• facebook
  • whatsapp
  • telegram

పత్ర రూపాంతరాలు

ఆకులు అనేక రకాలు!
 

 

ఆకు అనగానే అందరి కళ్ల ముందు ఒక ఆకారం స్ఫురిస్తుంది. కానీ వృక్షశాస్త్రం ఆకులు అనేక రకాలుగా ఉంటాయని చెబుతోంది. కొన్ని పత్రాలు ముళ్ల రూపంలో గుచ్చుకుంటాయి. మరికొన్ని దళాలు బోనులుగా మారి కీటకాలను తినేస్తాయి. ఇంకొన్ని నులి తీగలుగా తయారై బలహీన కాండాలకు అండగా నిలుస్తాయి. ఆ రూపాంతరాల వివరాలతోపాటు వివిధ మొక్కలు, వాటి సహజీవన విధానాలు తదితర అంశాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

పత్రం ప్రాథమిక విధి కిరణజన్య సంయోగక్రియ. కానీ కొన్ని మొక్కల్లో ఇది వివిధ క్రియలను నిర్వహించడానికి రూపాంతరం చెంది ఉంటుంది. 

1) పొలుసాకులు: ఇవి పత్రహరిత రహితంగా ఉంటాయి. 

ఉదా: కాజురైనా (సరుగుడు). వీటిలో పత్రాలు పలుచగా, ఎండిపోయినట్లు ఉంటాయి.


2) నులితీగలు: ఇవి బలహీన కాండం ఉండే పత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో పత్రం/పత్రభాగాలు నులితీగలుగా రూపాంతరం చెందుతాయి. 

ఉదా: స్మైలాక్స్, లాథిరస్‌. 


3) ప్రత్యుత్పత్తి పత్రాలు: బ్రయోఫిల్లమ్, బిగోనియా లాంటి మొక్కల్లో పత్రాలపై పత్రోపరిస్థిత మొగ్గలు ఏర్పడతాయి. ఇవి ప్రత్యుత్పత్తిని ప్రదర్శిస్తాయి.


4) ప్రభాసనం: ఇది ఎడారి మొక్కల్లో కనిపిస్తుంది. పత్రవృంతం లేదా ద్వితీయ విన్యాసాక్షం బల్లపరుపుగా మారి కిరణజన్య సంయోగక్రియ జరిపితే, దాన్ని ప్రభాసనం అంటారు. 

ఉదా: అకేషియా మెలనోక్సైలాన్, పార్కిన్‌సోనియా.


5) కంటకాలు: కొన్ని ఎడారి మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది మొనదేలి కంటకాలుగా మారతాయి. ఇవి బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఉదా: రేగు, ఒపన్షియా (నాగజెముడు).


6) బోను పత్రాలు: కొన్ని కీటకాహార మొక్కల్లో పత్రాలు బోనుగా మారి కీటకాలను బంధించడానికి తోడ్పడతాయి. 

ఉదా: నెపంథిస్, డ్రోసిరా


7) వేరుపత్రాలు/శోషణ పత్రాలు: ఈ మొక్కల్లో పత్రాలు వేర్లుగా రూపాంతరం చెంది ఉన్నాయి. 

ఉదా: సాల్వీనియా 


8) నిల్వ చేసే పత్రాలు: కొన్ని మొక్కల్లో పత్రాలు నీరు, ఆహారాన్ని నిల్వ చేస్తాయి. వీటివల్ల ఇవి మెత్తగా లేదా ఉబ్బి ఉంటాయి. 

ఉదా: కలబంద
 

కీటకాహార మొక్కలు

వీటినే మాంసాహార మొక్కలు (కార్నివోరస్‌ ప్లాంట్స్‌) అని కూడా అంటారు. ఇవి కీటకాలను, చిన్నగా ఉండే ఇతర జీవులను బంధించి జీర్ణం చేసుకుని పోషకాలను గ్రహిస్తాయి. ఈ మొక్కలు పెరిగే నేలలో పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకే కీటకాల నుంచి వాటికి కావాల్సిన పోషకాలను గ్రహిస్తాయి. వీటిలో పత్రాలు బోనుగా లేదా జంతువులను బంధించడానికి ప్రత్యేకంగా మార్పు చెంది ఉంటాయి. వీటిలోకి జీర్ణరసాలు/ఎంజైమ్‌లు స్రావితమై కీటకాలను జీర్ణం చేస్తాయి.

1) నెపంథిస్‌: దీన్ని పిచ్చర్‌ ప్లాంట్‌ (కూజా మొక్క) అంటారు. దీనిలో పత్రదళం చివరి భాగం కూజాగా, పత్రశీర్షం మూతగా మార్పు చెంది ఉంటుంది.

2) డ్రోసిరా: దీన్ని సన్‌డ్యూ మొక్క అని పిలుస్తారు. ఈ మొక్కలో పత్రాలు చెంచా ఆకారంతో అనేక స్పర్శకాలను కలిగి ఉంటాయి. స్పర్శకాల చివర ఉండే గ్రంథులు స్రావాలను విడుదల చేస్తాయి. ఇవి సూర్యకాంతిలో మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. అందుకే ఈ మొక్కను సన్‌డ్యూ అంటారు.

3) డయోనియా: ఈ మొక్కను వీనస్‌ ఫ్లైట్రాప్‌ అని అంటారు. దీనిలో పత్రం రెండు లంబికలుగా ఉండి కోణీయంగా కదులుతుంది. పత్రం అంచుల్లో జీర్ణగ్రంథులు ఉంటాయి.

4) యుట్రిక్యులేరియా: దీన్ని బ్లాడర్‌ వర్ట్‌ అంటారు. ఇది నీటి మొక్క. చీలిన పత్రాలు మార్పు చెంది కోశం/తిత్తిలా ఉంటాయి.

 

పరాన్నజీవ మొక్కలు

 నీరు, ఖనిజ లవణాలు లేదా సేంద్రియ పదార్థాల లాంటి వాటి కోసం ఇతర మొక్కలపై ఆధారపడే వాటిని పరాన్నజీవ మొక్కలు అంటారు. ఆతిథేయి మొక్కపై ఆధారపడే విధానాన్ని బట్టి వీటిని సంపూర్ణ పరాన్నజీవ మొక్కలు లేదా పాక్షిక పరాన్నజీవ మొక్కలుగా విభజించారు.

సంపూర్ణ పరాన్నజీవ మొక్కలు: ఇవి ఆతిథేయి మొక్కల నుంచి నీరు, ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలను గ్రహిస్తాయి. ఆతిథేయి మొక్క కాండం లేదా వేరులోని దారువు, పోషక కణజాలంతో సంబంధం ఏర్పరచుకుని నీరు, ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలను గ్రహిస్తాయి. ఈ మొక్కలు హరితరహితంగా ఉంటాయి.


పాక్షిక పరాన్నజీవ మొక్కలు: ఇవి ఆతిథేయి మొక్క నుంచి కేవలం నీరు, ఖనిజ లవణాలను మాత్రమే గ్రహిస్తాయి. ఆతిథేయి మొక్క వేరు లేదా కాండంలోని దారువుతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాయి. హరితయుతంగా ఉండి ఆతిథేయి నుంచి గ్రహించిన నీరు, ఖనిజ లవణాల సహాయంతో కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తాయి. పరాన్నజీవ మొక్కలు వేరు, కాండంపై పెరిగే విధానాన్ని బట్టి వీటిని కాండ పరాన్నజీవులు, వేరు పరాన్నజీవులుగా విభజించారు.


కాండ పరాన్నజీవులు: ఇవి కాండం నుంచి పదార్థాలను గ్రహిస్తాయి. ఇవి తిరిగి రెండు రకాలు 

1) సంపూర్ణ కాండ పరాన్నజీవులు 

ఉదా: కస్కూట 

2) పాక్షిక కాండ పరాన్నజీవులు 

ఉదా: విస్కమ్, లొరాంథస్‌


వేరు పరాన్నజీవులు: ఇవి వేరు నుంచి పదార్థాలను గ్రహిస్తాయి. ఇవి మళ్లీ రెండు రకాలు 

1) సంపూర్ణ వేరు పరాన్నజీవులు 

ఉదా: ఒరబాంకి 

2) పాక్షిక వేరు పరాన్నజీవులు 

ఉదా: స్ట్రైగా

 

మొక్కలు - సహజీవనం

 ఒక మొక్క వేరే మొక్క/జీవితో కలిసి నివసిస్తూ ఉంటే దాన్ని మొక్కల సహజీవనం అంటారు. ఈ ప్రక్రియలో రెండు జీవులు పరస్పరం లాభపడతాయి. ఉన్నతశ్రేణి మొక్కలు నిమ్నశ్రేణి జీవులైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలతో కలిసి నివసిస్తాయి. కొన్నిసార్లు నిమ్నశ్రేణి మొక్కలు కూడా సహజీవనం చేస్తాయి.

లైకెన్‌: శిలీంధ్రం, శైవలం సహజీవన జీవిని లైకెన్‌లు అంటారు. దీనిలో శైవలం కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారుచేసి శిలీంధ్రానికి అందిస్తుంది. శిలీంధ్రం శైవలానికి నీరు, ఖనిజలవణాల శోషణకు ఉపయోగపడుతుంది. లైకెన్లు ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడతాయి. లైకెన్లను వాయుకాలుష్యానికి సూచిక మొక్కలుగా చెప్పవచ్చు. అనుక్రమాన్ని ప్రారంభించే మొక్కలుగానూ పేర్కొనవచ్చు.

అజొల్లా - అనబీనా సహజీవనం: అజొల్లా టెరిడోఫైటా మొక్క. దీన్ని నీటిఫెర్న్‌ అంటారు. ఈ మొక్క పత్రాల్లో నీలిఆకుపచ్చ శైవలమైన అనబీనా సహజీవనం చేస్తూ ఉంటుంది. అజొల్లా అనబీనాకు జీవించడానికి కావాల్సిన ప్రదేశాన్ని ఇస్తుంది. అనబీనా గాలిలోని నత్రజని స్థాపన చేసి అజొల్లాకు అందిస్తుంది. దీనివల్లే అజొల్లాను వరి పొలాల్లో జీవఎరువుగా వాడుతున్నారు.

చిక్కుడు జాతిమొక్క - రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం: చిక్కుడు జాతి మొక్కలైన కంది, పెసర, మినుము, శనగ, వేరుశనగ లాంటి వాటి వేర్లలో వేరుబొడిపెలుంటాయి. వీటిలో రైజోబియం, బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ ఉంటుంది. ఇది గాలిలోని నత్రజనిని స్థాపించి మొక్కకు అందిస్తుంది. దీనికి బదులుగా మొక్క బ్యాక్టీరియాకు పోషకాలను అందిస్తుంది. ఈ సహజీవనం వల్లే చిక్కుడు జాతి మొక్కలు పెరిగే నేలలో నత్రజని పరిమాణం పెరుగుతుంది.


మైకోరైజా: శిలీంధ్రాలు, ఉన్నత శ్రేణి మొక్కల వేరుసహజీవనాన్ని మైకోరైజా అంటారు. దీనిలో మొక్క శిలీంధ్రానికి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తుంది. శిలీంధ్రం మొక్క వేరుపై పెరగడం వల్ల మొక్క లవణాలను శోషించుకునే ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. దీనివల్ల మొక్క ఎక్కువ ఖనిజ లవణాలను శోషించుకుంటుంది. ఈ కారణం వల్లే మైకోరైజా శిలీంధ్రాలను జీవ ఎరువుగా వాడుతున్నారు. దీనితో పంటల దిగుబడి పెరుగుతుంది.


మాదిరి ప్రశ్నలు

1. సరుగుడు మొక్కల్లో పత్రాలు ఏవిధంగా మార్పు చెందుతాయి?

1) పొలుసాకులు  2) నులితీగలు  3) కంటకాలు  4) ముళ్లు
 

2. ప్రభాసనం రకం పత్రరూపాంతరం ఏ రకమైన మొక్కల్లో కనిపిస్తుంది?

1) నీటి మొక్కలు      2) ఎడారి మొక్కలు 

3) బురద నీటిలో పెరిగే మొక్కలు     4) సముద్రంలో పెరిగే మొక్కలు3. కీటకాలను బంధించడానికి వీలుగా పత్రాలు ఏ మొక్కల్లో బోనులుగా రూపాంతరం చెందుతాయి?

1) నెపంథిస్‌   2) డ్రోసిరా   3) యుట్రిక్యులేరియా    4) పైవన్నీ 
 


4. కలబంద, వెల్లుల్లి మొక్కల్లో ఏ రకమైన పత్రరూపాంతరాలు కనిపిస్తాయి?

1) శోషణ పత్రాలు     2) వేరు పత్రాలు    3) నిల్వచేసే పత్రాలు    4) బోను పత్రాలు

 

5. కింది ఏ కీటకాహార మొక్కను సన్‌డ్యూ అని పిలుస్తారు?

1) డ్రోసిరా    2) నెపంథిస్‌    3) యుట్రిక్యులేరియా    4) వీనస్‌ ఫ్లైట్రాప్‌ 

 

6. సంపూర్ణ వేరు పరాన్నజీవికి ఉదాహరణ-

1) స్ట్రైగా     2) ఒరబాంకి     3) విస్కమ్‌     4) లొరాంథస్‌ 

 

7. విస్కమ్, లొరాంథస్‌లు కింది ఏ రకమైన పరాన్నజీవ మొక్కలకు ఉదాహరణ?

1) సంపూర్ణ వేరు పరాన్నజీవులు      2) పాక్షిక వేరు పరాన్నజీవులు     

3) పాక్షిక కాండ పరాన్నజీవులు       4) సంపూర్ణ కాండ పరాన్నజీవులు

 

8. కింది ఏ జీవుల సహజీవనం వల్ల లైకెన్‌ ఏర్పడుతుంది?

1) బ్యాక్టీరియా + వైరస్‌    2) బ్యాక్టీరియా + శైవలం     

3) శైవలం + శిలీంధ్రం     4) శైవలం + వైరస్‌ 

 

9. అజొల్లా మొక్కలో ఏ శైవలం సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేస్తుంది?

1) క్లామిడో మోనాస్‌    2) స్పైరోగైరా   3) నాస్టాక్‌     4) అనబీనా
 

10. చిక్కుడు జాతి మొక్కల్లో ఏ బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేస్తుంది?

1) సూడోమోనాస్‌    2) రైజోబియం   3) క్లాస్ట్రీడియం   4) బాసిల్లస్‌

 

సమాధానాలు: 1-1, 2-2, 3-4, 4-3, 5-1, 6-2, 7-3, 8-3, 9-4, 10-2. 

రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌

Posted Date : 01-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌