• facebook
  • whatsapp
  • telegram

శరీరధర్మశాస్త్రం - ప్రసరణ వ్యవస్థ

* మానవుల్లో ప్రసరణ వ్యవస్థను రక్త ప్రసరణ వ్యవస్థ, లింఫాటిక్‌ వ్యవస్థ లేదా శోషరస వ్యవస్థ అనే రెండు విధాలుగా అధ్యయనం చేయవచ్చు.

* రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానాంశాలు రక్తం, రక్తనాళాలు, హృదయం. మానవ రక్త ప్రసరణ వ్యవస్థ ఒక సంవృత ప్రసరణ వ్యవస్థ.

* మానవ హృదయం బేరి పండు ఆకృతిలో త్రికోణాకారంగా ఉంటుంది. సాధారణంగా పైభాగం వెడల్పుగా, కింది భాగం సన్నగా ఉంటుంది.

* హృదయాన్ని ఆవరించి రెండు పొరలు ఉంటాయి. వీటిని పెరికార్డియల్‌ త్వచాలు లేదా హృదయావరణ త్వచాలు అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అఘాతాల నుంచి సంరక్షిస్తుంది. 

* మానవుల్లో హృదయం నాలుగు భాగాలుగా విభజితమై ఉంటుంది. పైరెండు భాగాలను (గదులు) కర్ణికలు లేదా ఆరికల్స్‌ అంటారు. దిగువన అమరి ఉండే రెండు గదులను జఠరికలు లేదా వెంట్రికల్స్‌ అంటారు. 

* కర్ణికల గోడలు పలుచగా, జఠరికల గోడలు మందంగా ఉంటాయి. ఎడమవైపు ఉన్న రెండు గదుల్లో ఒకటి పూర్వాంతం వైపు, రెండోది పరాంతం వైపు అమరి ఉన్నట్లు కనిపిస్తాయి.

* రక్తనాళాలు ప్రధానంగా మూడు విధాలు. అవి: ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు.

* హృదయం నుంచి బయలుదేరి శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ధమనులు లేదా ఆర్టరీస్‌ అంటారు. 

* ధమనుల గోడలు దృఢంగా ఉంటాయి.

* అతిపెద్ద ధమనిని బృహద్ధమని లేదా మహాధమని లేదా ఓర్టా అని పిలుస్తారు.

* రక్తప్రసరణ వ్యవస్థలో చిన్న ధమని పుపుస ధమని. దీన్నే పల్మనరీ ఆర్టరీ అంటారు.

* పుపుస ధమని రక్తాన్ని హృదయం నుంచి ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది.

* శరీర భాగాల నుంచి హృదయానికి రక్తాన్ని రవాణా చేసే రక్తనాళాలను సిరలు లేదా వెయిన్స్‌ అంటారు.

* సిరలు తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు.

* గుండెకు పైభాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఊర్థ్వ బృహత్సిర (సుపీరియర్‌ వెనా కావా) అంటారు.

* గుండెకు కుడివైపున దిగువభాగంలో కనిపించే సిరను అధో బృహత్సిర (ఇన్‌ఫీరియర్‌ వెనా కావా) అంటారు. ఇది శరీరం దిగువ భాగాల నుంచి రక్తాన్ని సేకరించి హృదయానికి చేరుస్తుంది.

* హృదయంలో ఎడమవైపున ఉన్న కర్ణిక, జఠరికలు కుడివైపు వాటికంటే చిన్నగా ఉంటాయి. రెండు కర్ణికలు, జఠరికలు కండర నిర్మితమైన విభాజకాలతో వేరై ఉంటాయి.

* కుడి కర్ణికలోకి పూర్వ, పర మహాసిరలు తెరచుకునే రంధ్రాలు ఉంటాయి.

* ఎడమ కర్ణికలోకి ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరచుకుంటాయి.

* బృహద్ధమని ఎడమ జఠరిక పైభాగం నుంచి బయలుదేరుతుంది. ఈ ధమని చాపం శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది.

* కుడి జఠరిక పైభాగం నుంచి బయలుదేరే పుపుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.

* గుండె గోడలను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేయడం కరోనరీ ధమనుల విధి. ఈ కండరాల నుంచి రక్తాన్ని సేకరించే పని కరోనరీ సిరలు నిర్వర్తిస్తాయి. 

* విలియం హార్వే రక్త ప్రవాహం గురించి అధ్యయనం చేశాడు. 

గుండెలోని రక్తం ధమనుల్లోకి వెళుతుంది. అదేవిధంగా సిరల నుంచి రక్తం గుండెను చేరుతుంది. అంటే రక్తానికి రెండు ప్రవాహాలు ఉంటాయి. దీన్నే ద్వివలయ రక్త ప్రసరణ అంటారు.

* మార్సెల్లో మాల్ఫీజీ సూక్ష్మదర్శిని సహాయంతో కంటికి కనిపించని రక్తనాళాలను పరిశీలించాడు. ఇవి ధమనులు, సిరల మధ్య ఉండే అతిసన్నని, చిన్నవైన రక్తనాళాలు. వీటినే సూక్ష్మకేశనాళికలు (కేపిల్లరీస్‌) అంటారు.

* రక్తకేశనాళికలు ఏకకణ మందంతో నిర్మితమై ఉంటాయి. ఇవి సూక్ష్మ నాళాలు. ఇవి తమ నుంచి పదార్థాలు వ్యాపనం చెందడానికి వీలుగా ఉంటాయి. ధమనులు సిరలను కలుపుతూ రక్తకేశనాళికా జలాన్ని ఏర్పరచడానికి సహకరిస్తాయి

* మానవుడి గుండె పిండాభివృద్ధి సమయంలోనే 21వ రోజు నుంచి స్పందించడం ప్రారంభిస్తుంది.

* కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం లేదా కార్డియాక్‌ వలయం లేదా హార్ధిక వలయం అని అంటారు.

* కర్ణికల సంకోచంతో రక్తం కర్ణిక, జఠరికల మధ్య ఉన్న కవాటాలను తోసుకుని జఠరికలోకి ప్రవేశిస్తుంది. జఠరికలు రక్తంతో నిండగానే సంకోచిస్తాయి. 

*ఈ సమయంలోనే సడలిక మొదలై కర్ణికలు యథాస్థితికి చేరుకుంటాయి. 

*జఠరికలు సంకోచించడంతో దైహిక చాపంలోకి, పుపుస ధమనుల్లోకి కవాటాలు తెరుచుకోవడంతో రక్తం ప్రవహిస్తుంది. ఈ సమయంలోనే కర్ణికలు, జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం కలిగించిన పీడనానికి మూసుకుంటాయి.

* కవాటాలు మూసుకోవడంతో ‘లబ్‌’ అనే శబ్దం వినిపిస్తుంది. జఠరికలు యథాస్థితికి చేరుకునే సమయంలో అందులోని పీడనం తగ్గడంతో రక్తనాళాల్లోని కవాటాలు మూసుకుంటాయి. దీంతో ‘డబ్‌’ అనే శబ్దం వినిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియనే హార్ధిక వలయం అంటారు.

*ఈ వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొనే సంకోచ ప్రక్రియను ‘సిస్టోల్‌’ అని, విశ్రాంతి తీసుకునే యథాపూర్వక స్థితిని ‘డయాస్టోల్‌’ అని అంటారు. 

ఈ మొత్తం ప్రక్రియ సుమారు 0.8 సెకన్లలోనే జరుగుతుంది.

* ఇలా ఒకదానివెంట ఒకటి సంభవిస్తూ మనిషి మరణం వరకూ కొనసాగుతూనే ఉంటుంది. 

* ఇందులో కర్ణికల సంకోచ సమయం 0.11 - 0.14 సెకన్లు. జఠరికల సంకోచ సమయం 0.27 - 0.35 సెకన్లు. 

* పూర్తిగా రక్తనాళాల్లో ప్రవహించే రక్త వ్యవస్థ జంతు రాజ్యంలోని అనెలిడా, ఇఖైనోడర్మేటా, (ఆక్టోపస్‌ లాంటివి), సెఫలోపొడాకు చెందిన మొలస్కా జీవుల్లో, అన్ని పైస్థాయి కార్డేటా జీవుల్లోనూ కనిపిస్తుంది. ఈ రకమైన రక్తప్రసరణ వ్యవస్థను సంవృత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు.

*రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు. ఆర్థ్రోపొడాతో పాటు, అనేక మొలస్కా జీవులు, కింది స్థాయి కార్డేటా జీవుల్లో ఈ రకమైన ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

* ఆరోగ్యవంతుల శరీరంలో సిస్టోలిక్‌ పీడనం 120 మి.మీ., డయాస్టోలిక్‌ పీడనం 80. మి.మీ. పాదరస పీడనంగా ఉంటుంది. దీన్ని 120/80గా సూచిస్తారు.

వైద్యులు మానవుడి రక్తపీడనాన్ని స్పిగ్మోమానోమీటర్‌ పరికరంతో కొలుస్తారు. 

* రక్తపీడనం మన శరీరంలో వివిధ శరీర భాగాల్లో వేర్వేరుగా ఉంటుంది. కానీ వైద్యులు ధమని పీడనాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. విశ్రాంతి తీసుకోవడం, నడవటం, పరిగెత్తడం లాంటి పరిస్థితుల్లో రక్తపీడనం వేర్వేరుగా ఉంటుంది.

* విశ్రాంతి సమయంలో మానవుడిలో సాధారణం కంటే ఎక్కువ రక్తపీడనం ఉంటే ఆ వ్యక్తికి రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) ఉన్నట్లుగా భావిస్తారు. తక్కువగా రక్తపోటు గమనిస్తే దాన్ని హైపోటెన్షన్‌ అంటారు.

* జంతు రాజ్యంలో ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని అనెలిడాలో గమనించవచ్చు.

* రక్తకేశనాళికల ద్వారా కణజాలాల్లోకి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని కణజాల ద్రవం అంటారు. అయితే ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి నిర్దేశించిన మరో సమాంతర వ్యవస్థే శోషరస వ్యవస్థ. శోషరసం లేదా లింఫ్‌ అనేది రక్తాన్ని కణాలను జోడించే ప్రధానమైన పదార్థం.

* రక్తం నుంచి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి రక్తంలోకి చేర్చడం శోషరసం ప్రధాన విధులు.


మాదిరి ప్రశ్నలు

1. వేరికోజ్‌ వెయిన్‌ అంటే ఏమిటి?

1) ఒక్కసారిగా గుండె ఉబ్బిపోయి రక్తనాళాలు పగిలిపోయే వ్యాధి

2) ధమనుల్లో కొలెస్టరాల్‌ చేరి రక్తప్రసరణకు ఆటంకం కలిగించడం.

3) కవాటాలు సరిగా పనిచేయకపోవడంతో ఉపరితల సిరలు ఉబ్బి, మెలితిరిగి నొప్పి కలగడం.

4) మహాధమని బృహత్సిరలో కలిసిపోవడం వల్ల కలిగే హృద్రోగస్థితి.

జ: ఒక్కసారిగా గుండె ఉబ్బిపోయి రక్తనాళాలు పగిలిపోయే వ్యాధి  

 

2. ECG (ఎలక్ట్రో కార్డియోగ్రఫీ) అంటే...... 

1) గుండె చప్పుడు వింటూ రేఖాచిత్రం గీయడం.

2) హృదయ వలయానికి సంబంధించిన విద్యుత్‌ మార్పులను నమోదు చేయడం.

3) హృదయ స్పందనకు నాడీ ప్రచోదనానికి గల వినిమయం నమోదు చేయడం.

4) గుండెలో రక్తప్రసరణ చప్పుడును గుర్తించడం.

జ: హృదయ వలయానికి సంబంధించిన విద్యుత్‌ మార్పులను నమోదు చేయడం.

 

3. కండరమయ హృదయాల్లో సంకోచం ఎక్కడ ప్రారంభం అవుతుంది?            

1) ఆరిక్యులో వెంట్రిక్యులార్‌ నోడ్‌

2) బండిల్‌ ఆఫ్‌ హిస్‌

3) యూస్టేసియన్‌ కవాటాలు

4) సైనో ఏట్రియల్‌ నోడ్‌ 

జ: యూస్టేసియన్‌ కవాటాలు

 

4. కింది వాటిలో ఏ కారణంతో ఊపిరితిత్తుల్లో రక్తచలన దోషం ఏర్పడుతుంది?

1) హైపర్‌ టెన్షన్‌    2) కరోనరీ ఆర్టరీ డిసీజ్‌   3) ఏంజినా    4)గుండె విఫలమవడం

జ: గుండె విఫలమవడం

 

5. మానవ హృదయంలో ‘యాక్షన్‌ పొటెన్షియల్‌’ మార్గం ఏది?

1) SA నోడ్‌ - AV నోడ్‌ - AV బండిల్‌

2) AV నోడ్‌ - SA  నోడ్‌ - బండిల్‌ ఆఫ్‌ హిస్‌ - AV బండిల్‌ 

3) SA నోడ్‌ - AV నోడ్‌ - AV బండిల్‌ - బండిల్‌ ఆఫ్‌ హిస్‌

4) SA నోడ్‌ - AV నోడ్‌ - పర్కింజే తంతువులు.

జ: SA నోడ్‌ - AV నోడ్‌ - AV బండిల్‌ - బండిల్‌ ఆఫ్‌ హిస్‌

 

6. కింది వాటిలో ఏ సిర ఆక్సిజన్‌ రహిత రక్తాన్ని రవాణా చేయదు?

1) పుపుస సిర     2) కాలేయ సిర    3) హెపాటిక్‌ ఫోర్టోల్‌ సిర    4) రీనల్‌ వెయిన్‌

జ: పుపుస సిర


7. కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్య ఉండే కవాటం?  

1) ద్విపత్ర కవాటం    2) త్రిపత్ర కవాటం     3) మిట్రల్‌ కవాటం    4) అర్ధచంద్రాకార కవాటం

జ: త్రిపత్ర కవాటం


8. హృదయానికి రక్తప్రసరణ చేసే రక్తనాళ వ్యవస్థ? 

1) కరోనరీ వ్యవస్థ   2) దేహీయ వ్యవస్థ    3) పుపుస వ్యవస్థ   4) తంతుయుత వ్యవస్థ 

జ: కరోనరీ వ్యవస్థ

Posted Date : 15-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌