• facebook
  • whatsapp
  • telegram

రుతుపవనాల క్రియాశీలత  (ప్రభావితం చేసే అంశాలు)  

కుండపోతగా కురిసినా.. కరవు కాటేసినా!

ఒక ప్రాంతంలో ఒక దశలో అల్పపీడనం తలెత్తుతుంది. వర్షపాతం తగ్గిపోతుంది. దుర్భిక్షం సంభవిస్తుంది. మరో సందర్భంలో అక్కడే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. సముద్రాల్లో ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఏర్పడుతుంటాయి. ఒకే రకమైన పరిస్థితులు ఒక చోట అనుకూల, మరోచోట ప్రతికూల ఫలితాలను ఇస్తుంటాయి. వర్షాలు కుండపోతగా కురవడానికి, కరవు కాటేయడానికి అవే కారణాలుగా నిలుస్తుంటాయి. ఇవన్నీ కొన్ని అసాధారణ వాతావరణ ప్రక్రియలైన ఎల్‌ నినో, లా నినా మొదలైన వాటి వల్ల కలిగే రుతుపవనాల క్రియాశీలత  ప్రభావాలు. వీటిపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంపొందించుకోవాలి. దక్షిణ డోలనం, రుతుపవనాల విరామం, విస్ఫోటం తదితర అంశాల గురించీ తెలుసుకోవాలి.

1) ఎల్‌ నినో (El - Nino): ఇదొక అసాధారణ వాతావరణ ప్రక్రియ. ప్రతి అయిదు లేదా ఏడేళ్లకు ఒకసారి తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే అయన రేఖ ఉష్ణప్రవాహం. ఇది పెరూ తీర ప్రాంతం వైపు కదిలినప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగి అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో ఆంకోయి జాతి చేపలు అత్యధిక సంఖ్యలో మరణిస్తాయి. అంతే కాకుండా భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ బలహీనపడి వర్షపాత పరిమాణం తగ్గి, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్‌ నినో అనే లాటిన్‌ (స్పానిష్‌) పదానికి అర్థం క్రీస్తు జననం. ఒకసారి పెరూ తీరంలో అది ఏర్పడితే వరుసగా 11 నెలల పాటు కొనసాగుతుంది.

* సాధారణంగా భూమధ్యరేఖ ప్రతి ప్రవాహం (ఈక్వెటోరియల్‌ కౌంటర్‌ కరెంట్‌) అనే ఉష్ణ ప్రవాహాం 10ా దక్షిణ అక్షాంశం వరకు పెరూ తీరం మీదుగా విస్తరించి ఉంటుంది. అయితే, ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ పవన వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల ఇది బలంగా రూపాంతరం చెందుతుంది. ఈ సమయంలో ఇది 30 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు పెరూ తీరం వెంట పురోగమిస్తుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు బలహీనపడటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. 

సాధారణ సంవత్సరాల్లో పెరూ తీరం వెంట కదిలే హంబోల్డ్‌ శీతల ప్రవాహం ఈ ప్రత్యేక సమయంలో మాత్రం 30ా దక్షిణ అక్షాంశం వరకు నెట్టివేతకు గురవుతుంది. దీనివల్ల తూర్పు పసిఫిక్‌ మహాసముద్ర  ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగి పెరూ తీర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. ఫలితంగా భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల వైపు రావాల్సిన ఆగ్నేయ వ్యాపారపవనాలు పెరూ తీర ప్రాంతం వైపు కదులుతాయి. దాంతో ఆ తీర ప్రాంతంలో కుండపోత వర్షాలు సంభవించడం, తీరాన్ని ఆనుకుని ఉన్న పసిఫిక్‌ జలాల్లో రసాయన సంబంధిత ఆక్సిజన్‌ కొరత ఏర్పడి, పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడం జరుగుతుంది. ఇదే సమయంలో భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని కరవుపరిస్థితులు ఏర్పడతాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఎల్‌ నినో, నైరుతి రుతుపవన వ్యవస్థల మధ్య సంబంధం బలహీన పడుతుందని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఎల్‌ నినో కాకుండా హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్‌ ఓషన్‌ డైపోల్, ఈక్వెటోరియల్‌ ఇండియన్‌ ఓషన్‌ ఆసిలేషన్స్‌ లాంటి దృగ్విషయాల ప్రభావం కూడా నైరుతి రుతుపవనాలపై అధికంగా ఉందని వాటి ద్వారా తెలుస్తోంది.


2) లా నినా (La Ninaz): ఇది ఎల్‌ నినో కు వ్యతిరేకమైంది. పెరూ తీర ప్రాంతం వెంట సాధారణంగా కదిలే శీతల (హంబోల్డ్‌) ప్రవాహాన్నే లాని నా గా వ్యవహరిస్తారు. పెరూ తీరంలో ఈ పరిస్థితులున్నప్పుడు భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. లానినా అనే లాటిన్‌ (స్పానిష్‌) పదానికి అర్థÄం ఆడశిశువు జననం.

* భూమధ్యరేఖ ప్రతిప్రవాహం న్యూట్రల్‌ ఫేజ్‌లో ఉన్నప్పుడు, బలమైన ఆగ్నేయ వ్యాపార పవనాలు (స్ట్రాంగ్‌ ట్రేడ్‌ విండ్స్‌) పసిఫిక్‌ భూమధ్యరేఖ ప్రాంతంలో కదులుతున్నప్పుడు పెరూ తీర ప్రాంతంలో లానినా ఏర్పడుతుంది. 2, 3 నెలలపాటు కొనసాగుతుంది. ఇది ఎల్‌ నినోకు వ్యతిరేకమైన ఒక అసాధారణ వాతావరణ ప్రక్రియ.  గత వందేళ్లలో వరుసగా 2021, 2022, 2023ల్లో వరుసగా మూడుసార్లు సంభవించడం ఇదే మొదటిసారి. దీనినే ‘ట్రిపుల్‌ డిప్‌ ఎఫెక్ట్‌’ అని కూడా పిలుస్తారు. దీని కారణంగా భారతదేశంలో వరుసగా మూడేళ్లపాటు అధిక వర్షాలు సంభవించాయి. లానినా పెరూ తీరంలో బలంగా కదులుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు బలంగా ఉండి, భారతదేశానికి సమృద్ధిగా వర్షాలను ఇస్తున్నాయి.


3) దక్షిణ డోలనం: ఈ అసాధారణ వాతావరణ స్థితిని మొదటగా 1910లో గిల్బర్ట్‌ వాకర్‌ అనే శాస్త్రవేత్త పరిశీలించాడు. దక్షిణార్ధ గోళంలో ఆస్ట్రేలియా వాయవ్య తీరం వద్ద ఉండే హిందూ మహాసముద్రంలోని డార్విన్, దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 176 అక్షాంశం వద్ద ఉన్న ‘తాహిత్‌’ ద్వీపానికి మధ్య, గాలుల పీడన వ్యవస్థలో తేడాల వల్ల ఏర్పడే పరస్పర వ్యతిరేకతనే ‘దక్షిణ డోలనం’ లేదా టెలిలింక్స్‌ అని పిలుస్తారు. దక్షిణ డోలనం సమయంలో ఎల్‌ నినో ఏర్పడితే దానిని నివిళీవీ (ఎల్‌ నినో సదరన్‌ ఆక్సిలేషన్‌) ఎఫెక్ట్‌ అని పిలుస్తారు. 


4) ఎన్సో (ENSO): తూర్పు, పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడే అధిక, అల్ప పీడన కేంద్రాలు; వాటి మధ్య వచ్చే గాలుల పీడన వ్యవస్థలో సంభవించే పరస్పర వ్యతిరేకతనే దక్షిణ డోలనం అని పిలుస్తారు. అప్పుడప్పుడూ యాదృచ్ఛికంగా దక్షిణ డోలనం ఎల్‌నినోలు ఒకేసారి ఏర్పడతాయి. ఈ స్థితినే నివిళీవీ అని పిలుస్తారు. నివిళీవీ అంటే తూర్పు పసిఫిక్‌ తీరంలో ఉష్ణ జలాలు కదులుతూ ఉన్నట్లయితే అప్పుడు తూర్పు పసిఫిక్‌ ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడి ఉంటుంది. అదే విధంగా పశ్చిమ పసిఫిక్‌ తీరంలో శీతల జలాలు ఉన్నప్పుడు అక్కడ అధిక పీడనం ఏర్పడి ఉంటుంది. ఎల్‌ నినో కారణంగా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయో అవే నివిళీవీ వల్ల సంభవిస్తాయి. 


5) వాకర్‌ సర్క్యులేషన్‌: దక్షిణార్ధ గోళంలో హిందూ మహాసముద్రపు గాలులు, పసిఫిక్‌ మహాసముద్రపు గాలులతో పీడన పరిస్థితుల్లో తేడాల వల్ల వృత్తాకార మార్గంలో చలిస్తుండటాన్ని వాకర్‌ సర్క్యులేషన్‌ అంటారు.


6) హిందూ మహాసముద్ర ద్విద్భవస్థితి (IOD - Indian Ocean Dipole):  పశ్చిమ హిందూ మహాసముద్రంలో (మసాక్రే దీవి వద్ద), అరేబియా సముద్రం కలిసే భాగంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే దాని ప్రభావం తూర్పు భాగంలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంతో కలిసే చోట ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాలను హిందూ మహాసముద్ర రెండు ధ్రువాలుగా చెప్పొచ్చు.


హిందూ మహాసముద్ర తూర్పుభాగంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల (హిందూ మహాసముద్ర పశ్చిమ ధ్రువ ఉష్ణోగ్రతలు పెరిగే స్థితి) అక్కడి గాలులు నైరుతి రుతుపవనాలను బలంగా భారత్‌ వైపు నెడతాయి. దీనివల్ల భారత్‌లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. దీనిని ధనాత్మక స్థితిగా పేర్కొనవచ్చు. ఈ సందర్భంలో సమీపంలోని ఇండోనేసియా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలల్లో కరవు ఏర్పడే అవకాశం ఉంది. 


హిందూ మహాసముద్రం తూర్పు ధ్రువ ఉష్ణోగ్రతలు పెరిగితే (హిందూ మహాసముద్ర పశ్చిమ ధ్రువంలో ఉష్ణోగ్రతలు తగ్గే స్థితి) వ్యాపార పవనాలు ఆస్ట్రేలియాలో అధిక వర్షాలను కురిపిస్తాయి. ఇదే సమయంలో భారత్‌లో సగటు వర్షపాత పరిమాణం తగ్గిపోతుంది. ఈ అసాధారణ వాతావరణ స్థితిని రుణాత్మక స్థితిగా పేర్కొంటారు.


ఎల్‌నినో, ఇండియన్‌ ఓషియన్‌ డై పోల్‌ రెండు వేర్వేరు వాతావరణ ప్రభావిత అంశాలు. ఇవి ఒకేసారి ఏర్పడవచ్చు. భారత్‌పై ఎల్‌ నినో ప్రభావం ఉన్నా కానీ, ఇండియన్‌ ఓషియన్‌ డై పోల్‌ సానుకూలంగా ఉండటం వల్ల వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుంది.


రుతుపవనాల విరామం (మాన్‌సూనల్‌ బ్రేక్‌): నైరుతి రుతుపవన కాలంలో అంటే జులై, సెప్టెంబరు నెలల మధ్య ప్రతి వారం లేదా 10 రోజులకొకసారి వాతావరణంలో పొడి పరిస్థితులేర్పడి వర్షం సంభవించని స్థితినే రుతుపవనాల విరామం అని పిలుస్తారు.


రుతుపవనాల విస్ఫోటం (మాన్‌సూనల్‌ బరస్ట్‌): నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం మీదుగా కదిలేటప్పుడు సముద్ర ప్రభావిత వాయు రాశుల్లో చిక్కుకుపోయి అధిక నీటిఆవిరిని గ్రహిస్తాయి. ఇవి దేశ భూభాగంలోకి కేరళ తీరంలో ఆకస్మికంగా ప్రవేశించడంతో దేశంలో ఉష్ణోగ్రతలు 7  8 ్నది వరకు తగ్గిపోతాయి. దాంతో వాతావరణంలో తేమ శాతం పెరిగి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపు జల్లులు సంభవిస్తాయి. ఈ స్థితినే రుతుపవనాలవిస్ఫోటం అని పిలుస్తారు.

 

అక్టోబరు హీట్‌: నైరుతి రుతుపవనాలు సెప్టెంబరు నాలుగో వారం నుంచి దేశ భూభాగం నుంచి తిరోగమనం చెంది కదిలేటప్పుడు వాటిలోని తేమ  కారణంగా బెంగాల్‌ మైదాన ప్రాంతంలోని వాతావరణంలో ఆర్ద్రత పరిమాణం పెరిగి ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. ఈ స్థితినే ‘అక్టోబరు హీట్‌’ అని   పిలుస్తారు. దీని కారణంగా పశ్చిమ బెంగాల్‌ మైదాన ప్రాంతాల్లో అక్టోబరులో వాతావరణం వేడిగా, ఉక్కగా ఉంటుంది.


మోనెక్స్‌: 1978లో ‘గ్లోబల్‌ వెదర్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో ఉప కార్యక్రమంగా ‘మాన్‌సూన్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ను ప్రారంభించారు. దీనిని మోనెక్స్‌ అని అంటారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్,  భారతదేశం ఇందులో పాల్గొన్నాయి.


నేషనల్‌ మాన్‌సూన్‌ మిషన్‌: 2012లో ప్రారంభించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియాలజీ (ఐఐటీఎమ్‌)-పుణె, ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌సీఓఐఎస్‌)-హైదరాబాద్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌ కాస్టింగ్‌-నోయిడా సంస్థలు అమెరికా, ఇంగ్లండ్‌ సహాయంతో ప్రారంభించిన కార్యక్రమం. దీనిలో భాగంగా రుతుపవనాలను ముందే గుర్తించి, వాటి వర్షపు తీరును తెలుసుకోవచ్చు. 


రచయిత:  సక్కరి జయకర్‌ 

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌