• facebook
  • whatsapp
  • telegram

వైపరీత్యం

* విపత్తు నిర్వహణ
* అన్ని స్థితిగతులపై ప్రభావం

  విపత్తు అంటే అకస్మాత్తుగా సంభవించేది. ప్రకృతిసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తూ లేదా నిర్లక్ష్యం వల్ల జరిగే ఈ విపత్తులతో వెంటనే కోలుకోలేనంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ప్రకృతి సహజంగా కావచ్చు లేదా మానవ తప్పిదం వల్ల కూడా కావచ్చు.. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించలేం. ఈ వైపరీత్యాల ప్రభావం దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ఉంటుంది. అసలు వైపరీత్యాలు అంటే ఏమిటి? అవి ఎలా సంభవిస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వీటన్నింటిపై టీఎస్‌పీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సమగ్ర అవగాహన అవసరం. ఈ విభాగం నుంచి దాదాపు 8-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  మానవుడు భూమిపై ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన వాటిలో విపత్తులు ఒకటి. 'విపత్తు' ప్రపంచ సమస్య అయితే 'ప్రాంతీయ పరిష్కారం' దీనికి నివారణోపాయం. ఒక సమూహం(ప్రజలు) నుంచి సహాయం పొందాల్సినంత ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే సంఘటనను దేనినైనా విపత్తుగా పిలవవచ్చు. విపత్తులు ఆయా ప్రాంత ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, శారీరక, మానసిక స్థితిగతులు.. అన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి అనాది కాలం నుంచీ ఉన్నా గత కొన్నేళ్లుగా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం, పర్యావరణ హానికి కారణమవుతున్నాయి.

 

వైపరీత్యం అంటే...

  ఒక ప్రాంత ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలకు, పర్యావరణ హానికి కారణమయ్యే సంఘటనను వైపరీత్యంగా భావించవచ్చు. ఎడారిలో భూకంపం సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగదు. బంగ్లాదేశ్‌లో 2007లో సంభవించిన సిదర్ తుపానును దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వరదలు, కరవు, అగ్ని ప్రమాదాలు, భూపాతం (ల్యాండ్ స్త్లెడ్) లాంటి సామాజిక, సహజ విపత్తులు ప్రకృతిసిద్ధంగా, మానవ కారణంగా ఏర్పడతాయి.

 

దుర్బలత్వం అంటే..

  ఒక ప్రాంతం / నిర్మాణం / సేవలు, వాటి స్వభావం రీత్యా అవి విపత్తుభరిత ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నాయి? అనే అంశంపైన దుర్బలత్వం ఆధారపడి ఉంటుంది. ఈవిధంగా వైపరీత్యాల ప్రభావానికి గురయ్యే సునిశితత్వాన్ని పెంచే స్థితిని దుర్బలత్వం అంటారు. ప్రజలపై వైపరీత్యం చూపే ప్రభావం భౌతిక అంశాలపై మాత్రమే కాకుండా ఆ ప్రాంత ప్రజల ఆర్థిక, సాంఘిక స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా, సాంకేతికంగా సరైన నిర్మాణాలు లేని పేద దేశాల్లో విపత్తు నష్టం ఎక్కువగా ఉంటుంది. 2001లో గుజరాత్‌లో జరిగిన భూకంపం వల్ల 3.3 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైపరీత్యాల వల్ల అత్యధిక ప్రాణనష్టం జరుగుతుంది. 1970లో బంగ్లాదేశ్‌లో జరిగిన 'బోలా' అనే తుపాను వల్ల 3 లక్షల మంది చనిపోయారు.
భౌగోళిక, జల, జీవకారకమైన భూకంపాలు; సునామీలు, చక్రవాతాలు, వరదలు, వ్యాధులు లాంటి ప్రకృతిసిద్ధ విపత్తులను మానవుడు అడ్డుకోలేడు. నష్టానికి గురయ్యే అవకాశాలు ఉండటం, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకపోవడం అనే అంశాల కలయికపై విపత్తు నష్టం ఆధారపడి ఉంది. వాటిని ప్రతిఘటించే సామర్థ్యంపై మానవ పురోగమనం ఆధారపడుతుంది.

 

హ్యోగో కార్యచట్రం

  2005-15 మధ్యకాలంలో విపత్తుల తగ్గింపు, నివారణా కార్యాచరణ ప్రక్రియ కోసం జపాన్‌లోని హ్యోగో ప్రాంతంలోని కోబె వద్ద 2005 జనవరి 18 నుంచి 22 మధ్య ప్రపంచ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపత్తులకు సంబంధించి ముందు తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత చేపట్టాల్సిన తక్షణ కార్యక్రమాలను విపత్తు నిర్వహణతో అనుసంధానం చేసి ఈ వైపరీత్యాల నుంచి ప్రజలు తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు నిర్వహణ విధానాలను ప్రతిపాదించారు. అవి..

 

విపత్తు నిర్వహణ

  ఇది విపత్తులను ఎదుర్కొనే అనేక రకాల ప్రక్రియలను తెలియజేస్తుంది. ఇవి విపత్తు ముందు ప్రక్రియలు, తర్వాత ప్రక్రియలు అనే రెండు విధాలుగా ఉండాలని నిర్ణయించారు. విపత్తు ముందస్తు చర్యలు అపాయాన్ని కుదించే విధంగా ఉండాలి. విపత్తు తదనంతర చర్యలు తక్షణ ఉపశమనం, దీర్ఘకాలంలో క్రమంగా తేరుకోవడం అనే అంశాలుగా ఉండాలి.

 

రెండు రకాల చర్యలు

  విపత్తు అపాయ నిర్వహణ విపత్తుకు ముందు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. ఇందులో సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించడం అనే అంశాలకు సంబంధించిన ప్రక్రియలు కలిసి ఉంటాయి. ఈ ప్రక్రియలు నిర్మాణాత్మక, నిర్మాణేతర చర్యలు అనే 2 విధాలుగా ఉండాలి.

 

ఉపశమనం దిశగా..

  విపత్తు అపాయ నిర్వహణ తాత్కాలిక చర్యలకు సంబంధించిన అంశం. విపత్తు తీవ్రత, దాని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉపశమన చర్యలను విపత్తు జరిగిన క్షణం నుంచి కొన్ని వారాలు లేదా నెలలు నిర్వహిస్తారు.

 

తేరుకోవడం

  విపత్తుల నుంచి తేరుకునే నిర్వహణ దీర్ఘకాలిక చర్యలను తెలియజేస్తుంది. ఇందులో విపత్తు స్వభావాన్ని బట్టి పునర్నిర్మించడం, స్థిరత్వాన్ని కల్పించడం అనే చర్యలు చేపడతారు. ఇవి కొన్ని సంవత్సరాలు కొనసాగుతాయి.
మన దేశంలో విపత్తు నిర్వహణ మూడు స్థాయిల్లో జరుగుతోంది. అవి..
1. కేంద్రస్థాయిలో - ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)
2. రాష్ట్రాల స్థాయిలో - ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎంఏ)
3. జిల్లా స్థాయిలో - జిల్లా కలెక్టరు / జిల్లా మేజిస్ట్రేట్ / డిప్యూటీ కలెక్టరు / డిప్యూటీ మెజిస్ట్రేట్ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ).
వీటితోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) కొన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. విపత్తు నిర్వహణను సంస్థాగతం చేయడం, విపత్తులపై పరిశోధన, విపత్తు నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, సమావేశాలు ఏర్పాటు చేసి బులిటెన్‌లు ప్రచురించడం వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం మన దేశంలోని ఎన్ఐడీఎం పనిచేస్తోంది.

 

ముఖ్యాంశాలు

* ప్రకృతి విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల్లో ఆసియా ఖండంలో సంభవిస్తున్నవి 37 శాతం. వీటివల్ల జరిగే నష్టం 49 శాతం.
* ప్రపంచంలో ఎక్కువగా విపత్తులకు గురవుతున్న మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి.
* 2003-2009 ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం సహజ విపత్తుల వల్ల భారతదేశం ఏటా స్థూల జాతీయోత్పత్తిలో 2 శాతం, ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం నష్టపోతోంది.
* ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1990 దశకాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. తర్వాత మనదేశంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని మొదట వ్యవసాయ శాఖలో ఏర్పాటు చేశారు. 2002లో దీన్ని హోం వ్యవహారాల శాఖకు తరలించారు.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌