• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి

దక్షిణంలో ఉష్ణం.. ఉత్తరంలో సమశీతోష్ణం!

విస్తారమైన భౌగోళిక పరిధి, విభిన్న నైసర్గిక స్వరూపాలు, వైవిధ్య వాతావరణ పరిస్థితులున్న భారతదేశంలో శీతోష్ణస్థితి ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటుంది. తీవ్రమైన ఎండలు, వణకించే చలి, కుండపోత వర్షాలు, కరవు ఛాయలు లాంటివన్నీ దేశంలో కనిపిస్తుంటాయి. నిర్ణీత కాలవ్యవధులకు  అనుగుణంగా రుతువులు, రుతుపవనాలు వస్తుంటాయి. సముద్రజలాల ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుగుణంగా అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంటాయి. ఇన్ని రకాల పరిస్థితులకు కారణమవుతున్న దేశ నైసర్గిక, భౌగోళిక అమరికలు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని శీతోష్ణస్థితుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాతావరణ శాఖ పేర్కొన్న రుతుపవన కాలాలతో పాటు  దేశ వాతావరణ ముఖచిత్రంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.
 

సువిశాల భూభాగం ఉన్న భారతదేశంలో వ్యవసాయం మూలాధారంగా అనేక వృత్తులున్నాయి. ఒక ప్రాంత శీతోష్ణస్థితి ఆ ప్రాంత వ్యవసాయం, మానవుల నివాసాలు, వస్త్రధారణ, ఆహారం, రవాణా సౌకర్యాలు, పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ వేడి లేదా అధిక చలి ఉన్న ప్రాంతాలు ప్రజాజీవనానికి అంత అనుకూలం కావు. ఒక ప్రాంతంలో అనుకూలంగా ఉండే శీతోష్ణస్థితిని ఆ ప్రాంత వనరుగా భావించవచ్చు. భారతదేశ వాతావరణ సమాచారాన్ని భారత వాతావరణ శాఖ (ఇండియన్‌   మెట్రలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌) అధ్యయనం చేస్తుంది. దీన్ని మొదట 1875లో కోల్‌కతాలో స్థాపించారు. ప్రస్తుతం దిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది.


భారతదేశం ఉత్తరార్ధ గోళంలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది. కర్కటరేఖ దేశం మధ్యలో నుంచి వెళుతుంది. అందుకే దక్షిణ సగభాగం ఉష్ణమండలంలో, ఉత్తర సగభాగం సమశీతోష్ణ మండలంలో ఉన్నట్లుగా చెప్పొచ్చు. భారతదేశ శీతోష్ణస్థితిని ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిగా పేర్కొంటారు. మనదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు, దక్షిణాన ఉన్న హిందూమహాసముద్రం ఇక్కడి ఉష్ణోగ్రత, వర్షపాతాలపై ప్రభావం చూపుతాయి. దేశంలో ఉత్తర భాగం ఖండాంతర్గతంగా ఉండటంతో అధిక వేడి, ఎక్కువ చలి ఉంటే.. దక్షిణ భాగం ద్వీపకల్ప భాగంలో, సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయి.


దేశ ఉనికి, భూ-జల విస్తరణ, సముద్ర తీర ప్రాంతం నుంచి దూరం, హిమాలయ పర్వతాలు, ప్రదేశ ఎత్తు, పవనాలు మొదలైనవి. ఇవేకాకుండా ఎల్‌ నినో, లా నినో, దక్షిణ డోలాయనం, జెట్‌స్ట్రీమ్స్‌ కూడా ప్రభావితం చేస్తాయి.ఉష్ణోగ్రత, వర్షపాతాలను అనుసరించి దేశంలో మూడు రుతువులున్నాయి. అవి

1) వేసవి కాలం

2) వర్షాకాలం  

3) శీతాకాలం.


దేశ రుతుపవనాలు, ఉష్ణోగ్రతలను అనుసరించి భారత వాతావరణ శాఖ కాలాలను విభజించింది. అవి

1) శీతాకాలం - (డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు)

2) వేసవి కాలం - (మార్చి నుంచి మే వరకు)

3) నైరుతి రుతుపవన కాలం - (జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు)

4) ఈశాన్య రుతుపవన కాలం - (అక్టోబరు - నవంబరు)


వేసవిలో భారతదేశ వాయవ్య ప్రాంతంలో అధిక వేడిమి వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో పసిఫిక్‌ మహాసముద్రంలో, ఆస్ట్రేలియాలోనూ అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ కారణంగా పవనాలు దక్షిణార్ధ గోళం నుంచి భూమధ్యరేఖ దాటుకుని కుడిపక్కగా వంగి భారతదేశం వైపు పయనిస్తూ నైరుతి రుతుపవనాలుగా మారతాయి. రుతుపవనం (మాన్‌సూన్‌) అనే పదం ‘మౌసిమ్‌’ అనే  అరబిక్‌ పదం నుంచి వచ్చింది. మనదేశంలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా వ్యవసాయం, విద్యుత్తు ఉత్పత్తిపై ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వీస్తాయి. వీటినే ‘వేసవి వర్షాలు’ అంటారు. దేశ వార్షిక వర్షపాతంలో వీటి వాటా 70%. ఇక అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాలు వీస్తాయి. వీటిని ‘శీతాకాల వర్షాలు’ అంటారు. ఉష్ణోగ్రత, వర్షపాతాలను చూపే పటాలను ‘క్లైమోగ్రాఫ్స్‌’ అంటారు.


* శీతాకాలం: నవంబరు రెండో వారంలో మొదలై డిసెంబరు, జనవరి నాటికి చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర భారత దేశంలో జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శీతాకాలంలో ఉత్తర భారతాన కురిసే సాధారణ హిమపాతాన్ని ‘మహవత్‌’ అంటారు. శీతాకాలంలో ఉత్తర భారతంలో పర్షియన్‌ దేశాల నుంచి వచ్చిన ‘పశ్చిమ అలజడుల’ వల్ల వర్షం కురుస్తుంది. ఈ వర్షం అక్కడి రబీ పంటలకు అనుకూలం. భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ద్రాస్‌ (కార్గిల్‌) సెక్టార్‌ ప్రాంతం  (-450)    


* వేసవి కాలం: వేసవిలో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనికి కారణం సూర్యుడు భూమధ్యరేఖ నుంచి కర్కటరేఖ వరకు పయనిస్తూ, సూర్యకిరణాలు భూమిపై నిటారుగా పడటమే. ఈ కాలంలో దేశ వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల, బంగాళాఖాతం నుంచి, అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు సంవహనం చెందడం వల్ల దేశంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయి. వీటినే ‘సంవహన వర్షపాతాలు’ అంటారు. తెలంగాణలో ‘తొలకరి జల్లులు’, ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏరువాక జల్లులు’ అని అంటారు. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ‘మ్యాంగో షవర్స్‌’ లేదా ‘ముంగూరు’ వర్షాలని పిలుస్తారు. వేసవిలో దేశ వాయవ్య ప్రాంతంలో అత్యంత వేగంగా వీచే వేడి, పొడి గాలులను ‘లూ’ (Loo) అని పిలుస్తారు. వేసవిలో రాజస్థాన్‌లోని   జైసల్మీర్‌లోని గంగానగర్‌లో జూన్‌లో 50 ా‘ వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. 2016లో రాజస్థాన్‌ పలోడి ప్రాంతంలో అత్యధికంగా 51 ా‘ ఉష్ణోగ్రత నమోదైంది.


నైరుతి రుతుపవన కాలం


భారతదేశంలో పంటలకు ముఖ్యమైన ఈ రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో ప్రారంభమై జులై రెండో వారానికల్లా దేశమంతటా విస్తరిస్తాయి. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 80 శాతం ఈ రుతుపవనాల వల్లే కురుస్తుంది. ఇవి దేశంలో  మొదటగా అండమాన్, నికోబార్‌ దీవులను; కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. నైరుతి రుతుపవన కాలంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువ. పర్వతాల పశ్చిమ భాగంలో ఎక్కువగా, తూర్పుభాగంలో తక్కువగా కురుస్తుంది. తక్కువ వర్షం కురిసే ప్రాంతాన్ని ‘వర్షచ్ఛాయా ప్రాంతం’ అంటారు. దేశంలో అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రమ్‌  (1187 సెం.మీ.), చిరపుంజి (1141 సెం.మీ.)ల్లో నమోదవుతుంది.

ఈశాన్య రుతుపవనాలు

వీటినే తిరోగమన రుతుపవనాలు అంటారు.  భారత్‌లో గంగా మైదానంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అక్టోబరు రెండో వారం నాటికి బంగాళాఖాతం వరకు పోతుంది. దీని ప్రభావానికి లోనై దేశ ఈశాన్య దిశ నుంచి ద్వీపకల్పం వైపు రుతుపవనాలు తిరోగమిస్తాయి. ఈ పవనాలు బలహీనంగా ఉండి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి. అక్టోబరులో దక్షిణ   భారతదేశంలో ఏర్పడిన ‘అక్టోబర్‌ హీట్‌’ వల్ల అల్ప పీడనం ఏర్పడి తుపాన్లు వస్తాయి. దేశ మొత్తం వర్షపాతంలో ఈశాన్య రుతుపవనాల వల్ల సుమారు 10-13% వర్షం కురుస్తుంది. తమిళనాడులోని కోరమాండల్‌ తీరంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. కర్ణాటక, కేరళ, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొద్దిప్రాంతంలో వానలు పడతాయి. ఈ రుతుపవనాలు అక్టోబరులో ప్రారంభమై    డిసెంబరు చివరి నాటికి దేశమంతటా విస్తరిస్తాయి.


భారతదేశ సగటు వర్షపాతం 118.7 సెం.మీ.లు. వర్షం కురిసే రోజులు 40-45. దేశ ఈశాన్య రాష్ట్రాల్లో 180 రోజులు ఉండగా, పశ్చిమాన రాజస్థాన్‌ ప్రాంతంలో 20 రోజులు మాత్రమే. ప్రపంచ వర్షపాతంలో సుమారు 4% వర్షపాతం మన దగ్గర కురుస్తుంది. రుతువుల వారీగా చూస్తే నైరుతి రుతుపవనాల వల్ల 75% - 80% వరకు, ఈశాన్య రుతుపవనాల వల్ల 10-13%, వేసవిలో 8-10%, శీతాకాలంలో 2-3% వర్షం దేశంలో నమోదవుతుంది. అత్యధిక వర్షపాతం జులై, ఆగస్టు నెలల్లో, అత్యల్ప వర్షపాతం డిసెంబరు, జనవరి మాసాల్లో నమోదవుతుంది.


వర్షపాతం ఆధారంగా దేశంలోని ప్రాంతాలను నాలుగు రకాలుగా విభజించొచ్చు. 200 సెం.మీ. కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను అధిక వర్షపాత ప్రాంతాలని, 100-200 సెం.మీ. వర్షం పడే ప్రాంతాలను సాధారణ వర్షపాత ప్రాంతాలని, 50-100 సెం.మీ. వర్షం పడే ప్రాంతాలను తక్కువ వర్షపాత ప్రాంతాలని, 50 సెం.మీ. కంటే తక్కువ వర్షం నమోదైతే అత్యల్ప వర్షపాత ప్రాంతాలని అంటారు. మన దేశంలో సగటు వర్షపాతంలో 75% కంటే తక్కువ వర్షపాతం ఉండే స్థితిని కరవుగాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని తీవ్ర కరవుగాను పరిగణిస్తారు. మన దేశ భూభాగంలో 68% భూభాగం కరవు ప్రాంతంలో ఉంది.


* ఎల్‌ నినో: దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా వేడెక్కడాన్ని ‘ఎల్‌ నినో’ అంటారు. దీనర్థం చిన్నబాలుడు (The Christ Child). ఈ పరిణామాన్ని మొదటగా పెరూ మత్స్యకారులు గుర్తించారు. ప్రతి 3 - 7 ఏళ్లలో ఈ పరిస్థితి సంభవించవచ్చు. దీనివల్ల భారత్‌తోపాటు ఆగ్నేయాసియా దేశాల్లో రుతు పవన వ్యవస్థ దెబ్బతిని వర్షాలు సరిగా   కురవక, కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.


* లా నినో: పెరూ శీతల ప్రవాహం బలంగా ఉన్నప్పుడు భూమధ్యరేఖ వరకు ప్రయాణించి పసిఫిక్‌ మహాసముద్ర ఉష్ణోగ్రతలు తగ్గిస్తుంది. ఈ స్థితే ‘లా నినో’. దీనర్థం చిన్న బాలిక (The Christ Girl). దీనివల్ల భారత్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.


* దక్షిణ డోలనం: హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రం మధ్య పీడన    వ్యవస్థలో ఏర్పడే పరస్పర  వ్యతిరేకతనే దక్షిణ డోలనం/ టెలీలింక్స్‌ అంటారు.రచయత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 26-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌