• facebook
  • whatsapp
  • telegram

 పర్యావరణ సంబంధ సమకాలీన అంశాలు

లక్షద్వీప్ సముదాయంలో ఉన్న పరాలి - I (Parali I island) తీర ప్రాంత క్రమక్షయం వల్ల అదృశ్యమైనట్లు ఇటీవల చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. జీవ వైవిధ్య సంపద అధికంగా ఉండే ఇలాంటి ప్రాంతాలు అదృశ్యమైతే జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది.
¤ మన దేశానికి చెందిన సుందర్‌బన్స్‌కు సంబంధించిన జంతు సంపదను అధికారికంగా మొదటగా ZSI (Zoological Survey of India) ఇటీవల ప్రకటించింది. దీనికే Fauna of Sundarban Biosphere Reserve) గా పేరు పెట్టారు.
» మన దేశ సుందర్‌బన్స్‌ విభాగానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు లభించింది.
» సుందర్‌బన్స్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద మడఅడవిగా పేర్కొనవచ్చు (Largest tidal halophytic mangrove forest).


మౌస్‌డీర్‌లు

¤ తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ తొలిసారి మౌస్‌డీర్‌ను నల్లమల అడవుల్లో పునఃపురస్థాపనం (Reintroduction) చేసింది. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్‌లో ప్రజననం చేసిన ఈ మౌస్‌డీర్‌ను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పునఃపురస్థాపనం చేశారు. మౌస్‌డీర్‌లు (Spotted Chevrotain) జీవవైవిధ్యపరంగా అపాయకర స్థాయిలో ఉన్న జీవులుగా గుర్తింపు పొందాయి.
'కలప మంచిది'

¤ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్త్లెమేట్ ఛేంజ్ (MoEFCC) 'కలప మంచిది' అనే విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచార కార్యక్రమాన్ని స్టీల్, ప్లాస్టిక్ లాంటి పదార్థాలకు ప్రత్యామ్నాయంగా కలపను ఎక్కువగా ఉపయోగించే దిశగా అవగాహన కల్పించడానికి నిర్దేశించారు. కలపను అధికంగా ఉపయోగించడం వల్ల కార్బన్ కాలుష్యాన్ని నిరోధించవచ్చు.
» ఈ అవగాహన కార్యక్రమాన్ని ఫారెస్ట్ ప్లస్(Forest - plus) భాగస్వామ్యంతో ఏర్పాటుచేశారు. MoEFCC, USAID (United States Agency for International Development) సంయుక్తంగా REDD ని బలోపేతం చేయడానికి ఫారెస్ట్ ప్లస్‌ను నిర్వహిస్తున్నాయి. (REDD - Reducing Emissions from Deforestation and Forest Degradation).
» REDD కార్యక్రమాన్ని FAO (Food and Agriculture Organization), UNDP (United Nations Development Programme), UNEP (United Nations Environment Programme) పరస్పర సౌజన్యంతో నిర్వహిస్తున్నారు.


ఎలక్ట్రిక్ బస్ సర్వీస్

¤ మన దేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోతాంగ్ ప్రదేశంలో మొదటి ఎలక్ట్రిక్ బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. చాలా ఎత్త‌యిన‌ ప్రదేశంలో, పర్యటక కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్ సర్వీస్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ బస్ రోతాంగ్, మనాలీ ప్రాంతాల‌ మధ్య ప్రయాణిస్తుంది.
జాతీయ వన్యప్రాణి కార్యాచరణ ప్రణాళిక

¤ MoEFCC ఇటీవల మూడో జాతీయ వన్యప్రాణి కార్యాచరణ ప్రణాళిక (National Wildlife Action Plan)ను ఆవిష్కరించింది. ఈ కార్యాచరణ ప్రణాళికా సమయాన్ని 2017 - 2031 గా నిర్ణయించారు.
» ఈ ప్రణాళికకు జేసీ కలా నాయకత్వం వహించగా, ఆ కమిటీలో సుమారు 12 మంది సభ్యులున్నారు. వన్యజాతులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసే, మొదటి కార్యాచరణ ప్రణాళికగా దీన్ని పేర్కొంటారు.
» మొదటి నేషనల్ వైల్డ్‌లైఫ్ యాక్షన్ ప్లాన్‌ 1983లో ప్రారంభమై 2001లో ముగిసింది. రెండోది 2002లో ప్రారంభమై 2016లో ముగిసింది.


గ్లోబల్ వైల్డ్‌లైఫ్ ప్రోగ్రాం

¤ గ్లోబల్ వైల్డ్‌లైఫ్ ప్రోగ్రాం (GWP) సదస్సు ఇటీవల దిల్లీలో జరిగింది. దీనికి MoEFCC, ప్రపంచ బ్యాంక్, యూఎన్‌డీపీ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చి, నిర్వహించాయి. GWPలో ఆసియా, ఆఫ్రికాలకు చెందిన సుమారు 19 దేశాలకు సభ్యత్వం ఉంది. దీన్ని 2015లో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (WEF) ప్రారంభించింది. స్థిరాభివృద్ధి సాధన, వనరుల సంరక్షణ దీని ప్రధాన లక్ష్యం.
సెక్యూర్ హిమాలయ


¤ కేంద్రం ఇటీవల 'సెక్యూర్ హిమాలయ' (Secure Himalaya) అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం స్థానీయంగా లభించే ప్రాపంచిక ప్రాముఖ్యం కలిగిన జీవవైవిధ్య సంపదను సంరక్షించడం.
» ఈ ప్రాజెక్ట్ కాలపరిమితి ఆరు సంవత్సరాలు. దీని‌లో నాలుగు రాష్ట్రాల్లోని జీవసంపదను సంరక్షిస్తారు. అవి: హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం.
» కేంద్ర మంత్రిత్వ శాఖ (MoEFCC) ఐక్య రాజ్య సమితికి చెందిన యూఎన్‌డీపీ సాయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.

ట‌ర్టిల్ శాంక్చ్యుయ‌రీ

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ న‌దీ తీరంలో న‌మామి గంగే కార్య‌క్ర‌మంలో భాగంగా ట‌ర్టిల్ శాంక్చ్యుయ‌రీని స్థాపించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. మాన‌వప్రేరిత కార‌ణాల వ‌ల్ల జీవ‌వైవిధ్యానికి విఘాతం క‌ల‌గ‌కుండా దీన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. సంగంలో రివ‌ర్ బ‌యోడైవ‌ర్సిటీ పార్క్ వెంట ఈ శాంక్చ్యుయ‌రీ ఏర్పాట‌వుతుంది.

గ్రీన్ ప్లాటినమ్ అవార్డు

¤ మహారాష్ట్రలోని పాల్గుర్ జిల్లాలో ఇస్కాన్ (ISKCON International Society for Krishna Consciousness) నెలకొల్పిన 'గోవర్థన్ ఎకో విలేజ్‌'కు గ్రీన్ ప్లాటినమ్ అవార్డు లభించింది. ఈ బహుమతిని రాజస్థాన్‌లోని జయపురలో (జైపూర్) జరిగిన గ్రీన్‌బిల్డింగ్ కాంగ్రెస్ 2017లో అందజేశారు.
» గోవర్థన్ ఎకో విలేజ్ సుమారు 100 ఎకరాల్లో విస్తరించిన కాలుష్యరహిత ప్రాంతం. దీన్ని 2003లో ప్రారంభించారు.
» ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఈ గ్రీన్‌ప్లాటినం అవార్డులను ప్రదానం చేస్తుంది. ఐజీబీసీని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) స్థాపించింది.


గ్లోబల్ వైల్డ్‌లైఫ్ కాన్ఫరెన్స్

¤ గ్లోబల్ వైల్డ్‌లైఫ్ కాన్ఫరెన్స్ 12వ సమావేశం 2017, అక్టోబరు 23 నుంచి 28 వరకు మనీలాలో జరిగింది. దీన్నే CMS COP12 (Convention on the Conservation of Migratory Species of Wild Animals (CMS) Conference of Parties - Cop12) అంటారు. ఇది Their future is our future - Sustainable Development for Wildlife and People' అనే ముఖ్య ఉద్దేశంతో CMS CoP-12 జరిగింది. ఇలాంటి సమావేశం మన ఆసియా ఖండంలో జరగడం ఇదే తొలిసారి.


కొత్త చీమజాతి

¤ అత్యంత జీవవైవిధ్య సంపద కలిగిన పశ్చిమ కనుమల ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వ్‌లో పరిశోధకులు ఒక కొత్త చీమజాతిని కనుక్కున్నారు. చీమలపై విశేష పరిశోధనలు జరిపి India's Ant man గా పేరుపొందిన శాస్త్రవేత్త ముస్తాక్ ఆలీ పేరు మీద టైరనోమైర్మిక్స్ ఆలీగా నామకరణం చేశారు.


అతిచిన్న తాబేలు

¤ ఆలివ్ రిడ్లే తాబేలు ఆలివ్ రంగులో ఉండే పెంకు నిర్మాణాన్ని కలిగిన అతిచిన్న తాబేలు రకం. ఇది ప్రమాదకర స్థితిలో ఉండటం వల్ల వన్యప్రాణి సంరక్షణా చట్టం కింద రక్షణ కల్పిస్తున్నారు. ఇటీవల ఇవి ఒడిశాలోని గహిర్మాతా సముద్రతీరానికి (Gahirmatha beach) అధిక సంఖ్యలో తరలివచ్చాయి. గహిర్మాతా సముద్ర ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆలివ్ రిడ్లే స్థానంగా పేర్కొనవచ్చు. దీని శాస్త్రీయ నామం లెపిడోచెలిస్ ఆలివేసియా (Lepidochelys alivacea)


చిల్కా సరస్సు

¤  శీతాకాల సమయంలో వలస పక్షులు కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, రష్యా ప్రాంతాల నుంచి మన దేశంలోని ఒడిశా రాష్ట్రంలోని చిల్కా సరస్సుకు చేరతాయి. చిల్కాలో భాగమైన నలబానా బర్డ్ శాంక్చ్యుయరీలో ఎక్కువగా ఈ పక్షులను గుర్తించవచ్చు. చిల్కా సరస్సు మన దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఆసియా ఖండంలో కూడా ఇంతకంటే పెద్ద ఉప్పునీటి సరస్సు లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.
రి ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు న్యూ కేలిడోనియన్ బేరియర్ రీఫ్ (New Caledonian Barrier reef) అమెరికాలో ఉంది. మనదేశంలోని చిల్కా సరస్సు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.


నర్మదా మహోత్సవ్

¤ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 'నర్మదా మహోత్సవ్' యాత్రను ప్రారంభించారు. రెండువారాలపాటు జరిగిన ఈ యాత్ర ప్రధాన లక్ష్యం నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తును పెంచి నిర్మాణం పరిపూర్ణం చేయడం.
» 1961లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సర్దార్ సరోవర్ డ్యామ్‌కు శంకుస్థాపన చేశారు. నర్మదా నదిపై నిర్మించిన సుమారు 30 డ్యామ్‌లలో సర్దార్ సరోవర్ అతిపెద్దది కానుంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్యామ్ ఎత్తును 138.68 మీటర్ల మేర సంపూర్ణంగా పెంచడానికి 2017, జూన్ 17న నర్మదా కంట్రోల్ అథారిటీ నుంచి అనుమతి తీసుకుంది.
¤ ఇండియన్ కోస్ట్ గార్డ్ 2017, నవంబరు 29న తైల కాలుష్య నివారణ కోసం పోర్ట్‌బ్లెయిర్ కేంద్రంగా 'క్లీన్ సీ' 2017 నిర్వహించింది.


నల్లదుప్పి సంరక్షణ కేంద్రం

¤ అలహాబాద్ యమునా నదీ పరీవాహక ప్రాంతంలో నల్లదుప్పి సంరక్షణా కేందాన్ని (Blackbuck Conservation Reserve) స్థాపించడానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మన దేశంలో బ్లాక్‌బక్‌లకు మాత్రమే పరిమితమైన తొలి సంరక్షణా కేంద్రం ఇదే.
» బ్లాక్‌బక్ శాస్త్రీయ నామం ఏంటీ లోప్ సెర్వీకాప్రా (Antilope Cervicapra) ఇది చీతా తర్వాత అత్యంత వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉన్న జంతువుగా గుర్తింపు పొందింది.
» 1972 వన్యప్రాణి సంరక్షణా చట్టం ద్వారా దీన్ని వేటాడటం నేరం. IUCN రెడ్‌డేటా బుక్‌లో కూడా వీటికి స్థానం కల్పించారు.
¤ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గ్రీన్ గుడ్ డీడ్స్ అనే ప్రచార కార్యక్రమాన్ని 2018 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి పర్యావరణ మంత్రి డా. హర్షవర్దన్ న్యూదిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
¤ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoEFCC -Ministry of Environment, Forest and Climate Change) ఇటీవల బ్లూఫ్లాగ్ (Blue Flag) అనే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇది బీచ్ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంచడానికి, అభివృద్ధి పరచడానికి నిర్దేశించిన కార్యక్రమం. FEE (Foundation for Environmental Education)సముద్ర తీరాల స్థాయిని నిర్దేశించి, యోగ్యతను గణిస్తుంది. FEE అనేది లాభాపేక్షలేని ఒక ప్రభుత్వేతర సంస్థ. దీన్ని 1981లో స్థాపించారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. పర్యావరణ సంబంధ అవగాహన, విద్య ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడమనేది FEE ప్రధాన లక్ష్యం.


 ఫ్లెమింగో ఫెస్టివల్
     పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రాల్లో ఏటా మూడు రోజులపాటు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను  (Flamingo Festival)నిర్వహిస్తారు. ఈ పండుగను గత పన్నెండేళ్లుగా జరుపుతున్నారు. పర్యటకులను ఆకర్షించడానికి ఈ పండుగను జరపడం ఆనవాయితీగా మారింది. ఏటా సుమారు 80 రకాల పక్షులు 9000 నుంచి 12000 దాకా ప్రజననం కోసం శీతాకాలంలో పులికాట్, నేలపట్టు ప్రాంతాలకు వస్తుంటాయి. ప్రజనన ప్రక్రియ అయిపోగానే సంతతితోపాటు తిరిగి సైబీరియాకు ప్రయాణమవుతాయి.
¤ జియాన్ స్మాగ్ టవర్ (Xian Smog tower) నిర్మాణాన్ని చైనా పూర్తిచేసింది. ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకూ అత్యంత ఎత్త‌యిన‌ వాయుశుద్ధీకరణ స్తంభం. దీని ఎత్తు సుమారు 100 మీటర్లు (328 అడుగులు). ప్రస్తుతం చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు ఈ టవర్‌ను పరీక్షిస్తున్నారు.
¤ ఒడిశాకు చెందిన మంగలజోడి ఎకోటూరిజం ట్రస్ట్ ప్రతిష్ఠాత్మక UNWTO అవార్డ్‌ను (United Nations World Tourism Organisation) సొంతం చేసుకుంది. ఈ అవార్డ్‌ను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగిన 14వ బహుమతి ఉత్సవాల్లో ప్రదానం చేశారు. పర్యటక రంగంలో సృజనకు, నవీన ధోరణులకు ప్రోత్సాహకంగా ఈ అవార్డ్‌ను ఇస్తున్నారు.


వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

   మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లా ఘోదజారి ప్రాంతంలో ఒక కొత్త వన్యప్రాణి సంరక్షణ  కేంద్రాన్ని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ నిర్ణయం మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డ్ (SBWL - State Board for Wildlife)13వ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ సమావేశం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. ఈ నూతన వన్యప్రాణి సంరక్షణా కేంద్రం విస్తీర్ణం సమారు 159 చదరపు కిలోమీటర్లు. ఈ సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేయడం వల్ల దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 59 గ్రామాల యువకులకు ఉపాధి లభించే అవకాశం ఉంది.

¤ పర్యావరణ పనితీరు సూచీ (Environmental Performance Index - EPI)2018 సంవత్సర గణాంకాల ప్రకారం భారత్‌కు 177వ స్థానం దక్కింది. ఈ సూచీ కోసం మొత్తం పరిగణనలోకి తీసుకున్న దేశాలు 180. ఈ EPIని యేల్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయాలు రెండూ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, యూరోపియన్ కమిషన్ జాయింట్ రిసెర్చ్ సెంటర్ల సౌజన్యంతో తయారు చేశాయి. ఈ EPI - 2018 రిపోర్ట్‌ను 2018, జనవరి 23న విడుదల చేశారు. వాయు గుణాత్మకత, జల పారిశుద్ధ్యం, భార లోహాల కాలుష్యం, జీవ వైవిధ్యం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని EPIని తయారు చేశారు. 2018 EPIలో స్థానం సంపాదించుకున్న మొదటి అయిదు దేశాలు వరుసగా స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్తా, స్వీడన్. సూచికలో ఉన్న చివరి అయిదు దేశాలు వరుసగా నేపాల్, ఇండియా, కాంగో, బంగ్లాదేశ్, బురుండి.


మాగాణి నేలలు

    ప్రపంచ మాగాణి నేలల దినోత్సవాన్ని (WWD - World Wetland Day)ఏటా ఫిబ్రవరి 2న నిర్వహిస్తున్నారు. తడినేలల (మాగాణి నేలల) ప్రాధాన్యాన్ని తెలిజేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. 2018 సంవత్సరానికి ప్రధాన ఉద్దేశం 'పట్టణ ప్రాంతాల స్థిర భవిష్యత్ కోసం మాగాణి నేలలు' (Wetlands for a sustainble urban future).ఈ దినోత్సవాన్ని (WWD) మొదటిసారిగా 1997లో నిర్వహించారు.


పక్షి పండుగ

¤ పెలికాన్ పక్షి పండుగ - 2018 (Pelican Bird Festival - 2018) మొదటిసారిగా ఆటపాక పక్షి సంరక్షణా కేంద్రంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ, కృష్ణా జిల్లా అధికారవర్గం సంయుక్తంగా ఈ పక్షి పండుగను నిర్వహించాయి. కొల్లేరు నది మన దేశంలో ఉన్న మంచినీటి సరస్సుల్లో ఒకటి. ఇది కృష్ణా గోదావరి డెల్టాల భాగంలో ఉంది. నవంబరు 1999లో వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం దీన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రంగా గుర్తించారు. శీతాకాలంలో వేలకొద్ది పెలికాన్ పక్షులు కొల్లేరు ప్రాంతానికి వలస రావడం ఇక్కడి ప్రత్యేకత.
¤ కేంద్ర మంత్రిత్వ శాఖ ఫ్లైయాష్‌‌‌ను సమర్థంగా నిర్వహించడానికి యాష్‌ట్రాక్ అనే కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఫ్లైయాష్‌ అనేది బొగ్గుతో పనిచేసే థర్మల్ పవర్ స్టేషన్‌లలో దహన ప్రక్రియలో ఏర్పడే ఒక ఉత్పన్నకం. దీన్ని సిమెంట్, ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. మనం ఉండే ప్రదేశం నుంచి 100 - 300 కి.మీ. దూరంలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్లలో ఫ్లైయాష్ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని ఈ మొబైల్ ఆప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ ఆప్‌ను కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ న్యూదిల్లీలో ప్రారంభించారు.
¤ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoEFCC) 2017 సంవత్సరానికి సంబంధించిన ISFR (India State of Forest Report)రిపోర్ట్‌ను వెల్లడించింది. దీని ప్రకారం మన దేశం అటవీ సంపద సుమారు 8,021 చదరపు కిలో మీటర్లు పెరిగింది. 2015  నుంచి ఒక శాతం పెరిగింది. 2017 ISFR రిపోర్ట్ ప్రకారం దేశ భౌగోళిక వైశాల్యంలో 24.39% ఉన్నట్లు పేర్కొంది.
అసోం ప్రభుత్వం సెప్టెంబరు 22న రైనో దినోత్సవాన్ని నిర్వహించడానికి వన్యప్రాణి సంరక్షణా బోర్డును ఏర్పాటుచేసింది. ఈ దినోత్సవాన్ని ఒంటికొమ్ము రైనో సెరాస్‌ల రక్షణకు సంబంధించి అవగాహన కల్పించడం కోసం నిర్దేశించారు. ఈ జీవులు IUCN రెడ్‌లిస్ట్ గణాంకాల ప్రకారం ప్రమాద స్థాయిలో ఉన్న జీవులుగా గుర్తింపు పొందాయి.
¤ భారత జంతు సంక్షేమ బోర్డును (Animal Welfare Board of India - AWBI) బల్లాబ్‌గర్ ప్రాంతానికి ఇటీవల మార్చారు. ఇది హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉంది. ఇంతకుముందు ఈ సంస్థ చెన్నైలో ఉండేది. AWBI 1962లో స్థాపించిన ఒక రాజ్యాంగ సలహా సంస్థ. ఈ బోర్డులో 28 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు.
¤ ప్రపంచంలో ఉన్న వన్య జంతువులు, మొక్కల పైన అవగాహన పెంచడానికి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని (World Wildlife day) నిర్వహిస్తారు. ఇదే రోజు 1973లో CITES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఆమోదం పొందింది. అంతర్జాతీయ ఒప్పందాలు వన్యప్రాణులకు నష్టం కలిగించకుండా ఉండాలన్నది CITES ప్రధాన లక్ష్యం. ఇది 1975 జులై నుంచి అమల్లోకి వచ్చింది. దీని అమలు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP - United Nations Environment Programme) పర్యవేక్షణలో కొనసాగుతోంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా దీని ప్రధాన కేంద్రం.

పిచ్చుక దినోత్సవం

¤ ప్రపంచ పిచ్చుక దినోత్సవాన్ని మార్చి 20న నిర్వహిస్తున్నారు. WSD (World sparrow Day)మానవుడికి చాలా ఏళ్ల నుంచి సన్నిహితంగా ఉంటున్న‌  పిచ్చుక పక్షి జాతి సంరక్షణ కోసం నిర్దేశించారు. ఆవాసాల వినాశనం, ఆహారం దొరక్కపోవడం సూక్ష్మ తరంగాల కాలుష్యం (Microwave pollution)లాంటివి పిచ్చుక జాతుల జనాభా  త‌గ్గిపోవ‌డానికి ప్రధాన కారణాలు. WSD అనేది NFSI (Nature Forever Society of India)సంస్థ. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్ సౌజన్యంతో మరి కొన్ని ఇతర సంస్థలతో కలిసి ప్రారంభించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమం. 2010లో WSD మొదటిసారిగానిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 2012లో దిల్లీ ప్రభుత్వం "Rise of sparrows" అనే అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది.


ఎర్త్ అవర్

    ప్రపంచవ్యాప్తంగా 12వ సారి ఎర్త్ అవర్‌ను 2018లో మార్చి 24న జరుపుకున్నారు. వాతావరణ మార్పుపై ప్రపంచవ్యాప్త పిలుపు కోసం ఈ ఎర్త్ అవర్‌ను పాటించారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ పాటించారు. దీన్ని WWF (World Wide Fund for Nature) నిర్వహించింది. మొదటిసారిగా ఎర్త్ అవర్‌ను 2007, మార్చి 31న ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిపారు.


ధరిత్రీ దినోత్సవం

     2018 సంవత్సరానికి ధరిత్రీ దినోత్సవాన్ని (Earth Day) ఏప్రిల్ 22న నిర్వహించారు. 2018 సంవత్సరానికి ధరిత్రీ దినోత్సవం ప్రధాన ఉద్దేశం 'ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపండి' (End plastic pollution). ఎర్త్‌డే నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఈ ధరిత్రీ దినోత్సవ నిర్వహణను సమన్వయం చేస్తుంది. ఎర్త్‌డేను మొదటగా 1970లో నిర్వహించారు. అప్పటి నుంచి ఎర్త్‌డేను ప్రపంచవ్యాప్తంగా సుమారు 193 దేశాల్లో  ఏటా నిర్వహిస్తున్నారు.


కాలుష్య నగరాలు

   ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన గ్లోబల్ అర్బన్ ఎయిర్ పొల్యుషన్ డేటాబేస్ ప్రకారం ప్రపంచంలో గుర్తింపు పొందిన 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 14 నగరాలు మన దేశానికి చెందినవే. వీటిలో దిల్లీ, వారణాశి, కాన్పూర్, ఫరిదాబాద్, గయా, పాటియాలా, ఆగ్రా, ముజఫర్‌పూర్, శ్రీనగర్, గుడ్‌గావ్, జయపుర (జైపూర్), జోధ్‌పూర్. సూక్ష్మరేణువులతో కూడిన ధూళి స్థాయి ఆధారంగా 108 దేశాలకు చెందిన 4,300 నగరాలను పరీక్షించిన తర్వాత డేటాబేస్ తన విశ్లేషణాత్మక గణాంకాలను వెల్లడించింది.

  ఇండస్ డాల్ఫిన్ల గణన
    పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ వన్యప్రాణి నిధి (WWF India) సంయుక్తంగా ఇండస్ డాల్ఫిన్ల జనాభా గణన మొదటిసారిగా బియాస్ నదిలో 5 రోజుల పాటు, 185 కిలోమీటర్ల మేర జరిగింది. ఇండస్ డాల్ఫిన్ ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉండే క్షీరదం. ఇది భారత్, పాకిస్థాన్‌లలో మాత్రమే కనిపిస్తుంది. ఇండస్ డాల్ఫిన్ పాకిస్థాన్ దేశపు జాతీయ క్షీరదం. కానీ IUCN ప్రకారం ఈ జీవులు  అంతరించిపోయే దశలో ఉన్నట్లు పరిగణిస్తున్నారు.
¤ SAWEN (South Asia Wildlife Enforcement Network) అనే అంతర ప్రభుత్వ వన్యప్రాణి న్యాయ సంస్థ నాలుగో సమావేశాలు పశ్చిమ్ బంగలోని కోల్‌కతాలో మే 8 నుంచి 10 వరకు జరిగాయి. 2011లో ప్రారంభమైన SAWEN సమావేశం మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి. SAWENలో భాగమైన దేశాలు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు. వన్యప్రాణులపై జరిగే నేరాలను అరికట్టి, వాటిని సంరక్షించడంలో SAWEN సహకరిస్తుంది.
¤ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో BASIC మంత్రిత్వ శాఖల 26వ సమావేశం జరిగింది. BASICలో  పాల్గొన్న‌ దేశాల సంఖ్య నాలుగు (Brazil,South Africa, India, China). 2009 నవంబరులో జరిగిన ఒప్పందం ప్రకారం BASIC  ఏర్పాటైంది.


కీటక మ్యూజియం

    తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మన భారతదేశంలోనే మొదటి కీటక మ్యూజియాన్ని ఇటీవల ప్రారంభించారు. దీన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నెలకొల్పారు. "Bugs are Kings" అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఇన్‌సెక్ట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
¤ మనాస్ నేషనల్ పార్క్‌లో రెండు రోజుల పాటు అసోం స్ప్రింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ పండుగ నిర్వహణలో ఇండియన్ వ్యూవ‌ర్స్‌  అసోసియేషన్, స్వంకర్ మితింగ ఆన్‌సాయ్ అఫత్ సంస్థలు పాలుపంచుకున్నాయి. మనాస్ నేషనల్ పార్క్‌ను UNESCO ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌