• facebook
  • whatsapp
  • telegram

రక్షణ రంగం

నీటిలో మునిగి... నిఘాలో నిలిచి!

దేశ భద్రతకు ప్రమాదం జల, వాయు, భూ మార్గాల ద్వారా పొంచి ఉంటుంది. వీటిలో ఎటు వైపు నుంచైనా శత్రువులు దాడిచేసే అవకాశం ఉంది. అందుకే అన్ని విధాలుగా మన రక్షణ రంగాలు సిద్ధంగా ఉంటాయి. ఈ బలగాలకు రకరకాల ఆయుధ వ్యవస్థలను సమకూరుస్తారు. అలాంటి వాటిలో నావికాదశానికి ప్రధానమైనవి జలాంతర్గాములు. ఇవి నీటిలో మునిగి ఉండి నిరంతరం నిఘాలో నిలిచి దేశాన్ని రక్షిస్తుంటాయి.

జలాంతర్గాములు (Submarines):

రక్షణ రంగంలోని నావికా దళానికి బలాన్ని చేకూర్చేవి జలాంతర్గాములు. నీటిలో మునిగి ఉంటూ శత్రువులను ఎదుర్కోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి రెండు రకాలు. 

1) అణుశక్తితో నడిచేవి 

2) డీజిల్‌ జలాంతర్గాములు

అణుశక్తితో నడిచే జలాంతర్గాములు: 

ఇవి రోజుల తరబడి సముద్రంలో ఉంటూ శత్రువులకు కనిపించకుండా ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణించగలవు. భారతదేశం వద్ద ఇలాంటివి రెండు ఉన్నాయి. 

ఐఎన్‌ఎస్‌ చక్ర: ఇది సబ్‌మెరైన్‌ షిప్‌ న్యూక్లియర్‌ SSN (Submarine Ship Nuclear) రకానికి చెందింది. దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు.

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌: ఇది సబ్‌మెరైన్‌ షిప్‌ బాలిస్టిక్‌ న్యూక్లియర్‌ SSBN (Submarine Ship Balstic Nuclear) రకానికి చెందింది. భారతదేశ స్వదేశీ అణు జలాంతర్గామి. దీన్ని హిందుస్తాన్‌ షిప్‌యార్డ్, విశాఖపట్నం తయారుచేసింది. ఈ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్ర కంటే శక్తిమంతమైంది. ఇది అణ్వాయుధాలతో కూడిన బాలిస్టిక్‌ క్షిపణులను కలిగి ఉంటుంది. దీనిలో K-15 క్షిపణులను ఉంచారు. భారతదేశం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెజిల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అణు జలాంతర్గాములను తయారుచేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ కింద నిర్మాణంలో ఉన్న మరొక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిధామన్‌.

డీజిల్‌ జలాంతర్గాములు: 

ఇవి డీజిల్‌ను మండించుకొని విద్యుత్‌ శక్తిని తయారుచేసుకొని పనిచేస్తాయి. కొన్నిరోజులకు ఒకసారి ఇవి బయటకు వచ్చి సముద్రగర్భంలోకి వెళ్లిపోతాయి. నెలల తరబడి నీటి లోపల ఉండలేవు. 

ఉదా: ఐఎన్‌ఎస్‌ - కల్వరి, కందేరి, కరంజ్, వేలా, వాగిర్, వాగ్‌షీర్‌ వీటిని మజ్‌గావ్‌ డాక్‌యార్డ్, ముంబయి తయారుచేసింది. ఇవే కాకుండా సింధు తరగతికి చెందిన ఐఎన్‌ఎస్‌ - సింధు రక్షక్, సింధు విజయ్, సింధురాజ్, సింధురత్న, సింధు కేసరి, సింధుకీర్తి లాంటివి డీజిల్‌ జలాంతర్గాములు.  

యుద్ధనౌకలు: ఇవి విమాన వాహకనౌకలు, సాధారణ యుద్ధనౌకలు అని రెండు రకాలుగా ఉంటాయి. 

విమాన వాహకనౌకలు: వీటిపై పదుల సంఖ్యలో విమానాలు ఉంటాయి. ప్రస్తుతం భారతదేశం వద్ద రెండు విమాన వాహకనౌకలు ఉన్నాయి. 

1) ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య: దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. 

2) ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌: ఇది భారతదేశ మొదటి స్వదేశీ విమాన వాహకనౌక. దీన్ని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నిర్మించింది.  ప్రాజెక్ట్‌ - 71లో భాగంగా భారతదేశం రెండు విమాన వాహక నౌకలను తయారుచేస్తుంది. వీటిలో ఒకటి విక్రాంత్, రెండోది ఐఎన్‌ఎస్‌ విశాల్‌ (ఇది నిర్మాణంలో ఉంది). ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ విరాట్‌ అనే విమాన వాహక నౌకలను భారతదేశ సేవల నుంచి ఉపసంహరించారు. 

సాధారణ యుద్ధనౌకలు: ఇవి భారతదేశ నావికాదళంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. తిరిగే వేగం, దాడి చేసే స్వభావం, చేసే పనిని బట్టి ఇవి అనేక రకాలు. వీటిలో ముఖ్యమైనవి డిస్ట్రాయర్‌లు (విధ్వంసక నౌకలు), ఫ్రిగేట్‌లు, కార్‌వెట్టిలు. 

డిస్ట్రాయర్‌లు: ఇవి విమాన వాహక నౌకలకు ఎస్కార్టుగా ఉంటాయి. స్వల్ప శ్రేణి దాడుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో గైడెడ్‌ క్షిపణులు ఉంటాయి. 

ఉదా: ఐఎన్‌ఎస్‌ - కోల్‌కతా, కొచ్చి, చెన్నై, దిల్లీ, రాజ్‌పుత్, రణ్‌వీర్, రాణా, రణ్‌ విజయ్‌ 

ఫ్రిగేట్స్‌: ఇవి సాధారణ యుద్ధనౌకలు, వాణిజ్య సంబంధ నౌకలను రక్షించడానికి ఉపయోగపడతాయి. వీటికి జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఇవి గైడెడ్‌ క్షిపణులను కలిగి ఉంటాయి. 

ఉదా: ఐఎన్‌ఎస్‌ - శివాలిక్, సాత్పూర, సహ్యాద్రి, తల్వార్, త్రిశూల్, తబర్, బ్రహ్మపుత్ర, బెట్వా, బియాస్‌ 

కార్‌వెట్టిలు: ఇవి వేగంగా ప్రయాణిస్తూ కొద్దిపాటి ఆయుధాలను కలిగి ఉండే యుద్ధనౌకలు. ఇవి డిస్ట్రాయర్‌ల కంటే చిన్నవి, తీరప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు వాడే నౌకల కంటే పెద్దవి. వీటికి సబ్‌మెరైన్‌లు, ఇతర దాడులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. 

ఉదా: ఐఎన్‌ఎస్‌ - కమోర్త, కదమత్, కిల్టన్, కవరాటి, కొరా, వినాష్, విపుల్, విభూతి, కర్‌ముఖ్‌  డ్రోన్‌లు ఇవి పైలెట్‌ రహిత విమానాలు.

భారతదేశంలో కింది రకాల డ్రోన్‌లు ఉన్నాయి. 

లక్ష్య: దీన్ని శిక్షణ కోసం వినియోగిస్తున్నారు.

నేత్ర: దీన్ని సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ దళాలు సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లను కనిపెట్టడానికి వాడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో వరదలు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో భాగంగా దీన్ని ఉపయోగించారు. 

రుస్తోమ్‌: దీనికి తనంతట తానే టేకాఫ్, లాండింగ్‌ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. దీన్ని భారతదేశం లాపాస్‌ ప్రాజెక్టు కింద తయారుచేసింది.

నిషాంత్‌: దీన్ని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, బెంగళూరు తయారుచేసింది.

* భారతదేశం ప్రాజెక్ట్‌ ఘాతక్‌ కింద యుద్ధం చేసే సామర్థ్యం గల డ్రోన్‌లను తయారుచేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ను అటనామస్‌ అన్‌మ్యాన్‌డ్‌ రిసెర్చ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (AURA) అంటారు. ఇలాంటి డ్రోన్‌లను అన్‌మ్యాన్‌డ్‌ కంబాట్‌ ఎయిర్‌ వెహికిల్‌ (UCAV) అంటారు. కొందరు భారతదేశ అన్‌మ్యాన్‌డ్‌ కంబాట్‌ ఎయిర్‌ వెహికిల్‌ను ఘాతక్‌ అని కూడా పిలుస్తున్నారు.

* అమెరికాలో ఉన్న యుద్ధం చేయగల డ్రోన్‌లను ప్రిడేటర్‌ డ్రోన్‌లు అంటారు.

* ఆయుధాలను ప్రయోగించగలిగే అనేక డ్రోన్‌లను ఒకేసారి శత్రు దేశం పైకి పంపి యుద్ధం చేయడాన్ని స్వార్మ్‌ (Swarm) టెక్నాలజీ అంటారు.

* డీఆర్‌డీవోకు ఉన్న డ్రోన్‌లను ఎదుర్కొనే వ్యవస్థ (యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌) ను డీ4 అంటారు.

* ఇజ్రాయెల్‌ యాంటీ డ్రోన్‌ వ్యవస్థను స్మాష్‌ - 2000 అంటారు.

హెలికాప్టర్‌లు:  భారతదేశంలో ఉన్న హెలికాప్టర్‌లలో ముఖ్యమైనవి ధ్రువ్, రుద్ర.

ధ్రువ్‌: వీటిని నావికా దళం, వాయుసేనలో వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. హిందుస్తాన్‌ ఏరో నాటికల్‌ లిమిటెడ్‌ తయారుచేసింది.

రుద్ర: ఇది పోరాట పటిమ గల లేదా యుద్ధం చేయగల హెలికాప్టర్‌. ధ్రువ్‌ హెలికాప్టర్‌కు క్షిపణులు, తుపాకులను అమర్చి రుద్రను రూపొందించారు .

యుద్ధ ట్యాంక్‌లు: భారతదేశం వద్ద కింది యుద్ధ ట్యాంక్‌లు ఉన్నాయి.

అర్జున్‌: ఇది ప్రధాన యుద్ధ ట్యాంక్‌. దీనిపై క్షిపణుల దాడిని తట్టుకునే కంచన్‌ అనే కవచం ఉంటుంది.

T - 90: దీన్ని భీష్మ అని కూడా అంటారు. ఈ యుద్ధ ట్యాంక్‌ను రష్యా నుంచి పొందిన లైసెన్స్‌తో తయారుచేస్తున్నారు.

T - 72: దీన్ని అజేయ అంటారు.

Posted Date : 19-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌