• facebook
  • whatsapp
  • telegram

చక్రవాతాలు

సుడిగాలుల విలయం

ప్రచండ వేగంతో వీచే గాలుల ధాటికి భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోతాయి. కరెంటు స్తంభాలు కట్టె పుల్లల్లాగా నేలకొరుగుతాయి. ఇళ్ల పైకప్పులు గాలిలో చెక్కర్లు కొడతాయి. వాటికి కుంభవృష్టి తోడై నీరు వరదలై పారుతుంది. తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఈ విలయం ఎలా ఏర్పడుతుంది? ఆ సుడిగాలులు సృష్టించే విధ్వంసాలకు కారణం ఏమిటి? విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి తెలుసుకోవాలి. 

విధ్వంసం సృష్టించగలిగే వేగమైన గాలులు, కుండపోత వర్షంతో కూడిన వాతావరణ పరిస్థితినే చక్రవాతం అంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో సముద్రనీటి మట్టాన్ని పెంచి, తీరంలోని భూభాగాన్ని ముంచెత్తే ఉప్పెనగా (అధిక వేళాతరంగాలు) కూడా మారతాయి. చుట్టూ అధిక పీడన ప్రాంతంతో ఆవరించిన అల్పపీడన ప్రాంతంలోని శక్తిమంతమైన గాలులతో కూడిన సుడులు తిరిగే వాతావరణ అలజడే చక్రవాత స్వరూపం. ఇవి ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్య దిశలో సుడులు తిరుగుతాయి. చక్రవాతాన్ని ఆంగ్లంలో సైక్లోన్‌ అంటారు. అది ‘సైక్లోస్‌’ అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. గ్రీకు భాషలో సైక్లోస్‌ అంటే పాము మెలికల చుట్ట అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా ఉన్నట్లు గమనించిన హెన్రీ పెడింగ్టన్‌ అనే బ్రిటన్‌ వాతావరణ శాస్త్రవేత్త 1848లో వీటికి ‘సైక్లోన్‌’ అని పేరు పెట్టారు.

 

అల్పపీడనం నుంచే ఆవిర్భావం

సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ఒక అల్పపీడన ప్రాంతం అన్ని వైపుల నుంచి అధిక పీడన గాలులను ఆకర్షించడం వల్ల మధ్యలో చక్రవాత కేంద్రం ఏర్పడుతుంది. దీని వ్యాసార్ధం సుమారు 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిధిలో వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ చుట్టూ చక్రవాత కుడ్యంగా పిలిచే ప్రాంతం విధ్వంసకర పవనాలతో అలజడి సృష్టిస్తుంది. ఈ చక్రవాతాలను మూడు దశలుగా విభజించారు.

1) రూపకల్పన దశ: బాష్పీభవనం ద్వారా గాలిలో 7,000 మీటర్ల ఎత్తు వరకు అధిక సాపేక్ష ఆర్ధ్రతను చేరుకోవడానికి సముద్ర నీటిలో 60 మీటర్ల లోతు వరకు 26 డిగ్రీసెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అలాంటప్పుడే క్రమంగా నీటిఆవిరి నల్లని క్యుములోనింబస్‌ మేఘాలుగా మారుతుంది. 

2) పరిపక్వ దశ: ఈ దశలో క్యుములో నింబస్‌ మేఘాలు ఉరుములు, మెరుపులను ఏర్పరుస్తూ చక్రవాత కంటి చుట్టూ పట్టీల్లా దట్టంగా అల్లుకుంటాయి. ఆ సమయంలో చక్రవాత కన్ను ఉపగ్రహ చిత్రాల్లో నల్లని కేంద్రం/చుక్కగా కనిపిస్తుంది. ఈ నల్లని కేంద్రం ఎంత చిన్నగా కనిపిస్తే చక్రవాతం అంత బలంగా మారుతుంది. చక్రవాతం క్రమంగా తన స్థానాన్ని జరుపుతూ తీరాన్ని తాకుతుంది.

3) బలహీనపడటం: గాలి పీడనంలో వచ్చిన మార్పుల వల్ల చక్రవాతం పైకి లేదా కిందికి జరిగినప్పుడు అకస్మాత్తుగా ఛేదనం చెంది బలహీనపడుతుంది. ఈ విధంగా చక్రవాతాల కాలవ్యవధి 24 గంటల కంటే తక్కువ వ్యవధి నుంచి 3 వారాల కన్నా ఎక్కువకాలం వరకు ఉండవచ్చు. ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి సగటున 6 రోజులు పడుతుంది. అత్యంత సుదీర్ఘ చక్రవాతంగా పేరు పొందిన ‘టైఫూన్‌ జాన్‌’ 1994లో ఆగస్టు - సెప్టెంబరుల మధ్య 31 రోజులు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగింది.

 

వివిధ పేర్లు

చక్రవాతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలవారీగా వివిధ పేర్లతో పిలుస్తారు.

* హిందూ మహాసముద్రం (భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, అరేబియా దేశాలైన యెమన్, ఒమన్‌) దేశాల్లో - ఉష్ణమండల తుపాన్లు

* ఆస్ట్రేలియా - విల్లీ - విల్లీలు

* వాయవ్య పసిఫిక్‌లో చైనా, జపాన్‌ - టైఫూన్లు

* పిలిఫ్పైన్స్‌ - బగుయియేస్‌

* ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో అమెరికా తూర్పుతీరం పైన, వెస్టిండీస్‌ దీవులు - హరికేన్లు 

* అమెరికా సంయుక్త రాష్ట్రాల భూప్రాంతం - టోర్నడోలు

 

గాలి వేగం ఆధారంగా తుపాను తీవ్రత
కల్లోల రకం గాలి వేగం (గం./కి.మీ.లలో)
అల్పపీడనం (Low pressure) 31
వాయుగుండం (Depression) 31 - 49
తీవ్ర వాయుగుండం (Deep depression) 49 - 61
తుపాను కల్లోలం (Cyclonic storm)  61 - 88
తీవ్ర తుపాను కల్లోలం (Severe cyclonic storm) 88 - 118
అతి తీవ్ర తుపాను కల్లోలం (Very sever cyclonic storm) 118 - 221 
సూపర్‌ సైక్లోన్‌  221 కంటే ఎక్కువ


సూపర్‌ సైక్లోన్‌: 1999, అక్టోబరు 29న ఒడిశాలో సంభవించిన సూపర్‌ సైక్లోన్‌ వల్ల గంటకు 260 - 300 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. సముద్ర నీటిమట్టం 9 మీటర్లు కెరటాలతో ఉప్పెనగా మారి 140 మీటర్ల మేర తీరాన్ని ముంచేసింది. 10 వేల మంది మంది మరణించగా, 2 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

సాంకేతిక సహకారం: 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కుదిపేసిన హుద్‌-హుద్‌ తుపాను కారణంగా సూపర్‌ సైక్లోన్‌ కంటే తక్కువ వేగంతో గంటకు 180 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. 46 మంది చనిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో తుపాన్లను ముందుగానే అంచనా వేసి అప్రమత్తం చేస్తుండటంతో ఇటీవల కాలంలో ప్రాణనష్టం తగ్గించడం సాధ్యమవుతోంది.

టోర్నడో: ఇది భూఉపరితలంపై ఏర్పడే చక్రవాతం. 3 - 30 నిమిషాలపాటు మాత్రమే కొనసాగుతుంది. కానీ గాలి వేగం గంటకు 200 కి.మీ. నుంచి అత్యధికంగా 400 కి.మీ. ఉంటుంది. ఆ సమయంలో పైకి విసిరే సుడిగాలినే టోర్నడో అంటారు. దీని గాలివేగాన్ని ఫుజితా స్కేల్‌తో కొలుస్తారు. టోర్నడోలు ఎక్కువగా అమెరికా, మెక్సికో దేశాల భూభాగాల్లో వస్తుంటాయి. పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్‌ జంగిల్‌ విస్తీర్ణం పెరుగుతున్న కారణంగానే అమెరికాలో టోర్నడోల తాకిడి తీవ్రరూపం దాలుస్తోంది. అప్పడప్పుడు ఆస్ట్రేలియాలో ఏర్పడుతున్న నీటి టోర్నడోల (వాటర్‌ స్పౌట్‌) గురించి వాతావరణ నిపుణులు చర్చలు జరుపుతున్నారు.


భారత్‌లో 

మన దేశానికి రెండువైపులా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు ఆవరించి ఉన్నాయి. వాటిలో వేడినీరు ప్రవహిస్తుండటంతో రెండు సందర్భాల్లో తుపాన్లు సంభవిస్తున్నాయి.

1) నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందు - మే-జూన్‌ నెలల్లో అరేబియా సముద్రంలో సంభవించే చక్రవాతాలు ఈశాన్యం, తూర్పు, వాయవ్యం దిశల్లో కదిలి తీర దేశాల్లో ప్రభావం చూపిస్తున్నాయి.

2) ఈశాన్య రుతుపవనాల సమయంలో - అక్టోబరు - నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాతాలు ఎక్కువగా వాయవ్యం వైపు, కొన్నిసార్లు ఉత్తరం, పశ్చిమ దిశల్లో కదిలి తీర ప్రాంతంలో ప్రభావం చూపుతున్నాయి.

* హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాల వల్ల నష్టపోతున్న 8 దేశాలు 2004 నుంచి కొన్ని పేర్ల జాబితాను ముందుగానే రూపొందించాయి. వాటినే చక్రవాతాలకు పెడుతున్నారు. 2020లో మరో 5 దేశాలు ఇందులో చేరాయి. ప్రస్తుతం 13 దేశాల్లో ముందుగా నిర్ణయించిన పేర్ల జాబితాను చక్రవాతాల కోసం వినియోగిస్తున్నారు. 

* 1977, నవంబరు 19న సంభవించిన దివిసీమ తుపాను ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోయింది. నాటి విపత్తులో సుమారు 10 వేల మంది చనిపోయారు.

 

హెచ్చరికలు

రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తుపాను హెచ్చరికలను నాలుగు దశల్లో జారీ చేస్తుంది.

1) ప్రీ సైక్లోన్‌ వాచ్‌: సముద్రంలో తుపాను ఏర్పడే పరిస్థితి ఉన్నప్పటి నుంచి అంటే 72 గంటల ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తారు.

2) సైక్లోన్‌ అలర్ట్‌: తీరం వెంట ప్రతికూల ప్రభావం మొదలవుతుందని భావించిన 48 గంటల ముందు వెలువరిస్తారు.

3) సైక్లోన్‌ వార్నింగ్‌: తుపాను రాబోయే 24 గంటల్లో తీరాన్ని తాకుతుందని భావించినప్పుడు తుపాను హెచ్చరికలు చేస్తారు. ఇక్కడి నుంచి ప్రతి గంట గంటకి సమాచారం వెలువడుతుంది.

4) సైక్లోన్‌ హిట్‌ దశ: రాబోయే 12 గంటల్లో తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన సమయం నుంచి ఈ హెచ్చరిక మొదలవుతుంది. భూమిపై గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచే సమయం వరకు ఈ హెచ్చరిక జారీ చేస్తారు.


 

మాదిరి ప్రశ్నలు


1. దేశంలో గుజరాత్‌ తర్వాత రెండో పొడవైన తీరం ఉన్న రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌     4) ఒడిశా


2. ఒకప్పుడు రేవు పట్టణంగా కొనసాగిన కోరింగ ప్రాంతం 1839లో వచ్చిన తుపానుకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ప్రస్తుతం చిన్న గ్రామంగా కొనసాగుతోంది. ఆ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?

1) కాకినాడ     2) పశ్చిమ గోదావరి    3) నెల్లూరు    4) తిరుపతి


3. విశాఖపట్నాన్ని హుద్‌-హుద్‌ తుపాను ఏ తేదీన తాకింది?

1) 2014, అక్టోబరు 12        2) 2014, సెప్టెంబరు 14     3) 2015, ఆగస్టు 5     4) 2016, జనవరి 3


4. ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక తుపాను హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది?

1) చెన్నై   2) విశాఖపట్నం    3) కోల్‌కతా    4) పారాదీప్‌ 


5. తీవ్రమైన తుపాను గాలులను అడ్డుకోవడానికి తీర ప్రాంతం వెంబడి పెంచే చెట్లను ఏమంటారు?

1) ఆశ్రయతోరణ మొక్కలు    2) మడ అడవులు    3) శృంగాకార అడవులు   4) ఆల్ఫైన్‌ అడవులు


6. భారతదేశంలో తుపానులు ఎక్కువగా సంభవించే నెలలు?

1) డిసెంబరు - జనవరి    2) జూన్‌ - జులై     3) అక్టోబరు - నవంబరు    4) మార్చి - ఏప్రిల్‌


7. భారతదేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం చక్రవాతాలకు అనువుగా ఉంది?

1) 8%        2) 18%        3) 30%        4) 40%


8. 1970లో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి మూడు లక్షల మంది ప్రాణాలు బలిగొన్న తుపాను పేరు?

1) నైనా      2) లైలా      3) ట్రేసి     4) బోలా 


9. ఎంత వేగంతో గాలులు వీచినప్పుడు సూపర్‌ సైక్లోన్‌గా పిలవాలి?

1) గంటకు 221 కి.మీ.కంటే ఎక్కువ        2) గంటకు 118 కి.మీ.కంటే ఎక్కువ

3) గంటకు 88 కి.మీ. కంటే ఎక్కువ        4) గంటకు 400 కి.మీ. కంటే ఎక్కువ


10. మన దేశంలో బంగాళాఖాతానికి, అరేబియా సముద్రానికి మధ్య తుపాన్ల నిష్పత్తి ఎలా ఉంటుంది?

1) 4 : 1        2) 1 : 4        3) 2 : 6        4) 6 : 2

 

సమాధానాలు: 1-3,   2-1,   3-1,   4-2,   5-1,   6-3,   7-1,   8-4,   9-1,   10-1

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 01-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌