిన చర్యల వల్ల లోటు పెరిగింది. రెవెన్యూ లోటు దేశ జీడీపీలో 5.1 శాతానికి పెరగగా, విత్త లోటు 6.8 శాతానికి చేరింది.
* పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
* ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి కేటాయింపులు పెంచారు. గత బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.94,452 కోట్లు ఇవ్వగా ఈ సారి 137% అధికంగా రూ.2.23 లక్షల కోట్లకు పెంచారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం రూ. 35,000 కోట్లు కేటాయించారు. 
* మౌలిక సదుపాయాలకు రూ.5.54 లక్షల కోట్లు, రైల్వేకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయించారు.
* వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. రైతుల ఆదాయం రెట్టింపు కోసం కనీస మద్దతు ధర వ్యయానికి 1.5 రెట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
* జాతీయ నూతన విద్యా విధానం ద్వారా 15 వేల పాఠశాలల అభివృద్ధి.
* స్వచ్ఛ భారత్‌ - స్వస్థ్‌ భారత్‌ పథకానికి రూ.1.90 లక్షల కోట్లు.
* పట్టణ ప్రాంతాల్లో జల జీవన్‌ మిషన్‌ కింద రూ.2.87 లక్షల కోట్లు.
* రక్షణకు రూ.4.78 లక్షల కోట్లు. డిజిటల్‌ జనగణకు రూ.3,768 కోట్లు.


1947 అనంతరం భారత్‌లో బడ్జెట్‌
స్వాతంత్య్రానంతరం భారతదేశ అభివృద్ధి, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దడంలో మన ఆర్థికవేత్తలు కృషి చేశారు. ఆచార్య పి.సి.మహలనోబిస్‌ను భారత బడ్జెట్‌ పితామహుడిగా పిలుస్తారు. మన రాజ్యాంగంలో ఎక్కడా బడ్జెట్‌ అనే పదాన్ని ఉపయోగించలేదు. అయితే దీనికి సమాన అర్థంగా అధికరణ 112లో సంవత్సర విత్త ప్రకటన అని వాడారు. 1947 - 48 ఏడాదికి సంబంధించిన మొదటి బడ్జెట్‌ను దేశ మొదటి ఆర్థికమంత్రి ఆర్‌.కె.షణ్ముఖం శెట్టి 1947, నవంబరు 26న ప్రవేశపెట్టారు. మన దేశానికి ఇప్పటివరకు 27 మంది ఆర్థిక మంత్రులుగా పనిచేశారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
* ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక మంత్రులుగా ఇద్దరు మహిళలు పనిచేశారు. మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థికమంత్రి హోదాలో 1970 - 71 ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
* 2019లో నిర్మలా సీతారామన్‌ ఆర్థికమంత్రిగా నియమితులయ్యారు. 2021 - 22లో ఆమె వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడంలో కొన్ని మార్పులు తెచ్చారు. బడ్జెట్‌ ప్రతులను లెదర్‌ బ్రీఫ్‌కేస్‌లో తీసుకొచ్చే సంప్రదాయాన్ని మార్చారు. 2019, జులై 5న ఈమె తొలిసారి ఎర్రని వస్త్రం (Bahi khata)లో బడ్జెట్‌ కాగితాలను పార్లమెంట్‌కు తెచ్చారు. 
* కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి మొదటి పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆర్థిక సర్వే, బడ్జెట్‌ను ప్రజలకు మొబైల్‌ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చారు. 

కేంద్ర బడ్జెట్‌ 2022-23

ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్రబడ్జెట్‌ 2022-23ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంచనాలు కింది విధంగా ఉన్నాయి.

* మొత్తం అంచనాలు: 39,44,909 కోట్లు

* రెవెన్యూ వసూళ్లు: 22,04,422 కోట్లు

* మూలధన వసూళ్లు: 17,40,487 కోట్లు

* రెవెన్యూ వ్యయం: 31,99,663 కోట్లు

* మూలధన వ్యయం: 7,50,246 కోట్లు

* రెవెన్యూ లోటు అంచనా: 3.8%

* ద్రవ్య లోటు 6.4%

* ప్రాథమిక లోటు 2.8%

 

బడ్జెట్‌లో రూపాయి రాక (పైసల్లో)
ఆదాయ పన్ను :    15 
కస్టమ్స్‌ పన్ను :    05
కేంద్ర ఎక్సైజ్‌ పన్ను :    07
కార్పొరేషన్‌ పన్ను :    15 
జీఎస్‌టీ :    16
రుణరహిత మూలధనం :    02
పన్నేతర రాబడి :    05
అప్పులు, ఇతరాలు :    35
మొత్తం :    100 
రూపాయి పోక (పైసల్లో)
వడ్డీ చెల్లింపులు :    20
పన్నులు-సుంకాల్లో రాష్ట్రాల వాటా :    17
రక్షణ వ్యయం :    08
కేంద్ర రంగ పథకాలు :    15
కేంద్ర ప్రాయోజిత పథకాలు :    09
ఆర్థిక సంఘం - ఇతర బదిలీలు :    10
రాయితీలు :    08
పెన్షన్లు :    04
ఇతర వ్యయాలు :    09
మొత్తం :   100

  

బడ్జెట్‌ ముఖ్యంశాలు

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం 4 ప్రాధాన్యత అంశాలను ఎంచుకుంది. అవి:

1. ప్రధానమంత్రి గతిశక్తి 

2. సమ్మిళిత అభివృద్ధి

3. పెట్టుబడులు, ఉత్పాదకత, పర్యావరణ పరిరక్షణ

4. అభివృద్ధికి తోడ్పడే పెట్టుబడులు

* బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.9,90,241 కోట్లుగా ఉంది.

* వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగంపై నిర్ణయం.

* విద్యాబోధనను ప్రసారం చేసే టీవీ ఛానళ్ల సంఖ్యను 200కి పెంచడం.

* డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపనకు చర్యలు.

* ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు.

* స్టార్టప్‌ కంపెనీలకు 2023, మార్చి వరకు ప్రోత్సాహకాలను పొడిగించడం.

* 2022లో ఆర్‌బీఐ కొత్తగా డిజిటల్‌ కరెన్సీని తీసుకువస్తుంది.

* క్రిప్టో కరెన్సీ లాభాలపై 30 శాతం పన్ను విధింపు.

* దేశంలోని పోస్టాఫీసులన్నింటిలో బ్యాంకింగ్‌ సేవలు అందించడం.

* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మరో 80 లక్షలు ఇళ్లను నిర్మించడం.

* మేకిన్‌ ఇండియా ద్వారా 60 లక్షల ఉద్యోగాల కల్పన.

* రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్ల ఏర్పాటు.

* 2022లోనే దేశంలో 5జీ సేవలను ప్రారంభించడం.

* చిప్‌ ఆధారిత ఈ-పాస్‌పోర్టుల జారీ.

* డిజిటల్‌ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తులు బదిలీపై 30 శాతం పన్ను విధింపు.

* ఐఐటీల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు.

* దేశంలో 4 ప్రాంతాల్లో లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు.

* కొత్తగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 2.0 ప్రారంభం.

* రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచడం.

* 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించడం.

* 75 జిల్లాల్లో 75 ఈ-బ్యాంకుల ఏర్పాటు.

* రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యాల ఏర్పాటు.

* కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళిక రూపకల్పన.

* చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌ నేషన్‌ - వన్‌ ప్రొడక్ట్‌ పథకం అమలు.

* దేశవ్యాప్తంగా కొత్తగా 25 జాతీయ రహదారుల నిర్మాణం.

* సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తికి రూ.19,500 కోట్ల కేటాయింపు.

* 2025 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను పూర్తి చేయడం.

* వెయ్యి లక్షల మెట్రిక్‌ టన్నుల వరి సేకరణకు చర్యలు తీసుకోవడం.

* 60 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు అవకాశం ఉన్న 14 రంగాలను ప్రోత్సహించడం.

* కార్పొరేట్‌ సర్‌చార్జీని 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం.

 


తెలంగాణ బడ్జెట్‌ 2022-23

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2022-23 ఏడాదికి  బడ్జెట్‌ను 2022, మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దీన్ని శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ అంచనాలు కింది విధంగా ఉన్నాయి.

మొత్తం బడ్జెట్‌ అంచనా - 2,56,958 కోట్లు

రెవెన్యూ రాబడి - 1,93,029 కోట్లు

పెట్టుబడి రాబడులు - 63,832 కోట్లు

రెవెన్యూ వ్యయం - 1,89,274 కోట్లు

పెట్టుబడి వ్యయం - 29,728 కోట్లు

రెవెన్యూ మిగులు - 3,754 కోట్లు

ద్రవ్యలోటు - 52,167 కోట్లు

ప్రాథమిక లోటు - 33,255 కోట్లు

ముఖ్యాంశాలు

* రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం, అటవీ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాల, సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కళాశాలను విశ్వవిద్యాలయాలుగా మారుస్తారు. వీటికి రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.

* రాష్ట్రంలో మరో 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1000 కోట్లు ప్రతిపాదించారు.

* రూ.75,000 లోపున్న వ్యవసాయ రుణాల మాఫీ.

* తొలిసారిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా పథకం.

* మొదటి విడతలో లక్షమంది భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిళ్ల పంపిణీ.

* గొర్రెల పంపిణీ పథకానికి రూ.1000 కోట్ల కేటాయింపు.

* స్థలం ఉంటే రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.

* 57 ఏళ్లకే ఆసరా పెన్షన్‌ను అమలు చేస్తామని ప్రకటించారు.

* 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌కు రూ.1000 కోట్లు కేటాయించారు.

* బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌ పథకానికి రూపకల్పన చేశారు.

* 7 నుంచి 12వ తరతి చదివే 7 లక్షలమంది విద్యార్థినులకు ఆరోగ్య సంరక్షణ కిట్‌ను అమలు చేస్తారు.

* 1.77 లక్షల కుటుంబాలకు దళిత బంధు అమలుకు వీలుగా 17,700 కోట్లు కేటాయించారు.

* ఈ బడ్జెట్‌లో పన్ను రాబడుల అంచనా (రూ.1.08 లక్షల కోట్లు) తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్క్‌ దాటింది. 

* ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబార్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల మంజూరు చేశారు.

* వచ్చే ఆర్థిక సం. (2023-24)లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తారు.

* సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ అమలు.

* ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలు ఉండగా, వాటి సంఖ్యను 350కు పెంచుతారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో మరో 60 బస్తీ దవాఖానాల ఏర్పాటు.

* ఆరోగ్యశ్రీ చికిత్సలో ప్రస్తుతం ఒక్కొక్క కుటుంబానికి రూ.2 లక్షల వరకు గరిష్ఠ పరిమితి ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచారు.

* రాష్ట్రంలో గుండె, కాలేయం, బోన్‌మ్యారో తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

* మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.2,377 కోట్లు కేటాయించారు.

* గిరిజన తండాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు.

* రూ.20 కోట్లతో సాఫ్ట్‌ డ్రింక్‌ పరిశ్రమగా నీరాను ప్రారంభిస్తారు.

* గచ్చిబౌలి, ఎల్బీనగర్, ఆల్వాల్, ఎర్రగడ్డలో 4 సూపర్‌ దవాఖానాలకు రూ.1000 కోట్లు కేటాయించారు.

* ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ, క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధక ఆహారం అందించడానికి ఆహార ఛార్జీలను ఒక్కో పడకకు రూ.56 నుంచి రూ.112కు పెంచారు. సాధారణ రోగులకు ఒక్కో పడకకు రూ.40 నుంచి రూ.80కు పెంచారు.

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌