• facebook
  • whatsapp
  • telegram

యాంజియోస్పెర్మ్‌లు - సాధారణ లక్షణాలు

పుష్పించే మొక్కల్లో ఆవృత బీజాలు అనే పేరున్న యాంజియోస్పెర్మ్‌లు భూమిపై అత్యంత వైవిధ్యమైన మొక్కల సమూహం.


ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలిసిన 300000 జాతులు వీటిలో ఉన్నాయి. అవి చిన్న డక్‌వీడ్‌ నుంచి ఎత్తయిన రెడ్‌వుడ్‌ చెట్ల వరకు అన్ని ఆకారాలు, పరిమాణాల్లో ఉంటాయి. కొన్ని యాంజియోస్పెర్మ్‌లు అందమైన పువ్వులకు ప్రసిద్ధి చెందాయి, మరికొన్ని తినదగిన పండ్లు, కూరగాయల జాతికి చెందినవి.


జీవిత చక్రంలో ప్రధాన దశ అయిన స్పోరోఫైట్‌ లేదా సిద్ధ బీజదం వేర్లు, కాండం, పత్రాలుగా విభజితమైంది.


వాస్క్యులర్‌ సిస్టమ్‌ నాళిక కణజాల వ్యవస్థ దారువు నిజమైన నాళాలు, ఫ్లోయమ్‌లోని సహచర కణాలతో అభివృద్ధి చెంది మొక్కలన్నింటిలో అత్యున్నత స్థాయి పరిపూర్ణతను ప్రదర్శిస్తుంది.


పుష్పం అనే నిర్మాణంలో ఉన్న మైక్రోస్పోరోఫిల్స్‌ (కేసరాలు), మెగాస్పోరోఫిల్స్‌ (కార్పెల్స్‌) పరిపూర్ణ సంవిధానం యాంజియోస్పెర్మ్‌ల్లో విలక్షణమైందిగా నిలిచింది.


మైక్రోస్పోరోఫిల్‌ (కేసరం)కి నాలుగు మైక్రోస్పోరాంజియా (పుప్పొడి సంచులు) ఉండటం ఒక ప్రధాన లక్షణం.


అండాలు ఎల్లపుడూ మెగాస్పోరోఫిల్‌ మూల ప్రాంతమైన అండాశయంలో మూసుకుపోతాయి.


మైక్రోస్పోర్స్‌ (పుప్పొడి రేణువులు), మెగాస్పోర్‌లు అనే రెండు రకాల బీజాంశాల ఉత్పత్తి జరుగుతుంది. అందువల్ల యాంజియోస్పెర్మ్‌లు హెటిరోస్పోరస్‌ మొక్కలుగా ఉంటాయి.


అండాల్లో న్యూసెల్లస్‌ అనే అండాంతః కణజాలం ఉంటుంది.


పరాగ సంపర్కం కోసం గాలి, కీటకాలు, పక్షులు ఇతర జంతువులతో సహా వివిధ యంత్రాంగాలను ఉపయోగించుకుంటాయి.


పరాగ సంపర్కంలో పుప్పొడి రేణువులు కేసరాల నుంచి స్టిగ్మా లేదా కీలాగ్రానికి బదిలీ అవుతాయి.


పూర్తిగా పరాన్నజీవిగా ఉన్న గామిటోఫైట్‌ లేదా సంయోగ బీజద నిర్మాణ పరిమాణం, ఉనికి, జీవ కాలవ్యవధిని, సంక్లిష్టతలో విపరీతమైన క్షీణత ఆవృత బీజాలను గమనించవచ్చు. 


పురుష సంయోగ బీజదం పరిణితి చెందిన పుప్పొడి రేణువులకు లేదా మొలకెత్తిన పుప్పొడికి మాత్రమే పరిమితమవుతుంది. ప్రతి పరాగ రేణువులో శాఖీయ, ఉత్పాదక కణాలు ఉంటాయి. ఉత్పాదక కణాల నుంచి పురుష సంయోగ బీజాలు ఏర్పడతాయి.


పిండకోశం లేదా ఎంబ్రియోశాక్‌ను సాధారణంగా స్త్రీ సంయోగ బీజదంగా పేర్కొంటారు. ఇది ఎనిమిది కేంద్రకాలు, ఏడు కణాలు కలిగిన భాగం.

ఫలం అని పిలిచే ఫలదీకరణం చెందిన అండాశయంలో విత్తనం లేదా విత్తనాలు ఉంటాయి. ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలుగా, అండాశయాలు ఫలంగానూ మార్పు చెందుతాయి.


డబుల్‌ ఫెర్టిలైజేషన్‌ లేదా ద్విఫలదీకరణం, త్రిసంయోగం లేదా ట్రిపుల్‌ ఫ్యూజన్‌ లాంటి దృగ్విషయం యాంజియోస్పెర్మ్‌ల ముఖ్య లక్షణం.


ఫలదీకరణం తర్వాత ఎండోస్పెర్మ్‌ అభివృద్ధి చెందుతుంది. ఇది ట్రిప్లాయిడ్‌ లేదా త్రయస్థితిక దశలో ఉంటుంది.


కొన్ని యాంజియోస్పెర్మ్‌లు ద్వితీయ వృద్ధిని ప్రదర్శిస్తాయి. ఇది చెట్ల కలప కణజాల అభివృద్ధికి దారితీస్తుంది.


ఆవృత బీజాలు మానవులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఆహారం, ఔషధాలు, ఇంధనం ఇతర ఉత్పత్తుల కోసం మానవులు ఆవృత బీజాలను ఉపయోగిస్తారు.


ఆవృత బీజ ప్రధాన విభాగాలు

 

ఏకదళ బీజాలు (Monocots): ఈ మొక్కలు ఒకే బీజదళం కలిగిన మొక్కలు. సమాంతర ఈనెలు, గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.

ఉదా: గోధుమ, అరటి, వరి, టేకు, బంగాళాదుంప.


ద్విదళ బీజాలు (Dicots): ఈ మొక్కలు రెండు బీజదళాలను కలిగి ఉంటాయి. వీటికి జాలాకార ఈనెలు, తల్లి వేరు వ్యవస్థ ఉంటాయి. ఉదా: పసుపు, మొక్కజొన్న, ఆపిల్, గులాబీ, శనగ.


పలు ఆసక్తికరమైన యాంజియోస్పెర్మ్‌లు


రఫ్లీసియా ఆర్నాల్డి: ఈ పరాన్నజీవి మొక్క సుమత్రా, బోర్నియోలోని వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం పూసే మొక్కగా పేరుగాంచింది. ఇది 3 అడుగుల వెడల్పు వరకు పెరుగుతుంది. 15 పౌండ్ల బరువు ఉంటుంది. పరాగసంపర్క ఈగలను ఆకర్షించడానికి ఈ పువ్వు కుళ్లిన మాంసం వాసనను వెదజల్లుతుంది.


టైటాన్‌ ఆరమ్‌: ఈ మొక్క సుమత్రాకు చెందింది. దీని భారీ పుష్ప విన్యాసం (పువ్వుల సమూహం) ప్రసిద్ధి చెందింది. ఇది 12 అడుగుల పొడవు, 154 పౌండ్ల బరువు ఉంటుంది. పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి పుష్పగుచ్ఛం ఒక ప్రత్యేక వాసనను వెలువరిస్తుంది.


వీనస్‌ ఫ్లైట్రాప్‌: ఈ మాంసాహార మొక్క ఆగ్నేయ యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందింది. ఇది కీటకాలను బంధించి జీర్ణం చేసే రూపాంతరం చెందిన పత్రాలను కలిగి ఉంటుంది.


సన్‌డ్యూ మొక్కలు: ఈ మాంసాహార మొక్క ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది కీటకాలను బంధించి జీర్ణం చేసే జిగట ఆకులను కలిగి ఉంటుంది. సన్‌డ్యూ కీటకాలను ఆకర్షించడానికి తీపి తేనెను ఉత్పత్తి చేస్తుంది.


ఆర్కిడ్లు: ఇవి 20000 కంటే ఎక్కువ జాతులతో కూడి, పుష్పించే మొక్కల విభిన్న కుటుంబాల్లో ఒకటిగా ఉన్నాయి. ఆర్కిడ్లు వాటి అందమైన, అసాధారణమైన పుష్పాలకు ప్రసిద్ధి చెందాయి. కొన్ని ఆర్కిడ్లు తినడానికి అనుకూలమైనవి.


వనిల్లా ప్లానిఫోలియా: వనిల్లా బీన్స్‌ను ఉత్పత్తి చేసే ఆర్కిడ్‌. దీన్ని ఆహారం, పానీయాల్లో ఉపయోగిస్తారు.


కాఫీ అరబికా: కాఫీ గింజలను ఉత్పత్తి చేసే కాఫీ ప్లాంట్‌. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో కాఫీ ఒకటి.


కోకో థియోబ్రోమా: కోకో బీన్స్‌ను ఉత్పత్తి చేసే చాక్లెట్‌ చెట్టు. చాక్లెట్‌ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.


* అతిపెద్ద పత్రాలు ఉన్న యాంజియోస్పెర్మ్‌గా విక్టోరియా అమెజోనికాను పరిగణిస్తారు. దీని పత్రాలు 3 మీటర్ల (10 అడుగులు) వ్యాసం కలిగి ఉంటాయి.


ఉల్ఫియాకు చెందిన వివిధ జాతులను అతి చిన్న యాంజియోస్పెర్మ్‌లుగా పేర్కొంటారు. వీటిని సాధారణంగా వాటర్‌మీల్‌ లేదా డక్‌వీడ్‌ అని పిలుస్తారు. ఈ చిన్న మొక్కలు కొన్ని ఒక మిల్లీమీటర్‌ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి భూమిపై అతి చిన్న పుష్పాలనిచ్చే మొక్కల్లో ఒకటిగా పేరొందాయి. 


మౌంటెయిన్‌ యాష్‌ (యూకలిప్టస్‌ రెగ్నన్స్‌) అనేది ఎత్తయిన యాంజియోస్పెర్మ్‌ చెట్టు. ఇది ఆగ్నేయ ఆస్ట్రేలియాకు చెందింది. ఈ చెట్లలో కొన్ని 330 అడుగుల (100 మీటర్లు) కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటాయి.


మాదిరి ప్రశ్నలు


1. కింది వాటిలో యాంజియోస్పెర్మ్‌లను నిర్వచించే లక్షణం?

1) విత్తనాలను ఉత్పత్తి చేయడం

2) కోన్‌లను ఉత్పత్తి చేయడం

3) పుష్పాలను ఉత్పత్తి చేయడం

4) బీజాంశాలను ఉత్పత్తి చేయడం



2. పుష్పంలోని ఏ భాగంలో స్త్రీ పునరుత్పత్తి నిర్మాణాలు ఉంటాయి?

1) రేకులు   2) సీపల్స్‌   3) కేసరాలు   4) పిస్టిల్‌


3. మోనోకాట్‌లు సాధారణంగా ఏ రకమైన ఆకులను కలిగి ఉంటాయి?

1) సమాంతర ఈనెల వ్యాపనం

2) నెట్‌ లాంటి ఈనెల వ్యాపనం    

3) సాధారణ ఆకులు       

4) వ్యతిరేక ఆకులు



4. కింది వాటిలో పువ్వులోని ఆకర్షణ పత్రాల ప్రాథమిక విధి?

1) అండాశయ రక్షణ 

2) పరాగ సంపర్క జీవాలను ఆకర్షించడం

3) కిరణజన్య సంయోగక్రియ 

4) పుష్పానికి రక్షణ కల్పించడం


 

5. ద్విఫలదీకరణంలో ఒక స్పెర్మ్‌ సెల్‌ గుడ్డు కణాన్ని ఫలదీకరణం చేస్తే, మరొకటి దేనితో ఫలదీకరణం జరుపుతుంది?

1) కేసరం         2) ద్వితీయ కేంద్రకం 

3) ఎండోస్పెర్మ్‌         4) సీపల్స్‌



6. కింది వాటిలో సాధారణ పుష్పంలో భాగం కానిదేది?

1) స్టిగ్మా   2) స్టైల్‌   3) స్పోరోఫైట్‌    4) ఆంథర్‌



7. మొక్కలోని ఏ భాగం చివరికి పండుగా మారుతుంది?

1) అండాశయం    2) కీలాగ్రం

3) పుట్టగొడుగు     4) ఫిలమెంట్‌

 


8. పుష్పం పురుష పునరుత్పత్తి అవయవాన్ని ఏమంటారు? 

1) పిస్టిల్‌    2) కేసరం    3) సీపాల్‌    4) రేకులు



9. చాక్లెట్‌ ఉత్పత్తిలో ఉపయోగించే యాంజియోస్పెర్మ్‌ ఏది?

1) వెనిలా ప్లానిపోలియా   2) దాల్చిన చెక్క

3) కాఫీ అరబికా     4) థియోబ్రోమా కోకో


సమాధానాలు

1-3    2-4    3-1    4-2    5-2    6-3    7-1    8-2    9-4 

 

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌