• facebook
  • whatsapp
  • telegram

రక్షణ రంగ టెక్నాలజీ

నింగి.. నేలపై నిఘా నేత్రాలు!

యుద్ధ సమయంలో దేశంపై దాడులు ఎటువైపు నుంచైనా జరిగే అవకాశం ఉంది. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండేందుకు నింగిలో, నేలపై రక్షణ వ్యవస్థలను ఏర్పరుచుకుంటారు. శత్రుదేశాల కదలికలను కనిపెట్టేందుకు, దాడులను నిరోధించేందుకు వీటిని వినియోగిస్తారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు రక్షణ రంగ టెక్నాలజీకి సంబంధించిన ప్రాథమిక సమాచారంపై పట్టుసాధించాలి.

  రక్షణ రంగంలో టెక్నాలజీని వినియోగించుకున్న దేశం సైనిక పరంగా బలమైన దేశంగా అవతరిస్తుంది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ లాంటి దేశాలతో పాటు భారతదేశం కూడా ఈ టెక్నాలజీలో స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం రాడార్ల వంటి అనేక రక్షణ రంగ పరికరాలను దేశీయంగా తయారు చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది.  

 

రాడార్‌లు

  గాలిలో ఉన్న లక్ష్యాలైన విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్‌లు లాంటి వాటిని గుర్తించేందుకు రాడార్‌లు వాడుతున్నారు.ఒక దేశ రాడార్‌ వ్యవస్థ బలంగా ఉంటే శత్రుదేశాల విమాన, క్షిపణి దాడులను సమర్థంగా ఎదుర్కోవచ్చు. యుద్ధంలో ప్రతి దేశం మొదట తన శత్రుదేశ రాడార్‌ వ్యవస్థలను నాశనం చేసి పై చేయి సాధించాలని చూస్తుంది.

 భారతదేశం వద్ద ఉన్న రాడార్‌లు

* ఇంద్ర: ఇది డాప్లర్‌ రాడార్, 2డీ రాడార్‌. 

* బ్యాటిల్‌ ఫీల్డ్‌ సర్వైలెన్స్‌ రాడార్‌ (బీఎస్‌ఎఫ్‌ఆర్‌): దీన్ని బీఎస్‌ఎఫ్‌ ఉపయోగిస్తుంది. 

* రోహిణి రాడార్‌: ఇది 3డీ రాడార్‌. దీన్ని వాయుసేన ఉపయోగిస్తుంది..

* రేవతి రాడార్‌: ఇది 3డీ రాడార్‌. దీన్ని నావికాదళం వాడుతుంది.

* రాజేంద్ర: దీన్ని T-72 యుద్ధట్యాంకు, ఆకాశ్‌ క్షిపణిపై అమర్చారు.

 

అవాక్స్‌లు

  ఎయిర్‌బార్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (AEW&CS/AWACS)  - అవాక్స్‌లను ఆకాశంలో నిఘా నేత్రం అంటారు (ఐ ఇన్‌ ద స్కై). ఇవి ఒక రకమైన రాడార్‌ వ్యవస్థలు. వీటిని విమానాలపై అమరుస్తారు. ఇవి శత్రుదేశాల సరిహద్దుల వద్ద ఎగురుతూ శత్రుదేశాలు ప్రయోగించిన క్షిపణులు, మన దేశం వైపు వస్తున్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లను ముందుగానే గుర్తించి సమాచారాన్ని వేగంగా భూమిపై లేదా సముద్రంపై ఉన్న వ్యక్తులకు చేరవేస్తాయి. దీనివల్ల మనం శత్రు దేశాల క్షిపణులు, యుద్ధ విమానాలను   సమర్థంగా ఎదుర్కోవచ్చు.

మన దేశంలో ఉన్న అవాక్స్‌లు

* ఫాల్కన్‌ అవాక్స్‌: వీటిని ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేశారు. ఇవి 360 డిగ్రీల కోణంలో పనిచేస్తాయి.

* నేత్ర: దీన్ని ఇండియన్‌ అవాక్స్‌ అంటారు. ఇవి 270 డిగ్రీల కోణంలో పనిచేస్తాయి. దీన్ని సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌బార్న్‌ సిస్టం, బెంగళూరు అభివృద్ధి చేసింది. 

 

సోనార్‌లు 

  వీటిని సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాములు, ఆయుధాలు, సముద్రం లోతును గుర్తించడానికి వాడతారు.

భార‌త్‌లో ఉన్న‌ సోనార్‌లు

* హల్‌ మౌంటెడ్‌ సోనార్‌ అడ్వాన్స్‌డ్‌: దీన్ని నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ, కొచ్చి అభివృద్ధి చేసింది.

* మిహిర్‌: ఇది హెలికాప్టర్‌ సోనార్‌. 

* పంచేంద్రియ: ఇది స‌బ్‌మెరైన్‌ సోనార్‌. దీన్ని నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ, కొచ్చి అభివృద్ధి చేసింది.

 

టార్పిడోలు


నీటి అడుగున ప్రయాణిస్తూ జలాంతర్గాములు, నౌకలను పేల్చడానికి వాడే ఆయుధాన్ని టార్పిడో అంటారు. దీన్ని నీటి అడుగున ప్రయాణించే క్షిపణితో పోల్చవచ్చు. టార్పిడోలను నౌకలు లేదా సబ్‌మెరైన్‌ల నుంచి ప్రయోగించవచ్చు. 

దేశంలోని టార్పిడోలు

 * షయన: ఇది ఆధునిక తేలిక రకం టార్పిడో. దీన్ని నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విశాఖపట్నం అభివృద్ధి చేసింది.

* వరుణాస్త్ర: దీన్ని నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విశాఖపట్నం తయారు చేసింది.

* గరుడాస్త్ర: ఇది జలాంతర్గాములను నాశనం చేయగల ఆధునిక సెల్ఫ్‌ గైడెడ్‌ టార్పిడో. దీన్ని డిజైన్, అభివృద్ధి చేసినవారు ఎన్‌ఎస్‌టీఎల్, డీఆర్‌డీవో, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌. 

* డీఆర్‌డీవో, ఎన్‌ఎస్‌టీఎల్, ఎన్‌పీఓఎల్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ టార్పిడో డిఫెన్స్‌ సిస్టం (ఏటీడీఎస్‌) మారీచ్‌. దీన్ని యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ వ్యవస్థ అని పిలుస్తారు. వీటిని యుద్ధనౌకల నుంచి ప్రయోగించవచ్చు.

 

స్మార్ట్‌ (SMART)

సూపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టార్పిడోలను సబ్‌మెరైన్‌లపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. టార్పిడో దూరం కంటే ఎక్కువ దూరం నుంచి ప్రయోగిస్తారు. దీన్ని టార్పిడో, క్షిపణుల హైబ్రిడ్‌ వ్యవస్థగా పేర్కొనవచ్చు. యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ ఆయుధం మొదట క్షిపణిలా ఆకాశంలో ప్రయాణించి తర్వాత నీటిలోకి వెళ్లి సబ్‌మెరైన్‌పై దాడి చేస్తుంది. సబ్‌మెరైన్‌పైదాడి చేయగల దీని పరిధి 30 కి.మీ. దీన్ని యాంటీ సబ్‌మెరైన్‌ మిస్సైల్‌గా చెప్పవచ్చు.

 

యుద్ధ విమానాలు


భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో తేజస్‌ మినహా మిగిలినవన్నీ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినవే. కొన్నింటిని లైసెన్స్‌ తీసుకొని హిందూస్థాన్‌ ఏరో నాటికల్‌ లిమిటెడ్‌ తయారు చేస్తోంది. 

భారత్‌ వద్ద ఉన్న యుద్ధ విమానాలు

* జాగ్వర్‌: దీన్ని షంశేర్‌ అని పిలుస్తారు.

* మిరేజ్‌ - 2000: వీటిని వజ్ర పేరుతో పిలుస్తారు. ఇవి ఫ్రాన్స్‌కు చెందినవి. 

* మిగ్‌ - 21: దీన్ని ఆధునీకరించి బైసన్‌ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇవి ఎక్కువగా కూలిపోవడం వల్ల వీటిని ఎగిరే శవపేటికలు అని అంటున్నారు. వీటి స్థానంలో తేజస్‌ యుద్ధ విమానాలను ఉంచాలని భావిస్తున్నారు.

* మిగ్‌ - 27: వీటిని బహదూర్‌ అని పిలుస్తారు. ఇటీవల వీటిని వాయుసేన నుంచి తొలగించారు.

* మిగ్‌ - 29, సుఖోయ్‌ - 30 MKI: ఈ రెండింటినీ రష్యా నుంచి కొనుగోలు చేశారు.

 

రాఫెల్‌ యుద్ధ విమానం 


ఇది ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌ తయారు చేసిన 4.5 తరానికి చెందిన ఆధునిక యుద్ధ విమానం. అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంది. వివిధ రకాలుగా దాడి చేయగల యుద్ధ విమానం. ఇది శత్రుదేశాల భూభాగంలోకి ఎక్కువ దూరం వెళ్లి దాడి చేయగలుగుతుంది. అణ్వాయుధాలను కూడా మోసుకొని వెళ్లగలదు. దీని పరిధి 3700 కి.మీ. ఇది గంటకు 2,223 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో ఉన్న క్షిపణుల సహాయంతో శత్రుదేశాల క్షిపణులు, విమానాలను అడ్డగించవచ్చు. 

దీనిలోని ఆయుధాలు 

* గాలి నుంచి గాలిలోకి ప్రయోగించగల మీటియార్‌ క్షిపణులు. వీటి పరిధి 150 కి.మీ.

* గాలి నుంచి (యుద్ధ విమానం నుంచి) భూమి మీదకు ప్రయోగించగల స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు. వీటి పరిధి 300 కి.మీ.

* గాలి నుంచి గాలిలోకి ప్రయోగించగల మైకా క్షిపణులు. వీటి పరిధి 80 కి.మీ.

* రాఫెల్‌లో క్షిప‌ణుల‌తో పాటు స్పెక్ట్రా అనే వ్య‌వ‌స్థ ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయగల వ్యవస్థ. 

  ఇలాంటి 36 విమానాలను భారతదేశం కొనుగోలు చేసింది. వీటిలో మొదటి 5 విమానాలు అంబాలా (హరియాణ‌) వాయుసేన స్థావరానికి వచ్చాయి. వీటిని దసాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డీఆర్‌ఏఎల్‌) పేరుతో భారతదేశం తయారు చేస్తుంది. దీన్ని మహారాష్ట్రలోని మిలన్‌ వద్ద స్థాపించనున్నారు. 

 

తేజస్‌ యుద్ధ విమానం

  ఇది భారతదేశ తేలికపాటి యుద్ధ విమానం (లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌). వీటిని మిగ్‌ - 21 యుద్ధ విమానాల స్థానంలో ఉంచాలని భావిస్తున్నారు. దీని వేగం 1.6 మాక్‌. ఇవి నాలుగోతరం యుద్ధ విమానాలు. వీటిని హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిలో MK-I, MK-II  రకాలు ఉన్నాయి. ఇటీవల ఈ విమానం విమాన వాహక నౌక అయిన ఐఎన్‌ఎస్‌ - విక్రమాదిత్యపై దిగింది. ఈ ప్రక్రియను అరెస్టెడ్‌ లాండింగ్‌ అంటారు.


భారతదేశం 2024 నాటికి అయిదో తరానికి చెందిన అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) ను తయారు చేయాలని భావిస్తోంది.

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో ఏ రాడార్‌ను T-72 యుద్ధ ట్యాంకు, ఆకాశ్‌ క్షిపణిపై అమర్చారు?

1) రోహిణి   2) రాజేంద్ర   3) రేవతి   4) రుద్ర

 

2. విమానాలపై అమర్చే అవాక్స్‌ రాడార్‌లను ఏ పేరుతో పిలుస్తున్నారు?

1) ఆకాశంలో నిఘా నేత్రం    2) అంతరిక్షంలో గూఢచారి

3) అంతరిక్ష అవాక్స్‌          4) ఆకాశంలో గూఢచారి

 

3. భారతదేశం ఫాల్కన్‌ అవాక్స్‌ను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది?

1) ఫ్రాన్స్‌    2) అమెరికా   3) ఇజ్రాయెల్‌    4) రష్యా

 

4. సోనార్‌లకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) వీటిని సముద్ర లోతును కనుక్కోవడానికి వాడతారు.

2) సముద్రం లోపల ఉన్న జలాంతర్గాములను గుర్తించడానికి వాడతారు.

3) మిహిర్‌ అనేది హెలికాప్టర్‌ సోనార్‌

4) పైవన్నీ

 

5. జలాంతర్గాములను నాశనం చేయగల ఆధునిక సెల్ఫ్‌ గైడెడ్‌ టార్పిడో?

1) మారీచ్‌   2) వరుణాస్త్ర   3) గరుడాస్త్ర  4) స్పెక్ట్రా

 

6. డీఆర్‌డీవో, ఎన్‌ఎస్‌టీఎల్, ఎన్‌పీఓఎల్‌ సంస్థలు కలిసి తయారు చేసిన మారీచ్‌ అనేది?

1) అడ్వాన్స్‌డ్‌ టార్పిడో డిఫెన్స్‌ సిస్టం  

2) అడ్వాన్స్‌డ్‌ మిస్సైల్‌ సిస్టం  

3) అడ్వాన్స్‌డ్‌ సబ్‌మెరైన్‌

4) అడ్వాన్స్‌డ్‌ రాడార్‌

 

సమాధానాలు

1-2, 2-1, 3-3, 4-4, 5-3, 6-1.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌