• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణ - భావనలు

 

కోలుకోలేని కష్టం... తీరనంత నష్టం!

 

మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ప్రగతి సాధించినా వివిధ సందర్భాల్లో రకరకాల విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. అవి అభివృద్ధికి విఘాతం కలిగించి  తిరోగమనానికి దారి తీస్తున్నాయి. విపత్తుల నివారణ, సంసిద్ధతల కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ నష్టాన్ని పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో విపత్తులు, వైపరీత్యాలు గురించి ప్రాథమికాంశాలను అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి.

విపత్తు నిర్వహణ - భావనలు 

 

ఏదైనా ఒక ప్రదేశంలో నివసించే ప్రజలకు తీవ్రమైన ప్రాణహాని లేదా ఆస్తినష్టం కలిగించే భౌతిక సంఘటనను విపత్తుగా పిలుస్తారు. ఇలాంటి సమయంలో వీరికి ఇతర సమూహాల నుంచి అత్యంత సహాయ సహకారాలు అవసరమవుతాయి.

 

విపత్తులను ఆంగ్లంలో డిజాస్టర్‌గా పిలుస్తారు. ఇది గ్రీకు భాషకు చెందిన Des అంటే దుష్ట, aster అంటే నక్షత్రం అనే పదాల కలయిక ద్వారా వచ్చిన ఫ్రెంచ్‌ పదమైన Desastre, ఇటలీ పదమైన Disastro నుంచి Disaster అనే పదం పుట్టింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం: ఏదైనా ఒక ప్రదేశంలోని సమూహానికి బయట నుంచి, ఇతర సమూహాల నుంచి సాయం పొందాల్సినంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్య కలగజేసే సంఘటనలను విపత్తులు అంటారు. 

భారత్‌ విపత్తు నిర్వహణా చట్టం 2005 నిర్వచనం: ఏదైనా ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ నిర్లక్ష్యం లేదా ప్రమాదవశాత్తుగా తనకు తాను కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి విధ్వంసానికి, పర్యావరణ

నష్టానికి కారణమయ్యే ఉపద్రవం/ ప్రమాదం/ దుర్ఘటనను విపత్తుగా నిర్వచించింది. 

ఐక్యరాజ్య సమితి నిర్వచనం: అకస్మాత్తుగా లేదా పెద్ద దురదృష్టంగా సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటనను విపత్తు అంటారు. 

 

విపత్తుల రకాలు

వివిధ కారణాలను అనుసరించి విపత్తులు రెండు రకాలు ఉన్నాయి.

ప్రకృతి సిద్ధమైన విపత్తులు: మానవ ప్రమేయం లేకుండా సహజంగా ఏర్పడి నష్టానికి దారితీసేవి. ఇవి భౌగోళిక, జల, ఖగోళ పరిస్థితుల వల్ల సంభవిస్తాయి. 

ఉదా: భూకంపాలు, సునామీలు, తుపాన్లు, అగ్నిపర్వతాల విస్ఫోటాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, వేడిగాలులు, శీతల గాలులు లాంటివి. 

మానవ కారక విపత్తులు: మానవుడి నిర్లక్ష్యం, సాంకేతిక లోపం, ఆధిపత్య ధోరణులు లాంటి కారణాల వల్ల ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టానికి దారితీసే వాటిని మానవకారక విపత్తులుగా పరిగణించవచ్చు.

ఉదా: పారిశ్రామిక, రసాయనిక ప్రమాదాలు. అగ్నిప్రమాదాలు, అల్లర్లు, ఘర్షణలు, తీవ్రవాద దాడులు, పౌరయుద్ధాలు, గ్లోబల్‌వార్మింగ్‌ లాంటివి.

 

వేగాన్ని బట్టి విపత్తులను రెండు రకాలుగా వర్గీకరించారు. 

నెమ్మదిగా సంభవించే విపత్తులు: కరవు, పౌరయుద్ధాలు, కొన్ని రకాల వ్యాధులు. ఇవి నెమ్మదిగా సంభవిస్తాయి. అయితే క్రమంగా విస్తరించి మానవుడి పైన విరుచుకుపడి భారీగా నష్టాన్ని కలగజేస్తాయి.

వేగంగా సంభవించే విపత్తులు: భూకంపాలు, సునామీలు, తుపాన్ల లాంటివి. ఇవి అకస్మాత్తుగా విరుచుకుపడి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తాయి. 

భారత ప్రభుత్వం విపత్తుల అధ్యయనానికి 1999లో జె.సి.పంత్‌ ఆధ్వర్యంలో ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ  దేశంలో 31 రకాల విపత్తులు జరుగుతున్నాయని వివరించింది. 2004లో విపత్తు జాబితాలో సునామీని చేర్చడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 32కి చేరింది. వీటిని అయిదు సబ్‌గ్రూపులుగా విభజించారు. 

 

 

I. జలవాతావరణ సంబంధ విపత్తులు: * వరదలు, నీటిముంపు * తుపాన్లు, చక్రవాతాలు, సైక్లోన్లు * టోర్నడోలు, హరికేన్లు * కరవు* సునామీలు * వేడిగాలులు, శీతలగాలులు * సముద్రకోత * ఉరుములు, మెరుపులు, పిడుగులు

* హిమపాతాలు * వడగళ్ల వాన* కుండపోత వాన

II. భౌగోళిక విపత్తు: * భూపాతం, పంక ప్రవాహాలు * భూకంపాలు * గని విపత్తులు * ఆనకట్టలు తెగిపోవడం/ కూలిపోవడం 

III. రసాయన, పారిశ్రామిక, అణుసంబంధ విపత్తులు: * రసాయన, పారిశ్రామిక విపత్తులు * అణు విపత్తులు

IV. ప్రమాదభరితమైన విపత్తులు:  * అడవుల్లో కార్చిచ్చు * పట్టణాల్లో అగ్నిప్రమాదాలు * గ్రామాల్లో అగ్నిప్రమాదాలు * గనుల్లో వరద ప్రమాదాలు * నూనె, చమురు ఒలికిపోవడం * భవంతులు కూలిపోవడం * వరుస బాంబు పేలుళ్లు * ఉత్సవాల్లో తొక్కిసలాటలు * విద్యుత్‌ కారణంగా అగ్నిప్రమాదాలు * పడవల మునక  * విమాన, రోడ్డు, రైలు ప్రమాదాలు

V. జీవ సంబంధ విపత్తులు:  * మహమ్మారి వ్యాధులు * కీటక దాడులు * పశువుల వ్యాధులు * ఆహారం కలుషితం, విషపూరితం

వీటితోపాటు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) ఎడారీకరణ, గ్లోబల్‌ వార్మింగ్, కీటకాల వ్యాప్తులను పర్యావరణ విపత్తుల జాబితాలో ఉంచింది. 

 

వైపరీత్యం

ఆస్తి, ప్రాణ నష్టానికి, పర్యావరణ విధ్యంసానికి, జీవనోపాధికి ఆటంకం కలిగించే ప్రకృతి, మానవ ప్రేరిత ప్రమాద ఘటనలను ‘వైపరీత్యం’ అంటారు. వైపరీత్యాన్ని ఆంగ్లంలో ‘హజార్డ్‌’ అంటారు. ఈ పదం ఫ్రెంచ్, అరబ్‌ పదాల నుంచి ఉద్భవించింది.

విపత్తుగా వైపరీత్యం: వైపరీత్యం అన్నది విపత్తుకు దారితీసే ఒక సంఘటన. అంటే ఒక వైపరీత్యం జరిగినప్పుడు దానివల్ల ప్రజలకు కోలుకోలేని ఆస్తి, ప్రాణనష్టం లాంటి నష్టాలు జరిగితే దాన్ని విపత్తుగా పరిగణిస్తారు.

ఉదా: మనుషులు నివసించని ఎడారిలో భూకంపం సంభవిస్తే దాన్ని విపత్తుగా పరిగణించరు. అందువల్ల అన్నీ వైపరీత్యాలు విపత్తులుగా మారకపోవచ్చు కానీ అన్ని విపత్తులు వైపరీత్యాలు అవుతాయి. 

 

వైపరీత్యాలను మూడు రకాలుగా పేర్కొంటున్నారు. 

ప్రకృతిసిద్ధ వైపరీత్యాలు: మానవుడి ప్రమేయం లేకుండా జరిగేవి. 

ఉదా: భూకంపాలు, సునామీలు, తుపాన్లు, అన్ని ప్రకృతి విస్ఫోటాలు.

మానవ కారక వైపరీత్యాలు: మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, యాంత్రిక లోపం వల్ల జరిగే వైపరీత్యాలు.

ఉదా: రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు; పారిశ్రామిక పేలుళ్లు, పౌరయుద్ధాలు, ఘర్షణలు, అగ్నిప్రమాదాలు.

సామాజిక - సహజ వైపరీత్యాలు: ప్రకృతిసిద్ధం, మానవుడి ప్రమేయం ఈ రెండింటి కారణంగా జరిగే వైపరీత్యాలు.

ఉదా: ముందుగానే సరైన మురుగు నీటిపారుదల (డ్రైనేజ్‌) వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే కొద్దిపాటి వర్షాలకే వరదలు సంభవిస్తాయి. అలాగే కరవు, వ్యాధుల్లాంటివి.


రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌