• facebook
  • whatsapp
  • telegram

సామాజిక విధానం భావన ప్రాధాన్యం

ప్రజా శ్రేయస్సుకి ప్రభుత్వ సాధనం!

ప్రజల అవసరాలను తీరుస్తూ, సౌకర్యాలను కల్పిస్తూ, దేశ అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రభుత్వాలు, సమాజం వ్యవహరించే తీరే సామాజిక విధానం. బలహీనులకు అండ, అసమానతల నిర్మూలన, వనరుల సమపంపిణీ వంటి పురోగామి చర్యలు ఇందులో భాగం. దీని ఆధారంగానే సంక్షేమ పథకాలు రూపొందుతాయి. ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలుగా పరిణామం చెందడంలోనూ సామాజిక విధానం కీలక పాత్ర పోషించింది. ఈ విధానం ఎందుకు, ఎలా రూపుదిద్దుకుంది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏవిధంగా రూపాంతరం చెందింది తదితర అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

సామాజిక విధానం : భావన, ప్రాధాన్యం

ప్రజలు ఎదుర్కొనే కొన్ని ప్రత్యేక సమస్యల పరిష్కారానికి, వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఉన్నతికి ఉద్దేశించిందే సామాజిక విధానం. ఇది ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధి ప్రక్రియల్లో కీలక ప్రభావం చూపే అంశంగా గుర్తింపు పొందింది.


అర్థం: ఆక్స్‌ఫర్డ్‌ డిక్షన్రీ ప్రకారం సామాజిక విధానం అంటే ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు, అధికారులు, రాజనీతి ప్రముఖులు, ప్రభుత్వం తీసుకునే చర్యలు. ‘‘చట్టం, సూచన, పాలకుల నిర్ణయాలు లేదా వీటి సమ్మేళనంతో కూడిన స్పష్టమైన ప్రక్రియే సామాజిక విధానం’’ అని బిర్‌క్లాండ్‌ అభిప్రాయం.


పలు రకాల నిర్వచనాలు ప్రధానంగా మూడు లక్ష్యాలను సూచిస్తున్నాయి. అవి 

1) ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే ప్రయోజనకర విధానాలు. 

2) ప్రజల ఆర్థిక ప్రయోజనాలైన కనీస వేతనం, ఆదాయం, కనీస ప్రమాణాలను కల్పించడం. 

3) సంపన్నుల నుంచి పేదలకు వనరుల పునఃపంపిణీపై ప్రగతిశీల ధోరణి.


సామాజిక విధానం మానవ సంక్షేమ పథకాలను మెరుగుపరచి విద్య, ఆరోగ్యం, గృహ, సామాజిక భద్రతకు అనుగుణంగా మార్గదర్శకాలను, మధ్యవర్తిత్వాలను సూచిస్తుంది. మార్కెట్‌తో పాటు సామాజిక సంస్థల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడానికి, భర్తీ చేయడానికి ప్రభుత్వాలు నిర్మించిన సాధనంగానూ దానిని పరిగణించవచ్చు. సామాజిక విధానాన్ని విద్య, ఆరోగ్యం, ఉపాధి, సాంఘిక భద్రత లాంటి సేవలుగా నిర్వచిస్తారు. సంపద పునఃపంపిణీ, రక్షణ, సామాజిక న్యాయం గురించి కూడా చెబుతుంది.


ప్రాధాన్యం: ప్రజలకు ప్రాథమిక న్యాయాన్ని అందించి, కనీస జీవన ప్రమాణాలను పెంచి, తద్వారా ఆర్థిక అవసరాలకు సామాజిక విధానం భద్రత కల్పిస్తుంది. ఆధునిక యుగంలో  అభివృద్ధి ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధానపాత్ర పోషిస్తోంది. సంబంధిత ఆర్థిక విధానాల్లో సామాజిక న్యాయానికి అవరోధంగా ఉన్న అంశాలను ప్రాథమిక స్థాయిలో నియంత్రించేందుకు సామాజిక విధానం తోడ్పడుతుంది.


ఉదా:మలేసియాలో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక సంస్కృతులను నాశనం చేసే విధంగా ఉండటంతో వాటిని మార్చే లక్ష్యంతో సామాజిక విధానం ఆవిర్భవించింది. ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన స్థానికులకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన చైతన్యాన్ని పెంచింది.


అభివృద్ధి ప్రక్రియలో ఆర్థికాభివృద్ధి చక్రీయ అస్థిరత ఉత్పన్నమవుతుంది. దాంతో క్రమానుగత సంక్షోభాల వల్ల కలిగే సామాజిక ప్రభావాలను తగ్గించేందుకు సామాజిక విధానం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నిరుద్యోగం లాంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, ఆకస్మిక విపత్తులు (భూకంపాలు, తుపాన్లు), ఇతర ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశాలను కల్పిస్తుంది.సగటు కార్మికుల సామాజిక ఉత్పాదకతను పెంచుతుంది. సాంకేతిక ఆవిష్కరణలు, ప్రైవేటు యాజమాన్యాల అమానవీయ ధోరణుల నుంచి భద్రత కల్పించే విధంగా సామాజిక విధానం ఉంటుంది.


ప్రజావిధానం-సామాజిక విధానం:


ప్రజావిధానం: ప్రభుత్వ విధానాల్లో ఇదొక విధమైన అధికారిక, చట్టబద్ధమైన రూపం. విస్తృత దృష్టిలో భాగంగా ఒక ప్రత్యేక సమస్య లేదా ఆందోళనను ఎదుర్కోవడానికి ఏం చేయాలి లేదా ఏం చేయకూడదో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ అధికారిక విధానాలు మెజారిటీ ప్రజల అభిమతాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ప్రజలకు సహాయం చేయడమే సామాజిక విధానం లక్ష్యంగా ఉంటుంది. ప్రభుత్వ శాసనాలు, న్యాయచట్టాలు, నిబంధనలు, కార్యనిర్వాహక ఆదేశాలు, కోర్టు లేదా కార్యనిర్వాహక వ్యవస్థల నిర్ణయాలు తదితరాలు ప్రజావిధానంలో చేర్చిన వివిధ అంశాలు. అందులో  ఆరోగ్యపరమైన లక్ష్యాలు, తుపాను నియంత్రణ, పరిశ్రమల ద్వారా విడుదలైన విషపూరిత వ్యర్థాల పరిశుభ్రత, ప్రభుత్వ రాయితీలు, సంరక్షణ రాయితీలు, మహిళలు, పిల్లలు, శిశుసంరక్షణ లాంటి కార్యక్రమాలు ఉంటాయి. 


సామాజిక విధానం: ప్రజల సంక్షేమానికి సంబంధించిన విధానాలను సూచిస్తూ విశేషంగా వాడే పదం సామాజిక విధానం. ప్రజారోగ్యం, విద్య, నేరం, న్యాయం లాంటి ఇతర అంశాలను ప్రభావితం చేసేదిగా ఉంటుంది. సమాజంలో తలెత్తే సమస్యలు, కస్టమ్స్, చట్టాలు, వివిధ సమూహాల ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. సామాజిక విధానం సమాజంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్థానిక వర్గాల వనరులను కేటాయిస్తుంది. ఈ విధానాలు మొత్తం సమాజం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.


సామాజిక విధానం-స్వభావం:  సామాజిక విధానాలు దేశ నిర్మాణంలో ఆర్థికాభివృద్ధికి, ఇతర ప్రయోజనాల కోసం సహజంగా మానవతా దృక్పథంతో ఏర్పడ్డాయి. రాజకీయ స్థిరత్వం, రాజకీయ అవసరాల కోసం భవిష్యత్తు ప్రణాళికకు, ఆర్థికాభివృద్ధిÄ కోసం అటు ప్రభుత్వానికి, ఇటు దేశ ప్రజలకు మద్దతు పెంచడానికి రూపొందించారు. నయా ఉదారవాదం, సంప్రదాయవాదం, సామ్యవాదం, కమ్యూనిజం నుంచి ఫాసిజం వరకు సరళీకరణ విలువలు, సూత్రాలపై ప్రభుత్వం సామాజిక విధానాన్ని నిర్మిస్తుంది. సామాజిక విధానం దేశపౌరుల సంక్షేమాన్ని పెంపొందించడం, మానవ మూలధనాన్ని నిర్మించడం, ఉపాధికి మద్దతునివ్వడం, సామాజిక ప్రయోజనాలను మెరుగుపరచడం చేస్తుంది.


సామాజిక విధాన లక్ష్యాలను డ్రెక్‌’ అయిదు వ్యతిరేక జతలుగా సూచించాడు. 

1) మార్పులను ప్రభావితం చేసే విషయాలను భద్రపరచుకోవడం. 

2) ఒక నిర్దిష్ట సమూహంలోని సభ్యులతో ప్రత్యేకంగా లేదా సమానత్వంతో వ్యవహరించడం. 

3) సమాజంలో బాహ్య అసమానతలను, సమానత్వంగా ప్రోత్సహించడం. 

4) నిర్దిష్ట విలువల సమూహాలను ప్రోత్సహించడానికి లేదా భిన్న విలువలను కల్పించడం. 

5) వ్యక్తులను లేదా సమూహాలను మార్చడానికి లేదా వాతావరణాన్ని మార్చడానికి.


ఆధునిక ప్రభుత్వం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒక సామాజిక ఒడంబడికపై ఆధారపడి ఉంది. ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, దేశ ప్రయోజనానికి సహకరిస్తారు. ఇందుకు బదులుగా ప్రభుత్వాలు ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాప్రయోజనాలకు చట్టబద్ధత కలిగిస్తాయి. సామాజిక విధానం కేవలం సమాజం అధ్యయనం, దాని సమస్యలకు సంబంధించింది మాత్రమే కాదు. విజయం లేదా వైఫల్యాల విశ్లేషణ ద్వారా సమస్యలకు మెరుగైన పరిష్కార మార్గాలను సాధించడం, సమాజ సంక్షేమం, దాని శ్రేయస్సు మెరుగుపరచడానికి రూపొందించిన విధానాలేనని అల్కాక్‌ పేర్కొన్నాడు.


* ప్రజల సామర్థ్యాలను అభివృద్ధి చేసే విధంగా సామాజిక విధానం ఉండాలని అమర్త్యసేన్‌ సూచించారు. ఈ విషయంలో వారి స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వడం, జీవన విధానంలో విలువలను కలిగి ఉండటం ముఖ్యమన్నారు. ఏ ప్రభుత్వమైనా సామాజిక విధానం అమల్లో పౌరుల శ్రేయస్సు కోసం విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత లాంటి ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. సామాజిక విధానంలో ప్రధానంగా ప్రజల జీవితాల్లోని సమస్యలను ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలు విధానాలను తయారుచేయాలి. ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ జోక్యమే సామాజిక విధానం అంతిమ లక్ష్యం.


సామాజిక విధానం ఒక కీలకమైన అంశం. వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల దానిపై స్పష్టమైన అవగాహన లేదు. అంతేకాకుండా నిరుత్సాహభరిత నిర్ణయాలూ ఉన్నాయి.                

- టిట్‌మస్‌ (1974)

సామాజిక ప్రగతి నైతిక విధానంపై ఆధారపడి ఉంటుంది. దానిపై ప్రమాణాలు, సామాజిక న్యాయం, సమానత్వానికి సంబంధించిన వ్యక్తి మేధస్సు, అహం, పరోపకారాల కలయికపై అధికారం, శక్తి ఆధారపడి ఉంటాయి.                                                                                        

 - గిన్స్‌బర్గ్‌ (1953)

సమాజంలో నివసించే స్త్రీ, పురుషుల మధ్య ఉండే సంబంధాల మధ్య క్రమశిక్షణ ద్వారా హక్కులు ఏర్పడటాన్నే సామాజిక విధానంగా చెప్పవచ్చు. ఇవి వ్యక్తుల మధ్య ఉన్న జీవన విధానాలు, ప్రయోజనాలను ప్రభావితం చేసేంత వరకు ఉంటాయి.           - మెక్‌బెత్‌ (1957)

సమాజంలోని ప్రజల అవసరాలను తీర్చడానికి చేస్తున్న సేవలను, సంక్షేమాన్ని, సమాజ అభివృద్ధికి తీసుకున్న చర్యలను సూచించేదే సామాజిక విధానం’.                                 

- అల్కాక్‌ (2008)

 


రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి 

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌