• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ పారిశ్రామిక రంగం

* పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మనరాష్ట్రం దేశవ్యాప్తంగా పరిశ్రమల పరంగా ఆరో స్థానంలో, పరిశ్రమల నుంచి సమకూరే స్థూల విలువ ఆధారిత అంశాల పరంగా 8వ స్థానంలో ఉంది.

* దేశవిదేశాల నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ సానుకూలమైన పారిశ్రామిక వాతావరణం, నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకరమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోంది.

* ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు; ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

* బల్క్‌ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, సిమెంట్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఇంజినీరింగ్, జౌళి, తోలు, ఇనుము, ఉక్కు, రత్నాలు, ఆభరణాలు, బయోటెక్నాలజీ, రక్షణ లాంటి భారీ ఉత్పాదక పరిశ్రమలకు మనరాష్ట్రం నిలయం.

నూతన పారిశ్రామిక విధానం

* తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధాన చట్టం 2014ను ప్రవేశపెట్టింది.

* ఇందులో ‘కొత్త ఆవిష్కరణలకు పరిశోధనలు చేయడం, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పరిశ్రమల శ్రేయస్సు’ (Research to
Innovation, Innovation to Industry and Industry to prosperity) అనే అంశాలపై దృష్టి సారించారు.

* ఈ నూతన పాలసీలో ప్రభుత్వం innovate, incubate and incorporate అనే నినాదాన్ని ఇచ్చింది.

* తక్కువ సమయంలో సులభంగా వ్యాపారాన్ని సాగించే ఒక వ్యాపార నియంత్రణ వాతావరణాన్ని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. 

లక్ష్యాలు:

* ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను మరింత పోటీ పడేలా తీర్చిదిద్దడం.

* పారిశ్రామిక రంగంలోకి నూతన అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం.

* పట్టణ, గ్రామీణ యువత కోసం ఉపాధి అవకాశాలు సృష్టించడానికి కీలకమైన ఉత్పాదక రంగాలపై దృష్టి కేంద్రీకరించడం.

అత్యంత పోటీ ధరలకు అత్యున్నతస్థాయి వస్తువులను ఉత్పత్తి చేయడం.

* భారీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా “Made in Telangana - Made in India’’ ను ఒక బ్రాండ్‌గా నెలకొల్పడం.

* అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించడం.

* విధాన నిర్ణయాలను పారదర్శకంగా తీసుకోవడం.

* పర్యవేక్షణను తగ్గించడం, సౌలభ్యాన్ని పెంచడం.

ప్రోత్సాహకాలు: 

* తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక ప్రోత్సాహక పథకం టి-ఐడియా 2014 (తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌ అడ్వాన్స్‌మెంట్‌)ను సాధారణ కేటగిరీ పారిశ్రామికవేత్తల కోసం; టి-ప్రైడ్‌ 2014 (తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంట్రప్రెన్యూర్స్‌)ను దళిత పారిశ్రామికవేత్తల కోసం ప్రకటించింది.  

* MSME భారీ పరిశ్రమల వర్గాలకు వివిధ ప్రోత్సాహకాలను విస్తరించింది.

మౌలిక విలువలు: నూతన పారిశ్రామిక విధానం కింద పేర్కొన్న నిర్దిష్టమైన మౌలిక విలువలపై ఆధారపడి ఉంది.

* ప్రభుత్వ నియంత్రణ చట్టం పారిశ్రామికాభివృద్ధికి దోహదపడాలి.

* పారిశ్రామికవేత్తలు ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వ్యాపార నియంత్రణ వాతావరణంలో అభివృద్ధి సాధించాలి.

* పారిశ్రామికాభివృద్ధి భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేదిగా ఉండాలి.

* పారిశ్రామికీకరణ సమ్మిళితంగా ఉండాలి. సామాజిక సమానత్వానికి దోహదపడాలి.

* పారిశ్రామికీకరణ ప్రయోజనాలు రాష్ట్రంలోని అట్టడుగు, సామాజికంగా అణగారిన వర్గాల వారికి చేరాలి.

* పర్యావరణాన్ని పరిరక్షించాలి, పరిశ్రమల కారణంగా సంభవించే దుష్ప్రభావాలను తగ్గించాలి.

చేనేత, జౌళి పరిశ్రమ 

* చేనేత, జౌళి పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 

* ఈ పరిశ్రమకు భారత ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోంది. 

* వరంగల్‌ జిల్లా జౌళి పరిశ్రమలకు కేంద్రంగా ఉంది.

దుస్తుల ఎగుమతి పార్కులు, టెక్స్‌టైల్‌ పార్కులు

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుస్తుల ఎగుమతి, టెక్స్‌టైల్‌ పార్కులు:

* దుస్తుల ఎగుమతి పార్క్‌ (గుండ్లపోచంపల్లి, రంగారెడ్డి జిల్లా)

* టెక్స్‌టైల్‌ పార్క్‌ (సిరిసిల్ల)

* టెక్స్‌టైల్‌ పార్క్‌ (పాశమైలారం, మెదక్‌ జిల్లా)

* టెక్స్‌టైల్‌ పార్క్‌ (మల్కాపూర్, నల్గొండ జిల్లా) 

* సూరత్, కోయంబత్తూర్‌ తరహాలో వరంగల్‌ నగర శివార్లలో ఓ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది. 

జాతీయ పెట్టుబడి, వస్తు ఉత్పత్తి మండళ్లు (NIMZ)

* మెదక్‌లో 5000 నుంచి 6000 ఎకరాల్లో జాతీయ పెట్టుబడి, వస్తు ఉత్పత్తి మండళ్లను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం అక్కడ భూసేకరణ కూడా చేశారు.

* జీడీపీలో ఉత్పాదక రంగ వాటాను 6 నుంచి 25 శాతానికి పెంచడం దీని ప్రధాన లక్ష్యం. 

* ప్రతి NIMZలో పెట్టుబడిని సుమారు  రూ.30,000 కోట్లుగా, ఉద్యోగ కల్పనా సామర్థ్యాన్ని 3 లక్షలుగా ప్రభుత్వం అంచనా వేసింది. 

మహిళా పారిశ్రామిక పార్కు అభివృద్ధి

* మహిళలు పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఔత్సాహిక మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా మహిళా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.

* మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల హరిత పారిశ్రామిక పార్కు, మెదక్‌ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలను వీరికి  కేటాయించింది.

తెలంగాణలో కీలక పరిశ్రమలు

* సమాచార సాంకేతికత ఆధారిత సేవలు ITES, ఫార్మా, ఇంజినీరింగ్‌ కాంపొనెంట్స్‌ లాంటి విజ్ఞాన ఆధారిత పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం. 

* వీటిలో ఎక్కువ శాతం హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్నాయి. ఈ పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZ's), నిపుణులైన కార్మికుల లభ్యత, పరిశోధన సంస్థ లాంటి మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్థలు ఉన్నాయి.

* నిజామాబాద్, కరీంగనర్, వరంగల్‌ జిల్లాల్లో వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. ఆ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది.

* జిల్లాల్లో లభించే సహజ వనరుల ఆధారంగా ఆయా ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను రచించింది. వాటిని తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం - 2015లో వివరించింది.

నిజామాబాద్‌: గనులు, సిమెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌

కరీంనగర్‌: ఎరువులు, విద్యుత్, సిమెంట్, వస్త్ర పరిశ్రమ

ఆదిలాబాద్‌: సిమెంట్, పేపర్‌

వరంగల్‌: గనులు, ఫుడ్‌ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ

మెదక్‌: కెమికల్స్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్స్, ఫార్మా

రంగారెడ్డి: ఐటీ, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్, డిఫెన్స్‌ - ఏరోస్పేస్‌

మహబూబ్‌నగర్‌: వస్త్ర పరిశ్రమ, గనులు, ఫార్మా, వినియోగ ఉత్పత్తులు

నల్గొండ: సిమెంట్, ఫార్మా

ఖమ్మం: గనులు, విద్యుత్‌ (ఇంధనం), గ్రానైట్స్, మెటలర్జీ, పేపర్‌

పారిశ్రామిక కారిడార్లు

* హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ను కలిపే ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారుల పొడవునా పారిశ్రామిక కారిడార్లను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

* వీటిని DMIC (Delhi–Mumbai Industrial Corridor Project), PCPIR (Petroleum, Chemicals and Petrochemicals Investment Region) తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

* రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాన్ని హైస్పీడ్‌ రైలు, రోడ్డు వ్యవస్థతో అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

* అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై దృష్టి సారించింది.

ప్రాథమికంగా అభివృద్ధి చేసే పారిశ్రామిక కారిడార్లు

ఎ) హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌

బి) హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్‌

సి) హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ 

 

రెండో దశలో అభివృద్ధిచేసే పారిశ్రామిక కారిడార్లు

ఎ) హైదరాబాద్‌-మంచిర్యాల పారిశ్రామిక కారిడార్‌

బి) హైదరాబాద్‌-నల్గొండ పారిశ్రామిక కారిడార్‌

సి) హైదరాబాద్‌-ఖమ్మం పారిశ్రామిక కారిడార్‌ 

పారిశ్రామిక మౌలిక సదుపాయాలు

* ఐటీ/ ఐటీఈ, ఏరోస్పేస్, బయోటెక్, ఫార్ములేషన్స్‌ రంగాల్లో ఆరు సెజ్‌లను అభివృద్ధి చేశారు.

* ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పార్కులను నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) వరంగల్‌ జిల్లా మడికొండ గ్రామంలో సెజ్‌ను అభివృద్ధి చేసింది.

నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం భూమి గుర్తింపు

* టీఎస్‌ఐఐసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 74,133.18 ఎకరాల్లో 150 పారిశ్రామిక పార్కులు విస్తరించి ఉన్నట్లు గుర్తించింది. ప్రస్తుతం ఈ పార్కుల్లో 13,165 యూనిట్లు (పరిశ్రమలు) ఉనికిలో ఉన్నాయి.

* మొత్తం 74,133.18 ఎకరాల భూమిలో పరిశ్రమలకు కేటాయించడానికి ఇంకా 917.30 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

* టీఎస్‌ఐఐసీ రాష్ట్రంలోని 2.5 లక్షల ఎకరాల బంజరు భూమిని సర్వే చేసి, పారిశ్రామిక వినియోగానికి అవసరమైన 2,34,064.35 ఎకరాలను గుర్తించింది.

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌