• facebook
  • whatsapp
  • telegram

మొక్కల వర్గీకరణ

కంటిచూపుతో కనిపెట్టేందుకే!

  మన చుట్టూ వందల, వేల రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఒక్కోదానికి ఒక్కో పేరు పెట్టి అన్నింటినీ గుర్తుంచుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే శాస్త్రవేత్తలు లక్షణాలను అనుసరించి మొక్కలను వర్గీకరించారు. సమూహాలుగా విడగొట్టారు. కంటి చూపుతో కనిపెట్టగలిగే విధంగా జాతులుగా విభజించి, అధ్యయనాలను సులువు చేశారు. 

 

మొక్కల్లో శైవలాల నుంచి వృక్షాల వరకు అనేక జాతులున్నాయి. ఒకే రకమైన లక్షణాలు కలిగిన మొక్కలను శాస్త్రవేత్తలు ఒక వర్గంగా గుర్తించి, రక రకాలుగా విభజించారు. దానివల్ల వాటి అధ్యయనం సులభమైంది.

  మొక్కలన్నింటినీ వృక్ష రాజ్యంలో చేర్చారు. తిరిగి వాటిని పుష్పించని మొక్కలు (క్రిప్టోగామ్స్‌), పుష్పించే మొక్కలు (ఫానిరోగామ్స్‌)గా విభజించారు. పుష్పించని మొక్కలను మళ్లీ థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా విభాగాలుగా పేర్కొన్నారు. పుష్పించే మొక్కలను వివృతబీజాలు (జిమ్నోస్పెర్మ్స్‌), ఆవృతబీజాలు (ఆంజియోస్పెర్మ్స్‌)గా వ్యవహరించారు. ఆవృతబీజాల్లో ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అనే విభాగాలు ఉన్నాయి. 

 

థాలోఫైటా

  థాలస్‌ ఉన్న మొక్కలను థాలోఫైటా విభాగం కిందకు చేర్చారు. వేరు, కాండం, పత్రాలు లేని మొక్కను థాలస్‌ అంటారు. థాలోఫైటాను శైవలాలు, శిలీంధ్రాలుగా విభజించారు.

 

శైవలాలు: స్వయంపోషక థాలోఫైటా జీవులను శైవలాలు అంటారు. ఇవి ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. కొన్ని నేలపై కూడా ఉంటాయి. శైవలాల్లో ఆకుపచ్చ శైవలాలు (క్లోరోఫైసీ), పసుపు శైవలాలు (జాంధోఫైసీ), గోధుమ వర్ణ శైవలాలు (ఫియోఫైసీ), ఎరుపు శైవలాలు (రోడోఫైసీ), బాసిల్లారియోఫైసీ, నీలిఆకుపచ్చ శైవలాలు (సయనో ఫైసీ) అంటూ 11 రకాలుగా విభజించారు. శైవలాల అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు.

 

ప్రత్యేకతలు - ఉపయోగాలు: * భూమండలం మీద ఆవిర్భంచి, మొదటిసారి కిరణజన్యసంయోగ క్రియ జరిపిన మొక్కలు శైవలాలు.

* ఇవి కిరణజన్యసంయోగ క్రియ ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ భూమిపై ఉన్న సమస్త జీవకోటికి ప్రాణవాయువుగా మారింది. 

* సముద్రాల్లోని శైవలాలను సముద్ర కలుపు మొక్కలు అంటారు. భూమిపైన అత్యధికంగా శైవలాల వల్లే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతోంది.

* కొలనులోని నీరు ఆకుపచ్చగా ఉండటానికి కారణం క్లామిడోమోనాస్‌ అనే శైవలం. 

* క్లోరెల్లా అనే శైవలాన్ని అంతరిక్ష ప్రయాణాల్లో వాడతారు. దీని నుంచి క్లోరెల్లిన్‌ అనే సూక్ష్మ జీవనాశకం (యాంటీబయాటిక్‌) లభిస్తుంది.

* మాక్రోసిస్టిస్‌ అతిపెద్ద శైవలానికి ఉదాహరణ.

* అన్ని శైవలాలు స్వయంపోషితాలుగా ఉంటాయి. కానీ, సెఫల్యురాస్‌ అనే శైవలం పరపోషితంగా ఉండి వివిధ మొక్కల్లో వ్యాధికి కారణమవుతోంది.

* నీలి ఆకుపచ్చ శైవలాలైన నాస్టాక్, అనబీనా, టాలిపోథ్రిక్స్‌ లాంటి శైవలాలను జీవ ఎరువులుగా వాడుతున్నారు.

* ఉల్వా లాక్టుకా అనే శైవలాన్ని సూప్‌ల తయారీలో వాడతారు. 

* కాండ్రస్‌ క్రిస్పస్, హిప్నియా శైవలాల కణకవచాల నుంచి లభ్యమయ్యే పదార్థమైన కారాగీన్‌ను ఐస్‌క్రీమ్‌లు, సిరప్‌లు, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.

* రోడిమేనియా, గ్రాసిలేరియా శైవలాలను పశుగ్రాసంగా వాడుతున్నారు.

 

శిలీంధ్రాలు: థాలోఫైటాకు చెందిన పరపోషిత జీవులు శిలీంధ్రాలు. ఇవి పరాన్నజీవులుగా లేదా పూతికాహారులుగా ఉంటాయి. వీటి అధ్యయనాన్ని మైకాలజీ అంటారు. వాటి కణకవచం ఖైటిన్‌ అనే పదార్థంతో తయారవుతుంది. శిలీంధ్రాలు ఏక కణయుతంగా లేదా తంతుయుతంగా ఉంటాయి. తంతువులతో ఉన్న శిలీంధ్ర దేహాన్ని మైసీలియం అంటారు.  వాటిని మోల్డ్స్‌గా కూడా పేర్కొంటారు. శిలీంధ్రాలు అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా ప్రత్యుత్పతి జరుపుతాయి. అలైంగిక ప్రత్యుత్పతత్తిలో భాగంగా సిద్ధబీజాలను (స్పోరులను) ఏర్పరుస్తాయి.

 

ప్రత్యేకతలు - ఉపయోగాలు: * స్థూల నిర్మాణం ఉన్న శిలీంధ్రాలకు ఉదాహరణ పుట్టగొడుగులు. ఇవి శిలీంధ్రాల్లో అగారికేల్స్‌ అనే క్రమానికి చెందినవి.

* పూతికాహార శిలీంధ్రాలు జంతు, వృక్ష కళేబరాలను కుళ్లింపజేసి భూమిలో కలిపేస్తాయి. దీని వల్ల భూసారం పెరుగుతుంది. 

* ఈస్ట్‌ను ఉపయోగించి కిణ్వప్రక్రియతో ఇథైల్‌ ఆల్కహాల్‌ను తయారుచేస్తున్నారు.

* ఆస్పర్‌జిల్లస్‌ నైగర్‌ అనే శిలీంధ్రాన్ని ఉపయోగించి సిట్రికామ్లాన్ని తయారు చేస్తున్నారు.

* పెనిసీలియం శిలీంధ్రాన్ని పెన్సిలిన్‌ అనే సూక్ష్మజీవ నాశకం ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు.

* న్యూరోస్పోరా జాతుల శిలీంధ్రాలను జన్యుశాస్త్ర ప్రయోగాల కోసం వాడుతున్నారు.

* టెంపె అనే సోయా వంటకాన్ని తయారుచేయడానికి ఉడకబెట్టిన సోయాగింజలపై రైజోపస్‌ ఒరైజే అనే శిలీంధ్రంతో చర్య జరిపిస్తారు.

* రైబోప్లావిన్‌ను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడానికి ‘ఆష్బియా గోసెపి’ని ఉపయోగిస్తున్నారు.

 

బ్రయోఫైటా

  బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్యంలో ఉభయచరాలు అని పిలుస్తారు. ఇవి తేమ, నీడ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. వీటి దేహాలు నిజమైన కాండం, పత్రాలు, వేర్లుగా విభజన చెంది ఉండవు. కానీ వేర్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని మూలతంతువులు అంటారు. ఈ విభాగంలో కొన్ని మొక్కలు కాలేయం ఆకారంలో ఉండటంతో  వాటిని లివర్‌వర్టులుగా పేర్కొంటారు. ఇంకొన్ని కొమ్ము ఆకారంలో ఉండటంతో కొమ్ము మొక్కలుగా వ్యవహరిస్తారు.ఇంకొన్నింటిని మాస్‌ మొక్కలు అంటారు.

 

ప్రత్యేకతలు: * బ్రయోఫైటాలోని మొక్కలు ఉత్పత్తి చేసే పీట్‌ అనే పదార్థాన్ని ఇంధనంగా వాడతారు.

* ఫ్యునేరియా మొక్కను కార్డ్‌మాస్‌ లేదా ఫైర్‌మాస్‌ అంటారు.

* స్పాగ్నమ్‌ అనే మొక్కను బాగ్‌మాస్‌గా పిలుస్తారు. 

 

టెరిడోఫైటా

  టెరిడోఫైటా మొక్కల అధ్యయనాన్ని టెరిడాలజీ అంటారు. ఇవి వృక్షరాజ్య సరీసృపాలు, నిజమైన మొదటి నేల మొక్కలు. సాధారణంగా ఫెర్న్‌ మొక్కలుగా వ్యవహరిస్తారు. మొదట ప్రసరణ కణజాలాలు ఈ మొక్కల్లో వృద్ధి చెందడం వల్ల వీటిని నాళికాయుత పుష్పించని మొక్కలు అంటారు. ఇవి బ్రయోఫైటా, వివృతబీజాలకు మధ్య అనుసంధానంగా ఉంటాయి.

 

ఉదాహరణలు - ప్రత్యేకతలు: * లైకోపోడియం, సెలాజినెల్లా, మార్సీలియా అనేవి కొన్ని టెరిడోఫైటా మొక్కలు.

* ఈక్విజిటమ్‌ మొక్కను గుర్రపుతోక మొక్క అంటారు.

* సాల్వీనియా మొక్కలో వేర్లు ఉండవు.

* అజొల్లా అనే మొక్కను వరిపొలాల్లో జీవ ఎరువుగా వాడతారు.

 

వివృతబీజాలు

* వీటిని నగ్నవిత్తనాలున్న మొక్కలని అంటారు. 

* ఇవి ఎత్తయిన, చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి.

* పత్రాలు సూదుల్లా ఉంటాయి.

* వీటి పుష్పాలను శంకువులంటారు. 

* అంకురచ్చదం ఫలధీకరణకు ముందు ఏర్పడి ఏకస్థితిలో ఉంటుంది.

 

ఉదాహరణలు - ప్రత్యేకతలు: * ఈ వర్గానికి చెందిన సైకస్‌ను అలంకరణ మొక్కగా వాడతారు. వీటి అండాలు వృక్షరాజ్యంలో అతిపెద్దవి.

* అరకేరియా మొక్కను క్రిస్‌మస్‌ ట్రీ అంటారు.

* ఎఫిడ్రా మొక్క నుంచి ఎఫిడ్రిన్‌ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. 

* గింకో మొక్కను సజీవ శిలాజం అంటారు. 

* పైనస్‌ మొక్క నుంచి తీసిన రెసిన్‌ను టర్పింటైన్‌ తయారీకి వాడతారు. 

 

ఆవృత బీజాలు

ఈ మొక్కల్లో దారునాళాలుంటాయి. ఫలంలో విత్తనాలు ఉంటాయి. వీటిని ద్విదళ, ఏకదళ బీజాలుగా వర్గీకరించారు. 

 

ద్విదళ బీజాలు: వీటి విత్తనాల్లో రెండు బీజదళాలుంటాయి. పత్రాల్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. దీనిలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. మన చుట్టూ ఉండే మొక్కలు ఎక్కువగా ద్విదళబీజాలకు చెందినవే.

ఉదా: అన్ని చిక్కుడు జాతిమొక్కలు: బంతి, చామంతి, మల్లె, గులాబీ లాంటి పూల మొక్కలు: టమాట, వంకాయ, బీర, కాకర, దొండ, బెండ తదితర కూరగాయల మొక్కలు : మామిడి, సీతాఫలం, జామ వంటి ఫలాలనిచ్చే మొక్కలు: నిమ్మజాతి మొక్కలు ద్విదళ బీజాలకు ఉదాహరణ.

 

ఏకదళ బీజాలు: ఈ మొక్కల విత్తనంలో ఒకే బీజదళం ఉంటుంది. పత్రాల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. వేరు వ్యవస్థ అబ్బురపు వేరు వ్యవస్థ.

ఉదా: వరి, గోధుమ, జొన్న, సజ్జ లాంటి ధాన్యాలనిచ్చే మొక్కలు: అన్ని గడ్డి జాతిమొక్కలు: చెరకు, ఉల్లి, వెల్లుల్లి, అరటి, తులిప్స్, లిల్లి, ఆర్కిడ్‌ మొక్కలు; అలోవెరా, కొబ్బరి, ఈత, తాటి, ఖర్జూరం లాంటి పామ్‌జాతి మొక్కలు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. కింది ఏ తరగతికి చెందిన శైవలాలను జీవ ఎరువులుగా వాడతారు?

1) ఆకుపచ్చ శైవలాలు    2) గోధుమ వర్ణ శైవలాలు

3) నీలి ఆకుపచ్చ శైవలాలు    4) ఎరుపు శైవలాలు 

జ: నీలి ఆకుపచ్చ శైవలాలు

 

2. అంతరిక్ష ప్రయాణాల్లో వాడే శైవలం?

1) క్లామిడోమోనాస్‌    2) క్లోరెల్లా    3) మాక్రోసిస్టిస్‌    4) యూగ్లీనా 

జ: క్లోరెల్లా    ​​​​​​​

 

3. శిలీంధ్రాలు అలైంగిక ప్రత్యుత్పత్తిలో వేటిని ఏర్పరుస్తాయి?

1) పురుషబీజాలు     2) స్త్రీ బీజాలు    3) సంయుక్తబీజం     4) సిద్ధబీజాలు  

జ: సిద్ధబీజాలు  ​​​​​​​

 

4. కింది ఏ శిలీంధ్ర జాతులను జన్యుశాస్త్ర ప్రయోగాల కోసం వాడుతున్నారు?

1) న్యూరోస్పోరా     2) రైజోపస్‌     3) ఆస్పర్‌ జిల్లస్‌    4) ఆష్బియా    

జ: న్యూరోస్పోరా    

 

5. లివర్‌వర్టులు, కొమ్ముమొక్కలు కింది ఏ విభాగానికి చెందినవి?

1) థాలోఫైటా    2) బ్రయోఫైటా    3) టెరిడోఫైటా    4) వివృతబీజాలు  

జ: బ్రయోఫైటా    ​​​​​​​

 

6. ఏ టెరిడోఫైటా మొక్కను వరిపోలాల్లో జీవ ఎరువుగా వాడుతున్నారు?

1) లైకోపోడియం   2) సెలాజినెల్లా    3) మార్సీలియా    4) అజొల్లా 

జ: అజొల్లా ​​​​​​​

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌