• facebook
  • whatsapp
  • telegram

కమ్యూనిటీ ప్రణాళిక 

సంక్షోభాల నివారణలో  స్థానిక వ్యూహాలు!

ఆపద అనుకోకుండా సంభవిస్తుంది. ఆ సమయంలో అవసరమైన సాయం అందేలోపు అవాంఛనీయ నష్టం జరిగిపోవచ్చు. అప్రమత్తంగా ఉంటే ఆ తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే స్థానిక వనరులు, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని విపత్తు ప్రభావాన్ని తక్కువ చేసే లేదా తప్పించే ప్రణాళికలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పరస్పర సహకారం, సమాచారం, సమన్వయంతో సంక్షోభాల నుంచి బయటపడే వ్యూహాలను స్థానికంగా నేర్పిస్తోంది. వాటిపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన కలిగి ఉండాలి. విపత్తులను ఎదుర్కొనే స్థానిక యంత్రాంగాలను సిద్ధం చేసే తీరు, రక్షణ బృందాల ఏర్పాటు, శిక్షణ విధానాలనూ తెలుసుకోవాలి. 


ఒక నిర్దిష్ట ప్రదేశంలో వైపరీత్యాలను సమర్థంగా ఉపశమింపజేసే చర్యలు ప్రభుత్వం చేపట్టడానికి స్థానిక కమ్యూనిటీ సాయం కావాలి. భారత ప్రభుత్వం పలురకాల వైపరీత్యాలను తగిన విధంగా ఎదుర్కొనే నివారణ, ఉపశమన సన్నద్ధతకు అవసరమైన విపత్తు నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయాలని కమ్యూనిటీలను కోరుతోంది. విపత్తు నిర్వహణకు స్థానిక కమ్యూనిటీయే ప్రధానమైన విభాగమని పలు అంశాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 

మొదటి ప్రతిస్పందకుడు: విపత్తు సంభవించే ప్రదేశం కమ్యూనిటీయే కాబట్టి, తొలిగా స్పందించేది కూడా కమ్యూనిటీయే.  

గరిష్ఠ సమాచారానికి వనరు: ఒక ప్రాంతంలో విపత్తు సంభవించినప్పుడు అక్కడ నివసించేవారు మినహా మరెవ్వరూ ఆ ప్రాంతానికి సంబధించిన అత్యుత్తమ లేదా సమగ్ర తాజా సమాచారాన్ని ఇవ్వలేరు. 


విపత్తులను ఎదుర్కొనే స్థానిక యంత్రాంగాలు: అత్యధిక శాతం విపత్తులు పునరావృతమవుతాయి. కాబట్టి, తరాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న విపత్తులను ఎదుర్కొనే సంప్రదాయబద్ధమైన యంత్రాంగాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది స్థానిక వాతావరణాల్లో అత్యంత వేగంగా స్పందించే యంత్రాంగం అవుతుంది. దీనిని సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అభివృద్ధి పరచాలి. 

స్వ ప్రయోజనంలో స్వయం సమయం: విపత్తుల లాంటి సందర్భాల్లో వెలుపలి సహకారంపై అధికంగా ఆధారపడకుండా కమ్యూనిటీ వెంటనే స్పందించడం సహజ లక్షణం. 

పాఠశాల, ఇంటి వద్ద భద్రతా సూత్రాలు: 2001, జనవరి 26న గుజరాత్లో సంభవించిన భూకంపంలో 971 మంది విద్యార్థులు, 31 మంది ఉపాధ్యాయులు మరణించారు. బలహీన కట్టడాల కారణంగా 1884 పాఠశాల భవనాలు కుప్పకూలిపోయాయి. భుజ్ పట్టణంలోని ఇరుకైన వీధి నుంచి గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కవాతు చేసుకుంటూ వెళ్తున్న 300 మంది విద్యార్థులపై భవనాలు కూలడంతో వారు మరణించారు. భూమి కంపించడం ప్రారంభమవ్వగానే బాంబు పేలినట్లు భయపడి చాలా మంది పిల్లలు పాఠశాల భవనాల్లోకి పరుగులు తీసినట్లు వార్తలు వచ్చాయి.

* 2008, మే 12న చైనాలో సంభవించిన భూకంపంలో కూడా 900 మందికి పైగా హైస్కూలు విద్యార్థులు చనిపోయారు. ఈ రెండు ఘటనలు నిర్మాణాత్మకంగా, నిర్మాణేతరంగా కూడా సురక్షితమైన పాఠశాలలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించడంతోపాటు పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంటే విలువైన ప్రాణాలను కాపాడవచ్చు.  

* పాఠశాల విద్యార్థుల దుర్బలత్వాన్ని ప్రతిబింబించే మరొక సంఘటన 2004, జులై 16న తమిళనాడులోని లార్డ్ కృష్ణ స్కూల్లో జరిగింది. ఈ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 93 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. వీరంతా 11 ఏళ్లలోపు వారే. ఈ సంఘటనలు పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠశాలల్లో సురక్షిత వాతావరణం కలిగి ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అత్యధిక శాతం విపత్తులు హఠాత్తుగా సంభవిస్తాయి కాబట్టి సురక్షితమైన పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ఇల్లు, పాఠశాల వద్ద చేపట్టాల్సిన కొన్ని మౌలిక కార్యకలాపాలు:  భిన్న రకాల వైపరీత్యాలపై పాఠశాల, ఇంటి వద్ద అవగాహన కల్పించడం.

* పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయడం.  

* పాఠశాలలను రద్డీగా ఉండే రహదారులు, లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాకులు, ఆస్పత్రులు లాంటి వాటికి దూరంగా ఉండే విధంగా చూడటం.

* పాఠశాలల్లో నిర్మాణాత్మక, నిర్మాణేతర సురక్షితత్వాన్ని కాపాడటం.

పాఠశాలల్లో సంభవించే మానవ కారక విపత్తులు:  వార్షికోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలు

* విహారయాత్రల్లో జరిగే ప్రమాదాలు

* పాఠశాల ఆవరణలో జరిగే అగ్ని ప్రమాదాలు

* ఉగ్రవాద దాడి

* అపహరణ (కిడ్నాపింగ్)

* ఉద్దేశపూర్వకంగా జరిగే హింసాత్మక దాడి

* విషపూరిత ఆహారం

* ప్రయాణాల సందర్భంగా జరిగే ప్రమాదాలు. సురక్షితమైన పాఠశాల వాతావరణం ఉండాలంటే పాఠశాలకు, ఇంటికి సంబంధించిన విపత్తు నిర్వహణ ప్రణాళిక తప్పనిసరి. దానివల్ల విపత్తు సందర్భంగా సంభవించే నష్టాన్ని తగ్గించవచ్చు.  

విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు, శిక్షణ: విపత్తు నిర్వహణ బృందాల్లో ఉండాల్సిన అంశాలను గుర్తుంచుకోవాలి. అవి-

* అవగాహన కలిగిన బృందం

* హెచ్చరికలు, సమాచారాన్ని చేరవేసే బృందం

* ప్రథమ చికిత్సా బృందం

* శోధన, రక్షణ చర్యల బృందం

విపత్తుల నివారణ, ఉపశమనానికి చేపట్టాల్సిన చర్యలు:  భారత ప్రభుత్వం విపత్తుల వల్ల కలిగే ముప్పును తగ్గించడానికి పలు ఉపశమన చర్యలను సూచించింది. వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేస్తాయి. అవి-

* భవనం కూలడానికి అవకాశం ఉందా? లేదా? తెలుసుకోవడానికి దాని గోడలు, నేల, తలుపులు, మెట్లు, కిటికీలను సునిశితంగా పరిశీలించాలి.

* పునాదులకు పగుళ్లు వచ్చాయా? లేదా ? అని తనిఖీ చేయాలి. పునాదికి పగుళ్లు రావడం లేదా ధ్వంసమైనట్లయితే, ఆ భవనం నివాసానికి పనికి రాదు.

* అగ్ని ప్రమాదాలేమైనా జరిగాయా? లేదా పరిశీలించాలి. లీకవుతున్న గ్యాసు లైన్లు, కొట్టుకుపోయిన విద్యుత్తు సర్క్యూట్లు, సగం మునిగిన కొలుములు, విద్యుత్తు సామగ్రి లాంటి వాటిని గమనించాలి.

* మండే స్వభావం ఉన్న/పేలుడు పదార్థాలు ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉండవచ్చు. వాటివల్లే వరదల తర్వాత అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.

* మురుగునీరు, తాగునీరు లైన్లు దెబ్బతిన్నాయా అని తనిఖీ చేసుకోవాలి. దెబ్బతిన్నట్లు అనుమానం వస్తే మరుగుదొడ్లను వాడటం ఆపేసి ప్లంబరును పిలిపించాలి.

* వరదలు/సునామీ వల్ల వచ్చిన నీటితోపాటు భవనాల్లోకి విషపూరితమైన పాములు, ఇతర జంతువులు వచ్చాయేమో పరిశీలించాలి. చెత్తను కర్రతో కదిలించి చూడాలి.

* పొడిబారిన గోడలు, పైకప్పులు పడిపోయే ప్రమాదం ఉందేమో చూడాలి.

* తడిచిన భవనం ఆరిపోవడానికి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.

పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఉండాల్సిన ఆవశ్యక అంశాలు

పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. దాని ఆవశ్యకతను తెలియజేయాలి.

విపత్తు నిర్వహణ కమిటీ ఏర్పాటు: ఈ కమిటీ సభ్యులు పాఠశాలకు సంబంధించిన ప్రణాళికకు మార్గనిర్దేశకత్వం వహించడంలో, ప్రణాళికను అభివృద్ధి చేయడంలో పూర్తి బాధ్యత కలిగి ఉంటారు. 

వైపరీత్యాన్ని గుర్తించి, అంచనా వేయడం: పాఠశాలలు విపత్తుకు గురయ్యే అవకాశం ఉందని, పాఠశాలల యాజమాన్యంతో పాటు అందరికీ తెలియజేయడం చాలా ముఖ్యం. 

మానవ, భౌతిక వనరుల జాబితా: విపత్తు ప్రతిస్పందనలో మానవ, భౌతిక వనరులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాఠశాలలో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి జాబితా రూపొందించాలి. ప్రథమ చికిత్సలో శిక్షణ పొందినవారు శోధన, రక్షక చర్యల సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది లాంటి మానవ వనరుల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, సీనియరు విద్యార్థులకు ఈ అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. 

మ్యాపింగ్: చిన్నారులు, ఇతర సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న వనరులను గుర్తించడానికి మ్యాపింగ్ ఎంతగానో దోహదపడుతుంది. విభిన్న అవసరాలకు తగినట్లుగా నాలుగు భిన్నమైన మ్యాపులు ఉన్నాయి.

ఎ) సోషల్ మ్యాపు:

* ఇది పాఠశాల భౌతిక స్వరూపాన్ని వివరిస్తుంది.

* పాఠశాలలో ఉన్న పక్కా, ఆర్సీసీ, పెంకులున్న తరగతి గదులు 

* పాఠశాలలోని సిబ్బంది గది  

* పాఠశాలలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హోంసైన్స్ ప్రయోగశాలలు.

* పాఠశాల క్యాంటీను, పాఠశాల్లోని ముఖ్యమైన ప్రదేశం.

* పాఠశాల ఆవరణంలోని ఆట స్థలాలు, బహిరంగ ప్రదేశాలను ఈ మ్యాపు సూచిస్తుంది. 

బి) వనరుల మ్యాపు: విపత్తు సందర్భంలో తేలికగా గుర్తించే విధంగా అన్ని రకాల మానవ, భౌతిక వనరుల జాబితాను ఇందులో పొందుపరుస్తారు. 

సి) దుర్బలత్వ మ్యాపు: పాఠశాల భవనంలోని దుర్బల ప్రదేశాలను చూపుతుంది.

* ప్రతి తరగతి గదికి సంబంధించిన మ్యాపులో అందులోని పిల్లలు, వారి వివరాలను గుర్తించాలి.

* పాఠశాలలో బలహీనమైన నిర్మాణాలున్న తరగతి గదులు, ప్రయోగశాలలు, క్యాంటీన్లను సూచిస్తుంది.

* పాఠశాల్లోని మెయిన్ స్విచ్ బోర్డు ఉన్న ప్రదేశాన్ని తెలియజేస్తుంది.

* పాఠశాలల్లోని లోతట్టు ప్రదేశాలను గుర్తిస్తుంది. 

డి) పాఠశాలల్లోని సురక్షిత ప్రదేశం, ఖాళీ చేసే మార్గం చార్టు:

* సురక్షితమైన ప్రదేశాలను గుర్తిస్తుంది.

* పిల్లలు, సిబ్బంది ఆశ్రయం పొందడానికి అవసరమైన సురక్షిత ప్రదేశాలను తెలియజేస్తుంది.

* ఖాళీ చేసే మార్గపు చార్టు మొత్తం భవనాన్ని, భవనంలోని కిటికీలు, తలుపులు, బహిరంగ ప్రదేశాలన్నింటినీ స్పష్టంగా చూపిస్తుంది.

* అగ్ని ప్రమాదం/ భూకంపాలు సంభవించినప్పుడు తప్పించుకోవడానికి బయటకు వేళ్లే దారిని స్పష్టంగా చూపిస్తుంది.

* పాఠశాలలో బయటకు వెళ్లే మార్గాలను బాణపు గుర్తులతో స్పష్టంగా తెలియజేస్తుంది.

* సిద్ధం చేసిన మ్యాపులను పాఠశాల ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించాలి.

* బయటకు వెళ్లే మార్గాల్లో ఏవైనా దెబ్బతిని ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించాలి.
 


రచయిత: ఈదుబిల్లి   వేణుగోపాల్ 


 

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌