• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు సునామీలు 

పలకల కదలికలతో విస్ఫోటాలు.. వైపరీత్యాలు!

భూమి అంతర్గత నిర్మాణం పొరలు పొరలుగా ఉంటుంది. భూభాగం, సముద్ర భూతలాలుగా ఉండే పలకలు మందపాటి శిలాద్రవంపై ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఈ భూ పలకలు పరస్పరం ఢీకొంటూ, విడిపోతూ పక్కకు జారుతూ పెనువిపత్తులు సృష్టిస్తుంటాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియ గురించి శాస్త్రీయంగా  వివరిస్తున్న సిద్ధాంతాలు, అందులోని మౌలికాంశాల గురించి పోటీ పరీక్షారులు అవగాహన కలిగి ఉండాలి. భూ పలకల విస్తరణ తీరుతెన్నులు, ప్రాంతాలవారీగా క్రమానుగతంగా వస్తున్న భౌగోళిక మార్పుల గురించి తెలుసుకోవాలి.

శిలావరణ వ్యవసకు సంబంధించి ఆకస్మికంగా జరిగే దుర్ఘటనల్లో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత  విస్ఫోటాలు ప్రధానమైనవి. అవి సంభవించే ప్రక్రియలో భూఉపరితలంపై ముడుత పర్వతాలు, సముద్ర    భూతలాల్లో ట్రెంచెస్, రిడ్జెస్, ద్వీపవక్రతలు మొదలైన భూస్వరూపాలు ఏర్పడతాయి. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు ఏర్పడే విధానాన్ని గురించి వివరించే సిద్ధాంతాల్లో అత్యంత శాస్త్రీయమైంది, ఆమోదయోగ్య  మైందిగా ‘పలక విరూపక సిద్ధాంతం’ ప్రసిద్ధి చెందింది. 1967లో డబ్ల్యూ.జె.మోర్గాన్‌ దీన్ని ప్రతిపాదించారు. 

పలక విరూపక సిద్ధాంతంలోని ప్రతిపాదనలు:     

1) ఈ సిద్ధాంతం ప్రకారం 140 కి.మీ.ల మందం ఉన్న శిలావరణం లేదా ఆస్మావరణం దాదాపు 150 మిలియన్ల ఏళ్ల కిందట ఏస్తనోస్ఫియర్‌ ప్రాంతంలో జనించే ఉష్ణ  జనిత సంవహన ప్రవాహాల వల్ల ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఇందులో ఏర్పడిన ఆ భాగాలను శిలా వరణ పలకలు లేదా ఆస్మావరణ పలకలు అని పిలుస్తారు.

2) శిలావరణ పలకల్లో పరిమాణంలో పెద్దవిగా ఉన్నవాటిని ప్రధాన పలకలు అని, చిన్నగా ఉన్నవాటిని అప్రధాన పలకలుగా పిలుస్తారు. మొత్తం 6 ప్రధాన పలకలు, అనేక అప్రధాన పలకలు ఉన్నాయి.

ప్రధాన పలకలు: 

ఎ) అమెరికా పలక: ఖండ, సముద్ర భూతల  పదారంతో నిర్మితమై ఉంది. ఇది తూర్పు నుంచి పడమరకు జారుతూ ఉంటుంది.

బి) పసిఫిక్‌ పలక: ఇది పూర్తిగా సముద్ర భూతల  పదారంతో ఏర్పడి ఉంది. దీని సాపేక్ష చలనం వాయవ్య దిశలో ఉంటుంది.

సి) యురేషియా పలక: ఇది ఖండ స్వభావాన్ని కలిగి, కొద్దిగా సముద్ర భూతల స్వభావంతో ఉంటుంది. సాపేక్షంగా తూర్పు నుంచి పడమరకు లేదా ఈశాన్యం నుంచి నైరుతి దిశ వైపు జారుతుంది.

డి) ఆఫ్రికా పలక: ఖండ, భూతల స్వభావంతో ఉంటుంది. నైరుతి నుంచి ఈశాన్య దిశ వైపు  జారుతుంది.

ఇ) ఇండో ఆస్ట్రేలియన్‌ పలక: భారత ద్వీపకల్ప,  ఆస్ట్రేలియా ఖండ శిలావరణంతో ఉంది. నైరుతి నుంచి ఈశాన్య దిశ వైపు కదులుతుంది.

ఎఫ్‌) అంటార్కిటికా పలక: ఇది ఖండ సముద్ర, భూతల పదార స్వభావాలతో ఉంది.

కొన్ని అప్రధాన పలకలు: 

ఎ) నాజిక పలక: దక్షిణ అమెరికా వాయవ్య తీరానికి ఆనుకుని ఉన్న పసిఫిక్‌ పలకలోని భాగం. సముద్ర భూతల పదారంతో ఉంటుంది.

బి) కోకస్‌ పలక: ఇది కాలిఫోర్నియా తీరాన్ని ఆనుకుని ఉన్న పసిఫిక్‌ సముద్ర పలకలోని భాగం.

సి) ఫిలిప్పీన్స్‌ పలక: పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో ఉంది.

డి) అరేబియా పలక: ప్రస్తుతం ఉన్న పశ్చిమాసియా భూభాగం.

ఇ) కరేబియన్‌ పలక: పశ్చిమ ఇండియా దీవుల భూభాగం.

ఎఫ్‌) స్కోషియా పలక: అర్జెంటీనా ఆగ్నేయ తీరాన్ని అనుకుని ఉన్న పసిఫిక్‌ పలకలోని భాగం.

జి) జువాన్‌ ఫ్యూకా డీ పలక.

3) శిలావరణ పలకలన్నీ సిరంగా ఉండకుండా, ఏస్తనోస్ఫియర్‌ భూభాగంపై తేలియాడుతూ, భిన్న దిశల్లో   నిరంతరం కదులుతూ (జారుతూ) ఉంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా శిలావరణ పలకలు సుదీర్ఘ కాల   వ్యవధిలో ఒకదాంతో మరొకటి ఎదురెదురు లేదా వ్యతిరేక దిశల్లో కదులుతూ ఉండటంతో వాటి అంచుల వద్ద నాలుగు రకాల పలక సరిహద్దులు ఏర్పడ్డాయి. వీటి వెంబడి నిరంతరం శిలావరణ పలకలు కదులుతూ, తేలియాడుతూ, ఒకదాంతో మరొకటి ఢీకొంటూ ఉన్న ఈ ప్రాంతాల్లో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు లాంటి వైపరీత్యాలు సంభవించడమే కాకుండా భూఉపరితలం, సముద్ర భూతలాల్లో పలు రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి. అవి-

ఎ) అభిసరణ/క్షయకరణ పలక సరిహద్దులు: రెండు శిలావరణ పలకలు ఒకదాంతో మరొకటి ఎదురెదురు దిశల్లో కదులుతూ ఢీకొనే సరిహద్దు. ఈ ప్రాంతాల్లో తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. ఇవి 3 రకాలు.

1) ఖండ - ఖండ పలకల అభిసరణం: రెండు ఖండ పలకలు ఒకదాంతో మరొకటి ఢీకొనే సరిహద్దు. ఉదాహరణకు భారత ద్వీపకల్ప పలక, యురేషియా పలకలు ఒకదాంతో మరొకటి ఎదురెదురు దిశల్లో కదులుతూ నిరంతరం అభిసరణం చెందుతూ ఉండటంతో ప్రస్తుతం ఉన్న హిమాలయాల ఆవిర్భావం ఒకప్పటి టెథిస్‌ సముద్రం నుంచి జరిగింది. నేటి హిమాలయ ప్రాంతం ప్రపంచంలోని తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతం.

2) సముద్ర- సముద్ర పలకల అభిసరణం: రెండు సముద్ర పలకలు అభిసరణం చెందే ప్రాంతం. ఈ ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవిస్తూ వీటి కారణంగా తీర ప్రాంత భూభాగాల్లో సునామీలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ పలక సరిహద్దుల వద్ద సముద్ర భూతలాల్లో ట్రెంచ్‌లు ఏర్పడతాయి.

3) ఖండ- సముద్ర పలకల అభిసరణం: ఒక ఖండ, ఒక సముద్ర పలకలు అభిసరణం చెందే సరిహద్దు. ఈ ప్రాంతాల్లో తీవ్రమైన అగ్నిపర్వత ప్రక్రియలు సంభవించడమే కాకుండా తీరపు అంచుల వెంట ద్వీపవక్రతు అనే భూస్వరూపాలతోపాటు తీరప్రాంత ముడుత పర్వతం ఏర్పడింది. ఉదా: పసిఫిక్‌ తీరప్రాంతం

బి) అపసరణ లేదా నిర్మాణాత్మక పలక సరిహద్దులు: రెండు శిలావరణ పలకలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా కదిలేచోట ఉన్న పలక సరిహద్దులు. ఈ ప్రాంతాల్లో తీవ్రమైన అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవించి ‘రిడ్లు’ అనే నూతన భూస్వరూపాలు ఏర్పడటం వల్ల భూ ఉపరితల విస్తీర్ణం విస్తరిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మిడ్‌ అట్లాంటిక్‌ ఓషియానిక్‌ రిడ్జ్‌ వెంబడి అమెరికా పలక, యురేషియా పలకలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జారడం.

సి) సమాంతర పలక సరిహద్దులు: రెండు శిలావరణ పలకలు ఒకదాంతో మరొకటి సమాంతరంగా లేదా వ్యతిరేక దిశలో కదిలే చోట ఏర్పడే సరిహద్దు. ఈ సరిహద్దుల వద్ద ‘భ్రంశ రేఖలు’ ఏర్పడతాయి. వాటి వెంట శిలావరణ పలకలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి చోట భూకంపాలు ఏర్పడతాయి. ప్రపంచంలో అతి పెద్ద భ్రంశరేఖ ‘శాన్‌ అండ్రియాస్‌’ భ్రంశ రేఖ. ఇది కాలిఫోర్నియా పలక, జువాన్‌-ఫ్యూకా-డీ పలకల మధ్య ఉంది. భారత్‌లో అతిపెద్ద భ్రంశ రేఖ ‘అలియాబండ్‌’. ఇది గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో ఉంది.

డి) త్రిసంధి పలక సరిహద్దులు: మూడు శిలావరణ  పలకలు ఒకదాంతో మరొకటి ఎదురెదురు దిశల్లో కదిలే చోట ఏర్పడే   సరిహద్దులు. ఉదాహరణకు ఆఫ్రికా పలక, అరేబియా పలక, మధ్యధరా సముద్ర పలకలు అభిసరణం చెందే ప్రదేశం. ఈ ప్రాంతాల్లో     భూకంపాలు, అగ్నిపర్వతాలు    సంభవించడంతోపాటు పగులు లోయలు ఏర్పడతాయి.

* భారత్‌లోని హిందుసాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన రెండు ‘డోర్నియర్‌ 228 ఎయిర్‌క్రాఫ్ట్‌’లను కొనుగోలు చేసేందుకు ఏ దేశం ఇటీవల ఒప్పందం చేసుకుంది?        

జ: గయానా  

ప్రసార భారతి నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?          

జ: నవనీత్‌ కుమార్‌ సెహగల్‌

* ‘మిషన్‌ పామ్‌ ఆయిల్‌’ కార్యక్రమంలో భాగంగా దేశంలో మొదటి ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?      

జ: అరుణాచల్‌ ప్రదేశ్‌   

* భారత్‌కు చెందిన నుమాలిగర్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌) తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభించింది?

జ: బంగ్లాదేశ్‌  

* 2024, మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: ఫెయిర్‌ అండ్‌ రెస్పాన్సిబుల్‌ ఏఐ ఫర్‌ కన్స్యూమర్స్‌

* ఇటీవల వార్తల్లోకి వచ్చిన పంచేశ్వర్‌ మల్టీ పర్పస్‌ ప్రాజెక్ట్‌ (పీఎమ్‌పీ) ఏ రెండు దేశాలకు  సంబంధించింది?          

జ: భారత్‌ - నేపాల్‌

* ‘వరల్డ్‌ హియరింగ్‌ డే’ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?              

జ: మార్చి 3 

* ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఓఖ్లా పక్షుల   అభయారణ్యం ఎక్కడ ఉంది?  

జ: ఉత్తర్‌ప్రదేశ్‌   

రచయిత:సక్కరి జయకర్‌

 

 

Posted Date : 23-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు