• facebook
  • whatsapp
  • telegram

సర్వాయి పాపన్న తిరుగుబాటు - పరిపాలన

క్రీ.శ. 1687లో కుతుబ్‌షాహీ రాజ్యాన్ని మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించాడు. అదేసమయంలో బీజాపూర్‌ రాజ్యం గోల్కొండలో కలిసిపోయింది. గోల్కొండ రాజ్యంలో మొగల్‌ పాలన ప్రారంభమైంది. దీన్ని వారు దక్కన్‌గా వ్యవహరించారు. దక్కన్‌కు రాజధాని ఔరంగాబాద్‌. వీరి పాలనలో హైదరాబాద్‌ రాజకీయ వ్యక్తిత్వం కోల్పోయింది. వ్యవసాయం, పరిశ్రమలు, వజ్రాల గనులు మూతపడ్డాయి. దోపిడీ దొంగల బెడదతో రహదారులపై భద్రత కరవై వాణిజ్యం క్షీణించింది. శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తమైంది. దోపిడీ, అరాచకం నిత్యకృత్యాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్వాయి పాపన్న తన పోరాటాన్ని ప్రారంభించాడు.

* సర్వాయి పాపన్న క్రీ.శ. 1650లో జనగామ తాలూకాలోని తాటికొండలో జన్మించాడు. తల్లి పేరు సర్వమ్మ. ఈయన గౌడ కులస్తుడు. ఇంటిపేరు నాశనోళ్లు. చిన్నతనం లో పశువుల కాపరిగా ఉండేవాడు.

* ఇతడికి హసన్, హుస్సేన్, ఇమాం, దూదేకుల పీరా, కుమ్మరి గోవిందన్న, చాకలి సర్వన్న, మంగలి మానన్న అనే మిత్రులు ఉండేవారు. వీరి సహకారంతో సైన్యాన్ని, ఆయుధాలను సమీకరించి తాటికొండ పరిసర గ్రామాల్లో ఉన్న ధనవంతులు, జమీందార్ల నుంచి రహస్య పద్ధతుల ద్వారా ధనాన్ని సేకరించాడు.

* ధనవంతులను, భూస్వాములను ఎదిరించి, వారిపై దాడులు చేసి సొమ్మును దోచుకున్నాడు. అనేక మంది ప్రజలు పాపన్న సైన్యంలో చేరారు. 

* మొగల్‌ పాలనను అంతంచేసి, స్వతంత్ర రాజ్య స్థాపన చేయాలనే లక్ష్యంతో సర్వాయి పాపన్న పాలకులకు వ్యతిరేకంగా పోరాడాడు. అతడు చేసిన ఉద్యమాలకు తల్లి, సోదరి ధన సాయం చేశారు.

* పాపన్న చేతిలో దాడికి గురైన భూస్వాములు, జమీందార్లు అతడ్ని అంతం చేయాలని అనేకసార్లు ప్రయత్నించారు. వారితో ప్రత్యక్ష పోరాటం చేయలేక అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

మొగలులతో వైరం

* పాపన్న తను సేకరించిన ధనంతో కొత్త సైన్యాన్ని ఆయుధాలను సమకూర్చుకుని సర్వాయి పేటలో శతృదుర్భేధ్యమైన కోటను నిర్మించాడు. దాని కేంద్రంగానే పరిపాలనను ప్రారంభించాడు. 

* పాపన్న రాజ్య విస్తరణలో భాగంగా హుస్నాబాద్, కరీంనగర్‌ ప్రాంతాలను జయించాడు. 

* షాపురం కోట కేంద్రంగా నల్గొండ పరగణాలో ఉన్న జమీందార్లు, దొరలను దోచుకుంటూ పెద్దఎత్తున ధనాన్ని సేకరించాడు. 

* పాపన్నను ఎదిరించలేని జమీందార్లు, భూస్వాములంతా కలిసి అతడిపై మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబుకు ఫిర్యాదు చేశారు.

* ఔరంగజేబు పాపన్నను శిక్షించమని కొలనుపాక సర్దార్‌ రుస్తుం దిల్‌ఖాన్‌ను ఆదేశించాడు. అతడు తన వద్ద పనిచేసే ఖాసీంఖాన్‌కు పాపన్నను పట్టుకునే బాధ్యత అప్పగించాడు.

* ఖాసీంఖాన్‌ భారీ సైన్యంతో షాపురం కోటను ముట్టడించి, పాపన్నతో యుద్ధం చేశాడు. పాపన్న చేతిలో ఖాసీంఖాన్‌ మరణించాడు.

* పాపన్న లేని సమయంలో రుస్తుం దిల్‌ఖాన్‌ తన సైన్యంతో షాపూర్‌ కోటను ముట్టడించి ధ్వంసం చేశాడు. తర్వాత అక్కడికి చేరుకున్న పాపన్న అదే స్థానంలో బలీయమైన  రాతి కోటను తిరిగి నిర్మించి, అందులో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రపరిచాడు. 

* పాపన్న సైన్యం భారీగా పెరిగింది. ప్రజలు సుల్తాన్‌కు పన్నులు కట్టడం మానేశారు. దీంతో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాపన్నను అణచివేయమని మరోసారి రుస్తుం దిల్‌ఖాన్‌ను ఆదేశించాడు.

* అతడు భారీ సైన్యంతో షాపురంపై దండెత్తాడు. ఈ యుద్ధం మూడు నెలల పాటు సాగింది. అందులో రుస్తుం దిల్‌ఖాన్‌ ఓడిపోయాడు. 

* ఈ యుద్ధంలో పాపన్న ప్రధాన అనుచరుడైన చాకలి సర్వాయి, పర్దిల్‌ఖాన్‌ అనే జమీందారు చేతిలో మరణించాడు. 

* అదే సమయంలో ఔరంగజేబు మరణించాడు. అతడి కొడుకైన కాంబక్ష్‌ దక్కన్‌కు రాజప్రతినిధిగా వచ్చాడు. ఇతడు పాపన్నను ఎదుర్కోలేకపోయాడు. 

* క్రీ.శ. 1708లో పాపన్న ఓరుగల్లు కోటను ముట్టడించి వేలాది సర్దార్‌లను, ముస్లిం సైనికులను బంధించి అపార ధనాన్ని కైవసం చేసుకుని షాపురం తరలించాడు. 

* పాపన్న భువనగిరి దుర్గాన్ని ముట్టడించి, దాన్ని గెలుచుకున్నాడు. 

* మోత్కూరు తాలూకాలో ఉన్న వేముల కొండలో ఒక కోట నిర్మించి, కొంతకాలం ఆ ప్రాంతాన్ని పాలించాడు.

* అనేక మంది జమీందార్లు, జాగీర్దార్లు, ఫౌజుదార్లు సర్వాయి పాపన్నను అణచివేయాలని మొగల్‌ చక్రవర్తి బహదూర్‌షాను కోరారు.

* పాపన్నను చంపమని హైదరాబాద్‌ సుబేదార్‌ యూసఫ్‌ఖాన్‌ రుజ్‌బహానిని మొగల్‌ చక్రవర్తి ఆదేశించాడు.

* యూసఫ్‌ఖాన్‌ తన సహాయకుడైన దిలావర్‌ ఖాన్‌కు ఆ బాధ్యత అప్పగించాడు. అతడు పెద్ద సైన్యంతో పాపన్నపైకి యుద్ధానికి వెళ్లాడు. 

* దిలావర్‌ఖాన్‌ షాపురం కోటను ముట్టడించి, పాపన్నను ఓడించి, కోటను స్వాధీనం చేసుకున్నాడు. పాపన్న అక్కడి నుంచి పారిపోయాడు. పాపన్న గతంలో వరంగల్‌ కోటను ముట్టడించి బంధించి తెచ్చి షాపురం కోటలో ఉంచిన ముస్లిం సైనికులు దిలావర్‌ఖాన్‌ సేనలకు సహకరించడం వల్లే అతడు ఓడిపోయాడు.

* పాపన్న తాటికొండ కోటను చేరుకుని సైన్యాన్ని సమీకరించాడు. తురుష్క సైన్యం తాటికొండకు చేరుకుని పోరాటాన్ని ప్రారంభించింది. రెండు సేనల మధ్య తొమ్మిది నెలల భీకర పోరాటం జరిగింది. ఇందులో తాను ఓడిపోతానని ముందే గ్రహించిన  పాపన్న హుస్నాబాద్‌కు పారిపోవాలని భావించాడు. మార్గం మధ్యలో తురుష్కులు అతడ్ని బంధించారు. 

* యూసఫ్‌ఖాన్‌ రుజ్‌బహాని పాపన్న తల నరికి, హైదరాబాద్‌ కోటకు వేలాడదీయించి, మొండాన్ని మొగల్‌ చక్రవర్తికి పంపాడు.

* మొఘల్‌ సామ్రాజ్య పాలకుల 37 ఏళ్ల పాలనలో సర్వాయి పాపన్న స్వతంత్ర రాజ్యస్థాపనకు ప్రయత్నించి నల్గొండ, వేములకొండ, భువనగిరి, షాపురం, ఓరుగల్లు ప్రాంతాలను జయించి, సుమారు 20 ఏళ్లు రాజ్య పాలన చేశాడు.

పాపన్న రహస్య జీవితం

* పాపన్న మారువేషంలో పొలాస జమీందారు వెంకట్రావు వద్ద ఉద్యోగంలో చేరాడు. అతడు తన ధైర్య సాహసాలతో జమీందారు ప్రధాన అనుచరుడిగా మారాడు.

అక్కడే పనిచేస్తున్న హన్మంతు పాపన్నకు మంచి మిత్రుడయ్యాడు. హన్మంతు మరికొంతమంది మిత్రుల సహకారంతో పాపన్న పొలాస పొరుగున ఉన్న జమీందార్ల డబ్బును రహస్యంగా దోచుకోవడం ప్రారంభించాడు. ఇది గమనించిన దొరలు పాపన్నపై వెంకట్రావుకు రహస్య సమాచారం అందించారు. 

* జమీందారు పాపన్నతో పాటు ఆయన అనుచరులను బంధించి జైల్లో వేశాడు. 

* పాపన్న నాయకత్వంలో వారంతా జైలును బద్దలు కొట్టి, పారిపోయారు.

పాపన్న నిర్మించిన కోటలు

సర్వాయిపేట కోట


* పాపన్న అనేక కోటలు కట్టించాడు. క్రీ.శ. 1675లో సర్వాయిపేట కోట నిర్మించాడు. ఇది దాదాపు పదెకరాల విస్తీర్ణంలో ఉంది. ఇదే పాపన్న తొలి నిర్మాణం. 

* చతురస్రాకారంలో నిర్మించిన ఈ కోటకు  20 అడుగుల ఎత్తులో రాతి ముఖద్వారం ఉంటుంది. నాలుగు వైపులా దాదాపు 50 అడుగుల ఎత్తులో బురుజులు ఉన్నాయి. మందుగుండు, ఫిరంగులను బురుజులపైకి చేర్చేందుకు మెట్లు ఉన్నాయి. దీని పైభాగం విశాలంగా ఉంది. ఇక్కడ ఫిరంగులను  ఉపయోగించడానికి, శత్రువులను  ఎదుర్కొనేందుకు ప్రత్యేక  నిర్మాణ పద్ధతులను అనుసరించారు. 

* కోట ముఖద్వారానికి ఎడమవైపు కోటగిరి గుట్టలు ఉన్నాయి. గుట్ట పైభాగంలో కోనేరు, విశ్రాంతి తీసుకోవడానికి వసతులు ఉన్నాయి. గుట్టలకు ఆనుకుని కోటచుట్టూ పెద్ద కందకం ఉంది. ఇందులో నీళ్లు నింపి, మొసళ్లను వదిలేవారు.

తాటికొండ కోట

* పాపన్న క్రీ.శ. 1698లో తాటికొండలో కోటను నిర్మించాడు. 

* గ్రామం మధ్యలో ఉన్న బురుజుతో గుట్టను ఆనుకొని నిర్మించిన ఈ కోట దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 

* 60 అడుగుల ఎత్తులో చతురస్రాకారంలో నాలుగు బురుజులు ఉన్నాయి. కోట ప్రహరీ కూడా అంతే ఎత్తులో చతురస్రాకారంలో ఉంది. 

* గుట్ట పైభాగంలో చుట్టూ ప్రహరీగోడ ఉంది. దీనిపై మొత్తం 12 బురుజులున్నాయి. ఈ ప్రాంతంలో ఏడు గుండాలుండేవి. ఒక దానిలో సంవత్సరం పొడవునా నీరు ఉండేది. 

షాపురం కోట

* షాపురం కోట నిర్మాణం క్రీ.శ. 1700-05 మధ్య జరిగింది. దీనికి నాలుగువైపులా పెద్ద బురుజులున్నాయి. మధ్యలో ఎత్తయిన మరొక బురుజు ఉంది. దీన్ని స్థానిక ప్రజలు ‘నడింబురుజు’ అని వ్యవహరించేవారు. 

* దక్షిణం వైపు కోట ప్రాకారం దగ్గర గుమ్మి ఆకారంలో మరో బురుజు ఉంది. దీన్ని గుమ్మిబురుజు అంటారు. 

* పడమటి దిక్కున కోటకు ఎత్తయిన సింహద్వారం ఉంది. ఒక బురుజు నుంచి మరొక బురుజుకు నడిచి వెళ్లేందుకు వీలుగా గోడను వెడల్పుగా నిర్మించారు. 

* ఉత్తరం దిక్కులో మట్టితో మూసిన మరో చిన్న ద్వారం ఉంది. ఈ కోటకు రెండు ద్వారాలు ఉన్నాయి. 

* ఫిరంగులు గురిపెట్టి కాల్చడానికి వీలుగా పిట్టగోడలకు నాలుగువైపులా రంధ్రాలు ఏర్పాటు చేశారు. 

* దేవాలయాల నిర్మాణానికి ఉపయోగించే కొన్ని రాళ్లను ఈ కోట నిర్మాణానికి వాడారు. ఇది ఒక చిన్న పర్వతాన్ని అంతర్భాగంగా చేసుకుని, రాయి, సున్నం, ఇటుకలతో శత్రుదుర్భేధ్యంగా కట్టారు. 

* ఈ దుర్గానికి మూడు సొరంగ మార్గాలున్నాయి. ఒకటి కోట మధ్యభాగం నుంచి బయట ఉన్న మంచినీటి బావి దగ్గరకి వెళ్తుంది. ఈ సొరంగం బరువైన రాతి స్తంభాలతో, సున్నంతో నిర్మించారు. దీనికి దారి పొడవునా దిగుడులు ఉన్నాయి. 

* మరో సొరంగం ఒక బురుజుపై నుంచి మొదలై ప్రాకారం దాటి ఉత్తరం దిక్కుగా సాగి, మట్టితో మూసిన సొరంగం ద్వారా పక్కకు వెళ్తుంది. 

* ఉత్తరంవైపు కోటకు అతి సమీపంలో ‘నాంచారి బావి’ అని పిలిచే ఒక పాత బావి ఉండేది. 

* పాపన్న తన స్వతంత్ర పాలనకు షాపురం కోటనే ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు. అక్కడే పెద్ద ఎత్తున యుద్ధ సామగ్రిని నిల్వ చేశాడు.

* నల్గొండ జిల్లా వేములకొండ గుట్టలపై పాపన్న కొంతకాలం నివసించాడు. మూడు గుట్టల సముదాయంలో కుడివైపున్న గుట్టపై కొంతకాలం, మధ్య భాగంలో ఉన్న గుట్టపై కొంతకాలం గడిపాడు. 

* కుడివైపున్న గుట్టచుట్టూ రాతితో నిర్మించిన ప్రహరీగోడ ఉంది. మధ్యలో కోనేరుతో పైభాగం విశాలంగా ఉంది. పైభాగాన రాతితో నిర్మించిన రెండు గుళ్లు ఉన్నాయి. 

* గుట్ట పైభాగం నుంచి చూస్తే చుట్టూ కొండలు మాత్రమే కనిపిస్తాయి. 

* మధ్యభాగాన ఉన్న గుట్టపై ఒక కోనేరు ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఇది అనువైన ప్రదేశం. ప్రస్తుతం ఇక్కడ శిథిలమైన ఇటుకలు, మట్టిపాత్రలు ఉన్నాయి.

* ధూల్మిట్ట గ్రామంలో పాపన్న విజయాలు, వీరత్వాన్ని సూచించే శిలా ప్రతిమలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఒక రాతి బావి, మర్రి చెట్టు ఉన్నాయి. గుడి సమీపంలో గుర్రంపై పాపన్న రాజదర్పంతో ఉన్న నల్లరాతిపై చెక్కిన ప్రతిమలు ఉన్నాయి.

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌