• facebook
  • whatsapp
  • telegram

డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌

మనిషి మనిషికీ అచ్చు భేదం!

  నేరాలు జరిగినా, ప్రమాదాలు సంభవించినా, వ్యాధులకు కారణాలను కనుక్కున్నా, రక్తసంబంధాలను గుర్తించినా తరచూ వినిపించే పదం డీఎన్‌ఏ.  దాని నిర్మాణంలో ఒక్క శాతం కంటే తక్కువ భాగంలో ఉండే తేడాల ఆధారంగా కోట్లాది మందిలో భేదాలను కచ్చితంగా గుర్తిస్తున్నారు. అనేక రకాల ప్రయోజనాలను అందించే ఆ శాస్త్ర,  సాంకేతిక అంశం గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 

 

  వ్యక్తులను వారి డీఎన్‌ఏ ప్రింట్‌ (అచ్చు) క్రమాలాధారంగా గుర్తుపట్టడాన్ని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అంటారు. దీన్ని డీఎన్‌ఏ ప్రొఫైలింగ్, మాలిక్యులార్‌ ఫింగర్‌ ప్రింటింగ్, డీఎన్‌ఏ అనాలసిస్, జెనెటిక్‌ ఫింగర్‌ ప్రింటింగ్, ఫోరెన్సిక్‌ జెనెటిక్స్‌ అనే పేర్లతో పిలుస్తారు. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ను మొదటగా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త అలెక్‌ జెఫ్రీస్‌. భారతదేశంలో ఈ పద్ధతిని అభివృద్ధి చేసి, వ్యాప్తి చెందించినవారు సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ, హైదరాబాద్‌) మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ లాల్జి సింగ్‌.

  మనందరిలో 99.1 శాతం డీఎన్‌ఏ ఒకే రకంగా ఉంటుంది. కానీ మిగతా 0.9 శాతం మాత్రం ప్రతి ఒక్కరిలో వేర్వేరుగా ఉంటుంది. ఈ తేడాను ఉపయోగించి వ్యక్తులను గుర్తిస్తారు. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ను రూపొందించడం, విశ్లేషించడం వీఎన్‌టీఆర్‌ (వేరియబుల్‌ నంబర్‌ టాండమ్‌ రిపీట్స్‌) పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆధునిక డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ఎస్‌టీఆర్‌ (షార్ట్‌ టాండమ్‌ రిపీట్స్‌) అనే డీఎన్‌ఏ వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది.

అలెక్‌ జెఫ్రీస్‌ రూపొందించిన డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ప్రక్రియలో కింది దశలు ఉంటాయి. 

 

శాంపిల్స్‌/కణజాలాల నుంచి డీఎన్‌ఏను వేరుచేయడం: మానవుల్లో డీఎన్‌ఏను వేరుచేయడానికి రక్తం, వీర్యం, చర్మకణాలు, ఎముక మజ్జ, కుదురుతో కూడిన వెంట్రుకలును సేకరిస్తారు. ఇవేకాకుండా శరీరంలోని ఇతర కణాలను కూడా వాడుకోవచ్చు. 

 

డీఎన్‌ఏను కత్తిరించడం, వేరుచేయడం: ఈ ప్రక్రియలో డీఎన్‌ఏను మొదట రెస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌లు అనే ఎంజైమ్‌లతో కత్తిరిస్తారు. ఇవి డీఎన్‌ఏను నిర్ణీత ప్రదేశంలో కత్తిరిస్తాయి. ఇలా వచ్చిన డీఎన్‌ఏ ముక్కలను జెల్‌ ఎలక్ట్రోఫోరిసిస్‌ అనే ప్రక్రియను ఉపయోగించి వాటి పొడవు ఆధారంగా వేరుచేస్తారు.

 

డీఎన్‌ఏను నైలాన్‌ పొరపైకి మార్చడం: జెల్‌ ఎలక్ట్రోఫోరిసిస్‌ ద్వారా వేరుచేసిన డీఎన్‌ఏ ముక్కలను నైలాన్‌ పొరపైకి మారుస్తారు. ఈ ప్రక్రియ తర్వాత సదరన్‌ బ్లాటింగ్‌ ప్రక్రియను ఉపయోగించి డీఎన్‌ఏను గుర్తిస్తారు. 

 

ప్రోబింగ్‌: ఈ ప్రక్రియలో రేడియోధార్మికత క‌లిగి, వ‌రుస క్ర‌మం తెలిసిన‌ డీఎన్‌ఏ ముక్కను నైలాన్‌ పొర మీద ఉన్న డీఎన్‌ఏకు అతికిస్తారు.

 

డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ను అభివృద్ధి చేయడం: నైలాన్‌ పొరపైన డీఎన్‌ఏ ప్రోబ్‌లున్న డీఎన్‌ఏను ఎక్స్‌రే ఫిల్మ్‌తో చర్యనొందిస్తే ఆ ఫిల్మ్‌పై డీఎన్‌ఏ అచ్చులు ఏర్పడతాయి. దీన్నే డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ అంటారు. దీన్ని విశ్లేషించి వ్యక్తులను గుర్తిస్తారు. 

 

డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ అనువర్తనాలు 

* దీన్ని ఫోరెన్సిక్‌ సైన్స్‌లో ఉపయోగించి నిందితులను గుర్తించవచ్చు. 

* హత్య, అత్యాచారం లాంటి వాటిలో నిందితులు, వ్యక్తులను కచ్చితంగా గుర్తించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 

* ప్రకృతి విపత్తుల సమయంలో, ప్రమాదాల్లో చనిపోయిన, అగ్ని ప్రమాదాల్లో కాలిపోయిన వారి దేహాలను గుర్తించడానికి  ఉపయోగపడుతుంది

* తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులను తెలుసుకోవడానికి  

* ఒక వ్యక్తి తల్లిదండ్రులు, రక్త సంబంధీకులను గుర్తించడానికి దీన్ని వాడతారు. 

 

ఇతర రంగాల అనువర్తనాలు 

* వ్యవసాయ రంగంలో హైబ్రిడ్‌లను (సంకరాలు) గుర్తించడానికి 

* మానవ డీఎన్‌ఏలో వ్యాధులకు కారణమయ్యే జన్యువులను కనుక్కోవడానికి 

* సూక్ష్మజీవనాశక నిరోధకతను నియంత్రించే జన్యువుల పరిశోధనకు

* మానవుల వలసను లెక్కగట్టడానికి

* వంశ వృక్ష విశ్లేషణకు 

* జన్యు విశ్లేషణకు ఈ ప్రక్రియను వాడుతున్నారు. 

* వన్యజీవుల గుర్తింపునకు 

డీఎన్‌ఏ సాంకేతికత నియంత్రణ బిల్లు: భారత ప్రభుత్వం డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ను ఉపయోగించుకోవడానికి, వ్యక్తులను గుర్తించడానికి, ఈ ప్రక్రియను నియంత్రించడానికి డీఎన్‌ఏ టెక్నాలజీ రెగ్యులేషన్‌ బిల్లు - 2019ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా జాతీయ స్థాయిలో డీఎన్‌ఏ రెగ్యులేటరీ బోర్డు/అథారిటీని ఏర్పాటు చేయ‌నున్నారు.

జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో డీఎన్‌ఏ సమాచార బ్యాంకులను ఏర్పాటు చేస్తారు. ఇవి వ్యక్తుల డీఎన్‌ఏను భద్రపరచడానికి తోడ్పడతాయి. డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌పై పరిశోధన, అభివృద్ధి కోసం ఉపయోగపడే సీడీఎఫ్‌డీ (సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌) హైదరాబాద్‌లో ఉంది.

 

బయోటెక్నాలజీ

జీవులు/కణాలను మానవ అవసరాలకు వినియోగించడం లేదా జీవ కారకాలను మన అవసరాల కోసం నియంత్రణతో ఉపయోగించుకోవడాన్ని బయోటెక్నాలజీ అంటారు. బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు కార్ల్‌ ఎరికె. వృక్ష, జంతు, జీవరసాయన, జన్యు, సూక్ష్మజీవ శాస్త్రాలు, ఇంజినీరింగ్‌ల కలయికనే బయోటెక్నాలజీగా పేర్కొంటారు. 

 

శాఖలు: వినియోగాన్ని బట్టి బయోటెక్నాలజీని అగ్రికల్చర్, యానిమల్, ప్లాంట్, ఫ్యూయల్, ఇండస్ట్రియల్, మెడికల్, ఎన్విరాన్‌మెంట్‌ బయోటెక్నాలజీ అనే శాఖలుగా విభజించారు. 

 

రకాలు: బయోటెక్నాలజీ అనువర్తనాలు, ఉపయోగపడే రంగం, మానవ అవసరాలకు వినియోగించే విధానాన్ని బట్టి తేలికగా అర్థం కావడానికి వాటిని వివిధ రంగుల్లో విభజించారు. 

 

రెడ్‌ బయోటెక్నాలజీ: వైద్య, ఆరోగ్య రంగాల్లో వినియోగించడాన్ని గురించి తెలియజేస్తుంది.

 

బ్లూ బయోటెక్నాలజీ: ఇది ఆక్వాకల్చర్, తీరప్రాంత, సముద్ర బయోటెక్నాలజీల గురించి తెలుపుతుంది.  

 

గ్రీన్‌ బయోటెక్నాలజీ: బయోటెక్నాలజీని వ్యవసాయం, పర్యావరణం, జీవ ఎరువులు, జీవ ఇంధనాలు, బయోరెమిడియేషన్‌ లాంటి వాటికి ఉపయోగించడాన్ని తెలియజేస్తుంది. .

 

వైట్‌ బయోటెక్నాలజీ: పరిశ్రమల్లో జన్యు ఆధారిత బయోటెక్నాలజీ ఉపయోగాన్ని గురించి వివరిస్తుంది. 

 

గోల్డ్‌ బయోటెక్నాలజీ: బయో ఇన్ఫర్మాటిక్స్‌లో బయోటెక్నాలజీ ఉపయోగం, నానో బయోటెక్నాలజీల గురించి తెలుపుతుంది.

 

పర్పుల్‌ బయోటెక్నాలజీ: ఇది బయోటెక్నాలజీలో పేటెంట్‌లు, ప్రచురణలు, మేధోసంపత్తి హక్కులు, ఆవిష్కరణల గురించి తెలియజేస్తుంది.

 

బ్రౌన్‌ బయోటెక్నాలజీ: ఎడారి, వర్షాధార ప్రాంతం గురించి చెబుతుంది. 

 

ఎల్లో బయోటెక్నాలజీ: ఆహారం, పోషణ రంగాల్లో బయోటెక్నాలజీ సాంకేతికత గురించి తెలియజేస్తుంది. 

 

గ్రే బయోటెక్నాలజీ: కిణ్వప్రక్రియ, బయోప్రాసెస్, బయోటెక్నాలజీ గురించి వివరిస్తుంది. 

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌  

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌