• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో విపత్తులు

అంతా ఆపదలమయం!

  దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపత్తు ఏర్పడుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి గురైనప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణలు కోల్పోతున్నారు. ఆస్తులు నష్టపోతున్నారు. మనుషులు తమ మనుగడ కోసం పర్యావరణ వనరులను వినియోగించుకోవడమూ వైపరీత్యాలకు దారితీస్తోంది. ఆ ఆపదలు ఎన్ని రకాలు? వాటికి కారణాలు ఏమిటి? ఏవిధమైన నష్టాలు సంభవిస్తున్నాయి? తదితర అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

   విభిన్న భౌగోళిక, శీతోష్ణ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా భారతదేశం పెద్ద సంఖ్యలో ప్రకృతి, మానవకారక విపత్తులను ఎదుర్కొంటోంది. వీటికి తోడు అధిక జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అశాస్త్రీయ పద్ధతుల ఆచరణ లాంటి కారకాలు కూడా విపత్తుల దుర్భలత్వాన్ని పెంచుతున్నాయి. మన దేశంలో విపత్తులు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం దేశ భౌగోళిక నిర్మాణం.

 

భౌగోళిక దుర్భలత్వం 

విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి భారతదేశాన్ని అయిదు ప్రత్యేక ప్రాంతాలుగా విభజించారు.

 

హిమాలయ ప్రాంతం: భారతీయ భూపటల పలక, యూరేషియన్‌ భూపటల పలక కిందకు క్రియాశీలకంగా భూఅంతర్భాగంలో ప్రవేశిస్తుండటం వల్ల అతి తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి తూర్పున మయన్మార్‌ సరిహద్దు వరకూ భూకంపాలు, వాటికి సంబంధించిన భూపాతాలు (శిలలు విరిగి పడటం) తరచుగా జరుగుతున్నాయి. అంతే కాకుండా హిమాలయాల్లో అధిక వర్షాలు కారణంగా నేల కోతకు గురవుతోంది. 

 

ఉత్తర మైదానం: ఇది హిమాలయ ప్రాంతానికి పక్కనే ఉన్నందున భౌగోళికంగా విరూపకారక లక్షణాలు (ఖండ పలకల చలనాలు) కలిగి భూకంపాలు, భూపాతాలు (శిలలు విరిగి పడటం) ఏర్పడుతున్నాయి. నైరుతీ రుతుపవన కాలంలో విపరీతమైన వరదలు సంభవిస్తాయి. దాంతో నేల క్రమక్షయానికి గురవుతుంది. 

 

ద్వీపకల్ప పీఠభూమి: ఈ ప్రాంతం వివిధ రకాల కొండలతో విస్తరించి స్థిరమైన భూభాగంగా పరిగణిస్తున్పటికీ ఒక మోస్తరు భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే కొండల వెనుక ప్రదేశాల్లో వర్షం తక్కువగా ఉండి వర్షచ్ఛాయా ప్రాంతాలుగా మిగిలిపోయి కరవు కాటకాలు సంభవిస్తున్నాయి.

ఉదా: రాజస్థాన్, గుజరాత్, మహరాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలు.

 

తీరప్రాంత మండలం: భారత దేశానికి దీవులతో సహా మొత్తం తీరం 7,516 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 76 శాతం అంటే 5,700 కి.మీ తీరం తుపాన్లు, సునామీల ప్రమాదాలకు ఎక్కువగా గురవుతోంది. ఏటా తీర ప్రాంతం నదీ ముఖద్వారాల వద్ద (నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలు) వరదలు సంభవిస్తున్నాయి. 

 

ఎడారి ప్రాంతం: ఈ ప్రాంతంలో అల్ప నుంచి అత్యల్ప వర్షం నమోదు కావడం వల్ల ప్రతి సంవత్సరం కరవు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఒక్కోసారి వర్షపాతం సాధారణం కన్నా 50 శాతం తగ్గిపోయి విపత్కర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ విధంగా భారతదేశ సహజ సిద్ధమైన భౌగోళిక నిర్మాణమే వివిధ విపత్తుల దుర్భలత్వానికి ప్రధాన కారణంగా ఉంది.

 

శీతోష్ణ దుర్భలత్వం 

  దేశంలో వార్షిక వర్షపాతంలో సుమారుగా 75 శాతం వర్షం కేవలం నైరుతి రుతుపవనాల (జూన్‌ - సెప్టెంబరు నెలల్లో) కాలంలోనే కురుస్తుంది. ప్రతి ఏడెనిమిదేళ్లకు దేశంలో తీవ్ర కరవు సంభవిస్తుంది. 1980 - 2010 మధ్యలో నాలుగుసార్లు కరవు కాటకాలు వచ్చాయి. 1876-78లో మధ్య దక్షిణ భారతదేశంలో మహాదుర్భిక్షం, 1896-97లో దేశంలో దుర్భిక్షం సంభవించాయి (కరవు ఎక్కువ కాలం కొనసాగి, ఎక్కువ మందిపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని దుర్భిక్షంగా పేర్కొంటారు).

  దేశంలో వర్షపాత వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రాంలో ఏటా 1,187 సెం.మీ. ఉంటే రాజస్థాన్‌ జైసల్మేర్‌లో 12 సెం.మీ. మాత్రమే ఉంటుంది. తూర్పు, ఈశాన్య భారత దేశంలో అధిక వర్షాలు వల్ల గంగా, బ్రహ్మపుత్రా నదీ మైదానాల్లో ప్రతి సంవత్సరం వరదలు సంభవిస్తున్నాయి. 

 

సామాజిక, ఆర్థిక దుర్భలత్వం

  పేదలు తమ మనుగడ కోసం అనివార్య పరిస్థితుల్లో పర్యావరణ వనరులను ఉపయోగించుకోవడం వల్ల వరదలు, కరవు, భూపాతం లాంటి విపత్తుల తీవ్రత ఎక్కువవుతోంది. సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుండా తక్కువ వ్యయంతో కూడిన సామగ్రితో నిర్మించిన గృహాలు సులభంగా విపత్తులకు గురై మరింత సామాజిక వెనుకబాటుకు దారి తీస్తుంది. ఉదా: 2001-11 మధ్య వరదలు, చక్రవాతాలు, భూకంపాలు, భూపాతాల వల్ల సుమారుగా 1,50,23,870 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివరణ: ఈ సంస్థ నిర్వహిస్తున్న ఇండియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఐడీఎమ్‌) ప్రకారం దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 ప్రాంతాలను అధిక విపత్తులకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించారు. 

* దేశంలో సాగు భూమిలో 68 శాతం భూమి కరవును ఎదుర్కొంటోంది. 58.6 శాతం భూభాగంలో భూకంపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. 

* దేశం మొత్తం భూమిలో 12 శాతం భూభాగం వరదలు, 8 శాతం చక్రవాతాలు, 0.15 శాతం భూపాతాలు కలిగే అవకాశం ఉంది. 

 

భారతదేశంపై ప్రపంచ బ్యాంకు వివరణ: భారతదేశ అభివృద్ధి మార్గానికి సహజ విపత్తులు ఒక ప్రధాన అవరోధంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 

* దేశంలో సహజ విపత్తుల వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం నష్టం ఏర్పడుతోంది.

* విపత్తుల వల్ల ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం,  వైపరీత్యాల వల్ల జీడీపీలో 3 శాతం నష్టం వాటిల్లుతోంది. 

* యునైటెడ్‌ నేషన్స్‌ డిజాస్టర్స్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌) ప్రివెన్షన్‌ వెబ్‌ ప్రకారం భారతదేశంలో 1980-2010 మధ్య సహజ విపత్తులు వాటి ప్రభావాలు కింది విధంగా ఉన్నాయి. 

* విపత్తు ఘటనల సంఖ్య - 431

* మృతులు - 1,43,039 మంది

* ప్రభావిత ప్రజలు - 152,17,26,127 మంది

 

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ ప్రకారం

భారత దేశ విస్తీర్ణంలో సుమారుగా 85 శాతం భూభాగం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ విపత్తులకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

భారతదేశంలో సహజ విపత్తుల తీరు

వరదలు - 52 శాతం

తుపాన్లు - 23 శాతం

భూకంపాలు - 11 శాతం

భూపాతాలు - 11 శాతం

కరవు, ఇతరాలు - 3 శాతం 

 

సంవత్సరానికి సగటు మరణాలు (సుమారుగా)

* భూకంపాలు - 2,672 మంది

* వరదలు - 1,308 మంది

* తుపాన్లు - 1,219 మంది

* భూపాతాలు - 104 మంది

* కరవు - 8 మంది

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశంలో జరుగుతున్న సహజ విపత్తుల్లో కింది వాటిలో ఏది అధిక స్థాయిలో ఉంది?

1) భూకంపాలు   2) వరదలు    3) కరవు    4) భూపాతాలు

 

2. భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతం కింది ఏ విపత్తులకు ఆలవాలం?

1) ఒక మాదిరి భూకంపాలు, కరవులు    2) కరవు, నేలకోత

3) తీవ్ర వరదలు, భూకంపాలు   4) తీవ్ర భూకంపాలు, భూపాతాలు

 

3. మనదేశంలో ఏ ప్రాంతంలో భూకంపాలు, భూపాతాలు, నేల క్రమక్షయం, విపత్తులు అధికంగా సంభవిస్తాయి?

1) తీరప్రాంత మండలం   2) ఎడారి ప్రాంతం     3) ఉత్తర మైదానం    4) ద్వీపకల్పం

 

4. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తులకు అధిక దుర్భలత్వం కలిగి ఉన్నాయి?

1) 27 ప్రాంతాలు       2) 30 ప్రాంతాలు    3) 36 ప్రాంతాలు   4) 25 ప్రాంతాలు

 

5. దేశంలో ఎంత శాతం సాగు భూమిలో కరవు ఏర్పడుతుంది?

1) 68 శాతం     2) 75 శాతం     3) 58 శాతం    4) 40 శాతం

 

6. దేశంలో ఏ సహజ విపత్తుల వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయి?

1) భూకంపాలు    2) వరదలు     3) తుపాన్లు     4) భూపాతాలు

 

7. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం సహజ విపత్తుల వల్ల దేశ జీడీపీలో ఎంత శాతం నష్టపోతున్నాం?

1) 2 శాతం   2) 5 శాతం    3) 10 శాతం   4) 12 శాతం  

 

8. దేశంలో తుపాన్లు, సునామీలకు ఎక్కువగా గురవుతున్న తీరరేఖ పొడవు?

1) 5,700 కి.మీ    2) 7,500 కి.మీ     3) 4,500 కి.మీ     4) 2,500 కి.మీ

 

9. దేశంలో అత్యధిక వర్షం కురిసే ప్రాంతం ఏది?

1) మాసిన్రాం   2) జైసల్మేర్‌    3) కొలంబై   4) కొచ్చిన్‌  

 

10. దేశ శీతోష్ణ స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపించే దృగ్విషయం ఏది?

1) ఎల్‌నినో    2) లానినా     3) టోర్నడో     4) వాటర్‌ స్పాట్‌

 

సమాధానాలు 

1-2, 2-1, 3-3, 4-1, 5-1, 6-1, 7-1, 8-1, 9-1, 10-1.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 29-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌