• facebook
  • whatsapp
  • telegram

ఆమ్లాలు - క్షారాలు, pHభావన

ఆమ్లాల ధర్మాలు


* ఇవి పుల్లటి రుచిని కలిగి ఉంటాయి.

* నీలి లిట్మస్‌ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి.

* మిథైల్‌ ఆరెంజ్‌ సూచిక రంగును ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఫినాఫ్తలీన్‌తో రంగులేని ద్రావణాన్ని ఏర్పరుస్తాయి.

* మెగ్నీషియం (Mg), అల్యూమినియం (Al), ఇనుము (Fe) లాంటి లోహాలతో ఆమ్లాలు చర్య జరిపి, హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి.

* క్షారాలతో ఆమ్లాలు చర్య జరిపి లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.

* ఆమ్లాలు లోహ కార్బొనేట్‌లతో చర్య జరిపి కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువును విడుదల చేస్తాయి.


క్షారాల ధర్మాలు


* చేదుగా ఉంటాయి.

* తాకితే జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి.

* ఎర్ర లిట్మస్‌ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి.

* మిథైల్‌ ఆరెంజ్‌ సూచికను పసుపు రంగుకు మారుస్తాయి.

* క్షార ద్రావణాలు ఫినాఫ్తలీన్‌ సూచికను పింక్‌ రంగులోకి మారుస్తాయి.

* ఆమ్లాలతో క్షారాలు చర్య జరిపి లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.


బ్రాన్‌స్టెడ్‌ - లౌరీ ఆమ్ల - క్షార భావన


* ఆమ్లాలు హైడ్రోజన్‌ అయాన్‌లను (H+) దానం చేసే ప్రవృత్తి కలిగిన పదార్థాలు.

* క్షారాలు హైడ్రోజన్‌ అయాన్‌లను (H+) స్వీకరించే ప్రవృత్తి కలిగిన పదార్థాలు.

 


నీటి అయానిక లబ్ధం (Ionic Product of Water)

* నీటిలోని H+ అయాన్, OH- అయాన్‌ల గాఢతల లబ్ధాన్ని ‘నీటి అయానిక లబ్ధం’ అంటారు. దీన్ని 'Kw' తో సూచిస్తారు.

Kw = [H+] [OH-]
ఇక్కడ, [H+] = H+అయాన్‌ గాఢత

[H-] = H అయాన్‌ గాఢత

Kw విలువ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది.

* 25oC వద్ద నీటి అయానిక లబ్ధం: 

      1.0 x 10-14 మోల్‌2.లీ-2.


* ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటి అయానిక లబ్ధం పెరుగుతుంది.

* తటస్థ ద్రావణాలకి, [H+] = [H-]

        = 1.0 x 10-7 మోల్‌/లీ.


* ఆమ్ల ద్రావణాలకి, 

[H+] > 1.0 x 10-7 మోల్‌/లీ.

[OH-] < 1.0 x 10-7 మోల్‌/లీ.


* క్షార ద్రావణాలకి 

   [H+] < 1.0 x 10-7 మోల్‌/లీ.
   [OH-] > 1.0 x 10-7 మోల్‌/లీ.


pH మానం (pHScale) 


* ద్రావణాల ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని కచ్చితంగా చెప్పడానికి సోరెన్‌సెన్‌ అనే శాస్త్రవేత్త pH స్కేలును ప్రతిపాదించారు. 

* ఒక ద్రావణంలో ఉన్న హైడ్రోజన్‌ అయాన్‌ల గాఢత రుణ సంవర్గమానాన్ని pH అంటారు. 

* తటస్థ ద్రావణాల pH విలువ 7. 

* ఆమ్ల ద్రావణాల pH విలువ 0 - 7 మధ్య ఉంటుంది.

* క్షార ద్రావణాల pH విలువ 7 - 14 మధ్య ఉంటుంది.

* pH విలువ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ ద్రావణం అంత బలమైన క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. 


* pH విలువ ఎంత తక్కువగా ఉంటే, ఆ ద్రావణం అంత బలమైన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.

* బలమైన ఆమ్లం, బలమైన క్షారాల మధ్య చర్య జరిగి, ఏర్పడిన లవణాలు తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంతో వీటి pH విలువ 7 కు సమానంగా ఉంటుంది. 

ఉదా: సోడియం క్లోరైడ్‌ ద్రావణం.


* బలమైన ఆమ్లం, బలహీన క్షారం మధ్య జరిగిన చర్యలో ఏర్పడిన లవణ ద్రావణం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీని pH విలువ 7 కంటే తక్కువగా ఉంటుంది.

ఉదా: అమ్మోనియం క్లోరైడ్‌ ద్రావణం


* బలహీన ఆమ్లం, బలమైన క్షారం మధ్య చర్య జరిగి ఏర్పడిన లవణ ద్రావణం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీని pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుంది.


బఫర్‌ ద్రావణాలు


* ద్రావణాన్ని విలీనం చేసినప్పుడు లేదా కొంత ఆమ్లాన్ని లేదా కొంత క్షారాన్ని కలిపినప్పుడు pH విలువలో మార్పును నిరోధించే ద్రావణాలను ‘బఫర్‌ ద్రావణాలు’ అంటారు. 

* శరీర ద్రవాలైన రక్తం, మూత్రం మొదలైన వాటికి pH విలువలు నిర్దిష్టంగా ఉంటాయి. ఈ విలువల్లో ఎలాంటి మార్పు జరిగినా అది మానవ శరీర అనారోగ్యాన్ని సూచిస్తుంది. 

* రక్తం pH విలువను 7.3 వద్ద స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడే బఫర్‌ ద్రావణం - కార్బోనిక్‌ ఆమ్లం, బైకార్బొనేట్‌ అయాన్‌ల మిశ్రమం.


అర్హీనియస్‌ ఆమ్ల - క్షార భావన


* ఏదైనా పదార్థం హైడ్రోజన్‌ను కలిగి, నీటిలో కరిగినప్పుడు హైడ్రోజన్‌ అయాన్‌ (H+)లను ఇస్తే దాన్ని ‘ఆమ్లం’ అంటారు.

ఉదా: హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం: HCl

         సల్ఫ్యూరిక్‌ ఆమ్లం: H2SO4

        నత్రికామ్లం: HNO3

       కార్బోనిక్‌ ఆమ్లం: H2CO3

      ఫాస్ఫోరిక్‌ ఆమ్లం: H3PO4

     ఎసిటిక్‌ ఆమ్లం: CH3COOH


* నీటిలో కరిగినప్పుడు హైడ్రాక్సైడ్‌ అయాన్‌లను (H-) ఇచ్చే పదార్థాన్ని ‘క్షారం’ అంటారు.

ఉదా: సోడియం హైడ్రాక్సైడ్‌: NaOH

    పొటాషియం హైడ్రాక్సైడ్‌: KOH

    మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌: Mg(OH2)

    కాల్షియం హైడ్రాక్సైడ్‌: Ca(OH)2

    అల్యూమినియం హైడ్రాక్సైడ్‌: Al(OH)3

   అమ్మోనియం హైడ్రాక్సైడ్‌: NH4OH


లూయిస్‌ ఆమ్ల - క్షార భావన


* ఒక ఎలక్ట్రాన్‌ జంటను స్వీకరించే ప్రవృత్తి కలిగిన పదార్థాలు ఆమ్లాలు. 

ఉదా: లోహ కేటయాన్‌లు BF3, AlCl3, SO2, CO2 మొదలైనవి.


* ఒక ఎలక్ట్రాన్‌ జంటను దానం చేసే ప్రవృత్తి కలిగిన పదార్థాలు క్షారాలు.

ఉదా: ఆనయాన్‌లు, NH3, H2O మొదలైనవి.

బలమైన ఆమ్లాలు: జల ద్రావణంలో 100% అయనీకరణం చెంది, ఎక్కువ గాఢతలో హైడ్రోజన్‌ అయాన్‌లను (H+) ఇచ్చే వాటిని బలమైన ఆమ్లాలు అంటారు.

ఉదా: HCl, H2SO4, HNO2 మొదలైనవి.


బలహీన ఆమ్లాలు: జల ద్రావణంలో పాక్షికంగా అయనీకరణం చెంది, తక్కువ గాఢతలో హైడ్రోజన్‌ ఆయన్‌లను (H+) ఇచ్చే పదార్థాలను బలహీన ఆమ్లాలు అంటారు.

ఉదా: H2CO4, కర్బన ఆమ్లాలు మొదలైనవి.


బలమైన క్షారాలు: జల ద్రావణంలో 100% అయనీకరణం చెంది, ఎక్కువ గాఢతలో హైడ్రాక్సిల్‌ అయాన్‌లను (OH-) ఇచ్చే వాటిని బలమైన క్షారాలు అంటారు.

ఉదా: NaOH, KOH మొదలైనవి.


బలహీన క్షారాలు: జల ద్రావణంలో పాక్షికంగా అయనీకరణం చెంది, తక్కువ గాఢతలో హైడ్రాక్సిల్‌ అయాన్‌లను (OH-) ఇచ్చే వాటిని బలహీన క్షారాలు అంటారు.

ఉదా: NH4OH, Al(OH)3 మొదలైనవి.


తటస్థీకరణం: క్షారంతో ఆమ్లం చర్య జరిపినప్పుడు లవణం, నీరు ఏర్పడతాయి. ఈ చర్యను ‘తటస్థీకరణం’ అంటారు.


* తటస్థీకరణం ఒక ఉష్ణమోచక చర్య.

* తటస్థీకరణంలో ఒక మోల్‌ నీరు ఏర్పడటానికి వెలువడే ఉష్ణరాశి పరిమాణాన్ని ‘తటస్థీకరణోష్ణం’ అంటారు.

* ఒక బలమైన ఆమ్లం, బలమైన క్షారాన్ని తటస్థీకరణం చేసేటప్పుడు వెలువడే తటస్థీకరణోష్ణం విలువ 13.7 కిలో కేలరీలు/ మోల్‌.

ఉదా:   NaOH   +   HCl  →      NaCl    +     H2O

          (క్షారం)       (ఆమ్లం)        (లవణం)        (నీరు)

            + 13.7 కిలో కేలరీలు/ మోల్‌ (తటస్థీకరణోష్ణం)


* ఆమ్లం లేదా క్షారం లేదా రెండూ బలహీనమైనప్పుడు తటస్థీకరణోష్ణం 13.7 కిలో కేలరీలు/ మోల్‌ కంటే తక్కువగా ఉంటుంది. దీనికి కారణం, చర్యల్లో కొంత ఉష్ణం బలహీన ఆమ్లం లేదా క్షారాన్ని అయనీకరణం చెందించడానికి ఉపయోగపడటమే.

 

మాదిరి ప్రశ్నలు


1. 0.001 M గాఢత ఉన్న HCL ద్రావణం pH విలువ ఎంత? 

       1) 3          2) 4            3) 1              4) 3


2. ఉష్ణోగ్రతకు, నీటి అయానిక లబ్ధానికి మధ్య ఉన్న సంబంధం?

  1) విలోమానుపాతం     2) అనులోమానుపాతం     3) సమానం           4) కచ్చితంగా చెప్పలేం


3. నీటికి కొంచెం ఆమ్లాన్ని కలిపితే, ఆ ద్రావణం pH విలువ ఏమవుతుంది?

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది      3) మార్పు లేదు      4) మొదట పెరిగి, తర్వాత తగ్గుతుంది


4. కింది వాటిలో pH విలువ 7 కంటే తక్కువగా ఉన్న ద్రవం ఏది?

1) సోడా నీరు         2) సబ్బు నీరు          3) మానవ మూత్రం             4) 1, 3


5. కింది వాటిలో pH విలువ 7 కంటే ఎక్కువగా ఉన్న ద్రవం ఏది?

1) నిమ్మరసం      2) లాలాజలం        3) స్వేదన జలం     4) సబ్బు నీరు


6. తాజా స్వేదన జలం pH విలువ ఎంత?

       1) < 7             2) > 7              3) 7            4) 14


7. లూయిస్‌ ఆమ్ల-క్షార భావన ప్రకారం ఆమ్లం అంటే?

1) ఎలక్ట్రాన్‌ జంట స్వీకర్త           2) ఎలక్ట్రాన్‌ జంట దాత

3) ప్రోటాన్‌ స్వీకర్త                     4) ప్రోటాన్‌ దాత


8. తటస్థీకరణ అనేది ఏ చర్య?

1) ఉష్ణమోచక చర్య                2) ఉష్ణగ్రాహక చర్య

3) కాంతి రసాయన చర్య                4) 1, 2


9. అయనీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

1) అవగాడ్రో       2) అర్హీనియస్‌            3) లూయిస్‌      4) డీబ్రోలీ


10. మానవుడి రక్తం pH విలువ ఎంత?

  1) 5.6  5.8             2) 7.3  7.4             3) 6.6  6.8            4) 12.4  12.6


సమాధానాలు

1 - 1;     2 - 2;    3 - 2;    4 - 4;    5 - 4;    6 - 3;    7 - 1;    8 - 1;    9 - 2;    10 - 2

Posted Date : 15-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌