• facebook
  • whatsapp
  • telegram

రైల్వే రవాణా

సుదూరాలతో సులువైన అనుసంధానం! 

దేశ సమైక్యత, సమగ్రతను చాటే వ్యవస్థల్లో భారతీయ రైల్వేకు ప్రముఖ స్థానం ఉంది. బ్రిటిష్‌ హయాంలో దేశంలో వేళ్లూనుకున్న రైల్వే, భారతీయుల్లో జాతీయతా భావాలను పెంపొందించడంలో సాయపడింది. స్వాతంత్య్రానంతరం రవాణా, ఆర్థిక రంగాలకు ఆసరాగా నిలిచింది. ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వేగంగా పరుగులు తీస్తోంది. భారతీయ రైల్వే ప్రస్థానం, ఆవిరి ఇంజిన్ల నుంచి నేటి వందేభారత్‌ రైళ్ల వరకు జరిగిన ప్రగతిని అభ్యర్థులు తెలుసుకోవాలి. సువిశాల దేశంలో రైల్వేరంగం స్వరూపం, పనితీరుతో పాటు ప్రస్తుతం నడుస్తున్న రకరకాల రైళ్లు, అందులో వేగంగా నడిచేవి, వాటి ప్రయాణ మార్గాల గురించి అవగాహన పెంచుకోవాలి. 


మన దేశ రవాణా రంగంలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.అతి పెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉన్న దేశంగా ప్రపంచంలో రెండో స్థానాన్ని, ఆసియాలో మొదటి స్థానాన్ని భారత్‌ దక్కించుకుంది. ప్రయాణికులతో పాటు సరకు రవాణాలోనూ రైల్వేలు ప్రధానంగా ఉన్నాయి. దూరప్రాంత ప్రయాణానికి, రవాణాకు రహదారుల కన్నా రైల్వేలు సౌకర్యంగా ఉంటాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలను అనుసంధానం చేస్తూ, వ్యాపార, పర్యాటక, తీర్థయాత్ర, విద్యాసంబంధ కార్యకలాపాల నిర్వహణను రైల్వే సులభతరం చేస్తోంది.

చరిత్ర: దేశంలో తొలి ఆవిరి ఇంజిన్‌ రైలు 1853, ఏప్రిల్‌ 16న బొంబాయి నుంచి థానే మధ్య 34 కి.మీ. ప్రయాణించింది. ఈ మార్గాన్ని నిర్మించాలనే ఆలోచన మొదట బొంబాయి ప్రభుత్వ చీఫ్‌ ఇంజినీరు జార్జి క్లార్క్‌కు 1843లో వచ్చింది. 1853లో ప్రారంభించిన రైల్వే మార్గంలో 400 మంది అతిథులతో 14 బోగీల రైలును నడిపారు. మొదటి ప్రయాణికుల వాణిజ్య రైలు 1854, ఆగస్టు 15న 24 మైళ్ల దూరం ఉన్న హుగ్లీ - హౌరా మధ్య ప్రారంభమైంది. దేశంలో తూర్పు ప్రాంతంలో ఈస్ట్‌ ఇండియన్‌ రైల్వే సెక్షన్‌ ద్వారా రైలు ప్రయాణం జరిగింది. దక్షిణాన మొదటి రైలు 1856, జులైలో మద్రాసు రైల్వే కంపెనీ వ్యాసర్పాది నుంచి ఆర్కాట్‌ మధ్య నడిచింది. 1859, మార్చి 3న అలహాబాద్‌ నుంచి కాన్పుర్‌ మధ్య 69 మైళ్ల దూర మేర రైలు ప్రయాణం జరిగింది. 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాలు దేశంలో ఏర్పడ్డాయి. ప్రస్తుతం 68,043 కి.మీ. పొడవైన మార్గాలు, 7,308 స్టేషన్లతో సువిశాల వలయంగా విస్తరించాయి. 13,215 ఇంజిన్లు, 74,744 ప్రయాణ బోగీలు, 10,103 ఇతర బోగీలు సహా 3,18,896 వ్యాగన్లతో భారతీయ రైల్వేలు పటిష్ఠంగా ఉన్నాయి.

రైలు వేగం:  

సాధారణ వేగం - గంటకు 160 కి.మీ.లోపు

* సెమీ-హై వేగం - గంటకు 160 - 200 కి.మీ. 

* అధిక వేగం (హై) - గంటకు 200 కి.మీ.పైన  

* ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు వేగం - గంటకు 320 కి.మీ. 

* ప్రస్తుతం అత్యంత అధిక వేగంతో నడుస్తున్న రైలు - వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (గంటకు 180 కి.మీ.)

* అత్యంత అధిక వేగంతో నడుస్తున్న రెండో రైలు - గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (160 కి.మీ.) (న్యూదిల్లీ - ఆగ్రా)

రైల్వే జోన్లు: పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రైల్వే వ్యవస్థను 17 జోన్లుగా విభజించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1966, అక్టోబరు 2న సికింద్రాబాదు కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటైంది. దక్షిణ రైల్వేలోని విజయవాడ డివిజన్‌ను, కేంద్ర రైల్వేలోని సోలాపుర్, సికింద్రాబాదు డివిజన్లను విడదీసి దక్షిణ మధ్యరైల్వేగా ఏర్పాటు చేశారు. 1977, అక్టోబరు 2 నుంచి దక్షిణ రైల్వేలోని గుంతకల్లు డివిజన్‌ను కూడా ఇందులో కలిపారు. 1978లో సికింద్రాబాదును సికింద్రాబాదు, హైదరాబాదు డివిజన్లుగా విభజించారు. 2003, ఏప్రిల్‌లో గుంటూరు డివిజన్‌ ఏర్పాటైంది.

పరిశోధన - అభివృద్ధి: భారతీయ రైల్వేల పరిశోధన - అభివృద్ధి విభాగం (రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్స్‌ ఆర్గనైజేషన్‌ - ఆర్‌డీఎస్‌ఓ) పేరుతో లఖ్‌నవూలో ఉంది. రైల్వే రంగ సంబంధిత సాంకేతిక అంశాల్లో ఈ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తుంది. రైల్వే తయారీ - డిజైన్‌తో ముడిపడి ఉన్న ఇతర సంస్థలకూ ఇది సంప్రదింపు సేవలను అందిస్తుంది. కొవిడ్‌ సమయంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం సీఎస్‌ఐఆర్‌ - సీఎస్‌ఐఓల సహకారంతో ఏసీ బోగీల యూవీ-సీ ఆధారిత వైరస్‌ సూక్ష్మజీవ నిరోధక వ్యవస్థను ఆర్‌డీఎస్‌ఓ రూపొందించి అందజేసింది. అలాగే ద్విచక్ర, చతుశ్చక్ర తేలికపాటి/భారీ వాహనాలను ఎక్కించడం, దింపడం లాంటి సదుపాయాలతో 18 టన్నుల అత్యధిక బరువు మోయగల, 110 కి.మీ. వేగంతో ప్రయాణించే రవాణా కోచ్‌లను కూడా రూపొందించింది.

రైల్వే ఆర్థిక వ్యవస్థ: రైల్వే బడ్జెట్‌ కేంద్ర బడ్జెట్‌లో భాగమే అయినప్పటికీ 1924 నాటి తీర్మానం మేరకు అక్వర్త్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం 1924-25 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను చట్టసభకు విడిగా సమర్పిస్తున్నారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి 16 పద్దులుంటే, వాటిని పార్లమెంటు పరిగణనలోకి తీసుకుని విడిగా ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణ ఆర్థిక వ్యవహారాల్లో భాగంగా రైల్వే కార్యకలాపాల్లో పౌర అంచనాలను స్థిరంగా ఉంచటమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశం. అయితే 2017-18 నుంచి బిబేక్‌ దేబ్‌రాయ్‌ కమిటీ సిఫార్సు మేరకు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు.

రైల్వే కంపెనీలు: భారతదేశంలో మొదట ఆంగ్లేయుల యాజమాన్యంలోని ప్రైవేటు కంపెనీలు రైళ్లను నడిపాయి. 1849లో గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే కంపెనీ ఏర్పాటైంది. ఆ తర్వాత కలకత్తా అండ్‌ సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేస్‌ ఏర్పాటైంది. 1968లో నష్టాలు భరించలేక అది తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనపరిచింది. ఆ విధంగా ప్రభుత్వ యాజమాన్యంలోని మొదటి రైల్వే సంస్థగా మారింది. రైలు మార్గాలకు, స్టేషన్లకు కావాల్సిన భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. మూలధనంపై కనీస ప్రతిఫలానికి హామీ ఇచ్చింది. 1882 నాటికి దాదాపు 75 రైల్వే కంపెనీలు పనిచేసేవి. అందులో కొన్నింటిని స్వదేశీ సంస్థానాలు నడిపేవి. 1889లో నిజాం రైల్వేను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1901లో థామస్‌ రాబర్ట్‌ సన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం రైల్వే బోర్డు ఏర్పాటైంది.


1920లో అక్వర్త్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1925లో మొదటిసారి రైల్వే కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. క్రమంగా అన్ని కంపెనీలను హస్తగతం చేసుకుంది. 1950లో రాజుల సంస్థానాలను నడుపుతున్న రైల్వేలను కూడా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఏకస్వామ్య సంస్థగా భారతీయ రైల్వే నడుస్తోంది.

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ):  ఇది భారత రైల్వే అనుబంధ సంస్థ. 1999, సెప్టెంబరు 27న ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ. ఆన్‌లైన్‌లో టికెట్ల జారీ, రిజర్వేషన్, రద్దు చేసుకోవడం, రైలు వేళలు, కదలికలను తెలుసుకోవడం లాంటి సేవలను ప్రధానంగా అందిస్తోంది. రైల్వేస్టేషన్లలో ఈ సంస్థ రెస్టారెంట్లు, వసతి గదులు నిర్వహిస్తోంది. రైళ్లలో భోజనం, తినుబండారాల సౌకర్యం కల్పించడంతో పాటు, పర్యాటక ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతోంది.

టికెట్ల విధానం: భారత రైల్వేల్లో నిత్యం సీటు/ బెర్తు రిజర్వేషన్‌ లేకుండా ప్రయాణించేవారే ఎక్కువ. పెద్ద రైల్వేస్టేషన్ల వద్ద కంప్యూటర్‌ ద్వారా అన్‌రిజర్వ్‌ టికెట్లను ముందస్తుగా తీసుకునే ఏర్పాటు చేశారు.

ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌: మొత్తం 13 భారతీయ రైళ్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ లభించింది.

లగ్జరీ రైళ్లు:  

1) ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌ (1982)  

2) దక్కన్‌ ఒడిస్సి (2007)  

3) ది గోల్డెన్‌ చారియట్‌ (2008)  

4) రాయల్‌ రాజస్థాన్‌ ఆన్‌ వీల్స్‌ (2009)  

5) మహాపరినివాస్‌ ఎక్స్‌ప్రెస్‌ (2007)  

6) మహారాజా ఎక్స్‌ప్రెస్‌ (2010)

అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు: 

1) తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ 

2) గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ 

3) శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 

4) రాజధాని ఎక్స్‌ప్రెస్‌ 

5) దురంతో ఎక్స్‌ప్రెస్‌

 6) హర్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌

7) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ 

8) యువ ఎక్స్‌ప్రెస్‌ 

9) జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 

10) కవిగురు ఎక్స్‌ప్రెస్‌ 

11) వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ 

12) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌: 2019, ఫిబ్రవరి 15న న్యూదిల్లీ - వారణాసి మధ్య తొలి వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. ఈ తరహా రైళ్లు నేడు దేశవ్యాప్తంగా 34 నడుస్తున్నాయి. వందేభారత్‌ రైళ్లు సన్నాహక పరీక్షల్లో గంటకు 180 కి.మీ. వెళ్లినప్పటికీ, ప్రయాణంలో అనుమతించిన గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ.రచయిత: ధరణి శ్రీనివాస్‌


 


 

Posted Date : 21-12-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు