• facebook
  • whatsapp
  • telegram

నదీ మైదానాలు 

(గంగా-సింధూ-బ్రహ్మపుత్ర)  

(భారతదేశం - నిమ్నోన్నత స్వరూపాలు)

నీళ్ల గుంటలు చోర్స్‌.. ఒండలి నేలలు బెట్స్‌! 


అవి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నేలలు, అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు. జీవవైవిధ్యానికి నెలవులుగా నిలిచాయి. అక్కడ ప్రాచీన నాగరికతలు వెలిశాయి. పెద్ద ఎత్తున  వ్యవసాయం సాగుతుంది. అవే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన గంగా-సింధూ-బ్రహ్మపుత్ర నదీ మైదానాలు.  వాటి గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భారత ఉపఖండంలో కోట్లాది మందికి జీవనాధారంగా మారిన ఆ నేలల విశిష్టతలను అర్థం చేసుకోవాలి. 


హిమాలయా పర్వతాలకు దక్షిణం వైపు, దక్కను పీఠభూమికి ఉత్తరం వైపు ఉండే ప్రాంతమే గంగా-సింధూ-బ్రహ్మపుత్ర నదీ మైదానం. వింధ్య, హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించే నదులు ఒండ్రుమట్టిని తీసుకొచ్చి ఇక్కడ నిక్షేపించడంతో మైదాన ప్రాంతం ఏర్పడింది. ఈ మైదానాలు 2,414 కి.మీ., పొడవు, 241-321 కి.మీ.ల వెడల్పుతో సుమారు 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నాయి. ఒక్క గంగా మైదానమే 3.77 లక్షల చ.కి.మీ.లు ఉంది. బ్రహ్మపుత్ర నదీ మైదానం 1.5 లక్షల చ.కి.మీ.లు. ఈ మైదానాలను ‘డస్ట్‌ ఆఫ్‌ మౌంటెయిన్స్‌’ గా పిలుస్తారు. గంగా-సింధూ మైదానం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అతిపెద్ద  మైదానం. మైదానాల స్వభావాన్ని బట్టి భాబర్, టెరాయి, భంగర్, ఖాదర్, లవణీయ నేలలు, కోన్‌పుట్‌ ప్లెయిన్స్‌గా వర్గీకరించారు. సుమారు 25 లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ గంగా-సింధూ మైదానం ఏర్పడినట్లు తెలుస్తోంది.


భాబర్‌: నదీ ప్రవాహాల ద్వారా హిమాలయాల నుంచి వచ్చిన గులకరాళ్లతో ఏర్పడిన ప్రాంతం. ఇది పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉత్తర మైదాన సరిహద్దుల వెంట 8 - 16 కి.మీ.ల వెడల్పుతో ఉన్న సన్నటి మేఖల. ఈ ప్రాంతంలోకి రాగానే నదులు అంతరించినట్లు అనిపిస్తుంది. ఈ నేలలు వ్యవసాయానికి పనికిరావు.


టెరాయి: ఇది చిత్తడి ప్రాంతం. బంకమట్టి నిక్షేపితమవడంతో ఏర్పడింది. భాబర్‌ ప్రాంతంలో అంతరించినట్లుగా ఉండే నదులు తిరిగి ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. ఇవి దట్టమైన అరణ్యాలతో ఉంటాయి. ఇక్కడ గోధుమ, చెరకు విరివిగా పండుతాయి. సాగుభూమి పెరుగుతున్న క్రమంలో టెరాయి అడవులను చాలావరకు నిర్మూలించి వ్యవసాయ భూములుగా మార్చారు. 


భంగర్‌:  ఈ నేలలు పురాతన ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల ఏర్పడతాయి. నలుపు రంగులో ఉంటాయి. ఉత్తర భారతదేశ మైదానాల్లో ఎక్కువగా ఈ రకమైనవే. ఇవి సారవంతమైనవి. వీటిని పంజాబ్‌లో ‘దయా’, పశ్చిమబెంగాల్‌లో ‘బరింద్‌’, గంగా-యమునా అంతర్వేదిలో ‘బుర్‌’ నిక్షేపాలు అని పిలుస్తారు.


ఖాదర్‌:  ఇవి నదీ తీరాలకు దగ్గరగా ఉండి, కొత్తగా వచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడతాయి. వీటిలో ఇసుక, బురద ఎక్కువ; బంకమన్ను తక్కువ. ఇవి భంగర్‌ కంటే సారవంతమైన నేలలు. వీటిని పంజాబ్‌ ప్రాంతంలో ‘బెట్‌ల్యాండ్స్‌’ అంటారు.


లవణీయ నేలలు:  ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో క్షార లక్షణాలతో ఎండిపోయినట్లు కనిపించే నేలలను ప్రాంతీయంగా కల్లార్, ఉషర్, రకర్‌ నేలలు అంటారు. ఇటీవల ఎక్కువ నీటి సౌకర్యం కల్పించడంతో కొన్ని ప్రాంతాలు క్షార నేలలుగా మారాయి. వీటినే ‘రే’ నేలలు అంటారు. ఇవి నిస్సారమైనవి.


కోన్‌పుట్ ప్లెయిన్స్‌:  నదులు మైదానంలో ప్రవేశించిన తర్వాత కొండల పాదాల వద్ద ఇవి విసనకర్ర ఆకారంలో ఏర్పడే ఒండ్రుమట్టి ప్రాంతాలు.


వివిధ రకాలు: గంగా - సింధూ మైదానాలను ప్రాంతీయంగా వివిధ  రకాలుగా విభజించారు.


1) రాజస్థాన్‌ మైదానాలు:  ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఒకనాటి సరస్వతి నది, ఉపనదుల నిక్షేపాల వల్ల ఏర్పడిన మైదానాలు. ఇవి 1.75 లక్షల చ.కి.మీ.లు విస్తరించాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఎ) మరుస్థలి (థార్‌ ఎడారి ప్రాంతం), బి) రాజస్థాన్‌ (భంగర్‌). ఈ మైదానాలు ఈశాన్యం నుంచి నైరుతి వైపునకు వాలు కలిగి ఉన్నాయి


2) బ్రహ్మపుత్ర మైదానాలు: ఈ మైదానాలు తేయాకు, జనపనార పంటలకు ప్రసిద్ధి. ఇవి తక్కువ వెడల్పు (80 కి.మీ.)తో ఉంటాయి. ఎక్కువగా ఎర్ర నేలలను కలిగి ఉంటాయి. ఇక్కడ దేశంలోనే ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయి.

 

3) గంగా మైదానాలు:  దేశ పరీవాహక ప్రాంతంలో నాలుగో వంతులో ఈ మైదానాలు ఘగ్గర్, తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. వాటిలో గంగా, యమునా, దోబ్, ఖాదర్‌ నేలలు, సుందర్బన్‌ డెల్టా ఉన్నాయి.


4) పంజాబ్‌ - హరియాణా మైదానాలు:  యమునా నదికి పశ్చిమాన సింధూ, దాని ఉపనదులతో ఈ మైదానాలు ఏర్పడ్డాయి.


5) సింధూ మైదానం: సింధూనది ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల ఏర్పడింది. ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులను థారోస్‌ అని, ఎండిపోయిన నదుల ప్రవాహాల గుంటల్లో ఏర్పడిన సరస్సులను ‘థాండ్స్‌’ అని అంటారు.


బిహార్‌ ఉత్తర ప్రాంతంలో అక్కడక్కడ కనిపించే బురద ప్రాంతాలను ‘కోల్స్‌’ అని, గంగానది సమీపంలోని బిహార్‌లో ఉండే గుంట లాంటి నిర్మాణాలను ‘జల/తాల్‌’ అని, పంజాబ్‌లోని శివాలిక్‌ పాదాల వద్ద ఏర్పడిన చిన్న చిన్న నీటి గుంటలను ‘చోర్స్‌’ అని, పంజాబ్, హరియాణా ప్రాంతాల్లోని ఒండలి నేలలను ‘బెట్స్‌’ అని, రెండు నదుల మధ్య సారవంతమైన ప్రాంతాన్ని ‘దోబ్స్‌’ అని అంటారు.


ఉత్తర మైదానాల ప్రాధాన్యం: ఇవి అత్యంత వ్యవసాయ ఉత్పాదకత కలిగిన ప్రాంతాలు. ఇక్కడ గోధుమ, వరి, జనుము, చెరకు అత్యధికంగా పండుతాయి. నేలవాలు నీటి పారుదలకు అనుకూలంగా ఉంటుంది. ఏటా వరదల వల్ల వచ్చే ఒండ్రు నిక్షేపాల వల్ల నేల సారవంతమవుతుంది. అత్యధికంగా భూగర్భజలం ఉన్న ప్రాంతాలు. దేశ జనాభాలో 40 శాతం ఇక్కడే నివసిస్తున్నారు. దేశ అతి ప్రాచీన నాగరికతలు ఇక్కడే విలసిల్లాయి. ఈ ప్రాంతాల్లోనే ముడి చమురు, సహజవాయువులు ఉన్నాయి. ప్రాచీన కాలంలో మొదటి పట్టణీకరణ ఇక్కడే జరిగింది. జల రవాణాకు అనుకూలం.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో అతిపెద్ద నదీ మైదానం?

1) సింధూనదీ మైదానం  

2) గంగానదీ మైదానం  

3) బ్రహ్మపుత్రనదీ మైదానం  

4) ఏదీకాదు



2. ‘డస్ట్‌ ఆఫ్‌ మౌంటెయిన్స్‌’ అంటే?

1) ఆరావళి    2) దక్కన్‌ పీఠభూమి 

3) గంగా - సింధూ మైదానం  4) డెల్టా



3. బెట్‌ ల్యాండ్స్‌ ఉన్న ప్రాంతం?

1) అరుణాచల్‌ప్రదేశ్‌     2) కేరళ 

3) ఆంధ్రప్రదేశ్‌    4) పంజాబ్‌



4. ‘రే’ నేలలు అని వేటిని అంటారు?

1) రేగడి నేలలు      2) క్షారనేలలు  

3) ఇసుక నేలలు     4) ఏదీకాదు



5. బంకమట్టితో కూడి చిత్తడిగా ఉండే నేల?

1) టెరాయి   2) ఖాదర్‌    3) రే     4) ఏదీకాదు



6. రెండు నదుల మధ్య సారవంతమైన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?

1) బెట్స్‌    2) తార్‌   3) దోబ్స్‌    4) థాండ్స్‌



7. ‘కోల్స్‌’ అనే బురద ప్రాంతాలు ఉన్న రాష్ట్రం?

1) కేరళ    2) తమిళనాడు    3) ఒడిశా   4) బిహార్‌



8. కోన్‌ - పుట్‌ ప్లెయిన్స్‌ అంటే?

1) ఒండ్రు మట్టి ప్రాంతాలు  2) ఇసుక నేలలు   

3) ఎర్ర నేలలు     4) గులకరాళ్లు



9. కిందివాటిని జతపరచండి.

i) బిస్త్‌ దోబ్‌       ఎ) జీలం

ii) రేచన దోబ్‌   బి) చీనాబ్‌

iii) సింధూ సాగర్‌ దోబ్‌   సి) సట్లేజ్‌

1) i-సి, ii-బి, iii-ఎ     2) i-బి, ii-ఎ, iii-సి   

3) i-సి , ii-ఎ , iii-బి   4) i-ఎ, ii-బి, iii-సి 



10. దేశ జనాభాలో 40% మంది నివసిస్తున్న ప్రాంతం?

1) కొండప్రాంతం  2) తీరప్రాంతం 

3) నదీమైదానం   4) పీఠభూమి



11. హిమాలయాల్లో పుట్టిన నదులు ఈ   ప్రదేశంలోకి రాగానే మాయమైనట్లుగా  అనిపించే ప్రాంతం?

1) భాబర్‌    2) టెరాయి   3) భంగర్‌    4) ఖాదర్‌



12. భారత దేశంలో అతిపెద్ద నదీ ద్వీపం ‘మజులీ’ ఏ నదిలో ఉంది?

1) గంగా   2) యమునా    3) బ్రహ్మపుత్ర   4) సింధూ



13. సుందర్బన్‌ డెల్టా ఏ నదీమైదానంలో భాగం?

1)  సింధూ   2) గంగా  

3) బ్రహ్మపుత్ర  4) యమునా



14. కిందివాటిలో ఉత్తర భారతదేశంలో ప్రవహించని నది ఏది?

1) గండకి   2) సోన్‌    3) చంబల్‌    4) కావేరి



15. కిందివాటిలో సుమారు 3.75 లక్షల కిలోమీటర్లు విస్తరించిన నదీ మైదానం?

1) సింధూ   2) గంగా    3) బ్రహ్మపుత్ర   4) మహానది



సమాధానాలు



1-2; 2-3; 3-4; 4-2; 5-1; 6-3; 7-4; 8-1; 9-1; 10-3; 11-1; 12-3; 13-2; 14-4; 15-2.

 


రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌