• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ ఉద్యమాలు

రక్షించు.. పెంచు.. ఉపయోగించు!

 

ఆధునిక ప్రగతి పేరుతో పర్యావరణానికి కలిగిస్తున్న హానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ప్రజలు ఉద్యమించారు. భావితరాల భద్రతకు, సుస్థిరాభివృద్ధికి పోరాటాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను హత్తుకొని కాపాడుకున్నారు. పాలకులను ఎదిరించి ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగిన అలాంటి ఉద్యమాలు, వాటి సారథులు, ప్రజా భాగస్వామ్యం, నైతిక మద్దతు, సాధించిన ఫలితాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

ప్రకృతి వనరులను అవసరం మేరకు వినియోగించుకుంటూ, కొంత భావితరాలకు మిగిల్చే సుస్థిర అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా అపరిమిత ప్రగతి ధ్యేయంతో భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. అభివృద్ధితో పాటు పెరుగుతున్న కాలుష్య కారకాలు, నేల క్రమక్షయం, ఆమ్ల వర్షాలు, గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ క్షీణత లాంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ తగిన ఫలితాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భూగోళ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. 1962లో అమెరికాలోని సిల్వర్‌స్ప్రింగ్‌ ప్రాంతంలో పంట తెగుళ్ల నివారణకు డి.డి.టి. పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని అవశేషాలు పంట మొక్కల్లో జీవ సాంద్రీకృతమై పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీశాయో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో వివరించారు. ఇదే ఒరవడిలో భారతదేశంలో పలు పర్యావరణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.


బిష్ణోయి ఉద్యమం: ఇది భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా చరిత్రకెక్కింది. 1730లో రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌ జిల్లాలో ఖెజార్లీ/ఖెజాడ్లి గ్రామానికి చెందిన ఉద్యమం. బిష్ణోయి జాతి (కమ్యూనిటీ) ప్రజలకు ఖేజ్రీ వృక్షాలు చాలా పవిత్రమైనవి. అయితే అప్పటి మార్వాడీ పాలకుడు మహారాజా అభయ్‌ సింగ్‌ ఆదేశంతో సైనికులు ఖేజ్రీ వృక్షాలను నరికేయడానికి సిద్ధమయ్యారు. అమృతాదేవి నాయకత్వంలో బిష్ణోయి ప్రజలు చెట్లను కౌగిలించుకుని సైనికులు వాటిని  నరకకుండా అడ్డుకున్నారు. దాంతో సైనికులు అమృతాదేవితో పాటు 363 మందిని నరికివేశారు. నిశ్చేష్టుడైన రాజు వెంటనే బిష్ణోయి గ్రామాల్లో చెట్లు నరకకుండా నిషేధం విధించాడు.


చిప్కో ఉద్యమం: చిప్కో అంటే చెట్లను హత్తుకోవడం అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ, వాటిని హత్తుకుంటూ ఉద్యమం చేశారు. సుందర్‌లాల్‌ బహుగుణ, గౌరీదేవి, చండీప్రసాద్‌ బట్‌ మొదలైనవారు నాయకత్వం వహించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1964లో ఏర్పాటుచేసిన ‘దశోలి గ్రామ స్వరాజ్య మండల్‌’ ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1927లో ఆంగ్లేయులు చేసిన అటవీ చట్టంలోని ఆంక్షలను వ్యతిరేకిస్తూ 1930లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తిలారి ప్రాంతంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా 17 మంది సామాన్య ప్రజలను రాజ సైనికులు చంపేశారు. క్రమక్రమంగా ఈ ఉద్యమం బలపడి 1970 నాటికి చిప్కో ఉద్యమంగా మారింది. 1974 నుంచి గిరిజన మహిళలు గౌరీదేవి నాయకత్వంలో చెట్లను నరకకుండా రేయింబవళ్లు కాపలా కాశారు. 1980 నాటికి హిమాలయ అడవుల్లో చెట్లు నరకడాన్ని నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయం సాధించింది.


సైలెంట్‌ వ్యాలీ రక్షణ ఉద్యమం: సైలెంట్‌ వ్యాలీ అనేది కేరళలో పలక్కాడు జిల్లాలోని ఒక ఉష్ణమండల సతతహరిత అటవీ ప్రాంతం. 1973లో కేరళ ప్రభుత్వం ఈ ప్రాంతం మీదుగా ప్రహిస్తున్న కుంతిపూజ నదిపై జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది. దీనివల్ల ఆ ప్రాంతం పర్యావరణం దెబ్బతింటుందని, అనేక రకాల మొక్కలు, జంతువులు ముఖ్యంగా అరుదైన సింహం తోక ఉండే కోతులు అంతరించిపోతాయని శాస్త్ర సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. చివరికి 1985లో ఆ ప్రాంతాన్ని ‘సైలెంట్‌  వ్యాలీ నేషనల్‌ పార్కు’గా ప్రకటించారు.


అప్పికో ఉద్యమం: అడవుల సంరక్షణ కోసం చిప్కో ఉద్యమం తరహాలోనే కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలోని సాల్కానిలో 1983లో ఈ ఉద్యమం మొదలైంది. కన్నడంలో ‘అప్పికో’ అంటే కౌగిలించుకోవడం అని అర్థం. పాండురంగ హెగ్డే దీనికి నాయకత్వం వహించారు. ఈ ప్రాంతంలో 81% అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని కాగితం, కలప తయారీ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామ పిల్లలు, పెద్దలు చెట్లను హత్తుకుని కాంట్రాక్టర్ల బారి నుంచి వాటిని రక్షించారు. ఈ ఉద్యమం నినాదం ‘రక్షించు, పెంచు, హేతుబద్ధంగా ఉపయోగించు’.


జంగిల్‌ బచావో ఆందోళన: బిహార్‌ ప్రభుత్వం 1980లో అడవుల్లో ఉండే సాల్‌ వృక్షాల స్థానంలో టేకు వృక్షాలు పెంచాలని ప్రయత్నిచడంతో సింగ్‌బమ్‌ జిల్లాకు చెందిన గిరిజనులు సాల్‌ వృక్షాలను నరకకుండా వాటిని హత్తుకుని నిరసన తెలియజేశారు. ఈ ఉద్యమం క్రమంగా ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించింది.


ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఉద్యమం: జీవనోపాధి అందించే అటవీ వనరులను సంరక్షించుకోవడానికి, వారి పోడు వ్యవసాయ విధానాలను కొనసాగించడానికి ఝార్ఖండ్‌లోని ఆదివాసీ తెగలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించిన ఉద్యమం. దీని తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తిస్తూ ‘అటవీ హక్కుల చట్టం’ రూపొందించింది.


బీస్‌-నౌ ఉద్యమం:  శ్రీ జంబేశ్వర్‌ అనే మత గురువు పర్యావరణ పరిరక్షణకు 29 సూత్రాలను ప్రతిపాదించారు. అందువల్ల దీనికి బీస్‌-నౌ ఉద్యమం అని పేరొచ్చింది. ఈ ఉద్యమం ఉద్దేశం పంజాబ్, సింధు ప్రాంతాల్లో విస్తరించిన థార్‌ ఎడారి ప్రాంత వృక్ష, జంతుజాలాల రక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఈ సూత్రాల ఆరోగ్య పరిరక్షణ, సామాజిక పరివర్తన, దేశభక్తిని ప్రబోధించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పశుసంవర్థక పెంపుదలకు సంబంధించినవి. అవి తర్వాత కాలంలో అమృతాదేవి నాయకత్వంలో జోథ్‌పుర్‌లో బిష్ణోయి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి.


గంగా పరిరక్షణ ఉద్యమం: గంగానది స్వచ్ఛత కోసం సాధువులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రారంభించిన గాంధియన్‌ అహింసా ఉద్యమం. స్వామి నిగమానంద సనంద్‌ లాంటి సాధువులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగాలు చేశారు. ఈ ఉద్యమానికి గంగాసేవా అభియాన్‌ లాంటి సంస్థలు మద్దతుగా నిలిచాయి. భారత ప్రభుత్వం గంగా నదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా ‘అవిరళ్‌’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అవిరళ్‌ అంటే హిందీలో కొనసాగని అని అర్థం. అంటే గంగానదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా నదీ ప్రవాహం కొనసాగాలని చేపట్టిన ప్రాజెక్టు.


నర్మదా బచావో ఆందోళన: నర్మదా నది మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్ర, గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పగులు లోయ ద్వారా ప్రయాణిస్తుంది. దీనిపై గుజరాత్‌ ‘సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌’తో పాటు అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాలని తలపెట్టినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని కలుగుతుందని 1985 నుంచి మేధా పాట్కర్‌ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈమెతో పాటు బాబా ఆమ్టే, అరుంధతిరాయ్‌ లాంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మేధా పాట్కర్‌ ఏర్పాటు చేసిన సంస్థ నర్మదా థరన్‌గ్రస్త్‌ సమితి. ఈ ఉద్యమం కోసం చేసిన కృషికి ఫలితంగా మేధాపాట్కర్‌కు 1991లో స్వీడన్‌కు చెందిన రైట్‌ లైవ్లీ హుడ్‌ అవార్డు లభించడం విశేషం.


నవధాన్య ఉద్యమం: జీవ వైవిధ్య సంరక్షణకు, సేంద్రియ వ్యవసాయానికి రక్షణ కల్పిస్తూ, జన్యు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా 1982 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహార భద్రతలో ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాల పేరుతో ఉద్యమం రూపొందింది. ఇదొక ఎన్జీవో సంస్థ. దీని స్థాపకురాలు వందనా శివ. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు 50కి పైగా విత్తన నిల్వల బ్యాంకులను స్థాపించారు. వేలమంది రైతులకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించారు.


కోయల్‌కరో ఉద్యమం: ఇది కోయల్‌ కరో జలవిద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లోని కోయల్‌ - కరో బేసిన్‌లో ముండా, బరావన్‌ తెగలు జరిపిన ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా ‘కామ్‌ రోకో అభియాన్‌’ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన ఉద్యమంగా నిలిచింది.


నందిగ్రామ్‌ రసాయన ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన: ఆర్థిక మండళ్ల ఏర్పాటులో భాగంగా కోల్‌కతా సమీపంలో నందిగ్రామ్‌ ప్రాంతంలో ఇండొనేసియీ కంపెనీ రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటుకు 10 వేల ఎకరాల భూసేకరణ సందర్భంలో 2007లో జరిగిన ఆందోళన.


అవతార్‌ ఉద్యమం: ఒడిశాలో గనుల తవ్వకానికి వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిన సందర్భంలో అక్కడి కొండ తెగలవారు వారి కులదైవమైన అవతార్‌ పేరున పర్యావరణాన్ని, వారి జీవన వనరులను పరిరక్షించుకోవడానికి చేసిన ఉద్యమం


సింగూర్‌-టాటా నానో ఫ్యాక్టరీ వివాదం: పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ఫ్యాక్టరీ స్థాపనకు భూముల సేకరణ వివాదాస్పదమైంది. తృణమూల్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యవసాయ భూమి పరిరక్షణ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. అరుంధతీ రాయ్, అనురాధ తల్లావో, మేధాపాట్కర్‌ మద్దతు ప్రకటించారు. చివరికి ఆ కంపెనీ గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతానికి తరలివెళ్లింది.


కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు వివాదం: తమిళనాడులోని కూడంకుళం వద్ద నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్తు ప్రాజెక్టు వల్ల అక్కడి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవడమే కాకుండా రేడియో ధార్మిక విషవాయువులు ఆరోగ్యానికి హానికరమనే ఆందోళనలతో ఈ ఉద్యమం జరిగింది.


సోంపేట ఉద్యమం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో బీల భూముల్లో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మించడానికి నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే అక్కడి రైతులు, గ్రామస్థులు తమ జీవనోపాధి పోతుందని, అక్కడ విశాలంగా విస్తరించి ఉన్న కొబ్బరి తోటలు నాశనమవుతాయని, పర్యావరణపరంగా నష్టం జరుగుతుందని తిరుగుబాటు చేశారు. 2009, డిసెంబరు 5న రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలీస్‌ కాల్పులు కూడా జరిగాయి. చివరికి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని విరమించింది.


కాజెన్‌ట్రిక్స్‌ వ్యతిరేక ఉద్యమం: కర్ణాటకలో మంగుళూరు ప్రాంతంలోని నందకూరులో నిర్మించబోయే థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు ఉద్యమించారు. 


ఈ విధంగా దేశంలో అనేక సందర్భాల్లో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పర్యావరణాన్ని, తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి చేసిన ఉద్యమాలు ఎనలేని ప్రజామోదాన్ని పొందాయి.


రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌