• facebook
  • whatsapp
  • telegram

స‌ముద్ర శాస్త్రం

ప్రశాంత సాగరం.. కల్లోల తీరం!


ఉండేది ఉప్పునీరే అయినా భూగోళాన్ని మూడొంతులకుపైగా ఆవరించిన అనంత జలనిధులు  ప్రపంచ ప్రాణికోటికి జీవాధారాలు. వాతావరణ వ్యవస్థలకు మూలాలు. అనేక జలచరాలకు, అపార సంపదలకు నిలయాలైన ఆ అయిదు మహాసముద్రాల్లో ప్రశాంత సాగరమైన పసిఫిక్‌తోపాటు కల్లోల తీరాలున్న అట్లాంటిక్‌ ఉన్నాయి. వీటి విస్తరణ తీరు, ప్రత్యేకతల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


సముద్రం సమస్త జీవరాశులకు మూలాధారం. ప్రాణవాయువు లేకపోతే ఏ జీవి బతకలేదు. వాతావరణంలో ఉండే ఆ ప్రాణవాయువులో దాదాపు 25% సముద్రంలోని ఫైటోప్లవకం (ఆల్గే) అనే నిమ్న వృక్ష జాతి నుంచి లభిస్తుంది. సముద్రంలో మత్స్య సంపదే కాకుండా మాంగనీసు, కోబాల్ట్, నికెల్‌ లాంటి లోహ మూలకాలెన్నో లభ్యమవుతున్నాయి. శక్తి వనరైన చమురును సముద్ర భూతలం నుంచి వెలికితీస్తున్నారు.ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేసేదే సముద్ర శాస్త్రం (ఓషనోగ్రఫి).


ప్రపంచంలో అధిక భూభాగాన్ని మహాసముద్రాలు, సముద్రాలు ఆవరించి ఉన్నాయి. ఖండాల లోపలి భాగాల్లోని దేశాల తీరాన్ని ఆనుకుని తక్కువ వైశాల్యంతో, గాఢమైన లోతుతో ఉన్న జలభాగాలనే సముద్రాలు అంటారు. ఖండాల వెలుపలి భాగంలో అధిక విస్తీర్ణం, లోతులతో విస్తరించిన జలభాగాలను మహాసముద్రాలుగా పేర్కొనవచ్చు.


భూఉపరితలాన్ని ఆవరించిన 70.8 శాతం జలభాగంలో 97% ఉప్పునీరే. దీన్ని జీవులు వినియోగించుకోలేవు. మిగిలిన 3 శాతమే మంచినీరు. ఇందులో 2% ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లో మంచు రూపంలో నిరుపయోగంగా ఉంది. కేవలం 1% నీరే జీవులకు ఉపయోగపడుతోంది.


* భూఉపరితలాన్ని కప్పిఉన్న మొత్తం జలభాగాన్ని వాస్తవంగా నాలుగు మహాసముద్రాలుగా విభజించారు. అయిదో మహాసముద్రంగా పిలిచే అంటార్కిటికా లేదా దక్షిణ మహాసముద్రం అనేది ఒక భౌగోళిక ఊహ మాత్రమే.


మహాసముద్రాలు - ప్రత్యేకతలు

పసిఫిక్‌ మహాసముద్రం: మహాసముద్రాల్లోకెల్లా అతి పెద్దది, లోతైంది పసిఫిక్‌. ప్రపంచ విస్తీర్ణంలో 1/3వ వంతును ఇది ఆక్రమించింది. సగటు లోతు 5,000 మీటర్లు. త్రిభుజాకారంలో ఉండే దీన్ని ‘ప్రశాంత మహాసముద్రమని’, ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ అని పిలుస్తారు.తూర్పున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల సరిహద్దుల వెంబడి విస్తరించి ఉంది. పశ్చిమాన ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలకు సరిహద్దుగా ఉంది. ఈ సముద్ర ఖండతీరపు అంచుపైన జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా దేశాలున్నాయి. ప్రపంచంలోని అత్యంత లోతైన ‘మెరియానా ట్రెంచ్‌’ ఫిలిప్పీన్స్‌ దీవుల సమీపంలో, పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంది. ట్రెంచ్‌ లేదా కందకాలు ఎక్కువగా ఉన్న మహాసముద్రమిది. అబైసల్‌ (అగాధ) మైదానం ఎక్కువ వెడల్పుతో ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రాణులున్న సముద్రం కూడా ఇదే. దాదాపు 20 వేల రకాల జీవులున్నాయి. దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళంలోకి విస్తరించి బేరింగ్‌ జలసంధి వద్ద అంతమవుతుంది.

అట్లాంటిక్‌ మహాసముద్రం: రెండో అతి పెద్ద మహాసముద్రం. ఆంగ్ల అక్షరం ‘S’ ఆకారంలో ఉంటుంది. ‘హెర్రింగ్‌ పాండ్‌’, ‘కల్లోల సముద్రం’ అని పిలుస్తారు. తూర్పున ఐరోపా, ఆఫ్రికా ఖండాలకు; పశ్చిమాన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు సరిహద్దుగా ఉంది. రిడ్జ్‌ అనే భూస్వరూపాలు ఇందులోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అతి పొడవైన ‘ద గ్రేట్‌ అట్లాంటిక్‌ మిడ్‌ ఓషియానిక్‌ రిడ్జ్‌’ కూడా ఉంది. మహాసముద్రాలన్నింటిలో అత్యంత లవణీయత కలిగి ఉంది. ఇందులో వ్యాపార మార్గాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.

* అత్యంత పొడవైన తీర రేఖ ఉన్న మహాసముద్రం. (అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న దేశం కెనడా. తక్కువ తీరరేఖ ఉన్న దేశం సూడాన్‌.)

* అతి వెడల్పయిన ఖండతీరపు అంచున్న సముద్రం. ఇందులో అత్యంత లోతైన ప్రదేశం ప్యూర్టోరికా ట్రెంచ్‌ (బ్లాక్‌ డీప్‌). 

* అట్లాంటిక్‌ సరిహద్దు సముద్రాలను ఎపికాంటినెంటల్‌ సముద్రాలు అంటారు. ఉదా: మధ్యధరా సముద్రం, బాల్టిక్‌ సముద్రం.

* అట్లాంటిక్, ఆర్కిటిక్‌ సముద్రాలు డెవీస్‌ జలసంధి దగ్గర కలుస్తాయి.

ఆర్కిటిక్‌ మహాసముద్రం:  ఉత్తర ధృవం చుట్టూ విస్తరించి ఉన్న ఈ మహాసముద్రం ఆంగ్ల అక్షరం ‘వీ’ ఆకారంలో ఉంటుంది. ఆసియాకు ఉత్తరాన ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల చుట్టూ ఈ సముద్ర జలాలు విస్తరించి ఉన్నాయి. అత్యధిక శీతల పరిస్థితుల కారణంగా ఇందులోని నీరు ఏడాదంతా గడ్డకట్టే ఉంటుంది. ఇది అతి చిన్న మహాసముద్రం.

హిందూ మహాసముద్రం:  దక్షిణార్ధ గోళంలో అధిక భాగం విస్తరించిన మహాసముద్రం. ఆంగ్ల అక్షరం ‘M’ ఆకారంలో ఉంటుంది. ఇందులో అత్యంత లోతైన ప్రదేశం ‘సుంధా కందం’. హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవి మడగాస్కర్‌. అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటుచేసిన దీవి డిగోగార్సియా.

* హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే జలసంధి పేరు బాబ్‌ ఎల్‌ మాండెబ్‌. దీన్నే గేట్‌ వే ఆఫ్‌ టియర్స్‌ అంటారు.

అంటార్కిటిక్‌ మహాసముద్రం: ఇది దక్షిణ ధృవంలో విస్తరించి ఉంది. దక్షిణ మహాసముద్రమని పిలుస్తారు. ఖండతీరపు అంచు అతి తక్కువగా ఉంటుంది. పెంగ్విన్‌ పక్షులు ఈ సముద్ర తీర ప్రాంతంలో అత్యధికంగా సంచరిస్తాయి. ఇక్కడ భారతదేశం ప్రథమంగా దక్షిణ గంగోత్రి, ఆ తర్వాత మైత్రేయి అనే రెండు పరిశోధన కేంద్రాలను నెలకొల్పింది.

మహాసముద్రాల లోతు: సముద్రాల సరాసరి లోతు దాదాపు 3,800 మీటర్లు. వివిధ ప్రదేశాల్లో సముద్రాల లోతు, ప్రతిధ్వనిని గంభీరత మాపకం (Echo - Sounding) లేదా సోనార్‌ అనే పరికరం ద్వారా కొలుస్తారు. సముద్రాల లోతును పాథమ్స్‌ అనే ప్రమాణాలతో సూచిస్తారు (1 పాథమ్‌ = 1.8 మీటర్లు).

* సముద్రజల ఉపరితల దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం - నాటికల్‌ మైల్‌. (1 నాటికల్‌ మైల్‌ = 1.852 కి.మీ.)


మాదిరి ప్రశ్నలు

1. సముద్ర పంపిణీకి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి?

ఎ) నీటిఆవిరి కూడా భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు పెరుగుతుంది.

బి) నీటి సాంద్రతలో తేడాలు సముద్ర ప్రవాహాల నిలువు చలనశీలతను ప్రభావితం చేస్తాయి. 

సి) లవణీయత, ఉష్ణోగ్రత, నీటి సాంద్రత పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

పై ప్రకటనల్లో ఏది సరైంది?

1) ఎ, బి        2) బి            3) సి            4) ఎ, సి

జ:  బి 

 

2. సముద్ర భూతలంపై 1000 మీ., అంతకంటే ఎత్తు కలిగి ఉపరితలాలు సమతలంగా ఉన్న స్వరూపాలను ఏమని పిలుస్తారు?

1) అబైసల్‌ మైదానం     2) సీమౌంట్స్‌         3) గయోట్స్‌         4) రిడ్జెస్‌

జ:  గయోట్స్‌        

 

3. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి?

1) సముద్ర మట్టం పెరుగుదల        2) పంట పద్ధతిలో మార్పు

3) తీరరేఖలో మార్పు        4) పైవన్నీ

జ:  పైవన్నీ

 

4. సముద్రాల్లో ఒకే లోతు గల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు?

1) ఐసోనిఫ్‌         2) ఐసోక్లైంట్స్‌     3) ఐసోబాథ్స్‌        4) ఐసోహైడ్స్‌

జ: ఐసోబాథ్స్‌        

  

5. సముద్ర భూతలాల్లో పెట్రోలియం నిక్షేపాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటాయి?

1) ఖండతీరపు అంచు         2) ఖండతీరపు వాలు  

3) అబైసల్‌ మైదానం         4) మహాసముద్ర అగాథం

జ:  ఖండతీరపు అంచు​​​​​​​

 

6. పాథోమీటర్‌ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? 

1) ఫిలిం ఫ్రేమ్‌లు         2) సముద్రపు లోతు   

3) గాలి ఒత్తిడి              4) నీటి సాంద్రత

జ:  సముద్రపు లోతు

 

7. భూమి యొక్క అత్యంత లోతైన భాగమైన మెరియానా అగాథం ... మహా సముద్రంలో ఉంది?

1) ఆర్కిటిక్‌      2) అట్లాంటిక్‌       3) పసిఫిక్‌       4) హిందూ

జ:  పసిఫిక్‌       

 

8. అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న మహాసముద్రం?

1) హిందూ      2) పసిఫిక్‌      3) అట్లాంటిక్‌       4) ఆర్కిటిక్‌

జ:  అట్లాంటిక్‌       

 

9. ప్రశాంత మహాసముద్రం దేనికి పేరు?

1) పసిఫిక్‌       2) హిందూ       3) అట్లాంటిక్‌       4) ఆర్కిటిక్‌

జ:  పసిఫిక్‌       ​​​​​​​

 

10. S ఆకారంలో ఉన్న సముద్రం ఏది?

1) పసిఫిక్‌ మహాసముద్రం           2) అట్లాంటిక్‌ మహాసముద్రం  

3) మధ్యధరా సముద్రం              4) హిందూ మహాసముద్రం

జ:  అట్లాంటిక్‌ మహాసముద్రం​​​​​​​

 

11. సముద్ర లవణీయతను కిందివాటిలో ఏవి ప్రభావితం చేస్తాయి?

1) భూమి      2) గాలి        3) నది          4) అగ్నిపర్వతాల నుంచి వెలువడిన బూడిద

జ:  నది

 

12. మహాసముద్రాలకు పేర్లు పెట్టిన క్రమం?

ఎ) అట్లాంటిక్‌    బి) ఆర్కిటిక్‌     సి) హిందూ     డి) పసిఫిక్‌

1) బి, ఎ, డి, సి      2) డి, ఎ, బి, సి      3) ఎ, సి, బి, డి       4) సి, బి, ఎ, డి

జ:  డి, ఎ, బి, సి

 

13. రోజుకు రెండుసార్లు సముద్రపు నీటి లయబద్ధమైన పెరుగదల, పతనాన్ని ....... అంటారు. 

1) అల     2) సునామీ       3) విద్యుత్తు       4) ఆటుపోటు

జ:  ఆటుపోటు​​​​​​​

 

14. కిందివాటిలో పసిఫిక్‌ మహాసముద్రం యొక్క వెచ్చని సముద్ర ప్రవాహం ఏది?

1) కురోషియో కరెంట్‌       2) హంబోల్ట్‌ కరెంట్‌   

3) కానరీస్‌ కరెంట్‌         4) లాబ్రడార్‌ కరెంట్‌

జ:  కురోషియో కరెంట్‌

 

15. నేషనల్‌ మారిటైమ్‌ డేను 2023లో ఏ రోజున పాటించారు?

1) ఏప్రిల్‌ 5        2) ఏప్రిల్‌ 4        3) ఏప్రిల్‌ 3        4) ఏప్రిల్‌ 6

జ:  ఏప్రిల్‌ 5 

ర‌చ‌యిత‌: స‌క్క‌రి జ‌య‌క‌ర్‌

Posted Date : 07-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌