• facebook
  • whatsapp
  • telegram

జీర్ణవ్యవస్థ


ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి.. పోషకాలను వెలికితీసి!

 

శరీరానికి శక్తి కావాలి. అందుకోసం ఆహరం తినాలి. మరి ఆ ఆహారం, శక్తిగా ఎలా మారుతుంది? అదో అత్యద్భుతమైన ప్రక్రియ. ఆహారాన్ని దంతాలతో కొరకడంతో ప్రారంభమై, చివరకు పెద్దపేగుల్లో వ్యర్థంగా మారి బయటకు వచ్చేయడంతో ముగుస్తుంది. ఈ మధ్యలో నోట్లో చిన్న చిన్న ముక్కలైన ఆహారం ప్రత్యేక చలనాలతో మిక్సర్‌లాంటి పొట్టలోకి చేరుతుంది. అక్కడి రసాల వల్ల మరింత విచ్ఛిన్నమై చిన్నపేగులోకి ప్రవేశిస్తుంది. అక్కడే పోషకాల శోషణ జరిగి శరీరానికి శక్తి సమకూరుతుంది. కర్మాగారంలోని కార్మికుల్లాగా జీర్ణవ్యవస్థలోని వివిధ విభాగాలు పని చేస్తాయి. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

సంక్లిష్ట పదార్థాలను సరళంగా మార్చడం, శోషితం కాని పదార్థాలను శోషితమయ్యే విధంగా చేయడాన్ని జీర్ణక్రియ అంటారు.

 

జీర్ణవ్యవస్థ విధులు: 

1) ఆహార పదార్థాలను జీర్ణం చేయడం. 

2) జీర్ణమైన పదార్థాలను శోషణం చేసుకోవడం. 

3) జీర్ణంకాని పదార్థాలను బయటకు పంపడం.

 

భాగాలు: జీర్ణ వ్యవస్థ ఒక గొట్టం రూపంలో ఉంటుంది. దీనిలో మొదటి భాగం నోరు, చివరి భాగం పాయువు.

 

నోరు: దీనిలో 3 భాగాలుంటాయి. అవి..

1) నాలుక 

2) దంతాలు 

3) లాలాజల గ్రంథులు.

 

నాలుక: ఇది జీర్ణక్రియకు తోడ్పడదు. ఆహార పదార్థాల రుచిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

 

దంతాలు: ఇవి ఆహారాన్ని ముక్కలు చేయడానికి, నమలడానికి ఉపయోగపడతాయి. మొదటగా వచ్చే దంతాలను పాలదంతాలు అంటారు. వీటి సంఖ్య 20. రెండోసారి వచ్చే వాటిని శాశ్వత దంతాలు అంటారు. వీటి సంఖ్య 32. దంతాలు నాలుగు రకాలు 1) కుంతకాలు 2) రదనికలు 3) అగ్రచర్వణకాలు 4) చర్వణకాలు.

 

లాలాజల గ్రంథులు: ఇవి మూడు జతలుగా ఉంటాయి. 1) పెరోటిడ్‌ గ్రంథులు 2) అధోజిహ్వికా గ్రంథులు  3) అధోజంబికా గ్రంథులు.ఇవి స్రవించిన లాలాజలంలో లాలాజల ఎమైలేజ్‌ (టయలిన్‌) అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది ఆహారంలోని పిండిపదార్థాలపై పనిచేసి వాటిని మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది.

 

ఆహారవాహిక: ఇది నోటి తర్వాతి భాగం. దీనిలో ఆహారం పెరిస్టాలిటిక్‌ చలనాలను ప్రదర్శిస్తుంది. 

 

జీర్ణాశయం: ఆహారవాహిక తర్వాత భాగం జీర్ణాశయం. శరీరంలో ఎడమవైపున ఉంటుంది. ఇక్కడ ఆహారం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. దీనిలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. జీర్ణాశయంలోని ఆక్సిన్‌టిక్‌ కణాలు హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఆహార పదార్థాల్లోని సూక్ష్మక్రిములను చంపడానికి, ఎంజైమ్‌లను ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడుతుంది. చైతన్య రహిత స్థితిలో ఉన్న పెప్సినోజెన్, ప్రోరెనిన్‌ ఎంజైమ్‌లపై ఈ ఆమ్లం చర్య జరపడం వల్ల అవి చైతన్యవంతమైన పెప్సిన్, రెనిన్‌గా మారతాయి.

 

పెప్సినోజెన్‌ (చైతన్య రహిత స్థితి) + HCl   పెప్సిన్‌ (చైతన్య స్థితి)

 

ప్రోరెనిన్‌ (చైతన్య రహిత స్థితి) + HCl  రెనిన్‌ (చైతన్య స్థితి)

 

జీర్ణాశయంలోని గ్లోబ్‌లెట్‌ కణాలు స్రవించే మ్యూకస్‌ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం వల్ల కలిగే దుష్ప్రభావాల బారి నుంచి జీర్ణాశయ గోడలను రక్షిస్తుంది.

 

జఠర రసంలోని ఎంజైమ్‌లు: పెప్సిన్, రెనిన్, లైపేజ్‌ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. వీటిలో పెప్సిన్‌ ప్రొటీన్‌లపై పనిచేసి వాటిని పెప్టైడ్‌లుగా మారుస్తుంది. రెనిన్‌ పాలపై చర్య జరిపి దాన్ని పెరుగుగా మారుస్తుంది. లైపేజ్‌ కొవ్వులపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది.

 

చిన్నపేగు: జీర్ణాశయం తర్వాతి భాగం చిన్నపేగుగా కొనసాగుతుంది. దీని పొడవు 6-7 మీటర్లు. వ్యాసం 2.5 సెం.మీ. దీన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఆంత్రమూలం, రెండో భాగం మధ్యాంత్రం, మూడోది శేషాంత్రికం.

 

ఆంత్రమూలం: ఇది U ఆకారంలో అర మీటరు పొడవు ఉంటుంది, కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం దీనిలోకి విడుదలవుతాయి.

 

కాలేయం: శరీరంలో అతి పెద్ద గ్రంథి. సరాసరి 1.5 కిలోల బరువు ఉంటుంది. దీన్ని అతిపెద్ద జీవరసాయన కర్మాగారంగా పిలుస్తారు. ఇది A, D, B12 విటమిన్‌లతోపాటు ఇనుము, రాగి, గ్లైకోజెన్, కొవ్వులను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అవసరమైన ప్రోత్రాంబిన్‌ను తయారు చేస్తుంది. ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాలేయంలోని కుఫర్‌ కణాలు కణభక్షణ ద్వారా సూక్ష్మక్రిములను సంహరిస్తాయి. అధికంగా ఉన్న అమైనో ఆమ్లాలను యూరియాగా మారుస్తుంది. అత్యధికంగా పునరుత్పత్తి చెందే అవయవం. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయానికి సిర్రోసిస్‌ అనే వ్యాధి వస్తుంది.

 

కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. పైత్యరసంలో సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారో కోలేట్‌ అనే పైత్యరస లవణాలు; బైలిరూబిన్, బైలివర్డిన్‌ అనే పైత్యరస వర్ణకాలు ఉంటాయి. పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది, కొవ్వుల ఎమల్సిఫీకరణానికి తోడ్పడుతుంది.పైత్యరస వర్ణకాలు రక్తంలో ఎక్కువైతే కామెర్లు వస్తాయి. కాలేయం గురించి అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు. 

 

క్లోమం: జీర్ణాశయం కింది భాగంలో ఉంటుంది. శరీరంలో రెండో అతిపెద్ద గ్రంథి. దీన్ని మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. ఇది క్లోమ రసాన్ని స్రవించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. క్లోమరసంలో కింద పేర్కొన్న రకరకాల ఎంజైమ్‌లు ఉంటాయి.

 

అమైలేజ్‌: ఇది పిండిపదార్థాలను మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది.

 

ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్‌: ఇవి ప్రొటీన్‌లను పెప్టైడ్‌లుగా మారుస్తాయి.

 

లైపేజ్‌: ఇది కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది.

 

న్యూక్లియేజ్‌లు: ఇవి కేంద్రకామ్లాలపై పనిచేస్తాయి.

 

కార్బాక్సిపెప్టిడేస్‌: ఇది పెప్టైడ్‌లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది.

 

ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్‌ మొదటగా నిష్క్రియా రూపమైన ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్‌లుగా విడుదలవుతాయి. ట్రిప్సినోజెన్‌పై ఎంటిరోకైనేజ్‌ ఎంజైమ్‌ చర్య జరపడం వల్ల అది ట్రిప్సిన్‌ అనే చైతన్యవంతమైన స్థితిలోకి మారుతుంది. 

 

ట్రిప్సినోజెన్‌ (చైతన్యరహిత స్థితి) + ఎంటిరోకైనేజ్‌  ట్రిప్సిన్‌ (చైతన్యవంతమైన స్థితి)  

 

కైమోట్రిప్సినోజెన్‌పై ట్రిప్సిన్‌ ఎంజైమ్‌ చర్య జరపడం వల్ల అది కైమోట్రిప్సిన్‌ అనే చైతన్యవంతమైన స్థితిలోకి మారుతుంది.

 

కైమోట్రిప్సినోజెన్‌ (చైతన్యరహిత స్థితి) + ట్రిప్సిన్‌  కైమోట్రిప్సిన్‌ (చైతన్యవంతమైన స్థితి)

 

చిన్నపేగులో జరిగే జీర్ణక్రియ: చిన్నపేగు గోడల నుంచి విడుదలయ్యే స్రావాన్ని ఆంత్రరసం అంటారు. దీనిలో కింది ఎంజైమ్‌లు వివిధ పదార్థాల జీర్ణక్రియకు తోడ్పడతాయి.

 

అమైలేజ్‌: ఇది పిండిపదార్థాలపై చర్యజరిపి వాటిని మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది. 

పిండిపదార్థం + అమైలేజ్‌  మాల్టోజ్‌ చక్కెర

 

లైపేజ్‌: ఇది కొవ్వులపై చర్యజరిపి వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. 

లైపేజ్‌ + కొవ్వులు కొవ్వు ఆమ్లాలు

 

అమైనోపెప్టిడేస్‌: ఇది పెప్టైడ్‌లపై చర్య జరిపి వాటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. 

అమైనోపెప్టిడేస్‌ + పెప్టైడ్స్‌  అమైనో ఆమ్లాలు

 

సుక్రేజ్‌: ఈ ఎంజైమ్‌ సుక్రోజ్‌ చక్కెరపై చర్య జరిపి దాన్ని గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా మారుస్తుంది. 

సుక్రేజ్‌ + సుక్రోజ్‌ గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌

 

మాల్టేజ్‌: ఈ ఎంజైమ్‌ మాల్టోజ్‌ చక్కెరపై చర్య జరిపి దాన్ని గ్లూకోజ్, గ్లూకోజ్‌గా మారుస్తుంది.

మాల్టేజ్‌ + మాల్టోజ్‌ గ్లూకోజ్, గ్లూకోజ్‌

 

లాక్టేజ్‌: ఈ ఎంజైమ్‌ లాక్టోజ్‌ చక్కెరపై చర్య జరిపి దాన్ని గ్లూకోజ్, గాలక్టోజ్‌గా మారుస్తుంది.

లాక్టేజ్‌ + లాక్టోజ్‌ గ్లూకోజ్, గాలక్టోజ్‌

 

జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ: జీర్ణక్రియలో ఏర్పడిన సరళ పదార్థాలు చిన్నపేగు గోడల నుంచి చూషకాలు అనే వేళ్ల లాంటి నిర్మాణాల ద్వారా శోషితమవుతాయి. చూషకాల్లో రక్తనాళాలు, శోషరస నాళాలు ఉంటాయి. శోషితమైన ఆహారం మొదటగా రక్తంలోకి వెళుతుంది. తర్వాత అన్ని శరీర భాగాలకు సరఫరా అవుతుంది. 

 

పెద్దపేగు: ఇది చిన్నపేగు అనంతరం ఉండే భాగం. దీని పొడవు 1.5 - 1.8 మీటర్లు. వ్యాసం 6.5 సెం.మీ. దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి 1) అంధనాళం 2) పురీషనాళం 3) పాయువు. పెద్దపేగులో ఎలాంటి ఎంజైమ్‌లు ఉండవు కాబట్టి జీర్ణక్రియ జరగదు. ఇక్కడ జీర్ణంకాని పదార్థాల్లో నుంచి నీరు శోషితమవుతుంది. చిన్నపేగుకు, పెద్దపేగుకు మధ్య పెద్దపేగుకు అతుక్కుని ఉండూకం (అపెండెక్స్‌) అనే నిర్మాణం ఉంటుంది. మనిషిలో ఇది అవశేష అవయవం. శాకాహార జంతువుల్లో ఉండూకం సెల్యులోజ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

 

మాదిరి ప్రశ్నలు

 

1. జీర్ణక్రియ తర్వాత పిండిపదార్థాలు ఏ విధంగా మారతాయి?

1) అమైనో ఆమ్లాలు  2) చక్కెరలు  3) కొవ్వు ఆమ్లాలు   4) ప్రొటీన్‌లు

 

2. కిందివాటిలో జీర్ణక్రియ తర్వాత ఏర్పడే సరళ పదార్థాలకు ఉదాహరణ

1) పిండిపదార్థాలు  2) కొవ్వులు    3) కొవ్వు ఆమ్లాలు  4) ప్రొటీన్‌లు

 

3. లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్‌ వల్ల పిండిపదార్థాలు మాల్టోజ్‌ చక్కెరగా మారతాయి?

1) టయలిన్‌ 2) లైపేజ్‌ 3) మాల్టేజ్‌ 4) సుక్రేజ్‌

 

4. జీర్ణాశయంలోకి స్రావితమయ్యే జఠర రసంలో ఉండే ఆమ్లం?

1) నత్రికామ్లం  2) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   3) కార్బోనిక్‌ ఆమ్లం 4) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం

 

5. మన శరీరంలో జీర్ణ వ్యవస్థ విధులు?

1) ఆహారాన్ని జీర్ణం చేయడం   2) జీర్ణమైన పదార్థాల శోషణ   3) జీర్ణంకాని పదార్థాలను బయటకు పంపడం   4) పైవన్నీ

 

6. జఠర రసంలోని రెనిన్‌ ఎంజైమ్‌ ఏ విధంగా ఉపయోగపడుతుంది?

1) ప్రొటీన్‌లను జీర్ణం చేయడానికి   2) కొవ్వులను జీర్ణం చేయడానికి   3) పాలను పెరుగుగా మార్చడానికి   4) పిండి పదార్థాలను జీర్ణం చేయడానికి

 

7. కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమ రసాన్ని స్రవించే చిన్నపేగు మొదటి భాగాన్ని ఏమంటారు?

1) ఆంత్రమూలం  2) మధ్యాంత్రం   3) శేషాంత్రికం   4) పురీషనాళం

 

8. కిందివాటిలో కాలేయం ప్రత్యేకతలు

1) ఇది అతిపెద్ద గ్రంథి  2) అతిపెద్ద జీవరసాయన కర్మాగారం   3) విటమిన్‌ ఎ, డిలను నిల్వ చేస్తుంది 4) పైవన్నీ

 

9. అధికంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల ఏ గ్రంథి ప్రభావితమై సిర్రోసిస్‌ అనే వ్యాధి వస్తుంది?

1) క్లోమం 2) కాలేయం 3) థైమస్‌ గ్రంథి 4) లాలాజల గ్రంథి

 

10. క్లోమం నుంచి స్రావితమయ్యే పైత్యరసం ఏ విధమైన ప్రక్రియను నిర్వహిస్తుంది?

1) పిండిపదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది.   2) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది.   3) కొవ్వుల ఎమల్సిఫీకరణానికి తోడ్పడుతుంది.  4) ప్రొటీన్‌లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది.

 

సమాధానాలు: 1-2, 2-3, 3-1, 4-4, 5-4, 6-3, 7-1, 8-4, 9-2, 10-3.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌
 

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌