• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయ రాజకీయ పార్టీలు  

  ఈ పార్టీలు.. పక్కా లోకల్!  

ప్రాంతీయ ఆకాంక్షలు, ఆశయాలకు ఈ పార్టీలు ప్రతినిధులుగా వ్యవహరిస్తాయి. స్థానిక సమస్యలు, సంస్కృతులకు ప్రాధాన్యం ఇస్తాయి. సమాఖ్య విధానంలో ప్రధాన భాగస్వాములై భిన్న స్వరాలను విస్తరింపజేస్తున్న ఆ రాజకీయ సంస్థలే ప్రాంతీయ పార్టీలు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచి జాతీయస్థాయిలోనూ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. స్థానిక ప్రజల ఆదరణ పొందుతూ అధికారం దక్కించుకుంటున్న లోకల్ పార్టీల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అవి భారత ప్రజాస్వామ్య బహుళ స్వభావానికి దోహదం చేస్తున్న తీరును అర్థం చేసుకోవాలి. 

భారతదేశంలోని విభిన్న వర్గాల ఆకాంక్షలకు ప్రతి రూపంగా ప్రాంతీయ పార్టీలను పేర్కొనవచ్చు.జాతీయ రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో ప్రజల మెప్పును పొందడంలో విఫలమవుతున్న సందర్భాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం రోజురోజుకీ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రజల ఆదరణ పొంది అధికారాన్ని చెలాయించడంతో పాటు, జాతీయ స్థాయిలో కూడా కీలకశక్తిగా కొనసాగుతున్నాయి. 

రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీ - గుర్తింపు: ఒక రాజకీయ పార్టీని రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీగా గుర్తించాలంటే కింద పేర్కొన్న షరతుల్లో ఏదైనా ఒకదాన్ని నేరవేర్చాలి. ః గత చివరి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభలో ఉండే మొత్తం సీట్లలో కనీసం 3 శాతం సీట్లను లేదా 3 సీట్లను పొంది ఉండాలి.  లేదా ః గత చివరి లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం లోక్సభ సీట్లలో ప్రతి 25 సీట్లకు కనీసం ఒక అభ్యర్థి చొప్పున ఎన్నిక కావాలి. లేదా ః రాష్ట్ర శాసనసభకు జరిగిన గత చివరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రాష్ట్రంలో పోలైన చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి. దీంతోపాటు కనీసం ఇద్దరు అభ్యర్థులు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావాలి. లేదా ః లోక్సభకు జరిగిన గత చివరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రాష్ట్రంలో పోలైన చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6శాతం ఓట్లను సాధించాలి. దీంతోపాటు కనీసం ఒక అభ్యర్థి లోక్సభకు ఎన్నిక కావాలి.

2023, ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన నివేదిక ప్రకారం రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలు 57 ఉన్నాయి. జాతీయ లేదా రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలుగా గుర్తింపు పొందకుండా కేవలం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసిన పార్టీలను ‘నమోదిత గుర్తింపు పొందని పార్టీలు అంటారు. ఉదా: లోక్సత్తా పార్టీ, జనసేన పార్టీ.

ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డీఎంకే):  ఇది తమిళనాడులోని బలమైన ప్రాంతీయ పార్టీ. దీన్ని 1949లో సి.ఎన్.అన్నాదురై స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు ‘ఉదయిస్తున్న సూర్యుడు’. ఇది ప్రస్తుతం తమిళనాడులో  అధికారంలో ఉంది. ఎం.కె.స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఆలిండియా అన్నాద్రవిడ మున్నేట్ర కజగమ్ (ఏఐఏడీఎంకే):  డీఎంకే పార్టీ నుంచి విడిపోయి 1972, అక్టోబరు 17న ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీని తమిళనాడులో ఎం.జి. రామచంద్రన్ స్థాపించారు. ఎన్నికల గుర్తు ‘రెండు ఆకులు’.

ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ):  

ఈ పార్టీని స్వాతంత్రోద్యమ సమయంలో 1939లో సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. ఎన్నికల గుర్తు- ‘సింహం’. ప్రస్తుతం ఈ పార్టీ పశ్చిమ బెంగాల్లో కొంతమేర ప్రభావాన్ని కలిగి ఉంది.

అసోం గణపరిషత్ (ఏజీపీ): ఈ పార్టీని 1985లో ప్రపుల్ల కుమార్ మహంత అసోంలో ఏర్పాటు చేశారు. ఇది ఆ రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న పార్టీ. ఎన్నికల గుర్తు ‘ఏనుగు’.

ఆలిండియా మజ్లిస్ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం): ఈ పార్టీని 1927లో మహమ్మద్ నవాజ్ ఖాన్ స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రాబల్యంలో ఉంది.   ఎన్నికల గుర్తు ‘గాలిపటం’.

శివసేన (ఎస్ఎస్): 1966లో బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించారు. ఇది మహారాష్ట్రలో ప్రాబల్యం ఉన్న పార్టీ. ఎన్నికల గుర్తు ‘విల్లు బాణం’.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ): 1997లో లాలూప్రసాద్ యాదవ్ స్థాపించారు. ఇది బిహార్కే  పరిమితమైంది. ఎన్నికల గుర్తు ‘లాంతర్’.

జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్)): ఈ పార్టీని 1999లో హెచ్.డి.దేవెగౌడ స్థాపించారు. ఇది కర్ణాటకలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘తలపై గడ్డిమోపు మోస్తున్న మహిళ’

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం): ఈ పార్టీని 1972లో శిబూ సోరెన్ స్థాపించారు. దీనికి బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉంది. ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’.

ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ): ఈ పార్టీని 1986లో సుదేశ్ మహతో స్థాపించారు. ఇది బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉనికి కోసం కృషి చేస్తోంది. ఎన్నికల గుర్తు ‘అరటి పండు’.

ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ): ఈ పార్టీని 1996లో దేవీలాల్ స్థాపించారు. హరియాణాలో ప్రాబల్యంలో ఉంది.ఎన్నికల  గుర్తు ‘కళ్లజోడు’.

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్): 2006 లో రాజ్ఠాక్రే స్థాపించారు. మహారాష్ట్రలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘రైలు ఇంజిన్’.

జమ్ము-కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ): ఈ పార్టీని 1932లో షేక్ అబ్దుల్లా స్థాపించారు. ఎన్నికల గుర్తు ‘నాగలి’.

జమ్ము-కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్పీపీ): ఈ పార్టీని 1982లో భీంసింగ్ స్థాపించారు. ఎన్నికల గుర్తు ‘సైకిల్’.

జమ్ము-కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ): 1998లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ స్థాపించారు.ఎన్నికల గుర్తు ‘సిరాబుడ్డీ, కలం’.

బిజూ జనతాదళ్ (బీజేడీ):  ఈ పార్టీని 1997లో నవీన్ పట్నాయక్ స్థాపించారు. ఇది ఒడిశా రాష్ట్ర రాజకీయాలను శాసించడంలో కీలకపాత్రను పోషిస్తోంది. ఎన్నికల గుర్తు ‘శంఖం’.

మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ): 

ఈ పార్టీని 1963 లో దయానంద్ బందోద్కర్ స్థాపించారు. ఇది గోవా రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘సింహం’.

రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ): 1996లో అజిత్ సింగ్ స్థాపించారు. ఉత్తర్ప్రదేశ్లో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘చేతి పంపు’.

సమాజ్వాది పార్టీ (ఎస్పీ): 1992లో ములాయం సింగ్ యాదవ్ స్థాపించారు. ఉత్తర్ప్రదేశ్లో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘సైకిల్’.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్): ఈ పార్టీని 2001, ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘కారు’. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకుంది.

శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ): ఈ పార్టీని 1920లో సర్దార్ షర్ముఖ్ సింగ్ చుబ్బల్ స్థాపించారు. పంజాబ్లో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘తూకం వేసే త్రాసు’.

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్): 1993లో పవన్ కుమార్ చామ్లింగ్ స్థాపించారు. ఇది సిక్కింలో ప్రాబల్యంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీ. ఎన్నికల గుర్తు ‘గొడుగు’.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ): ఈ పార్టీని 1982, మార్చి 29న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థాపించారు. ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబల్యంలో ఉంది.  ఎన్నికల గుర్తు ‘సైకిల్’.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ): 

ఈ పార్టీని 2011లో వై.ఎస్. జగన్మెహన్ రెడ్డి స్థాపించారు. ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘సీలింగ్ ఫ్యాను’.

లోక్జన్శక్తి పార్టీ (ఎల్జేపీ): ఈ పార్టీని 2000వ సంవత్సరంలో రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఈ పార్టీ బిహార్లో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘బంగ్లా’.

మిజోనేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్): ఈ పార్టీని 1959లో పులాల్ డెంగా స్థాపించారు. మిజోరాం రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల  గుర్తు ‘నక్షత్రం’.

మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ (ఎంపీసీ): ఈ పార్టీని 1975లో బ్రిగ్ తెన్పున్గా స్థాపించారు. మిజోరాం రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘ఎలక్ట్రిక్ బల్బు’.

పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్ (పీపీఏ): ఈ పార్టీని 1977లో బకిన్పెర్టిన్ స్థాపించారు. ఈ పార్టీ అరుణాచల్ప్రదేశ్లో ప్రాబల్యంలో ఉంది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు ‘మొక్కజొన్న కంకి’.

జనసేన పార్టీ (జేఎస్పీ): ఈ పార్టీని 2014, మార్చి 14న పవన్ కల్యాణ్ స్థాపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’

బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్):  ఈ పార్టీని 2005లో హంగ్రామా మొహిలరి స్థాపించారు. అస్సాంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘నాగలి’.

యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ):  ఈ పార్టీని 1997లో ఇ.కె.మావ్లాంగ్ స్థాపించారు. మేఘాలయ రాష్ట్రంలో ప్రాబల్యంలో ఉంది. ఎన్నికల గుర్తు ‘డోలు’.

సిక్కిం క్రాంతి కారి మోర్చా (ఎస్కేఎం):  ఈ పార్టీని 2013లో ప్రేమ్సింగ్ తమంగ్ స్థాపించారు. సిక్కింలో తన ఉనికి కోసం ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల గుర్తు ‘టేబుల్ ల్యాంప్’.
ప్రారంభ దశలో జరిగిన నాటి తెలుగుదేశం పార్టీ సభలో ఎన్టీఆర్


 

   రచయిత: బంగారు సత్యనారాయణ   
 

Posted Date : 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌