• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యం - వన్యమృగ సంరక్షణ

ప్రత్యేక చట్టాలతో జీవజాతులు భద్రం!


జీవవైవిధ్య సంరక్షణ అంటే అంతరించిపోయే జంతుజాతులను గుర్తించి వాటిని పునఃస్థాపితం చేసే ప్రణాళికలు రూపొందించడం. అలాగే జీవజాతుల ప్రత్యుత్పత్తి ప్రాంతాలను రక్షించడం, అనుకూల పరిస్థితులు కల్పించడం. వన్యజంతువులు, మృగాల సంరక్షణ; అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతుల జన్యువులను, మూలాలను భద్రపరిచే ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం, దేశవాళీ జాతుల ఆవాసాలను రక్షించడం, దేశవాళీ మొక్కలు, జంతువుల అక్రమ రవాణా, వ్యాపారం నిరోధించడం, ఇందుకు అవసరమైన చట్టాలు చేయడం.  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రపంచంలోని మొత్తం జంతువుల్లో 6.5% భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న 17 దేశాల్లో భారత్‌ ఒకటి.


వన్యప్రాణుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం 1972లో సమగ్ర వన్యప్రాణి చట్టం తీసుకొచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం దేశంలో జాతీయ పార్కులు, వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీలు, కన్జర్వేటివ్‌ రిజర్వులు, కమ్యూనిటీ రిజర్వులు, బయోస్ఫియర్‌ రిజర్వులు, సామాజిక ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం దేశంలో 981 రక్షిత ప్రాంతాలున్నాయి. 1982లో వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాను దెహ్రాదూన్‌లో స్థాపించారు.


జాతీయ పార్కులు: ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో మానవ చర్యల కారణంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, ప్రదేశాలు, వన్యప్రాణులను రక్షించడానికి జాతీయ పార్కులు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒక ప్రత్యేక జంతు జాతిని పరిరక్షిస్తారు. ఇక్కడ వ్యక్తిగత హక్కులు ఉండవు. జాతీయ పార్కుల్లో వన్యప్రాణులకు హాని   కలగనంత వరకు వినోద, పర్యాటక, పరిశోధనలకు అనుమతి ఉంటుంది. జాతీయ పార్కుల సరిహద్దులను శాసనం ద్వారా పార్లమెంటు             నిర్ణయిస్తుంది. 


జాతీయ పార్కులను ‘ఇంటర్నేషనల్‌  యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ రక్షిత ప్రాంతంగా గుర్తించారు. దేశంలో మొదటి జాతీయ పార్కు (1936), జిమ్‌ కార్బెట్‌   నేషనల్‌ పార్కును ప్రారంభించారు.      తెలంగాణలో మొదటి జాతీయ పార్కు (1975) మహావీర్‌ హరిణ వనస్థలి (హైదరాబాద్‌). దేశంలో అత్యధిక జాతీయ పార్కులు (11) మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. జాతీయ పార్కుల్లో పెద్దదైన హెమిస్‌ నేషనల్‌ పార్కు (4400 చ.కి.మీ. విస్తీర్ణం) లద్దాఖ్‌లో, చిన్నది సౌత్‌ బటన్‌ పార్కు (0.3 చ.కి.మీ.) నికోబార్‌ దీవుల్లో ఉంది. జాతీయ పార్కులు లేని రాష్ట్రం - పంజాబ్‌.


బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు: ఒక భౌగోళిక ప్రాంతంలోని అంతరించే దశలో ఉన్న మొక్కలు, జంతువుల పరిరక్షణ; పెంపుడు జంతువులు, మొక్కల రక్షణ, గిరిజనుల జీవన శైలిని రక్షించడానికి ఏర్పాటైన బహుళ ప్రయోజనాలున్న రక్షిత ప్రాంతాలను బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు అంటారు. దేశంలోని మొదటి బయోస్ఫియర్‌ రిజర్వ్‌ తమిళనాడులోని నీలగిరి బయోస్ఫియర్‌ (1986). దేశంలో మొత్తం 18 బయోస్ఫియర్లు ఉన్నాయి. బయోస్ఫియర్‌ సరిహద్దును పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఇందులో ప్రవేశానికి పర్యాటకులకు అనుమతి లేదు. దేశంలో అతిపెద్ద బయోస్ఫియర్‌ రిజర్వ్‌ ‘రాణ్‌ ఆఫ్‌ కచ్‌ రిజర్వ్‌’, చిన్నది ‘దిబ్రూ సైకోవా’. దేశంలో ఏర్పాటు చేసిన చివరి బయోస్ఫియర్‌ (2011) మధ్యప్రదేశ్‌లోని పన్నా. బయోస్ఫియర్‌లను 1993లో మూడు జోన్‌లుగా విభజించారు.

1) కోర్‌ జోన్‌: ఇక్కడ పర్యాటకం, నివాసాలు, ఆర్థిక కార్యకలాపాలు నిషిద్ధం.

2) బఫర్‌ జోన్‌: పరిమిత పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి.

3) ట్రాన్సిషన్‌ జోన్‌: బయోస్ఫియర్‌ సరిహద్దు ప్రాంతాలు. వ్యవసాయ, నివాస ప్రాంతాలకు అనుమతి ఉంది.


కన్జర్వేటివ్‌ రిజర్వ్‌లు: జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో ఆ జీవుల పునరుత్పత్తి కోసం ప్రారంభించారు. ఇవి జమ్ము-కశ్మీర్‌లో అత్యధికంగా ఉన్నాయి.దేశం మొత్తం 97 ఉన్నాయి.

కమ్యూనిటీ రిజర్వ్‌లు: మతవిశ్వాసాలు, సంస్కృతిలో భాగంగా నిర్దిష్ట అటవీ ప్రాంతాన్ని, జంతువులను కాపాడుకునే ప్రాంతాలను కమ్యూనిటీ రిజర్వ్‌లు అంటారు. ఇవి దేశం మొత్తంలో 214 ఉన్నాయి. కమ్యూనిటీ రిజర్వ్‌లు, కన్జర్వేటివ్‌ రిజర్వ్‌లు జమ్ము-కశ్మీర్‌లో అధికంగా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఒక్కటి కూడా లేదు.

పవిత్ర అడవులు: మత విశ్వాసాలున్న గిరిజనులతో రక్షణ పొందే అడవులు. ఈ అడవుల్లో అనేక అరుదైన, అంతరించిపోయే వృక్ష, జంతు జాతులున్నాయి. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పవిత్ర వనాలు అంటారు. పవిత్ర అడవులు ఎక్కువగా హిమాచల్‌ ప్రదేశ్‌ (5000), ఆంధ్రప్రదేశ్‌ (691), తెలంగాణ (65)ల్లో ఉన్నాయి.జీవవైవిధ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

ప్రాజెక్ట్‌ టైగర్‌: దేశవ్యాప్తంగా పులుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందని గుర్తించిన కేంద్రం 1973లో ప్రాజెక్ట్‌ టైగర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో (2024, మార్చి నాటికి) 55 టైగర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి. మొదటిది జిమ్‌ కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌. చివరగా ఏర్పాటు చేసింది (55వది) దోల్‌పుర్‌ - కరౌలీ టైగర్‌ రిజర్వ్, రాజస్థాన్‌. దేశంలో పులులు మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాయి. అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ తెలంగాణాలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా - అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌. ప్రపంచంలో పులులు అధిక సంఖ్యలో ఉన్న దేశం భారత్‌.

ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌: ఇది దేశంలోని ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం. 1992లో ప్రవేశపెట్టారు. ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం ‘గజ టు ప్రజ’. 2022 నాటికి దేశంలో గుర్తించిన ఎలిఫెంట్‌ రిజర్వ్‌లు 33. ఈ కార్యక్రమం మొదట ఝార్ఖండ్‌లోని సింగ్‌భంలో ప్రారంభించారు.

ప్రాజెక్ట్‌ గిర్‌ లయన్‌: గుజరాత్‌లోని గిర్‌ అటవీ ప్రాంతాన్ని సింహాల రక్షణ కోసం ప్రకటించారు. మొదటగా 1957లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని చంద్రప్రభ అటవీ ప్రాంతంలో ఆసియాటిక్‌ లయన్‌ రీ ఇంట్రడక్షన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రాజెక్ట్‌ క్రోకొడైల్‌: 1975లో మొసళ్ల సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. మొదటగా ఒడిశాలోని సత్‌కోషియా గార్జ్‌ - శాంక్చురీలో ఈ మొసళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని నందన్‌కానన్‌ జూలో మొదలు పెట్టారు.

ప్రాజెక్ట్‌ రైనో: ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంరక్షణ కోసం 2005లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం 2020 నాటికి ఖడ్గమృగాల సంఖ్యను మూడు వేలకు పెంచడం.

ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్‌: మంచు చిరుతల సంరక్షణ కోసం 2009లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సుమారు 1,80,000 చ.కి.మీ. విస్తీర్ణంలో అయిదు హిమాలయ రాష్ట్రాలైన జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో విస్తరించి ఉంది.

గంగా - డాల్ఫిన్‌ల సంరక్షణ: గంగా డాల్ఫిన్‌ను కేంద్రం జాతీయ జలచర జంతువుగా గుర్తించింది. గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో నివసిస్తాయి. ఇవి చూడలేవు. అల్ట్రాసోనిక్‌ తరంగాల ద్వారా ఇతర వస్తువులు,   ఆహారాన్ని గుర్తిస్తాయి. గంగా డాల్ఫిన్‌ను అస్సాంలోని గువాహటి తమ పట్టణ జంతువుగా ప్రకటించింది.

ప్రాజెక్ట్‌ రెడ్‌ పాండా: 1966లో ప్రారంభించారు. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో దిగువ హిమాలయాల్లో నివసించే రెడ్‌ పాండాలను రక్షించడమే ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశం.

ప్రాజెక్ట్‌ వల్చర్‌: రాబందుల రక్షణ కోసం  ప్రారంభించారు. 2016లో హరియాణాలోని పింజోర్‌లో జిప్స్‌ రాబందుల పునఃప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ సంరక్షణ: దేశంలో  రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. ఇది రాజస్థాన్‌ రాష్ట్ర అధికార పక్షి.

చిత్తడి భూముల - రామ్‌సర్‌ ఒప్పందం: రామ్‌సర్‌ అనేది ఇరాన్‌లోని ఒక పట్టణం పేరు. 1971లో చిత్తడి భూముల సంరక్షణ కోసం అక్కడ సదస్సు జరిగింది. ఇది చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగిన ఏకైక, మొదటి అంతర్జాతీయ ఒప్పందం. దీనిపై 172 దేశాలు సంతకాలు చేశాయి.


   వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు  


 

వృక్ష, జంతు జాతుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వాటిని అభయారణ్యాలు అంటారు. వీటి సరిహద్దును శాసనం ద్వారా నిర్ణయించరు. వీటిలోకి వన్య  ప్రాణులకు హాని కలిగించనంత వరకు అటవీ కార్యక్రమాలకు, కలప, ఇతర వస్తువుల సేకరణకు అనుమతి ఉంటుంది. కానీ పరిశోధనలకు అనుమతి లేదు. ప్రస్తుతం దేశంలో 566 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలున్నాయి. వీటి విస్తీర్ణం దేశంలో     3.73% మేర ఉంది. దేశంలోని మొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (పక్షుల సంరక్షణ కేంద్రం) 1895లో ‘వేదాంతగల్‌’ను తమిళనాడులో ఏర్పాటు చేశారు. దేశంలో అత్యధిక వన్యమృగ కేంద్రాలు అండమాన్‌ - నికోబార్‌ దీవులు (96), మహారాష్ట్ర (50)ల్లో ఉన్నాయి. దేశంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గుజరాత్‌లోని కచ్‌ డిసర్ట్‌ శాంక్చురీ. భారత ప్రభుత్వం 1952లో వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఏర్పాటు చేసింది.


రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 20-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు