• facebook
  • whatsapp
  • telegram

శైవలాలు - సాధారణ లక్షణాలు

జాతులు

శైవలాలు (ఆల్గే) ఒకే వర్గీకరణ సమూహం కావు. ఇవి విభిన్న స్వరూప, పర్యావరణ, శారీరక లక్షణాలను ప్రదర్శిస్తాయి. వీటిలో అనేక రకాల జాతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:


గ్రీన్‌ ఆల్గే (క్లోరోఫైటా) 


ఈ సమూహం క్లోరోఫిల్‌ ఎ, బి కలిగి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవి ఏకకణ, కలోనియల్‌ లేదా బహుళ సెల్యులార్‌ కావొచ్చు. 


ఉదా: క్లామిడోమోనాస్‌ (ఏకకణ), వోల్వోక్స్‌ (కలోనియల్‌), ఉల్వా (బహుకణ) మొదలైనవి.


బ్రౌన్‌ ఆల్గే (ఫెయోఫైటా)


బ్రౌన్‌ ఆల్గే ఎక్కువగా సముద్రాల్లో నివసిస్తాయి. ఇవి ఫ్యూకోక్సాంథిన్‌ అనే వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా అవి గోధుమ లేదా ఆలివ్‌ ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. 


* హోల్డ్‌ఫాస్ట్‌లు, స్ట్రైప్స్, బ్లేడ్‌ల లాంటి నిర్మాణాలతో అవి పెద్దగా, సంక్లిష్టంగా ఉంటాయి. 


ఉదా: కెల్ప్, సర్గస్సమ్‌.


రెడ్‌ ఆల్గే (రోడోఫైటా)


ఎరుపు శైవలాలు సాధారణంగా సముద్ర పరిసరాల్లో కనిపిస్తాయి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటికి ఫైకోఎరిథ్రిన్స్‌ అనే ప్రత్యేక పిగ్మెంట్లు ఉంటాయి. 

ఉదా: పగడపు దిబ్బల్లో తరచుగా కనిపించే పగడపు ఆల్గే, నోరీ (సుషీలో ఉపయోగించేది).


డయాటమ్స్‌ (బాసిల్లరియోఫైటా)


ఇవి సంక్లిష్టమైన సిలికా షెల్స్‌కు ప్రసిద్ధి చెందిన ఒక రకమైన ఆల్గే. వీటిని ప్రపంచ ఆక్సిజన్‌ ఉత్పత్తికి ప్రధాన సహకారులుగా పేర్కొంటారు. ఇవి జల ఆహార గొలుసులో కీలకపాత్ర పోషిస్తాయి.


ఉదా: నావికులా, సైక్లోటెల్లా.


డైనోఫ్లాజెల్లేట్స్‌ (డైనోఫైటా)


ఇవి ఫ్లాజెల్లాతో కూడిన ఏకకణ ఆల్గే. ఇవి నీటిలో కదలడానికి ఫ్లాజెల్లా వీలు కల్పిస్తుంది. వీటి జనాభా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల హానికరమైన ఆల్గల్‌ బ్లూమ్‌లు ఏర్పడతాయి. 


ఉదా: కరేనియా, అలెగ్జాండ్రియం.


యూగ్లినాయిడ్స్‌ (యూగ్లినోఫైటా)


యూగ్లినాయిడ్స్‌ అనేవి ఏకకణ ఆల్గే. ఇవి ఐస్‌పాట్‌ అని పిలిచే ఒక ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇది కాంతిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఎక్కువగా మంచినీటి, సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తాయి. 


ఉదా: యూగ్లీనా.


గోల్డెన్‌ ఆల్గే (క్రిసోఫైటా)


గోల్డెన్‌ ఆల్గే ప్రధానంగా మంచినీటి బావుల వద్ద ఉంటాయి. వీటిలో కెరోటినాయిడ్స్‌ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ కారణంగా అవి బంగారు లేదా పసుపు-గోధుమ రంగులో కనిపిస్తాయి. వీటిలో ఏకకణ, బహుకణ జీవులు ఉంటాయి.


ఉదా: డైనోబ్రియాన్, సైన్యూరా.


లక్షణాలు


ఆల్గే లేదా శైవలాలు కిరణజన్య సంయోగక్రియ జీవులు. ఇవి మైక్రోస్కోపిక్‌ సింగిల్‌సెల్డ్‌ (ఏకకణ) రూపాల నుంచి పెద్ద బహుళ కణ సముద్ర పాచి వరకు ఉంటాయి. మంచినీరు, సముద్ర ఆవాసాలతో సహా వివిధ జల వాతావరణాల్లో ఉంటాయి. ఇవి జలచరాలకు ప్రాథమిక ఉత్పత్తిదారులుగా ఉంటాయి.


నివాసం 

ఆల్గేలు చెరువులు, సరస్సులు, నదులు లాంటి మంచినీటి వనరుల్లో; మహాసముద్రాలు, పగడపు దిబ్బల లాంటి సముద్ర పర్యావరణ వ్యవస్థల్లో నివసిస్తాయి. తేమ ఉన్న రాళ్లు, నేల, చెట్ల బెరడు లాంటి భూ సంబంధ ఆవాసాల్లోనూ వీటిని చూడొచ్చు.


ఆకృతి 

ఆల్గేలు విభిన్న రకాల నిర్మాణాలను ప్రదర్శిస్తాయి. ఇవి ఏకకణ లేదా బహుకణ జీవులు. కాలనీలను ఏర్పరుస్తాయి. 

* వీటి నిర్మాణాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కొన్ని ఆల్గేలు సరళంగా ఉండే తంతు నిర్మాణాలను కలిగి ఉంటే, మరికొన్ని థాలీ (ఆకు లాంటి నిర్మాణాలు) లేదా మొక్కలను పోలి ఉండే ఆకారాల్లో ఉంటాయి.


పునరుత్పత్తి 


లైంగిక, అలైంగిక చర్యల ద్వారా ఆల్గేలు పునరుత్పత్తి జరుపుతాయి.


అలైంగిక పునరుత్పత్తి: ఇది ఏకకణ రూపాల్లో కణ విభజన (బైనరీ ఫిషన్‌) లేదా బహుళ సెల్యులార్‌ రూపాల్లో ఫ్రాగ్మెంటేషన్‌ను కలిగి ఉంటుంది.


లైంగిక పునరుత్పత్తి: ఆల్గేలు పునరుత్పత్తి నిర్మాణాల విస్తృత శ్రేణిని కలిగి ఉంటాయి. వీటిలో గామెట్స్‌ అని పిలిచే ప్రత్యేక కణాలు ఉంటాయి. సంయోగ బీజాలు లేదా గామెట్‌ల కలయిక వల్ల జైగోట్‌లు ఏర్పడతాయి. ఇవి కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి.


జీవిత చక్రాలు 


ఆల్గేలు హాప్లాంటిక్, డిప్లోహాప్లాంటిక్, డిప్లాంటిక్‌తో సహా విభిన్న జీవితచక్రాలను ప్రదర్శిస్తాయి. ఈ వైవిధ్యాలు తరాల ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉంటాయి. 


* ఇక్కడ జీవి బహుళ సెల్యులార్‌ హాప్లాయిడ్‌ (గామెటోఫైట్‌), బహుళ సెల్యులార్‌ డిప్లాయిడ్‌ (స్పోరోఫైట్‌) దశల మధ్య ప్రత్యామ్నాయంగా ఉంటుంది.


ఆర్థిక ప్రాముఖ్యత 


ఆల్గేలకు గణనీయమైన ఆర్థిక విలువ ఉంటుంది.


ఆహారం: కొన్ని ఆల్గేలు తినదగినవి. ఆసియా వంటకాల్లో సముద్ర పాచిని ఆహారంగా తీసుకుంటారు.


బయోటెక్నాలజీ: జీవ ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, అధిక విలువైన రసాయనాలను ఉత్పత్తి చేయడానికి బయోటెక్నాలజీలో ఆల్గేను ఉపయోగిస్తారు.


పర్యావరణ సూచికలు: కొన్ని ఆల్గే జాతుల ఉనికి కనిపించడం లేదా కనిపించకపోవడాన్ని నీటి నాణ్యత, పర్యావరణ ఆరోగ్యానికి సూచికలుగా పేర్కొంటారు.


ఆక్వాకల్చర్‌: కొన్ని రకాల ఆల్గేలను ఆక్వాకల్చర్‌లో జలచరాలకు మేతగా ఉపయోగిస్తారు. ఇవి వాటికి పోషకాలుగా ఉపయోగపడతాయి.


ఆల్జినేట్‌ ఉత్పత్తి: ఆల్జినేట్‌కి మూలం బ్రౌన్‌ ఆల్గే. ఇది ఒక పాలీశాకరైడ్‌. దీన్ని ఆహారం, ఔషధాలు, వివిధ పారిశ్రామిక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు.


మాదిరి ప్రశ్నలు


1. ఆల్గేకి సంబంధించి కిందివాటిలో సరైంది?

1) అన్నీ ఏకకణ జీవులు             2) అన్నీ మొక్కలు

3) కిరణజన్యసంయోగ క్రియ జీవులు         4) శిలీంధ్రాలు



2. ఆల్గేలను ఏ రాజ్యానికి చెందిన సమూహాలుగా వర్గీకరించారు?

1) ఏనిమేలియా    2) ప్లాంటే        3) శిలీంధ్రాలు      4) ప్రొటిస్టా



3. చాలా ఆల్గేల్లో కిరణజన్యసంయోగ క్రియకు కారణమయ్యే ప్రాథమిక వర్ణద్రవ్యం ఏది?

1) క్లోరోఫిల్‌ - ఎ     2) క్లోరోఫిల్‌ - బి     3) కెరోటిన్‌     4) జాంతోఫిల్‌


 

4. కింది దేని ద్వారా ఆల్గే అలైంగిక పునరుత్పత్తి జరుపుకుంటుంది?

1) బైనరీ విచ్ఛిత్తి            2) చిగురించడం    

3) ఫ్రాగ్మెంటేషన్‌            4) పైవన్నీ


 

5. కిందివాటిలో ఆల్గే ఉండే నివాస స్థలం కానిది?

1) మంచినీరు             2) ఎడారి ఇసుక దిబ్బలు 

3) సముద్ర పరిసరాలు          4) తేమతో కూడిన నేల



6. ఏ రకమైన ఆల్గేను సాధారణంగా ‘కొలను తెట్టు’ అని పిలుస్తారు? (ఇవి తరచుగా నిశ్చల నీటి ఉపరితలంపై ఆకుపచ్చ పొరను ఏర్పరుస్తాయి.)

1) డయాటమ్స్‌         2) యూగ్లినాయిడ్స్‌ 

3) సైనో బ్యాక్టీరియా     4) గ్రీన్‌ ఆల్గే


 

7. అనేక ఆకుపచ్చ ఆల్గేల్లో ప్రాథమిక నిల్వ పాలీశాకరైడ్‌ ఏమిటి?

1) స్టార్చ్‌            2) సెల్యులోజ్‌    

3) కైటిన్‌            4) గ్లైకోజన్‌



8. ఆల్గే ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణద్రవ్యం?

1) క్లోరోఫిల్‌ - ఎ     2) క్లోరోఫిల్‌ - బి 

3) ఫైకోఎరిథ్రిన్‌         4) ఫైకోసైనిన్‌


 

9. కింది ఏ ఆల్గే వర్గం కాంతిని ఉత్పత్తి చేసే ‘బయోల్యూమినిసెన్స్‌’ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది?

1) బ్రౌన్‌ ఆల్గే         2) రెడ్‌ ఆల్గే 

3) డైనోఫ్లాజెల్లేట్స్‌         4) డయాటమ్స్‌



10. జల జీవావరణ వ్యవస్థల్లో ఆల్గే పాత్ర...

1) ఆక్సిజన్‌ ఉత్పత్తిని తగ్గించడం

2) కాలుష్య స్థాయులను పెంచడం

3) ప్రాథమిక ఉత్పత్తిదారులుగా వ్యవహరించడం

4) చేపల అధిక జనాభాను ప్రోత్సహించడం


సమాధానాలు

1-3    2-4    3-1    4-4    5-2    6-4    7-1    8-3    9-3    10-3


 

Posted Date : 19-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌