• facebook
  • whatsapp
  • telegram

జనాభా విస్తరణ

క్షీణత.. విస్ఫోటం.. స్థిరత్వం! 

పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఇళ్లు, ఆరోగ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులను ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది.  అందుకోసం మానవ నివాసాలు, వనరుల పంపిణీ, సామాజిక వృద్ధి తీరుతెన్నులను అర్థం చేసుకోవాలి. భూగోళశాస్త్రంలోని జనాభా విస్తరణ అధ్యాయం ఆ వివరాలను అందిస్తుంది. జనాభా పెరుగుదల, వలసలు, పట్టణీకరణ నమూనాలను విశదీకరిస్తుంది. పర్యావరణం, మౌలిక సదుపాయాలు, సామాజిక ఆర్థిక నిర్మాణాలపై జనాభా వృద్ధి ప్రభావాన్ని విశ్లేషించడంలో సాయపడుతుంది. శతాబ్ద కాలంలో భారతదేశ జనాభా విస్తరణలో విపరీతమైన వ్యత్యాసాలు నమోదయ్యాయి. క్షీణత, విస్ఫోటం, స్థిరత్వం సంభవించాయి. ఈ పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జనాభా వృద్ధిలో ముఖ్యమైన దశలు, వృద్ధి కారకాలు, గత అధికారిక లెక్కల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా జనాభా, జనసాంద్రత, వృద్ధి రేట్లతోపాటు ప్రస్తుత పరిస్థితులనూ తెలుసుకోవాలి.


దేశంలో జనాభా విస్తరణ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. ప్రాంతాలవారీగా మారుతోంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి 

1) దేశ భౌగోళిక స్థలాకృతి, నైసర్గిక స్వరూపాల్లో తేడాలు 

2) దేశ భూభాగంలోని శీతోష్ణస్థితి వైవిధ్యం 

3) వృక్ష సంపద, నేలలు, ఖనిజాలు తదితర సహజవనరుల లభ్యతలోని వైవిధ్యం

4) సమాజంలోని సామాజిక, ఆర్థికపరమైన వ్యత్యాసాలు (మత విశ్వాసాలు, సంప్రదాయాలు, విద్య, తలసరి ఆదాయం, భిన్నవర్గాల జీవన ప్రమాణాలు మొదలైనవి).

5) ప్రభుత్వ విధానాలు


 ప్రపంచంలో 2.4% భూభాగాన్ని, 17.5% జనాభాను భారతదేశం కలిగి ఉంది. 2011 లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో అత్యధికంగా 16.49% ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్‌ ఉన్నాయి. అతితక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో సిక్కిం, తర్వాత స్థానాల్లో మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా ఉన్నాయి.


* కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్నవి దిల్లీ (1.67 కోట్లు, 1.38 శాతం), పుదుచ్చేరి (12.44 లక్షలు, 0.10 శాతం). అల్ప జనాభా ఉన్నవి: లక్షదీవులు (64,473, (0.01 శాతం)), డామన్‌ డయ్యూ (2,43,247)


* జిల్లాల పరంగా అత్యధిక జనాభా ఉన్నవి మహారాష్ట్రలోని థానే (1.10 కోట్లు), బెంగాల్‌లోని 24 పరగణాలు (1 కోటి). అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబాంగ్‌ వ్యాలీ (7,498)


జనాభా వృద్ధి రేటు: ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల మధ్యలో పెరిగే జనాభాను జనాభావృద్ధి అంటారు.

ఉదా: 2001 - 2011 మధ్య పెరిగిన జనాభాను శాతంలో వ్యక్తపరిస్తే జనాభా వృద్ధి రేటు వస్తుంది. (21/121) × 100 = 17.5%


ఈ జనాభావృద్ధిని 10 సంవత్సరాలకు గణిస్తే అది ‘దశాబ్ద వృద్ధి రేటు’, అదే సంవత్సరానికి గణిస్తే ‘వార్షిక వృద్ధి రేటు’ అవుతుంది.


భారత్‌లో జనాభా వృద్ధి రేటు ప్రస్తుతం 1.64%గా ఉంది. ఇదే రేటులో దేశ జనాభా వృద్ధి చెందితే పాప్యులేషన్‌ రిఫరెన్స్‌ బ్యూరో అంచనాల ప్రకారం 2030 నాటికి, అమెరికన్‌ పాప్యులేషన్‌ బ్యూరో అంచనాల ప్రకారం 2025 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను అధిగమిస్తుంది (వాస్తవానికి 2023లోనే భారత్, చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరింది).

గత శతాబ్ద కాలంలో దాదాపు 4 రెట్లు పెరిగిన భారతదేశ జనాభా వృద్ధి రేటును 4 దశలుగా విభజించవచ్చు.

1) మొదటి దశ - స్థిరత్వంతో కూడిన వృద్ధి దశ (1901-21)

2) రెండో దశ - నిలకడతో కూడిన క్రమమైన వృద్ధి దశ (1921-51)

3) మూడో దశ - వేగవంతమైన వృద్ధి దశ (1951-81)

4) నాలుగో దశ - మందగమనంతో కూడిన తిరోగమన దశ (1981- ప్రస్తుతం)


* మనదేశంలో 1921లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. అందుకే 1921ను దేశ జనాభా లెక్కల సేకరణలో గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొన్నారు. 1951 తర్వాత జనాభా వృద్ధి రేటు వేగంగా పెరిగింది. ఇప్పటివరకు అత్యధిక జనాభావృద్ధి రేటు 1981లో నమోదైంది. అప్పటినుంచి నుంచి తగ్గుతోంది.


* 2001-2011 కాలంలో భారత దశాబ్ద జనాభా వృద్ధి రేటు 17.64%


* 2001-2011లో భారత వార్షిక వృద్ధి రేటు 1.64%


మొదటి దశ (1901-21): ఈ దశలో జననాల రేటుతో పోలిస్తే మరణాల రేటు కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఇంచుమించు జనాభావృద్ధిలో ఎలాంటి మార్పు లేదు. 1901 జనాభా లెక్కల (సెన్సస్‌) ప్రకారం జనాభావృద్ధి రేటు 5.42% ఉండగా, 1921 జనాభా లెక్కల ప్రకారం -0.31% గా నమోదైంది. అంటే రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. ఇన్‌ఫ్లూయెంజా, ప్లేగు, కలరా, స్మాల్‌పాక్స్‌ లాంటి వ్యాధులు ప్రబలడమే ఇందుకు కారణం. ఒక్క ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే 1.2 కోట్ల మంది భారతీయులు చనిపోయారు. 1911, 1913, 1915, 1918, 1920 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కరవు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వీటికితోడు మొదటి ప్రపంచయుద్ధంలో అనేక మంది భారతీయ సైనికులు మరణించారు.

రెండో దశ (1921-51): ఈ దశ మధ్యకాలంలో భారతదేశ జనాభా నిలకడతో కూడిన వృద్ధిని సాధించింది. 1921లో 251 మిలియన్ల జనాభా ఉండగా, 1951 నాటికి 360 మిలియన్లకు జనాభాకు పెరిగింది. ఇందుకు కారణాలు ఉన్నాయి. 1) వైద్య ఆరోగ్య సదుపాయాలు మెరుగై చాలావరకు సంక్రమణ వ్యాధుల నివారణ సాధ్యమైంది. 2) వర్షాలు సమృద్ధిగా కురవడంతో కరవు పరిస్థితులు తగ్గి, వ్యవసాయాభివృద్ధి జరిగి ఆహారధాన్యాల సరఫరా మెరుగైంది. ఈ దశలో జననాల రేటు కన్నా మరణాల రేటు కొద్దిగా తగ్గింది.

మూడో దశ (1951-81): ఈ దశలో దేశ జనాభా దాదాపు రెండు రెట్లు పెరగడమే కాకుండా జనాభావృద్ధి రేటు 2.2గా నమోదైంది. ఇందుకు కొన్ని కారణాలను గుర్తించారు. 1) శాస్త్ర సాంకేతిక, వైద్య రంగాల్లో పురోగతి, హరిత విప్లవంతో వ్యవసాయ రంగంలో జరిగిన ప్రగతి. 2) పారిశ్రామికీకరణ వల్ల జీవన ప్రమాణాలు మెరుగవడం.ఈ దశలో జనన, మరణాల రేట్లు రెండూ తగ్గాయి.

నాలుగో దశ (1981-ప్రస్తుతం): జనాభా నియంత్రణ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, చిన్న కుటుంబాలతో కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడంతో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. జనన, మరణాల రేట్లు రెండూ తగ్గాయి.

అధిక జనాభా దశాబ్దపు వృద్ధి రాష్ట్రాలు:  

* మేఘాలయ (27.8%)

* అరుణాచల్‌ ప్రదేశ్‌ (25.9%)

* బిహార్‌ (25.0%)

* జమ్ము- కశ్మీర్‌ (23.70%)

అల్ప జనాభా దశాబ్దపు వృద్ధి రాష్ట్రాలు: 

* నాగాలాండ్‌ (4.7%),

* కేరళ (4.86%) 

* గోవా (8.17%

అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: 

* దాద్రానగర్‌ హవేలీ (55.9%)

* డామన్‌ డయ్యూ (53.8%) 

అల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: 

 * లక్షదీవులు (6.3%) 

* అండమాన్, నికోబార్‌ దీవులు (6.9%)

ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్న జిల్లాలు:  

* కురుంగ్‌ కుమేయ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌) - 111.02%

* యానాం (పుదుచ్చేరి) - 77.1% 

తక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్న జిల్లాలు: 

* లాంగ్‌ లెంజ్‌ (నాగాలాండ్‌) (- 58.39%) 

* కిఫిరే (-30.54%)

జనాభా వృద్ధి రేటు క్రమం: 

* 1921 తర్వాత 2011 జనాభా లెక్కల్లో మాత్రమే ముందు సంవత్సరం జనాభా లెక్కలతో పోలిస్తే అదనంగా పెరిగిన జనాభా తగ్గింది. అంటే 1991-2001 మధ్య 18.23 కోట్లు అదనంగా పెరగగా, 2001-2011 మధ్య 18.14 కోట్లు పెరిగింది (సుమారు 8 లక్షల జనాభా తగ్గింది).

జనసాంద్రత:  ఒక చ.కి.మీ. పరిధిలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు.

* 1991 - (267 జనసాంద్రత)

* 2001 - (325) *2011 - (382) 

* 2011లో భారతదేశంలో సగటు జనసాంద్రత - 382

 * 2001 లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం - పశ్చిమ బెంగాల్‌

అధిక జనసాంద్రత రాష్ట్రాలు: 

 1) బిహార్‌ 1106  

2) పశ్చిమ బెంగాల్‌ 1028 

3) కేరళ 860 

4) ఉత్తర్‌ ప్రదేశ్‌ 307

 5) తెలంగాణ 307

తక్కువ జనసాంద్రత రాష్ట్రాలు:  

1) అరుణాచల్‌ ప్రదేశ్‌-17 

 2) మిజోరం-52 

3) సిక్కిం-86 

ఎక్కువ జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: 

 1) దిల్లీ - 11,320 

2) చండీగఢ్‌-9258 

తక్కువ జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు:  

1) అండమాన్, నికోబార్‌ దీవులు - 46 

2) దాద్రానగర్‌ హవేలీ - 700

3) లక్షదీవులు - 2149

అధిక జసాంద్రత ఉన్న జిల్లాలు: 

1) ఈశాన్య దిల్లీ - 37,346 

2) చెన్నై - 26,903

తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు:  

1) హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహుల్‌ స్పితి - 0.2

 2) దిబాంగ్‌ వ్యాలీ (అరుణాచల్‌ ప్రదేశ్‌) - 1

 3) సాంబా (జమ్ము-కశ్మీర్‌) - 2

 

 


రచయిత: జయకర్‌ సక్కరి


 

 

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌