• facebook
  • whatsapp
  • telegram

మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

తరతరాలు వర్ధిల్లే తీరు!

 

  అమ్మ మళ్లీ పుట్టింది, అచ్చం తాత పోలికలే అంటూ అందరి ఇళ్లల్లో మురిసి పోవడం తరచూ కనిపిస్తుంటుంది. మనుషుల పుట్టుక, కుటుంబాలు, జాతులు తరతరాలకు కొనసాగడం, భావోద్వేగ బంధాలు, మాతృత్వం, పితృత్వం వీటన్నింటికీ మూలం మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సమస్త సృష్టికి ఆధారమైన ఆ అద్భుత పునరుత్పత్తి పరంపర సాగే తీరు, ఆడ-మగలను నిర్ధారించే కారకాలు, కవలల జననాలు వంటి ఆసక్తికర అంశాలపై పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

 

  మానవ శరీరంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక అంతర్భాగం. మనిషి జన్మకు మూలం, తరాల కొనసాగింపునకు కారణం ఈ వ్యవస్థే. దీని నియంత్రణ, పనితీరు ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. 

 

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ: పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ముష్కాలు. ఒక జత ముష్కాలు శరీరం వెలుపల ముష్కగోణిలో అమరి ఉంటాయి. ముష్కాల్లోని శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రకణాలు ఏర్పడతాయి. ఇవి తాత్కాలికంగా ముష్కాల్లో ఉన్న అధివృషణిక (ఎపిడిడైమిస్‌) అనే భాగంలో నిల్వ ఉండి, ఇక్కడే పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. శుక్రకణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉత్పత్తి అవుతాయి. ముష్కాల్లో ఉన్న లీడిగ్‌ కణాలు/ ఇంటర్‌స్టీషియల్‌ కణాలు టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

 

శుక్రకణాల నిర్మాణం, ప్రత్యేకతలు: అభివృద్ధి చెందిన శుక్రకణాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి 1) తల 2) మెడ 3) తోక. శుక్రకణం తలలో కేంద్రకం ఉంటుంది. తలపైన ఉన్న టోపీ లాంటి నిర్మాణాన్ని ఎక్రోజోము అంటారు. దీనిలో ఉన్న ఎంజైములు శుక్రకణం అండంతో కలవడానికి, అండంలోకి చొచ్చుకొని పోవడానికి లేదా ఫలదీకరణకు ఉపయోగపడతాయి. శుక్రకణం మెడలో ఉన్న మైటోకాండ్రియాలు శుక్రకణం కదలడానికి శక్తినిస్తాయి. తోక శుక్రకణం చలనానికి ఉపయోగపడుతుంది. శుక్రకణాల్లో రెండు రకాలుంటాయి. సగం శుక్రకణాలు 22 + x = 23 క్రోమోజోములను, మిగతా సగం 22 + y = 23 క్రోమోజోములను కలిగి ఉంటాయి. మానవ శరీరంలో అతిచిన్న కణాలు శుక్రకణాలు.

 

పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించిన గ్రంథుల్లో ముఖ్యమైనవి 1) కౌపర్స్‌ గ్రంథులు. ఇవి జిగురు లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. 2) పౌరుష గ్రంథి. ఇది మూత్రాశయం వెనుక ఉంటుంది. దీని స్రావం శుక్రకణాల ఉత్తేజానికి, పోషణకు, రక్షణకు ఉపయోగపడుతుంది. శుక్రాశ‌యాలు సెమినల్‌ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది శుక్రకణాల పోషణకు ఉపయోగపడుతుంది. శుక్రకణాలు, పౌరుష గ్రంథి స్రావం, సెమినల్‌ ఫ్లూయిడ్‌ లాంటివి కలిసి వీర్యం (సెమెన్‌)గా బయటకు వస్తుంది. సెమెన్‌లో ఉండాల్సిన దాని కంటే తక్కువ శుక్రకణాలు ఉండటాన్ని ఒలిగోస్పెర్మియా అంటారు. శుక్రకణాలు ఉత్పత్తి కాకపోవడాన్ని అజోస్పెర్మియా అంటారు. శుక్రకణాల కదలిక లేకపోవడాన్ని ఆస్థినోస్పెర్మియా అంటారు.

 

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ: అండాశయాలు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. గర్భాశయానికి ఇరువైపులా రెండు అండాశయాలు ఉంటాయి. వీటికి అతుక్కుని ఫాలోపియన్‌ నాళాలుంటాయి. అండాశయాల్లో వివిధ దశల్లో ప్రాథమిక అండ పుటికలు ఉంటాయి. కౌమార దశలో పిట్యూటరీ గ్రంథి నుంచి స్రావితమయ్యే ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ ప్రాథమిక అండపుటికలపై పనిచేయడం వల్ల అవి గ్రాఫియన్‌ పుటికలుగా మారతాయి. గ్రాఫియన్‌ పుటిక చుట్టూ పుటిక కణాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్స్‌ హార్మోన్‌లను స్రవిస్తాయి.

 

గ్రాఫియన్‌ పుటికపై పిట్యూటరీ గ్రంథి స్రవించిన ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పనిచేయడం వల్ల అది కార్పస్‌ల్యూటియమ్‌ అనే నిర్మాణంగా మారుతుంది. కార్పస్‌ల్యూటియమ్‌ పగలడం వల్ల దానిలోని అండం బయటకు విడుదలై ఫాలోపియన్‌ నాళాల్లోకి ప్రవేశిస్తుంది.

 

  బాలికల్లో సరాసరి 10-14 సంవత్సరాల మధ్య రుతుచక్రం మొదలవుతుంది. దీన్నే మెనార్కె అంటారు. 45-55 ఏళ్ల మధ్య రుతుచక్రం ఆగిపోవడాన్ని మెనోపాజ్‌ అంటారు. రుతుచక్రంలో సరాసరి 28 రోజులకొకసారి అండం విడుదలవుతుంది. అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం అంటారు. ఈ సమయంలో గర్భాశయం లోపలి వైపు ఎండోమెట్రియమ్‌ అనే పొర ఏర్పడుతుంది. ఈ పొర ఫలదీకరణం తర్వాత ఏర్పడిన పిండం గర్భాశయ గోడలకు అతుక్కోవడానికి సహాయపడుతుంది.

  ఫాలోపియన్‌ నాళాల్లోని అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణం జరిగితే ఒక రకమైన మార్పులు, జరగకపోతే మరో రకమైన మార్పులు కలుగుతాయి. అండానికి శుక్రకణాలు లభ్యమైతే ఫలదీకరణం జరిగి సంయుక్తబీజం (జైగోట్‌) ఏర్పడుతుంది. ఫలదీకరణం ఫాలోపియన్‌ నాళాల్లో జరుగుతుంది.

 

లింగ నిర్ణయం: పుట్టబోయే శిశువు ఆడ లేదా మగ అని నిర్ధారించడాన్ని లింగ నిర్ణయం అంటారు. దీన్ని శుక్రకణం కలయిక నిర్ధారిస్తుంది. అండంతో 22x కలిగిన శుక్రకణం ఫలదీకరణం చెందితే ఆడ శిశువుగా, 22y కలిగిన శుక్రకణం ఫలదీకరణం చెందితే మగ శిశువుగా నిర్ధారణ అవుతుంది. స్త్రీ, పురుష బీజకణాల (అండం, శుక్రకణం) కలయికను ఫలదీకరణం అంటారు. ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం విభజన చెంది పిండంగా మారుతుంది. పిండం 6 నుంచి 10 రోజుల వ్యవధిలో బ్లాస్టోసిస్ట్‌ దశలో ఫాలోపియన్‌ నాళాల నుంచి కిందకు వచ్చి గర్భాశయ గోడలకు అతుక్కుని పెరుగుతుంది. ఈ దశలో పిండానికి గర్భాశయ గోడలకు మధ్య జరాయువు ఏర్పడుతుంది. ఇది పిండానికి తల్లి నుంచి పోషక పదార్థాలను అందించడానికి తోడ్పడుతుంది.

 

జరాయువు నుంచి మూడు హార్మోన్లు విడుదలవుతాయి. అవి 1) ఈస్ట్రోజెన్‌ 2) ప్రొజెస్టిరాన్‌ 3) హ్యూమన్‌ కోరియానిక్‌ గొనడోట్రోపిన్‌ (HCG). గర్భిణుల మూత్రంలో  హెచ్‌సీజీ హార్మోన్‌ ఉంటుంది. దీన్ని మూత్ర పరీక్ష ద్వారా గుర్తించి స్త్రీ గర్భధారణను నిర్ధారించవచ్చు. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ పిండం గర్భాశయ గోడలకు అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్‌ లోపం వల్ల గర్భిణుల్లో గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది గర్భస్రావాన్ని నిరోధిస్తున్నందున గర్భస్రావ నిరోధక హార్మోన్‌ అంటారు. పిండం గర్భాశయంలో తొమ్మిది నెలలు పెరిగి గర్భావది కాలం పూర్తయిన తర్వాత శిశువుగా జన్మిస్తుంది.

  * గర్భాశయంలో పెరుగుతున్న పిండం చుట్టూ ఉన్న ద్రవాన్ని ఉల్బద్రవం లేదా ఉమ్మ నీరు అంటారు. ఇది పిండానికి రక్షణనిస్తుంది. దీన్ని పరీక్షించడం ద్వారా పుట్టబోయే శిశువులో వచ్చే జన్యు సంబంధ వ్యాధులను ముందుగానే తెలుసుకోవచ్చు.

  ఫలదీకరణం జరగకపోతే వచ్చే మార్పులు: ఫాలోపియన్‌ నాళాల్లో ఉన్న అండం ఫలదీకరణ చెందకపోతే అండం, అండాశయంలో ఉన్న కార్పస్‌ల్యూటియమ్, గర్భాశయ గోడ లోపల ఉన్న ఎండోమెట్రియమ్‌ కలిసి బహిష్టు రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీని తర్వాత మళ్లీ రుతుచక్ర వలయం ప్రారంభమవుతుంది. తిరిగి ప్రాథమిక అండపుటిక గ్రాఫియన్‌ పుటికగా మారడం, అండం విడుదలవడం, కార్పస్‌ల్యూటియమ్‌గా మారడం, ఎండోమెట్రియమ్‌ ఏర్పడటం జరుగుతాయి. ఫలదీకరణం జరగకపోతే ఇవి తిరిగి బహిష్టు రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఇలా ప్రతి 28 రోజులకొకసారి జరుగుతుంది.

 

కవలలు ఏర్పడటం, జననం: కొన్ని సెకన్లు/నిమిషాల వ్యవధిలో జన్మించే శిశువులను కవలలు అంటారు. కవలలు రెండు రకాలు 1) సమరూప కవలలు 2) అసమరూప కవలలు

 

సమరూప కవలలు: వీరు పోలికల్లో అన్ని విధాలుగా ఒకే రకంగా ఉంటారు. వీరి డీఎన్‌ఏ కూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ వేలిముద్రలు వేర్వేరుగా ఉంటాయి. ఈ కవలలనే ఏక సంయుక్త బీజ జనిత కవలలు అంటారు. అండం ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడిన సంయుక్త బీజం విభజన చెంది పిండం ఏర్పడే తొలి దశలో రెండుగా విభజన చెందుతుంది. ఇవి రెండూ విడివిడిగా అభివృద్ధి చెందడం వల్ల ఇద్దరు శిశువులు ఏర్పడతారు. సమరూప కవలలు కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. వీరు ఆడ-ఆడ లేదా మగ-మగ శిశువులుగా ఉంటారు.

 

అసమరూప కవలలు: వీరు పోలికల్లో ఒకే రకంగా ఉండరు. డీఎన్‌ఏ, వేలిముద్రలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీరు రెండు నుంచి ఆరుగురు శిశువులుగా ఉండవచ్చు. రుతుచక్ర సమయంలో స్త్రీలలో ఒక నెలలో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ అండాలు విడుదలై అవి ఫలదీకరణం చెందితే అసమరూప కవలలు ఏర్పడతాయి. వీరిలో ఆడ లేదా మగ శిశువులు లేదా ఇద్దరూ ఉండవచ్చు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. కింది ఏ కణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడతాయి?
1) శుక్రకణాలు        2) అండాలు    
3) సంయుక్త బీజం    4) నాడీకణాలు

 

2. అండాలతో పోలిస్తే శుక్రకణాల ప్రత్యేకతలు-
1) చిన్నవిగా ఉంటాయి            2) ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి
3) కదలికను చూపుతాయి           4) అన్నీ

 

3. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మాత్రమే కనిపించే గ్రంథి?
1) థైమస్‌ గ్రంథి 2) పౌరుష గ్రంథి 3) అవటు గ్రంథి 4) బాల గ్రంథి

 

4. కింది ఏ హార్మోన్‌ను గర్భస్రావక నిరోధక హార్మోన్‌ అంటారు?
1) అడ్రినలిన్‌ 2) బీటా ఈస్ట్రాడయోల్‌ 3) ప్రొజెస్టిరాన్‌ 4) థైరాక్సిన్‌

 

5. శుక్రకణం, అండం కలిసి ఫలదీకరణం జరిగే ప్రదేశం?
1) అండాశయం 2) ఫాలోపియన్‌ నాళం 3) గర్భాశయం 4) గర్భాశయ ముఖద్వారం

 

6. ఇద్దరు అసమమరూప కవలలు కింది ఏ విధంగా ఉండవచ్చు?
1) ఇద్దరు ఆడవారు 2) ఇద్దరు మగవారు
3) ఒక ఆడ, ఒక మగ శిశువు 4) అన్నీ

 

7. కార్పస్‌ల్యూటియమ్‌ పగిలి అండోత్సర్గం జరగడానికి కారణమైన హార్మోన్‌
1) ఫాలిక్యులర్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌
2) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌
3) ఈస్ట్రోజెన్‌ 4) టెస్టోస్టీరాన్‌

 

8. స్త్రీలలో 45-55 ఏళ్ల మధ్య రుతుచక్రం ఆగిపోయే స్థితిని ఏమంటారు?

1) మెనోపాజ్‌ 2) మెనార్కె 3) అబార్షన్‌ 4) సింథసిస్‌ 

 

సమాధానాలు: 1-1, 2-4, 3-2, 4-3, 5-2, 6-4, 7-2, 8-1.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌
 

Posted Date : 19-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌