• facebook
  • whatsapp
  • telegram

జీవ వైవిధ్యం

భిన్నత్వంతోనే జీవజాతికి స్థిరత్వం!

 

 

జీవసంపద పుష్కలంగా, వైవిధ్యంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. భిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ అనుకూలతలు కలిగి రకరకాల వృక్ష, జంతు జాతులతో గొప్ప జీవవైవిధ్య కేంద్రంగా నిలిచింది. భూమిపై జీవవైవిధ్యం అసమానంగా, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా మన దేశం మాత్రం అనాదిగా జైవిక సంపదతో అలరారుతోంది. పిచ్చుక నుంచి ఏనుగు వరకు, గడ్డిపోచల నుంచి మహావృక్షాల వరకూ లక్షలాది రకాల జీవజాలం ఇక్కడ ఉన్నాయి. ఈ తరహా విశేషాల గురించి పోటీ పరీక్షలు రాసేవారికి శాస్త్రీయ అవగాహన ఉండాలి. దేశంలోని జీవ భౌగోళిక మండలాల ప్రత్యేకతలు, పెరిగే జీవజాతుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

భూమిపై ఉన్న జీవసంపద సంక్లిష్టం, వైవిధ్యభరితం. ఆ జీవ జాతుల మధ్య ప్రత్యేకతలను తెలియజేసేదే జీవ వైవిధ్యం. భౌమ, జలావరణ వ్యవస్థల్లోని సమస్త జీవజాతుల మధ్య జన్యు పరమైన, జాతి సంబంధిత, ఆవరణ వ్యవస్థల తీరుల్లో ఉన్న తేడాలను జీవ వైవిధ్యం అంటారు. 1992లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన జీవవైవిధ్య ఒప్పంద సదస్సులో ఈ మేరకు నిర్వచనం ఇచ్చారు. రేమండ్‌ ఎఫ్‌.డోస్‌మన్‌ అనే శాస్త్రవేత్త మొదట 1967లో జీవసంబంధ వైవిధ్యం (బయోలాజికల్‌ డైవర్సిటీ) అనే పదాన్ని ఉపయోగించాడు. దీన్నే 1985లో డబ్ల్యూ.జి.రోజెన్‌ అనే శాస్త్రవేత్త జీవవైవిధ్యం (బయో డైవర్సిటీ)గా ప్రయోగించాడు. జీవవైవిధ్యాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు.

 

1) జన్యు వైవిధ్యం: ఒక జాతి జీవుల్లోని జన్యువుల లక్షణాల్లో ఉన్న భేదాలతోపాటు విభిన్న జాతుల జీవుల మధ్య ఉన్న జన్యువుల సంఖ్యలోని తేడాలనూ జన్యు వైవిధ్యం అంటారు. అలాంటి వైవిధ్యాలు తర్వాతి తరాలకు సంక్రమిస్తాయి. ఆ వైవిధ్యం అధికంగా ఉన్న జాతుల్లో పరిసరాలకు అనుగుణంగా శరీర అవయవాల్లో మార్పులు ఏర్పడి, ఎక్కువకాలం మనుగడ సాగిస్తాయి.

 

ఉదా: మనిషిలో 35 వేల నుంచి 45 వేల జన్యువులు, వరిలో 30 వేల నుంచి 50 వేల జన్యువులు ఉంటాయి.

 

2) జాతుల వైవిధ్యం: ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రాంతంలో నివసించే జాతుల మధ్య శారీరకమైన తేడాల్లో ఉండే వైవిధ్యాన్ని జాతుల వైవిధ్యం అంటారు. ఒక ప్రాంతంలో ఎన్ని రకాల జీవులు నివసిస్తే అక్కడ అంత జాతి వైవిధ్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఒక భౌగోళిక ప్రాంతంలో జాతుల ఆధిపత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అక్కడి జాతుల ఆధిపత్యం, సంపన్నత్వం, సమానత్వం గురించి తెలుసుకోవచ్చు. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ జాతుల వైవిధ్యం సాధారణంగా తగ్గుతుంది. ఇందుకు కారణం శీతోష్ణ పరిస్థితుల్లో మార్పు ఉండటమే. సముద్ర ఆవరణ వ్యవస్థలో కూడా ఖండతీరపు అంచులో జాతుల సంపన్నత్వం ఎక్కువగా ఉంటుంది. జాతుల వైవిధ్యంపై ఆధారపడి ఒక జాతి ఆహారం పొందడమనేది అక్కడ లభించే ఇతర జాతులను బట్టి ఉంటుంది. ఆ విధంగా జాతుల వైవిధ్యం ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తుంది.

 

3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం: జీవావరణంలోని విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య తేడాలు, వైవిధ్యాలనే ఆవరణ వ్యవస్థల వైవిధ్యం అంటారు. శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపాల్లోని వైవిధ్యం వల్ల ఒక ఆవరణ వ్యవస్థలో అనేక రకాల జాతులు, వివిధ పరిమాణాల్లో నివసిస్తుంటాయి.

 

ఉదా: ఉష్ణమండల వర్షాధార ఆవరణ వ్యవస్థ, గడ్డి భూముల ఆవరణ వ్యవస్థ, మాంగ్రూవ్‌ అడవుల ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ తదితరాలు.

 

జీవ వైవిధ్య గణన: 1972లో విట్టేకర్‌ అనే శాస్త్రవేత్త జీవ వైవిధ్య గణనకు మూడు కొలమానాలు సూచించాడు.

 

1) ఆల్ఫా వైవిధ్యం: ఇది ఒక ప్రాంతంలో లేదా ఒక ఆవరణ వ్యవస్థలో జాతుల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య లేదా జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది. 

 

2) బీటా వైవిధ్యం: విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య భిన్నత్వాన్ని తెలియజేస్తుంది. ఇది సాధారణంగా ఆవరణ వ్యవస్థల మధ్య జాతుల సంఖ్యలో మార్పులను అంచనా వేసే విధానం.

 

3) గామా వైవిధ్యం: ఒక ప్రాంతంలోని విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య వైవిధ్యాన్ని, ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాలు, కలిగే మార్పులను, జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది.

 

 

భారతదేశ జీవవైవిధ్య సంపద - ప్రాంతీయ విభాగాలు:

* ప్రపంచ వైశాల్యంలో భారత్‌ భూభాగం 2.4% మాత్రమే ఉన్నప్పటికీ జీవజాతుల్లో 7% కలిగి ఉంది. మానవ జనాభాలో 18% ఇక్కడే ఉంది.

* ప్రపంచంలోని మెగా జీవవైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి. క్షీరదాల్లో 7వ స్థానం, సరీసృపాల్లో 5వ స్థానం, పక్షుల్లో 9వ స్థానం కలిగి ఉంది.

* దేశంలోని వృక్షజాతుల్లో 33%, జంతు జాతుల్లో 50% స్థానికమైనవి ఉన్నాయి.

 

రెండు.. అయిదు.. పది!


మన దేశంలోని జీవ సంపదను రెండు జీవరాజ్యాలు, అయిదు సహజ మండలాలు, పది జీవభౌగోళిక ప్రాంతాలుగా విభజించవచ్చు.


జీవరాజ్యాలు:  ఒకే రకమైన లక్షణాలున్న చెట్లు, జంతువులతో కూడిన ఖండం లేదా ఉపఖండమంత విస్తీర్ణం ఉన్న ప్రాంతాలను జీవరాజ్యం అంటారు. అక్కడి ఆవరణ వ్యవస్థలన్నీ విశాలంగా ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో 8 ప్రాదేశిక జీవ భౌగోళిక రాజ్యాలు ఉన్నాయి. వాటిలో రెండింటిని మన దేశం కలిగి ఉంది. అవి 1) హిమాలయాల ప్రాంతంలో పాలియార్కిటిక్‌ జీవరాజ్యం 2) దేశంలో మిగిలిన ఉపఖండమంతా ఉన్న మలయన్‌ జీవరాజ్యం.


సహజ జీవ మండలాలు: నిర్దిష్టమైన శీతోష్ణ పరిస్థితుల్లో వృక్ష, జంతు సముదాయాలు ఉండే ప్రదేశాలను సహజ జీవ మండలాలు అంటారు. అవి అక్కడి మృత్తికలకు, పరిస్థితులకు అలవాటు పడి మనుగడ సాగిస్తాయి. మన దేశంలో సహజ జీవమండలాలను అయిదు రకాలుగా విభజించారు. 1) ఉష్ణమండల తేమ అడవుల మండలం 2) ఉష్ణమండల పొడి లేదా ఆకురాల్చే అడవుల మండలం (ఇందులో రుతుపవన అడవులు కలిసి ఉంటాయి) 3) వెచ్చని ఎడారి, అర్ధ ఎడారి మండలం 4) శృంగాకార అడవుల మండలం 5) హిమాలయ అంచుల్లోని ఆల్ఫైన్‌ గడ్డి మండలాలు


జీవ భౌగోళిక ప్రాంతాలు: భౌగోళికంగా వృక్షాలు, జంతువుల విస్తరణను తెలియజేసేదే జీవ భౌగోళిక శాస్త్రం. దీని ప్రకారం వృక్ష, జంతు జాతులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి.


హిమాలయాల పైభాగం (ట్రాన్స్‌హిమాలయాలు): టిబెట్‌ పీఠభూమి, జమ్ము-కశ్మీర్‌లోని లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌ - స్పితిలతో కూడిన ప్రాంతం. ఇది దేశ వైశాల్యంలో 5.7% ఆక్రమించి ఉంది. ఇక్కడ పర్వత సంబంధ మొక్కలే పెరుగుతాయి. అడవి మేకలు, గొర్రెలు లాంటి జంతువులు ఉంటాయి. కొన్ని వలస పక్షులు కూడా నివసిస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే క్రూర మృగం మంచు చిరుత.


హిమాలయ భాగం: ఇది జమ్ము-కశ్మీర్‌లో వాయవ్యం నుంచి ఈశాన్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు విస్తరించి ఉంది. దేశ భూభాగంలో 6.9% ఆక్రమించిన ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. సాల్, సీసం, జమూన్‌ లాంటి వృక్షాలు; 3000 మీటర్ల ఎత్తులో సిల్వర్‌ ఫర్, రెడో డెండ్రాన్లు లాంటి ఆల్ఫైన్‌ వృక్ష సంపద ఉంటుంది. గొర్రెలు, మేకలు, జింకలు వంటి జంతు సంపద, వివిధ రకాల పక్షులు కనిపిస్తాయి.


ఎడారి ప్రాంతం: ఈ ప్రాంతం ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన రాజస్థాన్‌లో, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దేశ వైశాల్యంలో 6.9% ఆక్రమించింది. ఇక్కడ వార్షిక వర్షపాతం 25 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల బాష్పోత్సేకాన్ని నిరోధించే తుమ్మ, బలుసు, రేగు, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి జిరోఫైట్స్‌ వర్గానికి చెందిన పొదలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ భౌమ మండలంలో సింహాలు, పులులు, జింకలు, తోడేళ్లు, గాడిదలు, బట్ట మేకల పక్షి లాంటివి నివసిస్తాయి.


అర్ధ శుష్క మండలం: మధ్యప్రదేశ్‌లో కొంత ప్రాంతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కొంత ప్రాంతం ఈ జీవ భౌగోళిక మండలంలో ఉంది. ఇది ఎడారికి, దక్కన్‌ పీఠభూమికి మధ్య ప్రాంతం. దేశ వైశాల్యంలో 15.6% ఆక్రమించిన ఈ ప్రాంతం పాక్షిక ఎడారి లక్షణాలతో ఉంటుంది. ఆకురాల్చే అడవులు ఎక్కువ. టేకు, మోదుగ, తంగేడు లాంటి చెట్లు ఉంటాయి. పులులు, జింకలు, నక్కలు, దుప్పులు లాంటి జంతు సంపద ఉంటుంది.


పశ్చిమ కనుమల ప్రాంతం: ఇది మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన కొండల ప్రాంతం. నైరుతి రుతువులో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మహాగని, ఎబోని, రోజ్‌వుడ్‌ లాంటి బలమైన చెట్లు పెరుగుతాయి. ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే సతత హరితారణ్యాలు విస్తరించి ఉంటాయి. ఏనుగులు, పులులు, బ్లాక్‌ మంకీస్‌ లాంటి రకరకాల కోతులు, నీలగిరి తహర్‌ దుప్పులు, జింకలు వంటి గొప్ప జీవవైవిధ్యం ఉంది.


దక్కన్‌ ద్వీపకల్ప ప్రాంతం: చోటా నాగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ఈ మండలంలో వార్షిక వర్షపాతం 100 సెం.మీ. ఉన్న పీఠభూములు ఉంటాయి. చాలావరకు తేమ ఆకురాల్చే పర్వత వెనుక భాగాల్లో శుష్క ఆకురాల్చే అడవులు విస్తరించి ఉంటాయి. టేకు, మద్ది, గంధపుచెట్టు, ఎర్రచందనం, వెదురు, మోదుగ లాంటి వృక్షాలకు ప్రసిద్ధి. పులులు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, తోడేళ్లు లాంటి జంతువులు నివసిస్తాయి.


ఈశాన్య భారత ప్రాంతం: అత్యంత జీవవైవిధ్యమున్న ప్రాంతం. అత్యధిక వర్షపాతం ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ నుంచి అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇందులో ఉంటాయి. సాల్, చెంప, ఎత్తయిన వెదురు లాంటి వృక్ష సంపద, గిబ్బస్‌ కోతులు, రెడ్‌ పాండా, ఖడ్గమృగాలు, బెంగాల్‌ రాయల్‌ టైగర్స్‌ లాంటి జంతుసంపదకు ప్రసిద్ధి. నెపెంథిస్‌ లాంటి కీటకాహార మొక్కలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. అనేక రకాల పక్షులు కనిపిస్తాయి.


గంగా మైదాన ప్రాంతం: ఇది గంగా, దాని ఉపనదుల ప్రాంతమైన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దేశ వైశాల్యంలో 11% ఆక్రమించింది. సారవంతమైన నేలలు జంతు, వృక్షసంపద కంటే వివిధ రకాల పాడిపంటలకు అనుకూలం. వేప, చింత, మామిడి లాంటి కొన్నిరకాల వృక్షాలు; దుప్పులు, జింకలు వంటి జంతువులకు అనుకూలం.


దీవులు: బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షదీవులు జీవభౌగోళిక, సముద్ర ప్రభావిత ప్రాంతాలు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు ఎక్కువ. అందువల్ల దట్టమైన అడవులు, చెట్లపై నివసించే పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. మధ్యస్థ వర్షపాతం ఉండే లక్షదీవుల్లో ఆకురాల్చే పలుచని అడవులు విస్తరించి ఉంటాయి. ప్రవాళ బిత్తికలతో ఆవరించిన ఈ దీవులు ప్రత్యేక జీవ వైవిధ్య సంపదగా నిలిచాయి.


తీర ప్రాంతాలు: భారతదేశానికి 7,516 కి.మీ. పొడవైన తీరం ఉంది. తీరం అంచుల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. లక్షదీవులు తప్ప తీరం ఉన్న అన్ని ప్రాంతాల్లో విస్తరించిన మడ అడవులు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రతీకలు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 19-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌