• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు - భూపాతాలు

భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తుంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం కూడా. భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి భూకంపాల వల్ల భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో భూకంపాల వల్ల వరదలు, కొండ చరియలు విరిగి పడటం, సునామీ రావడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
ఉదా: 2004, డిసెంబరు 24న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ వల్ల భారతదేశ తూర్పు తీరప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.


భూకంపం ఎందుకు వస్తుంది?

భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒకచోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్నే భూకంపం అంటారు. అంటే భూ ఉపరితల భూభాగం కొన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా భూమి పొరల్లో అన్నింటి కంటే పెద్దదైన 'భూపటలం' అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. వీటినే 'పలక చలనాలు' అంటారు.

భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను 'సిస్మిక్ ప్రాంతాలు' లేదా 'భూకంప ప్రభావిత ప్రాంతాలు' అంటారు.

భూకంపాలు - కారణాలు

భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అయితే కింది కారణాల వల్ల భూకంపాలను కొంతవరకు గుర్తించవచ్చు.

అవి: 1) అగ్నిపర్వతాల ఉద్భేదన ప్రక్రియ

     2) అంతర్భాగంలో జరిగే కేంద్రక విస్ఫోటనం

     3) గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం

     4) భూ అంతర్భాగంలో పలక చలనాలు (ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్స్)


పై కారణాల వల్ల భూ అంతర్భాగంలో ఎక్కడైన అత్యధిక శక్తి విడుదలైనప్పుడు కంపనాలు ప్రారంభమైన మూల స్థానాన్ని 'భూకంపనాభి' అంటారు. నాభి నుంచి ఉపరితలానికి చేరే ప్రాంతాన్ని 'అధికేంద్రం' అంటారు. భూకంప నాభి నుంచి ప్రకంపనాలు పరావర్తనం చెంది వక్రీభవిస్తాయి.

భూకంప కదలికలు - తరంగాలు

భూ అంతర్భాగంలో కదలికలు/ పలక చలనాలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే 'సిస్మిక్ తరంగాలు' అంటారు. వీటిని భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.

ఇవి మూడు రకాలు:

ఎ) భూమిలో ప్రారంభమయ్యే మొదటి తరంగాలను 'p' లేదా ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి ఒత్తిడితో కూడిన శబ్ద తరంగాలు. అన్ని మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.

బి) రెండో తరంగాలను 's' లేదా గౌణ తరంగాలు అంటారు. ఇవి నిటారుగా/ ఊర్థ్వ వ్యాప్తంగా, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. భూ కేంద్రం ద్వారా ప్రయాణించవు.

సి) 'p', 's' తరంగాల వల్ల వచ్చే ఉపరితల తరంగాలను 'L' లేదా దీర్ఘ తరంగాలు అంటారు. వీటి వల్ల భూ ఉపరితల నష్టం తీవ్రంగా ఉంటుంది.

భూకంపాలు - విస్తరణ

* భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.

* ఇవి అగ్నిపర్వత ప్రాంతాల్లో, ముడుత పర్వతాలు ఉన్నచోట ఎక్కువగా సంభవిస్తాయి.

* ఇప్పటివరకు భూకంపాలను గుర్తించని ప్రాంతం ఆస్ట్రేలియా.

* భూకంపాలను ముందుగా పిల్లులు, పాములు, పశువులు గుర్తిస్తాయి.

ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్రం, 21% మధ్యదరా ప్రాంతాలు, 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి.
 

భూకంపాలు - పరికరాలు

* భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్/ భూకంప లేఖిని అంటారు. దీన్నే మెర్కెలి స్కేలు అని పిలుస్తారు. ఈ స్కేలును  ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఉపయోగించవచ్చు.

* భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేదే భూకంప దర్శిని.

* భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేలుతో గుర్తిస్తారు. దీన్ని ట్రైనైట్రోటోల్యూన్ (TNT) పదార్థం ఆధారంగా లెక్కిస్తారు. రిక్టర్ స్కేలుపై 09 పాయింట్లు ఉంటాయి. అయితే రిక్టర్ స్కేలు కొలత 7.0 కంటే ఎక్కువ న‌మోదైన‌ప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.

* భూకంప తీవ్రతను మరో పద్ధతి ద్వారా 'భ్రామక పరిమాణ' స్కేలును ఉపయోగించి కనుక్కోవచ్చు.

రిక్టర్ స్కేలు రీడింగ్ - భూకంప ప్రభావం

      రిక్టర్‌స్కేలు           -              భూకంప ప్రభావం

ఎ) 3.5 కంటే తక్కువ   -      మానవులు గుర్తించలేరు. రోజుకు 1000 సార్లు సంభవిస్తాయి.

బి) 3.5 - 5.4             -     కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఏడాదికి 49 వేల సార్లు వస్తాయి. విధ్వంసం ఉండదు.

 సి) 5.5 - 6.0            -     భవనాలు, నాణ్యతలేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏడాదికి 6,200 సార్లు వస్తాయి.

డి) 6.1 - 6.9           -    100 కి.మీ. వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.

ఇ) 7.0 - 7.9           -    పెద్ద భూకంపాలు, ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.

ఎఫ్) 8.0 కంటే ఎక్కువ  -  తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వస్తుంది. అతి పెద్ద భూకంపాలు

 

ఇప్పటివరకు రిక్టర్‌స్కేలుపై 9.0 వచ్చిన భూకంపాలు

1) 1960 చిలీ  2) 1964 అలస్కా 3) 2004 ఇండోనేసియా, భారతదేశం

భూకంపాలు - ఫలితాలు

* భూకంపాలు నిర్ణీత వ్యవధిలో (ఒక నిమిషంలోపే) వస్తాయి.

* భూకంపాలకు పగలు, రాత్రి సమయాలుండవు. అన్ని వేళల్లో సంభవిస్తాయి. వీటివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య  ఉంటాయి.

* భూకంపాల వల్ల చమురు బావులు, గ్యాస్ పైపులు పగిలి అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. సునామీ కూడా సంభవిస్తుంది.

భారతదేశంలో భూకంపాలు

* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వత పాదాల వద్ద సంభవిస్తాయి. దేశంలో తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ, బిహార్‌లో వస్తున్నాయి.

ఉదా: 1897లో ఈశాన్య షిల్లాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ హైదరాబాద్ భూకంపాలను 5 జోన్లుగా నిర్ధారించింది. 2002లో జోన్ - I ను జోన్ - II లో విలీనం చేశారు. ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. వీటిలో జోన్ V అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర జమ్మూ, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు జోన్ - V లో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ 4వ జోన్ పరిధిలో ఉంది

* భారత భౌగోళిక ప్రాదేశిక ప్రాంతంలో భూకంపాల వల్ల సుమారు 59% దుర్బలత్వం సంభవిస్తుంది.

ఉదా: 1) 2001, జనవరి 26 - గుజరాత్ భుజ్ భూకంపం

          2) 2005, అక్టోబరు 8 - జమ్మూ కశ్మీర్ ఉరి, తంగదర్ భూకంపం

          3) 2011, అక్టోబరు 5 - సిక్కిం భూకంపం

          4) 2015, ఏప్రిల్ 25 - కాఠ్‌మాండూ, బిహార్ భూకంపం

* ప్రాంతీయ భూకంప ప్రమాదాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, గోదావరి మైదానాలు 3వ జోన్‌లోనూ, హైదరాబాద్ నగరం 2వ జోన్‌లోను ఉన్నాయి.

భూకంప అధ్యయనాలు - పరిశోధన

* భూకంపాలను సిస్మాలజీ ద్వారా అధ్యయనం చేస్తారు.

* సమాన భూకంప ప్రాంతాలను కలిపే రేఖలను 'ఐసో సిస్మిల్స్' అంటారు.

* అంతర్జాతీయ భూకంప అధ్యయన కేంద్రం - లండన్.

* జాతీయ భూకంప పరిశోధన సమాచార కేంద్రం - న్యూదిల్లీ.

* ఇండో రష్యా భూకంప పరిశోధన కేంద్రం - న్యూదిల్లీ.

* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ - హైదరాబాద్.

*  1898లో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.

*  రూర్కీ (ఉత్తర్ ప్రదేశ్)లోని కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ భూకంపం వచ్చినప్పుడు తట్టుకునే భవన నిర్మాణ ప్రణాళికలను రూపొందించింది.
 

భూపాతాలు

* వాలుగా ఉండే నిర్మాణ ప్రదేశాల్లో ప్రకృతి కారకాల వల్ల కొంత భాగం విడివడి బయటకు కొట్టుకుని పోయి క్రమక్షయం చెందడాన్ని 'భూపాతం' అంటారు. వీటినే కొండ చరియలు విరిగి పడటం లేదా పదార్థ నాశనం అంటారు. ఇటీవల 2018 ఆగస్టులో కేరళలో అధిక వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

* ఇవి ఎక్కువగా పర్వత వాలు ప్రదేశాలు, నదీ వక్రతల ప్రాంతాలు, అధిక వర్షం కురిసే కొండ ప్రాంతాల్లో సంభవిస్తాయి. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో గృహ నిర్మాణం 'పిరమిడ్' ఆకారంలో ఉండటం వల్ల భూపాతాల నుంచి రక్షణ పొందవచ్చు.

* భారతదేశంలో వీటి వల్ల 15 శాతం దుర్బలత్వం ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశంలోని హిమాలయాలు 7 పొరల అవక్షేప శిలలతో ఏర్పడి ఉన్న కారణంగా ప్రపంచ భూపాతాల్లో అధికంగా 30 శాతం ఇక్కడే సంభవిస్తున్నాయి.

ఉదా: 2013, జూన్ 16, 17 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ప్రాంతంలో కొండచరియలు ఎక్కువగా విరిగిపడ్డాయి.

* దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో అధిక వర్షం, అడవులను నరికివేయడం వల్ల ఎక్కువగా భూపాతాలు ఏర్పడుతున్నాయి.

* భూపాతాలను 'లాండ్‌స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి' ద్వారా ముందే గుర్తిస్తారు. 2004 నుంచి భూపాతాలకు నోడల్ ఏజెన్సీగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కతా బాధ్యత వహిస్తుంది.

 

హిమపాతాలు:

* వీటినే మంచుకొండలు విరిగి పడటం అంటారు. ఇవి ఎక్కువగా అతి శీతల, ఎత్తయిన ప్రాంతాల్లో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల పర్వతం పైభాగం నుంచి కిందికి జాలువారుతూ తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.

* ఈ రకమైన మంచు లేదా హిమపాతాలు సాధారణంగా ద్రాస్, ఫెర్ పంజాల్, స్పిటి, లేహ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

* హిమాలయ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా, కులు, స్పిటి, కిన్నార్; ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో హిమపాతాలు సంభవిస్తాయి.

 

ఉరుములు, మెరుపులు:

మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలోని కణాలతో ఘర్షణ వల్ల ఆవేశపూరితం అవుతాయి. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల ధన, రుణ ఆవేశాల మధ్య ఉత్సర్గం (discharge) జరిగి పెద్ద ఎత్తున వెలుగు చారికలు/ రేఖలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. వీటినే మెరుపులు, ఉరుములు అంటారు. ఈ ప్రక్రియను 'విద్యుత్ ఉత్సర్గం' అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య జరుగుతుంది. ఇవి ఎక్కువగా వర్షం వచ్చే ముందు వస్తాయి. వీటిని 'లైట్నింగ్ డిటెక్టర్ల' ద్వారా 90 శాతం కచ్చితత్వంతో కనిపెట్టవచ్చు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పుణెలో ఉంది. లైట్నింగ్ డిటెక్టర్లను ఫిన్‌లాండ్ తయారు చేస్తుంది. పిడుగులు/ మెరుపుల నుంచి పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి 'తటి ద్వాహకం' (Lightning) లను ఉపయోగిస్తారు.

                                      

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌