• facebook
  • whatsapp
  • telegram

లింగ ప్రాతిపదికన వెలి

అర్ధభాగం.. అయినా అసమానం!

  జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు శతాబ్దాలుగా తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. పితృస్వామిక సమాజంలో లింగ వివక్ష సహజ పరిణామంగా మారిపోయింది. మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం, సాధికారత ఎండమావులుగా మిగిలిపోయాయి. ఈ జాడ్యాలను రూపుమాపడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, చర్యలు చేపట్టినా ఆశించినంత ఫలితం అందడం లేదు. ఈ నేపథ్యంలో ‘సామాజిక మినహాయింపు-హక్కులు’ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షల అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.  

 

  భారతీయ సమాజంలో వివిధ రూపాల్లో వెలి, బహిష్కరణ కనిపిస్తుంది. మన సమాజం పితృస్వామ్యాన్ని అనుసరిస్తోంది. సంప్రదాయ గ్రామీణ సమాజాల్లో పితృస్వామిక విస్తృత కుటుంబాలు ఎక్కువగా కనిపించేవి. ఇందులో పురుషులకు ఎక్కువ హక్కులు, అవకాశాలు దక్కాయి. దీని నుంచే లింగ అసమానత్వం పుట్టుకొచ్చింది.

 

వర్గీకరణ: లింగాన్ని ఆంగ్లంలో ‘జెండర్‌’ అని పిలుస్తారు. లింగ వర్గీకరణ ప్రకారం 1) స్త్రీలు 2) పురుషులు 3) విషమ లింగీయులు/మధ్య లింగీయులు ఉన్నారు.

  మధ్య లింగీయులను సమాజం విస్మరించింది. వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించలేదు. వారు సమాజంలో వెలికి, బహిష్కరణకు గురయ్యారు. అదేవిధంగా స్త్రీలు సమానత్వం లేకుండా హక్కులు కోల్పోయారు. సమాజంలో పురుషులకు ఇచ్చిన ప్రాధాన్యం స్త్రీలకు, మధ్య లింగీయులకు ఇవ్వలేదు. విషమ లింగీయులకు రక్షణ కల్పించడం, వారి హక్కులను కాపాడటం కోసం 2019లో లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల సంరక్షణ) చట్టం వచ్చింది. మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం అనేక చట్టాలు, విధానాలు రూపొందాయి.

 

అసమానతలు - మహిళలు

భారతీయ సమాజంలో లింగ అసమానత్వం ఒక ప్రధాన సమస్య. మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా సమాన అవకాశాలు, హక్కులు కల్పించకపోవడమే లింగ అసమానత్వం.

 

అసమానతకు గురయ్యే అంశాలు:  * బ్రూణ హత్యలు * ఆస్తి హక్కును నిరాకరించడం * గృహహింస * ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం * సమాన వేతనాలను నిరాకరించడం * పురుషాధిక్యత - పితృస్వామ్యం * వరకట్నం * అక్రమ రవాణా * సతీసహగమనం * పునర్వివాహంపై ఆంక్షలు * పని ప్రదేశాల్లో వేధింపులు * తగినంత రాజకీయ

 

ప్రాతినిధ్యం లేకపోవడం

 

బ్రూణ హత్యలు: మలివేద కాలం నుంచి స్త్రీల పట్ల వివక్ష ప్రారంభమైంది. పురుష సంతానానికి ఇచ్చిన ప్రాధాన్యం స్త్రీ సంతానానికి ఇవ్వలేదు. సాంకేతికత పెరగడంతో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడ పిల్లలను పిండ దశలోనే నిర్మూలిస్తున్నారు. స్త్రీ బీజాలు, పిండాలను చంపేయడం లేదా నాశనం చేయడాన్ని ‘ఫెమిసైడ్‌’ అంటారు. గర్భంలో పెరుగుతున్న పిండంపై లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని నిషేధిస్తూ 1994లో గర్భస్త పూర్వ, పిండ పూర్వ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం తీసుకొచ్చారు. 1980 - 2020 మధ్యకాలంలో సుమారు కోటికి పైగా గర్భస్రావాలు జరిగాయి.

 

ఆస్తి హక్కును నిరాకరించడం: ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం దాదాపు 39 దేశాల్లో స్త్రీలకు కుటుంబంలో ఉన్న పురుషులతో సమానంగా వారసత్వ ఆస్తి హక్కు లేదు. 2005లో హిందూ వారసత్వ చట్టం - 1956కి సవరణలు చేసి భారతదేశంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఈ సవరణ ప్రకారం మహిళలకు పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తిలో సోదరులతో సమానంగా వాటా లభిస్తుంది.

 

గృహహింస: నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (విదిళితీ) నివేదికల ప్రకారం మహిళలపై గృహహింస అత్యధికంగా జరుగుతోంది. దీనికి కారణం లింగ అసమానత్వం. భౌతిక హింస, మానసిక హింస, లైంగిక హింస, ఆర్థిక హింస అనే నాలుగు రూపాల్లో గృహహింస ఉంటుంది. మహిళలను ఇలాంటి హింసల నుంచి కాపాడటం కోసం 2005లో గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది.

 

ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం: భారతీయ పితృస్వామిక వ్యవస్థలో మహిళలకు ఆర్థిక సాతంత్య్రం కరవైంది. మహిళలను విద్యకు దూరం చేయడం, బయటకు వెళ్లనీయకపోవడం, అవకాశాలకు దూరం చేయడం లాంటి వాటి వల్ల వారు ఆర్థికంగా స్వావలంబన సాధించలేకపోయారు. బాల్యంలో తండ్రిపై, యవ్వనంలో భర్తపై, వృద్ధాప్యంలో కుమారుడిపైన ఆధారపడుతున్నారు.

 

సమాన వేతనాలు నిరాకరించడం: గ్రామాల్లో నేటికీ స్త్రీ, పురుషులకు వేర్వేరు కూలీలు చెల్లిస్తున్నారు. వేతనాల్లో అసమానతలను రూపుమాపడానికి 1948లో కనీస వేతనాల చట్టం, 1976లో సమాన వేతనాల చట్టం తీసుకువచ్చారు.

 

పురుషాధిక్యత - పితృస్వామ్యం: పితృస్వామ్యం కారణంగా స్త్రీలు సమానత్వం కోల్పోయారు. వారసత్వపు హక్కులకు నోచుకోలేదు. ఉమ్మడి కుటుంబంలో స్త్రీల స్థాయి మరీ కుంచించుకుపోయి, కఠినంగా ఉంటుంది. వనరులు పరిమితంగా ఉన్నప్పుడు పురుషులకు కల్పించే అవకాశాలు స్త్రీలకు అందడం లేదు.

 

వరకట్నం: వరకట్నం కారణంగా సమాజంలో స్త్రీల స్థాయి దిగజారింది. పురుషుడికి స్త్రీ కట్నం చెలించాల్సి రావడం లింగ అసమానత్వానికి దారితీసింది. వరకట్నాన్ని రద్దు చేస్తూ 1961లో వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చారు.

 

అక్రమ రవాణా: వాణిజ్య ప్రయోజనాల కోసం మహిళలు, బాలికలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగుమతి/ దిగుమతి లేదా రవాణా చేయడం కూడా లింగ అసమానత్వానికి దారితీసింది. అక్రమ రవాణాను నిషేధిస్తూ 1956లో స్త్రీల అనైతిక అక్రమ రవాణాను అణిచివేసే చట్టం తీసుకొచ్చారు.

 

సతీసహగమనం: భర్త మరణిస్తే అతడితో పాటు భార్యను చితిలో వేసి చంపేసే ఆచారం మధ్యయుగంలో చాలా ఎక్కువగా ఉండేది. రాజపుత్ర తెగలో ఇది జేహార్‌ రూపంలో అమలయ్యేది. రాజా రామ్‌మోహన్‌రాయ్‌ కృషి వల్ల 1829లో సతీసహగమన నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది.

 

పునర్వివాహంపై ఆంక్షలు: భార్య చనిపోతే భర్త పునర్వివాహం చేసుకోవచ్చు. దీనిపై సమాజంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ భర్త చనిపోయిన స్త్రీకి  పునర్వివాహానికి అవకాశం ఇవ్వలేదు. వీరిపై సమాజం కొన్ని ఆంక్షలు విధించింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ కృషితో 1856లో ‘హిందూ వితంతు పునర్వివాహ చట్టం’ అమల్లోకి వచ్చింది.

 

పని ప్రదేశాల్లో వేధింపులు: సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత మహిళలు కార్యాలయాల్లో ఎక్కువగా పని చేస్తున్నారు. ఇంట్లో కంటే కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. వీటిని అరికట్టడానికి 2013లో ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టే చట్టం’ వచ్చింది.

 

రాజకీయాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం: మహిళా సాధికారతలో భాగంగా 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. అయినప్పటికీ చట్టసభల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో కేవలం 10% స్థానాలే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 14% మాత్రమే.

 

ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక (గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌) - 2021

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ప్రచురించిన లింగ వ్యత్యాస నివేదిక-2021లో భారతదేశానికి 140వ స్థానం లభించింది. దీనిలో మొత్తం 156 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారతదేశం స్కోరు 0.625. స్త్రీ, పురుషుల మధ్య అంతరాన్ని నాలుగు కోణాల్లో పరిశీలించి ఈ నివేదిక తయారుచేస్తారు. 

* ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు

* విద్యాభివృద్ధి

* ఆరోగ్యం, మనుగడ

* రాజకీయ సాధికారత

ఈ ప్రకారం చూస్తే భారతదేశం స్త్రీల విషయంలో అన్ని విభాగాల్లోనూ చాలా వెనుకబడి ఉంది.

 

మాదిరి ప్రశ్నలు

 

1. పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించడం నుంచి కాపాడే చట్టం - 2013కు మరొక పేరు?

1) PASH చట్టం   2) POSH చట్టం            

3) PUSH చట్టం    4) వన్‌ స్టాప్‌ చట్టం

 

2. మనదేశంలోని ఎన్ని రాష్ట్రాలు స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి?

1) 6       2) 7     3) 8      4) 9

 

3. స్త్రీ బీజాలు, పిండాలను చంపివేయడాన్ని ఏమంటారు?

1) సూసైడ్‌     2) హోమిసైడ్‌      3) ఫెమిసైడ్‌     4) జెండర్‌సైడ్‌

 

4. సమాన వేతనాల చట్టం ఎప్పుడు రూపొందించారు? 

1) 1976       2) 1966      3) 1956      4) 1946

 

5. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల సంరక్షణ) చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?

1) 2015      2) 2005      3) 2012       4) 2019

 

6. 2021 గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ నివేదికలో భారత్‌ స్థానం ఎంత?

1) 140     2) 125     3) 126    4) 127

 

7. గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ నివేదికను ఎవరు ప్రచురిస్తారు?

1) యూఎన్‌ఓ     2) డబ్ల్యూఈఎఫ్‌     3) సార్క్‌   4) ఏడీబీ

 

8. ఇటీవల కాలంలో ఆడపిల్లల వివాహ వయసు ఎంతకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది?

1) 19     2) 21     3)  24     4) 25

 

సమాధానాలు

1-2, 2-4, 3-3, 4-1, 5-4, 6-1, 7-2, 8-2.

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  కుటుంబ వ్యవస్థ

  మాజ నిర్మితి

‣ విలక్షణ భారతం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌