• facebook
  • whatsapp
  • telegram

విపత్తులు  ప్రాథమిక భావనలు

అంతా ధ్వంసం చేసే ఆపదలు!

ప్రజలకు తీవ్ర నష్టం కలిగించి, వనరులను ధ్వంసం చేసే ప్రకృతిపరమైన లేదా మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలే విపత్తులు. సంవత్సరాలుగా సాధించిన సమాజ వికాసాన్ని, భౌతిక ప్రగతిని ఒక్కసారిగా తుడిచేయగలిగే, సుస్థిరాభివృద్ధికి ఆటంకాలు సృష్టించి, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ విపత్తుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. విపత్తు నిర్వహణ భావనలు, సంబంధిత పదజాలంపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. విపత్తు లక్షణాలు, రకాలు, వర్గీకరణ, వాటి  కారణంగా తలెత్తే నష్టాలు, ఉదాహరణలపై తగిన పరిజ్ఞానం ఉండాలి.


ప్రజాజీవనానికి తీవ్రనష్టం కలిగించి, సమాజంలోని సహజ, సాంస్కృతిక వనరులను ధ్వంసం చేసి సమాజ సాధారణ కార్యకలాపాలకు అంతరాయాలను కలిగించే, ప్రజలను నిరాశ్రయులుగా చేసే ప్రకృతిపర లేదా మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలు, దుర్ఘటనలే విపత్తులు. ‘విపత్తు’ను ఆంగ్లంలో డిజాస్టర్‌ అంటారు. గ్రీకు భాషలోని Dus (దుష్ట), aster (నక్షత్రం) అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన ఫ్రెంచ్‌ పదం desastre నుంచి డిజాస్టర్‌ వచ్చింది. గ్రీకు, లాటిన్‌ భాషల్లో disaster అంటే దుష్టనక్షత్రం అని అర్థం. ప్రాచీన కాలంలో పూర్వీకులు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రంతో ముడిపెట్టి, ఆ నక్షత్రాన్ని దుష్టనక్షత్రంగా భావించేవారు. భూకంపాలు, తుపాన్లు, వడగళ్ల వానలు, కుంభవృష్టి, భూపాతం, భూ క్రమక్షయం, హిమపాతం, వరదలు లాంటి సహజ లేదా ప్రకృతి విపత్తులు; అగ్నిప్రమాదాలు, మహమ్మారి వ్యాధులు, రోడ్లు, విమాన, రైలు ప్రమాదాలు, రసాయన, అణుప్రమాదాలు లాంటి మానవ కారక విపత్తులు నిత్యం సంభవిస్తూనే ఉంటాయి. విపత్తు సహజమైంది లేదా మానవ ప్రేరేపితం కావచ్చు. విపత్తు వల్ల పెద్దఎత్తున మనుషుల ప్రాణాలకు, జీవనోపాధికి, ఆస్తులకు, ప్రాంతాలకు నష్టాలు జరుగుతుంటాయి. 


  విపత్తు ప్రభావం:  విపత్తు ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి లక్షణాలు కనిపిస్తాయి.

* సమాజ సాధారణ జీవనానికి అంతరాయం కలుగుతుంది. దీని ప్రభావం పెద్దసంఖ్యలో ప్రజలపై పడుతుంది. 

 పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. విపత్తు ప్రభావానికి గురైన కమ్యూనిటీకి ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి బయటి నుంచి సహాయం అవసరమవుతుంది. 

దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుంది.


ముఖ్య లక్షణాలు: 

* ఆకస్మికంగా సంభవిస్తాయి.

అతివేగంగా ఏర్పడతాయి. 

 మానవ సమాజాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన వనరులను ధ్వంసం చేస్తాయి. 

 పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తాయి.

 పర్యావరణ వనరులను ధ్వంసం చేసి ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధిని అడ్డుకుంటాయి. 

 సమాజ సాధారణ జీవనానికి అంతరాయాన్ని కలిగిస్తాయి. 


  ఐక్యరాజ్య సమితి నిర్వచనం:   ‘సమాజ సాధారణ కార్యకలాపాలకు అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’.


 విపత్తుల వర్గీకరణ:  విపత్తుల ఆవిర్భావం, అవి సంభవించే వేగం, వాటికి దారితీసే కారణాల ఆధారంగా పలు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ఎ) నిదానమైన లేదా వేగవంతమైన విపత్తులు:

1) నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు: రోజులు, నెలలు లేదా కరవు మాదిరిగా సంవత్సరాల తరబడి కొనసాగే విపత్తును నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు అంటారు. ఉదా: పర్యావరణ క్షీణత, తెగుళ్ల దాడి, దుర్భిక్షం లాంటివి.


2) వేగంగా వచ్చే విపత్తు: తక్షణ విఘాతం వల్ల సంభవించే విపత్తును వేగంగా వచ్చే విపత్తు అంటారు. దీని ప్రభావం స్వల్పకాలం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం   కొనసాగవచ్చు. ఉదా: భూకంపం, చక్రవాతం, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వత విస్ఫోటం.


బి) సహజ లేదా మానవకారక విపత్తులు:

1) సహజ విపత్తులు: ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించి, ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక నష్టాలకు దారితీసేఘటనను సహజ విపత్తు అంటారు.

 వరదలు, కరవులు, సముద్ర వేలా తరంగాలు, భూప్రకంపనల కారణంగా సంభవించే విపత్తులు సహజ విపత్తుల కిందకి వస్తాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ, 2008 చైనాలో వచ్చిన భూకంపం, 2007లో బంగ్లాదేశ్‌లో వచ్చిన సిదర్‌ తుపాను, రాజస్థాన్‌లో తరచూ వచ్చే కరవు; ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఏటా సంభవించే వరదలు సహజ విపత్తులకు ఉదాహరణలు.

  ప్రకృతి సంబంధ విపత్తుల నివారణ సాధ్యం కాదు. కానీ ఆధునిక శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాలను ఉపయోగించుకుని, వాటి తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.


2) మానవకారక విపత్తులు: ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీసే మానవ ప్రేరేపిత వైపరీత్యం సాధారణ జీవితానికి కలగజేసే తీవ్ర అంతరాయాన్ని మానవ కారక విపత్తు అంటారు. 

అగ్నిప్రమాదాలు, రసాయన లేదా పారిశ్రామిక ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, రోడ్డు, రైలు, విమాన, జల ప్రమాదాలు, రాజకీయ అశాంతి మొదలైనవాటితో తలెత్తే విపత్తులను మానవకారక విపత్తులు లేదా మానవ ప్రేరేపిత విపత్తులు అంటారు.

ఉదా: 1984 భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, 1997లో దిల్లీలోని ఉపహార్‌ సినిమాహాలులో జరిగిన ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడం, 2003లో కుంభకోణం పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం, 2008లో జైపుర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు, 2013, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్లు: విశాఖపట్టణం సమీపంలో ఆర్‌ఆర్‌ వేంకటాపురంలో 2020, మే 7న ఎల్జీ పాలిమర్స్‌ రసాయన పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదం మొదలైనవి.


 అయిదు విభాగాలు: ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన ‘డెస్‌ఇన్వెంటర్‌’ విపత్తు సమాచార నిర్వహణ వ్యవస్థ వర్గీకరణ ప్రకారం సహజ విపత్తులను అయిదు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు.


1) భూభౌతిక విపత్తులు: మానవ జీవనానికి, సామాజిక, ఆర్థిక అంతరాయానికి లేదా పర్యావరణ నష్టానికి కారణమయ్యే భౌగోళిక ప్రక్రియ లేదా ధర్మాన్ని భూభౌతిక విపత్తు అంటారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు గాయపడటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, జీవనోపాధికి, సేవలకు నష్టం జరుగుతుంది. ఉదా: భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సునామీ.


2) హైడ్రోలాజికల్‌ ఘటనలు: సాధారణ జలచక్రంలో వచ్చే మార్పుల కారణంగా లేదా వాయువ్యవస్థలో మార్పు వల్ల జలాశయాలు పొంగిపొర్లడంతో సంభవించే ఘటనలు.

ఉదా: వరదలు, భూపాతాలు, తరంగ చర్యలు.


3) వాతావరణ సంబంధిత ఘటనలు: స్వల్ప వ్యవధి నుంచి దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితుల కారణంగా సంభవించే విపత్తులు. ఉదా: తుపాను, టోర్నడో తుపాన్లు, ఉష్ణమండల తుపాన్లు, శీతలగాలులు, అసాధారణ ఉష్ణోగ్రతలు, పొగమంచు, మంచు గడ్డకట్టుకుపోవడం, వడగాలులు, పిడుగులు, భారీ వర్షాలు, ఇసుక తుపాన్లు, ధూళి తుపాన్లు, మంచు తుపాన్లు.


4) శీతోష్ణస్థితికి సంబంధించిన ఘటనలు: స్వల్పకాలం నుంచి దశాబ్దాల తరబడి శీతోష్ణస్థితి పరిస్థితుల్లో వచ్చే మార్పుల కారణంగా సంభవించే విపత్తు ఘటనలు. ఉదా: కరవు, అసాధారణ ఉష్ణ పరిస్థితులు, కార్చిచ్చులు, హిమానీనదాలు ఉప్పొంగడం, కుంగిపోవడం.


5) జైవిక ఘటనలు: వ్యాధికారక సూక్ష్మజీవులు, విష కీటకాలు, జైవిక చర్యను జరిపే పదార్థాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం, వ్యాధుల సంక్రమణ జరిగితే దాన్ని జైవిక విపత్తు అంటారు. దీని ప్రభావంతో జీవనోపాధి, సేవలు, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయంతో పాటు పర్యావరణ నష్టం జరుగుతుంది. ఉదా: వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాలు, ప్రియాన్‌ లాంటి వాటి ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులు, కీటకాల దాడులు, జంతువుల తొక్కిసలాటలు. 


 విపత్తు నిర్వహణ భావనలు ::విపత్తు ప్రభావం తక్షణంగా, స్థానికంగా ఉంటుంది. తరచూ విస్తారంగా, దీర్ఘకాలం కూడా ఉండొచ్చు. ఒక కమ్యూనిటీ సొంత వనరులతో ఎదుర్కోగలిగిన సామర్థ్యానికి మించి ఉండొచ్చు. అందువల్ల వెలుపలి నుంచి జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి వనరుల సాయం అవసరం కావచ్చు. 


అత్యవసరం: కొన్నిసార్లు విపత్తుకు బదులుగా ఈ భావనను వాడుతుంటారు. సమాజం మనుగడకు తీవ్ర అంతరాయం కలిగించే జైవిక లేదా సాంకేతిక వైపరీత్యాలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు.


విపత్తు నష్టం: ఇది విపత్తు సమయంలో లేదా విపత్తు ఏర్పడిన క్షణమే సంభవిస్తుంది. దీనిని సాధారణంగా భౌతిక యూనిట్ల (ఇళ్లకు సంబంధించి చదరపు మీటర్లు, రోడ్లయితే కి.మీ.లు)లో లెక్కిస్తారు. ప్రభావిత ప్రాంతంలో భౌతిక ఆస్తుల మొత్తం లేదా పాక్షిక విధ్వంసాన్ని, ప్రాథమిక సేవలకు కలిగే అంతరాయాన్ని, జీవనోపాధి వనరులకు కలిగే ఇబ్బందులను వివరిస్తుంది.


విపత్తు తాకిడి: ఇదొక వైపరీత్య ఘటన లేదా విపత్తు ప్రతికూల, సానుకూలం సహా మొత్తం ప్రభావాన్ని   తెలియజేస్తుంది. ఇందులో ఆర్థిక, మానవ, పర్యావరణ తాకిడులు కూడా ఇమిడి ఉంటాయి. 


 విపత్తు రకాలు:   విపత్తు ముప్పు తగ్గింపునకు సెడాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2015-2030 పరిధి ప్రయోజనం ఆధారంగా విపత్తును వివిధ రకాలుగా పేర్కొంటారు. 


చిన్నతరహా విపత్తు: స్థానిక కమ్యూనిటీలపై మాత్రమే ప్రభావం చూపి, ఆ కమ్యూనిటీకి వెలుపల నుంచి సహకారం అవసరమయ్యే విపత్తు, చిన్నతరహా విపత్తు.


భారీతరహా విపత్తు: జాతీయ లేదా అంతర్జాతీయ  సహకారం అవసరమయ్యే విధంగా ఒక సమాజాన్ని ప్రభావితం చేసే విపత్తు.తరచూ, అరుదుగా వచ్చే విపత్తులు: విపత్తులు సంభవించే సంభావ్యత, ఒక నిర్దిష్ట వైపరీత్యం తిరిగి వచ్చే వ్యవధి, దాని తాకిడి ఆధారంగా విపత్తులను తరచుగా వచ్చే లేదా అరుదైన విపత్తులుగా వర్గీకరిస్తారు. 


నెమ్మదిగా విస్తరించే విపత్తు: కాలక్రమేణా క్రమంగా విస్తరించే విపత్తును నెమ్మదిగా విస్తరించే విపత్తు అంటారు. ఉదా: కరవు, ఎడారీకరణ, సముద్ర మట్టాల పెరుగుదల, కొవిడ్‌-19 లాంటి  మహమ్మారుల వ్యాప్తి.


అకస్మాత్తుగా దాడి చేసే విపత్తు: ఇది సత్వరం లేదా ఆకస్మికంగా సంభవించే వైపరీత్య ఘటన. ఉదా: భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటం, ఆకస్మిక వరదలు, రసాయన విస్ఫోటం.


 


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌