• facebook
  • whatsapp
  • telegram

విపత్తులు 

* విపత్తు (Disaster) అనే పదం ఫ్రెంచ్‌భాషకు చెందింది. Desaster అనే ఫ్రెంచ్ పదం నుంచి Disaster అనే ఆంగ్ల పదం వచ్చింది. దీనికి 'చెడ్డ నక్షత్రం (Bad star)'అని అర్థం.
* పర్యావరణం, సమాజం, సామాన్య ప్రజలకు ఆర్థికంగా అధిక నష్టం కలిగించి, సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితిని 'విపత్తుగా' పరిగణించవచ్చు. ప్రకృతి వైపరీత్యాల (Natural Hazards) వల్ల అధిక మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలుంటాయి. జరిగిన నష్టం ఆధారంగా విపత్తు తీవ్రతను అంచనా వేస్తారు. ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability) ఉన్నప్పుడు, వైపరీత్యాలను ఎదుర్కొనే ముందస్తు సమర్థ చర్యలు లేనప్పుడు విపత్తు తీవ్రత అధికంగా ఉంటుంది.


         విపత్తు సందర్భంలో ప్రజలు ప్రమాదకర లేదా సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఒక ప్రాంత ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability), వయసు, పేదరికం, నిరక్ష్యరాస్యత, సరైన శిక్షణ లేకపోవడం, పర్యావరణ క్షీణత, నియంత్రించలేని అభివృద్ధి, సరైన వసతులు లేకపోవడం, ప్రమాదకర ప్రదేశాలు, నివాసాలు, ఆర్థికంగా పటిష్టంగా లేకపోవడం, పట్టణీకరణం, జనాభా పెరుగుదల లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.  
వైపరీత్యం వల్ల అతి తక్కువ ప్రభావం ఉండి, ఆర్థిక, ప్రాణ నష్టాలు లేకపోతే అది విపత్తుగా మారే అవకాశం లేదు. ఉదాహరణకు ప్రాణులు, ఆవాసాలులేని ఏదైనా ఎడారి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే, దాన్ని విపత్తుగా భావించలేం.


    వైపరీత్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
1) సహజ వైపరీత్యాలు (Natural Hazards)
2) మానవకారక వైపరీత్యాలు (Man made Hazards).


సహజ వైపరీత్యాలు: ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి. తుపానులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, సునామీ, కొండచరియలు విరిగిపడటం, వరదలు, కరవు, చీడపీడలు ఎక్కువ కావడం లాంటివాటిని సహజ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.


మానవకారక వైపరీత్యాలు: సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం; ఆనకట్ట కూలిపోవడం (Dam Failure); యుద్ధాలు; పరిశ్రమల నుంచి విషవాయువులు, హానికర పదార్థాలు వెలువడటం లాంటి మానవ చర్యల వల్ల మానవకారక వైపరీత్యాలు సంభవిస్తాయి.


* వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితి ఆధారంగా కిందివిధంగా విభజించవచ్చు.
1) భౌగోళిక సంబంధ వైపరీత్యాలు (Geological Hazards): భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, గనుల్లో మంటలు రావడం, ఆనకట్ట బద్దలు కావడం, కొండచరియలు విరిగిపడటం (Land side) లాంటివాటిని భౌగోళిక సంబంధ విపత్తులుగా పేర్కొనవచ్చు.


2) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు (Water & Climatic Hazards): తుపానులు, టోర్నడోలు, హరికేన్లు, వరదలు, కరవు, వేడి గాలులు, మంచు చరియలు విరిగిపడటం(Snow Avalanche), సముద్రం వల్ల కలిగే కోత (Sea erosion), వడగళ్ల వాన, గాలితో కూడిన వర్షం(Cloud burst) లాంటివాటిని నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.


3) పర్యావరణ సంబంధ వైపరీత్యాలు (Environmental Hazards): పర్యా వరణ కాలుష్యం, ఎడారి విస్తరించడం (Desertification), చీడపీడల సంక్రమణ (Pest Infection), అడవులు నశించడం లాంటివి వీటికి ఉదాహరణ.


4) జీవన సంబంధ విపత్తులు: చీడపీడలు వ్యాపించడం (Pest Attacks), ఆహారం కలుషితమవడం, మానవులు, జంతువుల నుంచి అంటు వ్యాధులు (Human/ Animal Epidemics) వ్యాపించడం లాంటివి జీవసంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ.


5) రసాయన, పారిశ్రామిక వైపరీత్యాలు: పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడటం, పారిశ్రామిక దుర్ఘటనలు, చమురు ఎక్కువగా ఒలికిపోవడం(Oil Spils), నూనెలవల్ల మంటలు చెలరేగడం, అణు దుర్ఘటనలు మొదలైనవాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.


6) ప్రమాద సంబంధ వైపరీత్యాలు: రైలు, విమాన, వాహన, పడవ సంబంధ ప్రమాదాలు, జనావాసాల మధ్య మంటలు చెలరేగడం, ఒకేసారి అనేకచోట్ల బాంబులు పేలడం, అడవుల్లో కారుచిచ్చు, భవంతులు కూలిపోవడం, విద్యుత్ సంబంధ ప్రమాదాలు, పండగల సందర్భంలో జరిగే ప్రమాదాలు, గనుల్లోకి వరదరావడం లాంటివి ప్రమాద సంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ. కొన్నిసార్లు సహజ, మానవ సంబంధ కారణాలు కలవడం వల్ల కూడా వైపరీత్యాలు రావచ్చు.


* ఇలాంటి వాటిని సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio-Natural Hazards) అంటారు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో చెత్త, చెదారం పేరుకుపోవడం వల్ల వరదలు రావడం. కొన్నిసార్లు కరవు, మంటలు చెలరేగడం లాంటివి సహజ, మానవ కారణాలు రెండింటి ఫలితంగా సంభవించవచ్చు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌