• facebook
  • whatsapp
  • telegram

కృత్రిమ మేధ 

మన రోజువారీ జీవనంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లో వాడే ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఆప్షన్, అసిస్టెంట్‌ మెనూ, చాట్‌బోట్స్‌ మొదలైనవన్నీ దీని ఆధారంగానే పనిచేస్తాయి. హైవేలపై ప్రయాణించే వాహనాల వేగాలను సూచించే డిస్‌ప్లే బోర్డులు, గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్, ఈ-పేమెంట్‌ అప్లికేషన్లలో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. 

నిర్వచనం: మనిషి ఏదైనా పనిచేసే ముందు దాని గురించి ఆలోచించి, విషయాలను గ్రహించి, సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తాడు. అదే పనిని యంత్రాల సాయంతో అత్యంత నేర్పుగా లేదా సమర్థవంతంగా చేయడాన్ని కృత్రిమ మేధగా పేర్కొంటారు. ఇది ఆవిర్భావం నుంచే అనేక రకాల నూతన సాంకేతికతలను అనుసరిస్తూ నేటి కృత్రిమ మేధగా పరిణామం చెందింది.

* యంత్ర పరికరాలు లేదా మెషిన్‌లు ప్రదర్శించే మేధా

శక్తిని కృత్రిమ మేధగా చెప్పొచ్చు. ఇది కంప్యూటర్‌ సైన్స్‌ అధునాతన విభాగం. దీని ద్వారా మనిషి మేధో సంపత్తి కలిగిన నూతన యంత్రాలు లేదా కంప్యూటర్లను రూపొందించవచ్చు.

* సమాచార సేకరణ, వాటి ప్రక్రియల అనుసంధానం, గణన శక్తి, మేధోపరమైన నిర్వహణ మొదలైన వాటిని నూతన సాంకేతికతకు అనుసంధానించారు. దీంతో పనుల్లో కచ్చితత్వం, వేగం పెరిగాయి. 

* ఉత్పాదకతలోనూ అత్యంత నాణ్యమైన, మెరుగైన ఫలితాల సాధనకు ఏఐ ఎంతో తోడ్పడింది. ప్రస్తుత దశాబ్దంలో ఈ కృత్రిమ మేధ అనేక రంగాలకు విస్తరించి, పురోగతిలో తనదైన పాత్రను పోషిస్తోంది.

* కృత్రిమ మేధ అనే పదాన్ని 1956లో జాన్‌ మెకార్తీ అనే అమెరికన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త మొదటిసారి ప్రస్తావించారు.

* ప్రస్తుతం ఇది వివిధ అనువర్తనాల (Applications) ద్వారా అన్ని రంగాల్లో విస్తృత సేవలను అందిస్తోంది. ఈ దశాబ్దకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సాంకేతికతగా కృత్రిమ మేధను పేర్కొనవచ్చు. యంత్రాల పరస్పర అనుసంధానం, వాటి చర్యల ద్వారా వివిధ రకాల కష్టసాధ్యమైన పనులను సులభంగా సాధించడాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌గా భావించవచ్చు.

* మానవ మేధస్సే కృత్రిమ మేధకు దిశానిర్దేశం చేస్తుంది. ముఖ్యంగా ఇది మెషిన్‌ లెర్నింగ్, ప్యాటర్న్‌ రికగ్నైజేషన్, బిగ్‌డేటా, న్యూరల్‌ నెట్‌వర్క్స్, సెల్ఫ్‌ అల్గారిథమ్స్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది.

* పారిశ్రామిక రంగంలో వివిధ సమస్యలు - సవాళ్ల పరిష్కారానికి, భారీ యంత్ర పరికరాల నిర్వహణకు కృత్రిమ మేధ కీలక వనరుగా మారింది. 

ఉదా: యాపిల్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ‘సిరి’, గూగుల్‌ అసిస్టెంట్, చోదకరహిత కార్లు.

అనువర్తనాలు

వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్లు, మన నిత్యజీవిత కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సేవలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాం.

వ్యక్తిగత సిఫార్సులు (Presonalised recommndations): మనం ఇంటర్నెట్‌లో దేని గురించి అయినా వెతికినప్పుడు, ఆ సెర్చ్‌ చరిత్ర ( Search history) ఆధారంగా వివిధ రకాల సిఫార్సులు కనిపించడం.

ఉదా: Online streaming searches, Predictive texts (మనం సెర్చ్‌ ఇంజిన్‌లో ఒక లెటర్‌ టైప్‌ చేస్తే  పదం లేదా పూర్తి వాక్యం రావడం), డిజిటల్‌ పర్సనల్‌ అసిస్టెంట్స్, వాయిస్‌ కమాండ్స్‌ మొదలైనవి. 

మెషిన్‌ ట్రాన్స్‌లేషన్స్‌: భాష ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సేవలను ఉపయోగించి పదాలను రాసినా లేదా మాట్లాడినా అవి మనకు కావాల్సిన భాషలోకి అనువాదం అవుతాయి. దీని ద్వారానే వీడియోల్లో ఆటోమేటెడ్‌ సబ్‌టైటిల్స్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: వివిధ రకాల ఏఐ అనుసంధాన సేవల ద్వారా స్మార్ట్‌హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. వాటిలో శక్తి వనరులను, నీటిని పొదుపుగా వాడేందుకు స్మార్ట్‌ మీటర్లు, స్మార్ట్‌ థర్మోస్టాట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత ప్రమాణాలు కలిగిన జీవనశైలిని అందిస్తున్నారు.   

ఆటోమొబైల్స్‌: ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న అధునాతన నావిగేషన్‌ వ్యవస్థలన్నీ ఏఐ అనుసంధానంతోనే పనిచేస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ (EU)లో వాహన ప్రమాదాలను నివారించడానికి ఆటోమేటెడ్‌ సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. ఇది VI-DAS (Vision Inspired Driver Assistance System) అనే ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఫలితంగా అక్కడ ప్రమాదాలు చాలావరకు తగ్గాయి.

ఆర్థిక రంగం: కృత్రిమ మేధ ద్వారా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ముందుగానే కనుక్కోవచ్చు. ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో జరిగే అక్రమ లావాదేవీలను ‘ఆటోమేషన్‌’ వ్యవస్థ ద్వారా నియంత్రించవచ్చు. షేర్‌ మార్కెట్లు, ట్రేడింగ్‌ వ్యవస్థతో దీన్ని అనుసంధానించడం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చు.

తయారీ/ పారిశ్రామిక రంగం: కృత్రిమ మేధ ప్రవేశంతో పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు వచ్చాయి. మార్కెట్‌లో అత్యధిక డిమాండ్‌ ఉన్న వస్తువులను, వాటి సరఫరాకు కావాల్సిన ముందస్తు ప్రణాళికలను దీని ద్వారా రూపొందించవచ్చు. ఆయా ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను, పంపిణీని నిర్దేశించవచ్చు. 

గవర్నెన్స్‌: కృత్రిమ మేధలోని 'Deep learning' పద్ధతులను సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అందించే నిధులు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు చేరాయో, లేదో  తెలుసుకోవచ్చు.    

చట్టాల అమలు (Law Enforcement): కృత్రిమ మేధను చట్టాల అమలులో ఉపయోగించడం వల్ల నేర నిర్ధారణలో కచ్చితత్వం పెరుగుతుంది. దీనికి ముఖ కవళికల గుర్తింపు (Facial recognition), గొంతు లేదా మాటల గుర్తింపు (Speech recognition) మొదలైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా దోషులను వేగంగా, పారదర్శకంగా గుర్తించవచ్చు.

ప్రకృతి వైపరీత్యాలు - వాటిని ఎదుర్కొనే చర్యలు: ఏఐ అనుసంధానం ద్వారా ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికలు, అనంతరం తీసుకొనే చర్యల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉదా: 2014, అక్టోబరులో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరికల ద్వారా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించారు.

ప్రతికూలతలు...

ఈ భవిష్యత్‌ టెక్నాలజీల ఆవిష్కరణ, ఉపయోగంతో ‘సాంకేతిక నిరుద్యోగం (Technological Unemployment) ఏర్పడుతుంది. యంత్రాలు, కంప్యూటర్లు మానవ మేధ ఆధారంగా పని చేయగలవు కానీ పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు (Adaptive learning) తీసుకోలేవు. ఏఐలో భాగమైన సమాచార నిక్షిప్తత, సేకరణ వల్ల గోప్యత హక్కుకు Right to Privacy భంగం కలుగుతుంది. ఈ సాంకేతికత వినియోగం నైతిక, సాంఘిక సవాళ్లకు కూడా తెరతీస్తుంది.

ఇతర అంశాల్లో ఏఐ ఉపయోగాలు...

సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ భద్రత: అంతర్జాలంలో జరిగే మోసాలను, సైబర్‌ నేరాలను కృత్రిమ మేధ సాయంతో సమర్థంగా ఎదుర్కోవచ్చు.

కొవిడ్‌ సమయంలో ఏఐ పనితీరు: కొవిడ్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ఏఐ సాంకేతికత ఎంతో  ఉపయోగపడింది. థర్మల్‌ ఇమేజింగ్‌ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్ఫ్రారెడ్‌ థర్మామీటర్‌ సాయంతో మనుషుల శరీర ఉష్ణోగ్రతలను భౌతిక దూరం పాటిస్తూ అంచనా వేయగలిగారు. వీటిని కార్యాలయాలు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన ప్రాంతాల్లో ఉపయోగించి వ్యాప్తిని నిరోధించారు. 

* ఏఐ ఆధారిత ఊపిరితిత్తుల స్కానింగ్‌ ద్వారా కొవిడ్‌ వ్యాధి తీవ్రతను అంచనా వేసి చాలామంది రోగుల ప్రాణాలను రక్షించారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్‌ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తోడ్పడింది.

సామాజిక మాధ్యమాలు - నకిలీ వార్తలు: సోషల్‌ మీడియా వేదికల్లో  నిత్యం అనేక అంశాలు కనిపిస్తుంటాయి. వాటిలో సత్యాసత్యాలను గుర్తించడం కష్టం. కృత్రిమ మేధ సాయంతో నకిలీ వార్తలను, అసత్య ప్రచారాలను నిర్ధారించి వాస్తవాలను పౌరులకు అందుబాటులో ఉంచే వీలుంది. 

వ్యవసాయ రంగం: ఏఐ ఆధారిత అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయంలో మెరుగైన ఫలితాలను సాధించొచ్చు. నీటి నిర్వహణ, మిశ్రమ వ్యవసాయం, పంట మార్పిడి, డ్రోన్ల ఆధారిత పురుగు మందుల పిచికారీ మొదలైన వాటిని ఉపయోగించి అధిక దిగుబడులు పొందొచ్చు. 

* ఏఐ, రోబోటిక్స్‌ అనువర్తనాల ద్వారా పంటపొలాల్లో ఒకే సమయంలో అనేక పనులను నిర్వహించవచ్చు.  

ఆరోగ్య రంగం: కృత్రిమ మేధ సాయంతో ప్రజల నుంచి గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా ప్రజారోగ్య వివరాలను నమోదు చేస్తున్నారు. వాటిని విశ్లేషించి ఆరోగ్య రంగంలో నూతన సాంకేతికతను ఆవిష్కరిస్తున్నారు.

ఉదా: ఏఐ సాంకేతికత సాయంతో Brain Computer Interface (BC)ని విశ్లేషించి నరాల సంబంధిత వ్యాధులను అంచనా వేస్తున్నారు.   

రవాణా రంగం: ఏఐ ఆధారిత రక్షణ, వేగ సామర్థ్యం ఉన్న రైలు ట్రాఫిక్‌ వ్యవస్థను రూపొందిస్తున్నారు. రోడ్లపై వాహనాల చక్రాల ఘర్షణను తగ్గించే ఏఐ ఆధారిత మెషీన్‌ టెక్నాలజీని, సురక్షితంగా, వేగంగా నడిచే వాహనాలను రూపొందిస్తున్నారు. టెస్లా సంస్థ తయారు చేసిన చోదక రహిత కార్లు ఏఐ ఆధారంగా తయారైనవే

* కృత్రిమ మేధ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకు మార్గాన్ని సుగమం చేసింది.                     

 భారతదేశం - కృత్రిమ మేధ

కెనడా ఆధారిత గ్లోబల్‌ ఏఐ నివేదిక - 2019 ప్రకారం, ప్రపంచ దేశాల్లో కృత్రిమ మేధ సాంకేతికతలో భారత్‌  9వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, బ్రిటన్‌ దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ నిర్వహించిన సర్వేల ప్రకారం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 1 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని అంచనా. ఏఐ 2035 నాటికి భారత ఆర్థిక వృద్ధిరేటును వార్షికంగా 1.3 %  పెంచుతుందని భావిస్తున్నారు. 

నీతి ఆయోగ్‌ విధానం

కృత్రిమ మేధ అభివృద్ధికి భారత ప్రభుత్వం 2018, జూన్‌లో "National Strategy for Artificial Intelligence - # AI for all" ని రూపొందించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను నీతిఆయోగ్‌ విడుదల చేసింది. వీటి ప్రకారం దేశంలోని అయిదు రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని నిర్దేశించారు. అవి:

1. ఆరోగ్యం   2. వ్యవసాయం 3. విద్య

4. పట్టణాలకు అవసరమైన స్మార్ట్‌ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

5. రవాణా 

ఏఐ ప్రణాళిక ప్రకారం దేశంలో కృత్రిమ మేధ అభివృద్ధికి COREs (Creation of centres of research excellence in AI) రూపొందించి, వీటి ద్వారా అకడమిక్‌ రిసెర్చ్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 

* పారిశ్రామిక రంగంలో ఏఐను ఉపయోగించి ఇండస్ట్రీ 4.0 దిశగా అడుగులు వేయడం, వేగవంతమైన సమ్మిళిత  వృద్ధిని సాధించి దేశాన్ని అభివృద్ధి మార్గంలో వెళ్లేలా చేయడం # AI for all ముఖ్య ఉద్దేశం.

* 2019 మార్చి 20న నీతి ఆయోగ్‌ "AIRAWAT" (Artficial Intelligence Research Analytics and Knowledge Assimilation Platform) అనే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. 

* సీబీఎస్‌ఈ, ఎడ్యుకేషన్‌ కరికులమ్‌లో 9వ తరగతి నుంచి AI ను ఒక ఎలెక్టివ్‌ (Elective) సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది. 

* దేశంలో ప్రథమంగా ఐఐటీ హైదరాబాద్‌ AI ను (B.Tech) ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు AI లో డిప్లొమాలు, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించి, AI కి కావాల్సిన నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయి.   

Posted Date : 10-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌