• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - బహుళార్థసాధక ప్రాజెక్టులు

పంటలకు కృత్రిమంగా నీరు అందించడాన్ని నీటిపారుదల (Irrigation) అంటారు. భారతదేశాన్ని పాలించిన అనేక రాజులు, చక్రవర్తులు తమ రాజ్యాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చెరువులను తవ్వి, కాలువలను ఏర్పాటుచేసి వ్యవసాయానికి నీరు అందించారు.

దేశంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఆహార భద్రతను సాధించడానికి నీటిపారుదల సౌకర్యాలను పెంపొందించాలి.

* స్వాతంత్య్రానంతరం పంచవర్ష ప్రణాళికల ముఖ్య ఉద్దేశాల్లో నీటిపారుదల వసతులను పెంపొందించడం ప్రధానాంశంగా ఉండేది.

* 1974-75లో కేంద్ర ప్రభుత్వం ‘ఆయకట్టు ప్రాంత అభివృద్ధి’ కార్యక్రమాన్ని చేపట్టింది. నీటిపారుదల శక్యత ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూరించడమే దీని ప్రధాన ఉద్దేశం. 


ఈ కార్యక్రమంలోని ప్రధానాంశాలు

1) వ్యవసాయ ప్రాంతంలో కాలువలు, డ్రైన్‌ల నిర్మాణం.

2) భూమి ఎత్తుపల్లాలను సరిచేయడం

3) ప్రదర్శనా పద్ధతుల్లో రైతులకు పంటల నమూనాల విషయంలో తగిన శిక్షణ ఇవ్వడం.


8వ పంచవర్ష ప్రణాళికా కాలంలోనీటిపారుదల కోసం చేపట్టిన అంశాలు

* ఆయకట్టు అభివృద్ధి పథకం ద్వారా, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో, కరవుకు గురయ్యే ప్రాంతాల్లోనూ స్ప్రింక్లర్లు నెలకొల్పడం, డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థల ఏర్పాటు.

* నీటిపారుదల, వ్యవసాయ పద్ధతుల్లో మార్పు తీసుకురావడం

* భూఉపరితలజల వాడకాన్ని, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సహించడం.

* ప్రణాళికా కాలానికి ముందు భారతదేశ నీటి పారుదల సమర్థత 22.6 మిలియన్‌ హెక్టార్లు ఉండగా, ఇది 1993-94 నాటికి 85 మిలియన్‌ హెక్టార్లకు, 2020-21 నాటికి స్థూలంగా 95.57 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది.


నికర నీటిపారుదల: నికర పంటలు పండే భూమిలో సాగునీరు అందే మొత్తం విస్తీర్ణమే నికర నీటిపారుదల.

* దేశంలో 201516 నాటికి నికర నీటిపారుదల విస్తీర్ణం 68.234 మిలియన్‌ హెక్టార్లు

దేశం మొత్తం నికర నీటిపారుదల శాతం 48.73%

* అధిక నికర నీటిపారుదల ఉన్న రాష్ట్రాలు - పంజాబ్‌ (99.-62%) హరియాణా (96.91%), ఉత్తర్‌ప్రదేశ్‌ (83.17%)..

* అత్యల్ప నికర నీటిపారుదల ఉన్న రాష్ట్రాలు  అసోం (6.5%)మిజోరం (13.9%),, సిక్కిం (14.45%).-.

* నికర నీటిపారుదల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 46.74%, తెలంగాణలో 43.94% గా ఉంది. 

* స్థూల నీటిపారుదల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 49.40%, తెలంగాణలో 41.62% గా ఉంది.


బహుళార్థసాధక ప్రాజెక్టులు (Multi Purpose Projects)

 ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలను ఆశించి నదీ ప్రవాహానికి అడ్డంగా, అనువైన ప్రదేశంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆనకట్టలు, బ్యారేజీలు, కాలువలు, జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలు నిర్మించే పథకాలను బహుళార్థసాధక ప్రాజెక్టులు అంటారు.

ముఖ్య ఉద్దేశాలు:

* జల విద్యుచ్ఛక్తిని అధిక ప్రమాణాల్లో ఉత్పత్తి చేయడం

* వ్యవసాయానికి నీటి సౌకర్యాలు కల్పించడం

* వరదల నియంత్రణ 

* అంతఃస్థలీయ జల రవాణాను అభివృద్ధి పరచడం 

మత్స్య ఉత్పత్తిని ప్రోత్సహించడం

* భూగర్భ జలాల పెంపు 

* జలాశయాల జలగ్రాహక ప్రాంతాల్లో అడవుల పెంపకం, నేలల పరిరక్షణ.

* పర్యాటకులను ఆకర్షించి టూరిజాన్ని ప్రోత్సహించడం

* భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టును స్వాతంత్య్రానంతరం దామోదర్‌ నది మీద నిర్మించారు.  


దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టు: 1948లో స్వాతంత్య్రం తరవాత ప్రారంభించిన మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు

* దామోదర్‌ నది, దాని ఉపనదులపై ఝార్ఖండ్‌ రాష్ట్రంలో నిర్మించారు.

* ఈ ప్రాజెక్టును అమెరికాలోని ‘‘టెన్నిస్‌ వ్యాలీ అథారిటీ’’ ప్రాజెక్టు ఆధారంగా నిర్మించారు

* దామోదర్‌ నదిని బెంగాల్‌ దుఃఖదాయని అంటారు. ఆకస్మిక వరదల నుంచి బెంగాల్‌ను కాపాడటం ఈ ప్రాజెక్టు ఉద్దేశాల్లో ప్రధానమైంది.

* ఈ ప్రాజెక్టు పశ్చిమ్‌బంగా, బిహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు.

* 1181 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి 5.15 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందిస్తుంది.

* ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్రాజెక్టులు -  తిలియ, మైథాన్, పంచట్, కోనార్‌


భాక్రానంగల్‌ ప్రాజెక్టు: సట్లెజ్‌ నదిపై హిమాచల్‌ప్రదేశ్‌లో భాక్రా, నంగల్‌ అనే ప్రదేశంలో నిర్మించారు.


భాక్రా డ్యామ్‌: భారతదేశంలో అత్యంత గ్రావిటీ కలిగిన డ్యామ్‌.

* భాక్రా డ్యామ్‌ వెనక భాగంలో గురుగోవింద్‌ సాగర్‌ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. దీని పొడవు 90 కి.మీ. 

* ఇది నీటి నిల్వ సామర్థ్యంలో ఇందిరాసాగర్, నాగార్జునసాగర్‌ల తర్వాత దేశంలో మూడో అతి పెద్ద జలాశయం. 


నర్మదా నదీలోయ ప్రాజెక్టు: 1987లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. నర్మద, దాని ఉపనదులపై 30 భారీ ప్రాజెక్టులు, 135 మధ్య తరహా, 3000 చిన్న తరహా డ్యామ్‌లను నిర్మించారు.


సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌: నర్మదా నదీలోయ ప్రాజెక్టులో అతి పెద్ద డ్యామ్‌. దీన్ని గుజరాత్‌ రాష్ట్రంలో నవగాల ప్రాంతంలో నిర్మించారు.

* ఈ డ్యామ్‌ ప్రతిపాదిత పొడవు 1210 మీ., ఎత్తు 163 మీ. సుప్రీంకోర్టు దశల వారీగా దీని ఎత్తును పెంచడానికి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం దీని ఎత్తు 138 మీటర్లు.

* ఈ ప్రాజెక్టు నిర్మాణం 1987లో ప్రారంభమైంది. అయితే దీన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ 2017 సెప్టెంబరు 17న ప్రారంభించారు.


ఇందిరా సాగర్‌ డ్యామ్‌: దీన్ని నర్మదా సాగర్‌ లేదా పునాస డ్యామ్‌ అని కూడా పిలుస్తారు.

మధ్యప్రదేశ్‌ ఖండ్వాలోని పూనాస్‌ వద్దనున్న నర్మద నదిపై నిర్మించారు.

* ఇందిరా సాగర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్‌ డ్యామ్‌లను కలిపి ఇందిరా సాగర్‌ కాంప్లెక్స్‌ అని పిలుస్తారు. 

* ఈ డ్యామ్‌ నీటి సామర్థ్యం 12220 మిలియన్‌ క్యూబిక్స్‌.


కళ్లనై డ్యామ్‌: భారతదేశంలో అత్యంత పురాతనమైన డ్యామ్‌. దీన్ని కావేరి నదిపై కరికాళ చోళుడి కాలంలో నిర్మించారు. దీన్నే గ్రాండ్‌ ఆనకట్ట అని కూడా అంటారు. ఈ డ్యామ్‌ ఇప్పటికీ వినియోగంలో ఉంది.


నీటిపారుదల ప్రాజెక్టులు - వర్గీకరణ

దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులను ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా ప్రణాళికా సంఘం మూడు రకాలుగా వర్గీకరించింది.


1) భారీ నీటిపారుదల ప్రాజెక్టులు(Major Projects): 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న ప్రాజెక్టులు.  

ఉదా: భాక్రానంగల్, నాగార్జునసాగర్, సర్దార్‌ సరోవర్‌

సాధారణంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నదులపై నిర్మిస్తారు.


2) మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు (Medium Projects): 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ఉంటే మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అంటారు. వీటిని నదులు, ఉపనదులపై నిర్మిస్తారు. ఉదా: దిండి ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు మొదలైనవి.


3) చిన్న తరహా ప్రాజెక్టులు(Minor Projects): 2000 హెక్టార్లలోపు ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు.

* భూగర్భ జల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ కోవలోకి వస్తాయి.

*సాధారణ బావులు, ఎక్కువ లోతులేని గొట్టపు బావులు, పంపుసెట్ల సాయంతో నీటిని పైకి తోడే లోతైన గొట్టపు బావులు భూగర్భ జల పథకాల్లో భాగం. 

* చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించడం, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఉపరితల పథకాల కోవలోకి వస్తాయి.


డ్యామ్‌లు - రకాలు (Types of Dams)

నిర్మాణం, నమూనా ఆధారంగా డ్యామ్‌లను కింది విధంగా పేర్కొంటారు.

1) భారీ డ్యామ్‌: 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే డ్యామ్‌లను భారీ డ్యామ్‌లు అంటారు.

* దేశంలో అత్యధికంగా భారీ డ్యామ్‌లు ఉన్న రాష్ట్రాలు - మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌

2) గ్రావిటీ డ్యామ్‌: రాతితో లేదా కాంక్రీటుతో భారీ పరిమాణంలో, అత్యంత ఎత్తుగా నిర్మించే డ్యామ్‌లను గ్రావిటీ డ్యామ్‌లు అంటారు.

* వీటిని నదిలోని ఇరుకైన లోయల్లో, గార్జ్‌లపై నిర్మిస్తారు.

* ఇవి నిట్టనిలువుగా, అధిక నీటి ఒత్తిడిని, బరువును తట్టుకునేలా ఉంటాయి.

3) రాక్‌ఫిల్‌ డ్యామ్‌: ఈ రకమైన డ్యామ్‌లను భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నిర్మిస్తారు.

వీటి నిర్మాణంలో మట్టి, కాంక్రీటుకు బదులుగా చిన్న చిన్న రాళ్లను ఉపయోగిస్తారు.

తక్కువ వ్యయంతో పూర్తవుతాయి.

ఉదా: భద్ర డ్యామ్‌ (కర్ణాటక), సలాల్‌ డ్యామ్‌ (జమ్మూ, కశ్మీర్‌)

* జమ్మూ, కశ్మీర్‌లో నిర్మించిన మొట్టమొదటి జలవిద్యుత్‌ కేంద్రం/ ప్రాజెక్టు సలాల్‌ డ్యామ్‌

4) ఎర్త్‌ఫిల్‌ డ్యామ్‌: భారత్‌లో సుమారు 80 శాతానికి పైగా డ్యామ్‌లు ఈ రకానికి చెందినవే.

* విశాలమైన నదీ లోయకు అడ్డంగా మట్టితో లేదా గ్రావెల్‌తో తక్కువ ఎత్తులో నిర్మిస్తారు.

* ఈ డ్యామ్‌ పునాదులను రాళ్లతో లేదా కాంక్రీటుతో నిర్మిస్తారు.

5) ఆర్చ్‌ డ్యామ్‌: నీటి ఒత్తిడిని తగ్గించడానికి ఆర్చ్‌ ఆకారంలో నిర్మించే డ్యామ్‌లు. గార్జ్‌ల వద్ద వీటి నిర్మాణం అవసరం, అనుకూలం. 

ఉదా: హీరాకుడ్‌ డ్యామ్‌

6) మాసోనరి డ్యామ్‌: రాతితో లేదా ఇటుకతో నిర్మించే డ్యామ్‌లను మాసోనరి డ్యామ్‌లు అంటారు.

ఉదా: వాణి విలాససాగర్‌ డ్యామ్‌ (కర్ణాటక), రెంగాలి డ్యామ్‌ (ఒడిశా)

స్లూయిస్‌ గేట్లు(Sluice gates):  డ్యామ్‌ అడుగు భాగాన నీటి విడుదలకు ఏర్పాటు చేసే గేట్లు. నది/డ్యామ్‌లోని పూడికను తొలగించడానికి ఈ గేట్లను ఉపయోగిస్తారు.

స్పిల్‌వేస్‌: వీటిని డ్యామ్‌ పైభాగాన ఏర్పాటు చేస్తారు. డ్యామ్‌ నిండినప్పుడు నీటి విడుదలకు వీటిని ఉపయోగిస్తారు.

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను గిలీదిTMC (Thousand Million Cubic Feet) రూపంలో పేర్కొంటారు. 

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌