• facebook
  • whatsapp
  • telegram

 రక్తం - భాగాలు 

శరీరంలో సూక్ష్మరక్షక భటులు.. పారిశుద్ధ్యకార్మికులు!


మనిషి శరీరంలో రక్తం అత్యంత ముఖ్యమైన ద్రవరూప కణజాలం. వివిధ పోషకాలు, ఆక్సిజన్‌ సరఫరాకు, అనవసరమైన పదార్థాల విసర్జనకు తోడ్పడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి రోగ నిర్ధారణకు అవసరమైన కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.  ఇందులో రక్తకణాలు, ప్లాస్మా తదితర భాగాలు ఉంటాయి. అవి రోగ నిరోధకశక్తిని పెంపొందించడానికి, రక్తం గడ్డకట్టడానికి, ఇంకా అనేక రకాల శరీర ప్రక్రియల నిర్వహణలో సాయపడతాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న రక్తం గురించి అభ్యర్థులు పోటీపరీక్షల కోణంలో చదువుకోవాలి. రక్తంలోని కణాల రకాలు, వాటి విధులు, శరీర ఆరోగ్యంలో అవి నిర్వర్తించే పాత్ర గురించి తెలుసుకోవాలి.


రక్తం గురించి అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. ఉన్నత శ్రేణి జీవుల్లో రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. దీనినే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్తం pH 7.3 - 7.5 మధ్య ఉంటుంది. రక్తాన్ని ప్లాస్మా, రక్తకణాలుగా విభజించచ్చు. మనిషి శరీరంలో సరాసరి 4-5 లీటర్ల రక్తం ఉంటుంది.


ప్లాస్మా: రక్తంలో రక్తకణాల మధ్య ఉండే ద్రవాన్ని ప్లాస్మా అంటారు. ఇది మొత్తం రక్తంలో 55 శాతం ఉంటుంది. ఇది లేత పసుపు పచ్చ రంగులో స్వచ్ఛంగా ఉంటుంది. ప్లాస్మాలో 90-92 శాతం నీరు, మిగతా భాగంలో నిరేంద్రియ లవణాలు,      కార్బొనేట్‌లు, బైకార్బొనేట్‌లు, ఫాస్ఫేట్‌లు, క్యాల్షియం, ప్రొటీన్లు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు లాంటివి అనేకం ఉంటాయి. ప్లాస్మా ప్రొటీన్లలో ఆల్బుమిన్‌ గ్లోబ్యూలిన్, ఫైబ్రినోజెన్, ప్రోత్రాంబిన్‌ ముఖ్యమైనవి.


రక్తంలోని కణాలు: ఇవి రక్తంలో 45 శాతం ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు,    రక్తఫలకీకలు ఉంటాయి.

రక్తఫలకీకలు (ప్లేట్‌లెట్స్‌): మానవుడితో సహా   క్షీరదాలన్నింటిలోనూ ఉంటాయి. పూర్తి కణాలు కావు. కేంద్రకం ఉండదు. రక్తకణాలన్నింటిలో చిన్నవి. ఎముక మజ్జలోని మెగాకారియోసైట్‌ల నుంచి ఇవి ఉద్భవిస్తాయి. వీటి జీవితకాలం 7 నుంచి 10 రోజులు. రక్తం గడ్డకట్టడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. రక్తనాళాలు తెగినప్పుడు రక్తఫలకీకలు స్రవించిన రసాయనం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రక్తం కారడం తగ్గిపోతుంది. గాయమైన వెంటనే రక్తఫలకీకలు థ్రాంబోప్లాస్టిన్‌ అనే రసాయనాన్ని స్రవించి రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రారంభిస్తాయి.


ఎర్రరక్త కణాలు: వీటినే ఎరిథ్రోసైట్‌లు అంటారు. ఇవి గుండ్రంగా లేదా ద్విపుటాకారంగా ఉండే కేంద్రక రహిత కణాలు. శరీరంలో కేంద్రకం లేని కణాలు ఇవే. క్షీరదాల్లో ఒంటె, లామాల్లోని ఎర్రరక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది. ఎర్రరక్తకణాల లోపల హిమోగ్లోబిన్‌ ఉంటుంది. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ఇదే కారణం. ఇది ఆక్సిజన్, కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.


ఎర్ర రక్తకణాలు ఎముక మజ్జ నుంచి ఏర్పడతాయి. ఇవి ఏర్పడటాన్ని ఎరిథ్రోపాయిసిస్‌ అంటారు. వీటి జీవితకాలం 120 రోజులు. మగవారిలో దాదాపుగా ఒక క్యూబిక్‌ మిల్లీ మీటర్‌కు 5 నుంచి 5.5 మిలియన్‌లు, ఆడవారిలో ఒక క్యూబిక్‌ మిల్లీ మీటరుకు 4.5 నుంచి 5 మిలియన్‌లు ఉంటాయి. హిమోగ్లోబిన్‌లో ఇనుము, ప్రొటీన్‌ సముదాయాలు ఉంటాయి. ఎర్రరక్త కణాలు పిండ దశలో కాలేయం, ప్లీహం ఎముక మజ్జలో ఏర్పడతాయి. శిశువు పుట్టినప్పుడు మొదలు జీవితకాలమంతా ఎముక మజ్జలో తయారవుతాయి. 120 రోజుల తర్వాత ఎర్రరక్త కణాలు కాలేయం, ప్లీహంలో విచ్ఛిన్నమవుతాయి. ప్లీహాన్ని ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అని, రక్తాన్ని నిల్వ చేసుకుంటుంది కాబట్టి బ్లడ్‌ బ్యాంక్‌ అని పిలుస్తారు. పర్వత ప్రాంతాల్లో నివసించేవారికి, వ్యాయామం చేసేవారికి రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్‌ వివిధ దశల్లో విచ్ఛిన్నం చెంది చివరకు బిలి రూబిన్, బిలి వర్డిన్‌ అనే వర్ణకాలుగా మారుతుంది. ఎర్రరక్త కణాలు క్షీరదాల్లో కాకుండా ఇతర సకశేరుకాల్లో అండాకారం లేదా కుంభాకారంలో కేంద్రకయుతంగా ఉంటాయి.


తెల్లరక్త కణాలు; వీటిని ల్యూకోసైట్‌లు అంటారు. నిర్ణీత ఆకారం ఉండదు. కేంద్రకయుతంగా ఉంటాయి. శరీరాన్ని వివిధ సూక్ష్మజీవుల బారి నుంచి రక్షించి వ్యాధి నిరోధకత కలిగిస్తాయి. ఈ కణాలనే శరీర రక్షక భటులు అంటారు. ఎర్రరక్త కణాలతో పోలిస్తే తెల్లరక్త కణాల సంఖ్య తక్కువ. ఇవి ఒక క్యూబిక్‌ మిల్లీమీటర్‌కు 5,000 నుంచి 10,000 వరకు ఉంటాయి. తెల్లరక్త కణాలు ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇవి వివిధ అవయవాల్లో పలు రకాలుగా విభజన చెందుతాయి. ఇవి లింఫ్‌ గ్రంథులు, ప్లీహం, థైమస్‌ గ్రంథి, ఎముక మజ్జ లాంటి వాటిలో T- లింఫోసైట్‌లు, B-లింఫోసైట్‌లు లాంటి రకాలుగా మారతాయి. ల్యూకోసైట్‌లను కణికాయుత కణాలు, కణికారహిత కణాలుగా విభజించవచ్చు. కణికాయుత తెల్ల రక్తకణాలను తిరిగి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్‌గా విభజించవచ్చు. కణికారహిత కణాలను  లింఫోసైట్‌లు, మోనోసైట్‌లుగా పేర్కొనవచ్చు.


ఎసిడోఫిల్స్‌: వీటిని ఇయోసినోఫిల్స్‌ అంటారు. ఇవి ఇయోసిన్‌ వర్ణకంతో రంగును పొందుతాయి. పరాన్నజీవుల సంక్రమణ, అలర్జీ ఉన్నప్పుడు శరీరంలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి గాయాలు మానడానికి, సూక్ష్మజీవులు స్రవించిన విషపదార్థాలను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. తెల్ల రక్తకణాల్లో ఇవి 2 నుంచి 4 శాతం వరకు ఉంటాయి.


బేసోఫిల్స్‌: తెల్ల రక్తకణాల్లో వీటిశాతం 0.5 నుంచి 2 వరకు ఉంటుంది. ఇవి మిథిలిన్‌ బ్లూ అనే వర్ణకంతో రంగును పొందుతాయి. హెపారిన్‌ను స్రవిస్తాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకపోవడానికి కారణం హెపారిన్‌.


న్యూట్రోఫిల్స్‌: తెల్లరక్తకణాల్లో అన్నింటికంటే ఎక్కువగా ఉండే కణాలు ఇవే. 62 శాతం ఉంటాయి. ఇవి కణభక్షణ (ఫాగోసైటాసిస్‌)ను ప్రదర్శిస్తాయి. బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులను వాటిలోకి తీసుకుని  చంపేస్తాయి. వీటిని శరీర సూక్ష్మరక్షక భటులు అంటారు. హానికర బ్యాక్టీరియా నుంచి రక్షించే మొదటి శ్రేణి కణాలు న్యూట్రోఫిల్స్‌.


లింఫోసైట్‌లు: తెల్ల రక్తకణాల్లోకెల్లా అతిచిన్న కణాలు. వీటి శాతం 30. వీటిని తిరిగి T- లింఫోసైట్‌లు, B -లింఫోసైట్‌లు అని విభజించవచ్చు. ఇవి శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులను యాంటీజెన్‌లు (ప్రతిరక్షక జనకాలు)గా గుర్తించి వాటిని తటస్థం/ నిర్వీర్యం చేయడానికి యాంటీబాడీ (ప్రతిరక్ష దేహాలు)లను ఉత్పత్తి చేస్తాయి. ఎయిడ్స్‌ వ్యాధిలో లింఫోసైట్‌లపై హెచ్‌ఐవీ వైరస్‌లు దాడి చేసి వాటి సంఖ్యను తగ్గిస్తాయి. అందుకే హెచ్‌ఐవీ రోగుల్లో లింఫోసైట్‌ల సంఖ్య తగ్గుతుంది.


మోనోసైట్స్‌: తెల్లరక్తకణాల్లో అతిపెద్ద కణాలివి. అయిదు శాతం వరకు ఉంటాయి. కణభక్షణను ప్రదర్శిస్తాయి. వీటిని తిరిగి మాక్రోఫెజ్‌లు, స్కావెంజర్‌ కణాలుగా పేర్కొంటారు. ఇవి చనిపోయిన, దెబ్బతిన్న కణాలను తీసివేసి శరీర పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి. బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని రక్షించే రెండో శ్రేణి కణాలుగా ఉంటాయి.


నమూనా ప్రశ్నలు

 1. రక్తం గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాలను ఎన్నుకోండి.

 ఎ) రక్తాన్ని ద్రవరూప కణజాలం అంటారు.

 బి) రక్తం గురించి చేసే అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు.

 సి) రక్తం ఎర్రగా ఉండటానికి కారణం హిమోగ్లోబిన్‌.

 డి) రక్తం వివిధ రకాల పదార్థాల రవాణాకు తోడ్పడుతుంది.

1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి 3) సి, డి 4) బి, సి 2. రక్తంలోని ప్లాస్మాకు సంబంధించి కిందివాటిలో సరికానిది? 

ఎ) ప్లాస్మా ఎరుపు రంగులో ఉంటుంది.

బి) ప్లాస్మా ఎర్ర రక్తకణాల లోపల ఉంటుంది.

 సి) రక్తంలో 55 శాతం వరకు ప్లాస్మా ఉంటుంది.

డి) ప్లాస్మాలో 90 నుంచి 92 శాతం వరకు నీరు ఉంటుంది.

 1) ఎ, బి  2) బి, సి  3) సి, డి  4) ఎ, డి


 

3. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

ఎ) రక్త ఫలకీకలు త్రాంబోప్లాస్టిన్‌ అనే రసాయనాన్ని స్రవిస్తాయి. 

బి) రక్త ఫలకీకలు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే రసాయనాన్ని స్రవిస్తాయి. 

1) ఎ, బి లు సరైనవి. ఇవి రెండు వేర్వేరు అంశాలు.

2) ఎ సరైంది, బి సరైంది కాదు. ఇవి వేర్వేరు అంశాలు.

3) ఎ, బి లు సరైనవి. ఇవి ఒకే అంశానికి సంబంధించినవి.

4) ఎ, బి లు సరికావు. ఇవి ఒకే అంశానికి సంబంధించినవి. 

4. కింది వాక్యాల్లో సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) రక్తఫలకీకలు ఎముక మజ్జలోని మెగాకారియో సైట్‌ల నుంచి ఏర్పడతాయి.

బి) రక్తఫలకీకలు పూర్తి కణాలు కావు, కేంద్రకం ఉండదు.

సి) మన శరీరంలో కేంద్రకం లేని కణాలు ఎర్రకక్త కణాలు.

డి) క్షీరదాల్లో లామా, ఒంటెల్లో ఎర్రరక్త కణాలు కేంద్రకయుతంగా ఉంటాయి. 

1) ఎ, డి  2) బి, సి  3) ఎ, బి, సి, డి  4) ఎ, బి, డి
5. కింది జతలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) రక్తఫలకీకలు      1) స్కావెంజర్‌ కణాలు 

బి) ఎర్రరక్త కణాలు    2) విషపదార్థాలను నాశనం చేయడం

సి) ఎసిడోఫిల్స్‌        3) ఆక్సిజన్‌ రవాణా

డి) బేసోఫిల్స్‌          4) యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది  

ఇ) న్యూట్రోఫిల్స్‌       5) హెపారిన్‌ను స్రవిస్తుంది 

ఎఫ్‌) లింఫోసైట్‌లు     6) కణభక్షణను చూపుతుంది 

జి) మోనోసైట్‌లు      7) రక్తం గడ్డకట్టడానికి 

1) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-5, ఎఫ్‌-7, జి-6

2) ఎ-7, బి-3, సి-2, డి-5, ఇ-6, ఎఫ్‌-4, జి-1

3) ఎ-7, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్‌-1, జి-6

4) ఎ-4, బి-3, సి-2, డి-6, ఇ-5, ఎఫ్‌-1, జి-7


సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-3; 5-2.


 

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌