• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం

అందరికీ ఆహారం.. ఆర్థికవ్యవస్థకు ఆధారం!

  ప్రజలకు ఆహారం, ఉపాధి, పరిశ్రమల అవసరమైన ముడిసరుకులను వ్యవసాయం అందిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికీ మన దేశంలో సగానికిపైగా జనాభా అగ్రికల్చర్, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ వ్యవసాయం మౌలిక స్వరూపం, వర్షపాతం, నేలల స్వభావానికి అనుగుణంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగుతున్నాయనే అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  మన దేశంలో వ్యవసాయం సింధూ నాగరికత కాలం నుంచే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్‌ రెండోది. త్వరలోనే మొదటి స్థానానికి చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత జనాభాకు ఆహారాన్ని మన వ్యవసాయ రంగమే సమకూరుస్తోంది. దాంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకూ అండగా ఉంది (దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 18%). ఆర్థికంగా దూసుకుపోతున్న మన దేశంలో నేటికీ 55% ప్రజలకు వ్యవసాయమే జీవానాధారం. గ్రామీణ కుటుంబాల్లో 70% సేద్యంపైనే ఆధారపడి ఉన్నారు. వారిలో 82% చిన్న, సన్నకారు రైతులు. వ్యవసాయ రంగం పరిశ్రమకు ముడిసరకులను అందిస్తుంది. విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తుంది.

  భారత ఆర్థిక సర్వే ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 1950-51లో 51.9% ఉండేది. 2017- 18 నాటికి 17-18%కి తగ్గింది. దేశంలో అత్యధిక వ్యవసాయదారులున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ మొదటి స్థానంలో; బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి.

 

రుతువులు

ఖరీఫ్‌ (జూన్‌- అక్టోబరు): వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ఆధారంగా పంటలు సాగయ్యే కాలమిది. పంటల కాలవ్యవధి 5 నెలలు. నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేస్తారు. ఉదా: వరి, చెరకు, మొక్కజొన్న, పత్తి, పొగాకు, జనపనార, నువ్వులు, శనగలు

 

రబీ (నవంబరు - ఫిబ్రవరి): ఈశాన్య రుతుపవనాల కాలంలో 4 నెలల పాటు ఉండే పంట కాలమిది. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు పండిస్తారు. 

ఉదా: గోధుమ, బార్లీ, ఆవాలు, నూనెగింజలు

 

జైద్‌ (మార్చి - మే): నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ కాలంలో పంటలు పండిస్తారు. వరి, మొక్కజొన్నతో పాటు దోస, పెసర, కంది, గుమ్మడి, వేరుశనగ, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలు పండిస్తారు.

  దేశంలో వ్యవసాయ ప్రాంతాలను గుర్తించేందుకు వర్షపాతం, ఉష్ణోగ్రత, ఎత్తు, అక్షాంశం, నేల సారం, పంటలను పరిగణనలోకి తీసుకుంటారు. డాక్టర్‌ చెన్‌హన్‌ సేంగ్‌ అనే శాస్త్రవేత్త దేశాన్ని 16 వ్యవసాయ ప్రాంతాలుగా గుర్తించాడు. దీనికి ఆయన స్థలాకృతి, నీటిపారుదల, పంటల వ్యవస్థ, కౌలుదారీ వ్యవస్థ, సాధారణ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాడు. కె.విలియం ఈస్టర్‌ అనే శాస్త్రవేత్త వ్యవసాయ ప్రణాళిక, నియంత్రణ కోసం వివిధ పద్ధతులను అవలంబించాడు. అందులో వ్యవసాయ ప్రధాన పంటల ప్రాంతాలను, వ్యవసాయ ప్రణాళికలకు వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలను గుర్తించాడు. దీనికోసం దేశాన్ని మూడు ప్రధాన భూభాగాలుగా, 10 ఉప భాగాలుగా, హిమాలయాలు లేకుండా 52 వ్యవసాయ ప్రాంతాలను గుర్తించాడు. జాతీయ *** సర్వేక్షణ సంస్థ జనసాంద్రత, పంటల నమూనాలు, సముద్ర మట్టం నుంచి ఎత్తు, రవాణా సౌకర్యాల ఆధారంగా దేశాన్ని 25 ప్రధాన వ్యవసాయ మండలాలు, 66 ఉప వ్యవసాయ ప్రాంతాలుగా గుర్తించింది.

డాక్టర్‌ రంద్వా దేశాన్ని అయిదు వ్యవసాయ ప్రాంతాలుగా గుర్తించారు. ఇవి కొంత ప్రామాణికంగా ఉన్నాయి.

 

సమశీతోష్ణ హిమాలయ ప్రాంతం: ఈ ప్రాంతాన్ని మళ్లీ రెండు మండలాలుగా విభజించారు.

 

ఎ) తూర్పు హిమాలయ ప్రాంతం: ఇక్కడ వర్షపాతం అధికంగా ఉంటుంది.250 సెం.మీ. కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదవుతుంది. దీని పరిధిలో సిక్కిం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధానంగా తేయాకు, వరి పంటలు పండుతాయి.

 

బి) పశ్చిమ హిమాలయ ప్రాంతం: దీనిలో కులు, కాంగ్రా లోయలు, ఘర్‌వాల్, కుమవోస్, సిమ్లా కొండలు, జమ్మూ-కశ్మీర్‌ ఉన్నాయి. వర్షపాతం సాధారణంగా నమోదవుతుంది. వాల్‌నట్, బాదం, ఆపిల్, చెర్రీ, ఆప్రికాట్, ప్లమ్‌ వంటి పంటలతోపాటు బంగాళదుంప, మొక్కజొన్న, వరి లాంటి ఆహార పంటలు పండిస్తారు.

 

ఉత్తర మెట్ట ప్రాంతం: వార్షిక వర్షపాతం 75 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో 20 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది. దీని కింద పంజాబ్, హరియాణా, దిల్లీ, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు పండిస్తున్నారు.

 

తూర్పు మాగాణి ప్రాంతం: ఇక్కడ వర్షపాతం 150 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండి, ఒండ్రు నేలలతో సారవంతంగా ఉంటుంది. అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తూర్పు మధ్యప్రదేశ్, త్రిపుర, మణిపుర్, మిజోరం రాష్ట్రాలు దీని కిందకు వస్తాయి. ప్రధానంగా వరి, జనపనార, తేయాకు, చెరకు పండిస్తారు.

 

పశ్చిమ మాగాణి (మలబార్‌ ప్రాంతం): వార్షిక వర్షపాతం 250 సెం.మీ. మేర నమోదవుతుంది. లేటరైట్‌ నేలలు ఉండే ఈ ప్రాంతం కేరళ, పశ్చిమ సముద్ర తీరం, కర్ణాటకల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రధాన పంటలు కొబ్బరి, తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిమామిడి, ఆర్కుట్, మిరియాలు, ధనియాలు.

 

దక్షిణ/చిరుధాన్యాల ప్రాంతం: ఇక్కడ వార్షిక వర్షపాతం 50 - 100 సెం.మీ. ఉంటుంది. నల్లనేలలు, లేటరైట్‌ నేలలు ఉంటాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ దక్షిణ ప్రాంతం, దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ తమిళనాడు, తూర్పు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని భాగాల్లో ఈ ప్రాంతం ఉంది. ప్రధానంగా జొన్న, సజ్జ, వేరుశనగ, ఆముదం, పత్తి పండిస్తారు.

 

 

వ్యవసాయం, అనుబంధ రంగాల పథకాలు

* నీలి విప్లవం - చేపల ఉత్పత్తి

* శ్వేత విప్లవం - పాలు, పాల ఉత్పత్తులు

* పసుపు విప్లవం - నూనెగింజల ఉత్పత్తి

* వెండి విప్లవం - కోడిగుడ్ల ఉత్పత్తి

* బంగారు విప్లవం - పండ్ల ఉత్పత్తి

* ఆరెంజ్‌ విప్లవం - నిమ్మ, నారింజ జాతుల ఉత్పత్తులు

* బూడిద విప్లవం - ఎరువుల ఉత్పత్తి పెంపుదల

* బ్రౌన్‌ విప్లవం - సుగంధద్రవ్యాల ఉత్పత్తి

* హరిత విప్లవం - ఆహారధాన్యాల ఉత్పత్తి

 

విధానాల పేర్లు

ఎపీకల్చర్‌ - తేనెటీగల పెంపకం

హార్టికల్చర్‌ - ఉద్యానవన పంటల పెంపకం

సెరికల్చర్‌ - పట్టుపురుగుల పెంపకం

ఆక్వాకల్చర్‌ - రొయ్యల పెంపకం

ఫ్లోరికల్చర్‌ - పూలతోటల పెంపకం

విటీకల్చర్‌ - ద్రాక్షతోటల పెంపకం

సిల్వీకల్చర్‌ - కలపనిచ్చే చెట్ల పెంపకం

 

భారతదేశ వ్యవసాయం- విశిష్ట లక్షణాలు

* మన దేశంలో రైతులకు వ్యవసాయమే జీవనాధారం. కుటుంబసభ్యుల సహాయంతో పండించిన పంటలను సొంత అవసరాలకు వాడుకొని మిగిలిన ఉత్పత్తులను అమ్ముకొని జీవనం సాగిస్తారు.

* అధిక జనాభా ప్రభావం వ్యవసాయ రంగంపై పడుతోంది. ఉపాధి, ఆహార ధాన్యాలకు డిమాండ్‌ అధికమవుతోంది. అదే సమయంలో వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు (పరిశ్రమలు, గృహాలు, రియల్‌ ఎస్టేట్‌) మారుతుండటంతో పంç పండే భూమి తగ్గి, సాగులో ఉన్న భూమిపై ఒత్తిడి పెరుగుతోంది.

* పురాతన కాలం నుంచి వ్యవసాయం రంగంలో పశువులకు ప్రాధాన్యం ఉంది. దున్నడానికి, నీటి సరఫరాకు; పచ్చిగడ్డి, పంట రవాణా లాంటి అవసరాలకు వినియోగించేవారు. కాలానుగుణంగా యంత్రాల వినియోగం పెరగడంతో పశువుల ప్రాముఖ్యం తగ్గింది. 

* దేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మన వ్యవసాయ రంగం నేటికీ రుతుపవన ఆధారితంగానే సాగుతోంది. ఎన్ని ప్రాజెక్టులు, నీటిపారుదల వసతులు కల్పించినప్పటికీ ఇంకా భారీ పరిమాణంలో వర్షాధార భూములు ఉన్నాయి.

* వివిధ రకాల శీతోష్ణస్థితులు, నైసర్గిక స్వరూపాలు ఉండటంతో దేశంలో వివిధ పంటలు పండించేందుకు వీలవుతోంది.

* వ్యవసాయంలో ఆహార పంటలకే మొదటి ప్రాధాన్యం. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆహార పంటల ఉత్పత్తి ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ స్వాతంత్య్రం వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆహార పంటల సాగు భూమి తగ్గిపోయింది.

* పశుసంపదలోనూ మన దేశానికి ప్రత్యేకత ఉంది. కానీ పశుగ్రాసాన్నిచ్చే పంటలు పండించడంలో మన దేశం కొంత వెనుకబడి ఉంది. దీనివల్ల పశువులకు పోషక విలువలున్న మేత కొరత ఎక్కువైంది.

 

డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 30-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌