• facebook
  • whatsapp
  • telegram

భూచలనాలు

ఆత్మప్రదక్షిణ చేసి... ఆ సూర్యుడినీ చుట్టివచ్చి!

 

  రాత్రి, పగలు ఎలా ఏర్పడతాయి? సముద్ర ప్రవాహాలు ఎందుకు మారుతుంటాయి? వేసవికాలం, వర్షాకాలం, చలికాలం రావడానికి కారణాలు ఏమిటి? భూచలనాల గురించి చదివితే ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. పరీక్షల్లో మార్కులూ వస్తాయి.

భూమికి రెండు రకాల చలనాలుంటాయి. అవి 1) భూభ్రమణం       2) భూపరిభ్రమణం.

 

భూభ్రమణం లేదా ఆత్మభ్రమణం

* భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకుని గంటకు సగటున 1610 కి.మీ.ల వేగంతో పడమర నుంచి తూర్పునకు తనచుట్టూ తానూ తిరిగే చలనాన్ని భూభ్రమణం అంటారు.భూమి ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు.

అక్షం: ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి కేంద్రం ద్వారా వెళ్లే ఊహారేఖనే అక్షం అని పిలుస్తారు. 

 

భూభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు:

* రాత్రి-పగలు ఏర్పడటం ః పోటు-పాటులు సంభవించడం.

* పవనాల దిశలో, సముద్ర ప్రవాహాల దిశలోనూ మార్పులు సంభవించడం (భూభ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలాల కారణంగా ఉత్తరార్ధ గోళంలో సహజసిద్ధ మార్గంలో వీచే పవనాలు కొంత కుడివైపు, దక్షిణార్ధ గోళంలో కొంత ఎడమవైపున అపవర్తనం చెంది కదలడాన్ని ‘కోరియాలిస్‌’ ప్రభావం లేదా ఫెరల్స్‌ సూత్రమని పిలుస్తారు).

* సూర్యుడు రోజులోని వివిధ సమయాల్లో భూమి క్షితిజరేఖకు వివిధ ఎత్తుల్లో ఉండటం.

  భూమి తన కక్ష్యామార్గంలో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ స్థానభ్రంశం చెందే బాహ్యచలనాన్ని భూపరిభ్రమణం అని పిలుస్తారు. భూమి సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం చేయడానికి పట్టేకాలం 365 రోజుల 6 గంటల 10 సెకన్లు. సాధారణంగా సంవత్సరానికి 365 రోజులుగా లెక్కిస్తారు. కానీ మిగిలిన 6 గంటలను ప్రతి 4వ సంవత్సరానికి ఒకసారి కలుపుతారు. దాంతో ఆ ఏడాదిలో 366 రోజులుంటాయి. అందుకే ఈ నాలుగో ఏడాదిని లీపు సంవత్సరమని పిలుస్తారు. ఆ ఏడాదిలో వచ్చే అదనపు రోజును ఫిబ్రవరికి కలుపుతారు. 

  భూపరిభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు: ః రాత్రి, పగటి సమయాల్లో తేడాలు ఏర్పడటం ః సంవత్సరంలో వివిధ కాలాల్లో వివిధ రుతువులు ఏర్పడటం.

 

భూపరిభ్రమణ సమయంలో ఈ రెండు రకాల మార్పులు భూమిపై ఏర్పడటానికి కారణం 

1) భూ అక్షం 23 1/2 డిగ్రీల కోణంతో కుడివైపునకు వాలి ఉండడం (లేదా) భూ అక్షం తన సమతల కక్ష్యాతలంతో 66 1/2 డిగ్రీల కోణం చేయడం..

2) భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లే కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గడం లేదా భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం తగ్గడం.

 ఈ రెండు కారణాల వల్ల తన కక్ష్యామార్గంలో తిరిగేటప్పుడు భూమికి సంబంధించి నాలుగు ప్రత్యేక స్థానాలను గమనించవచ్చు. వాటి ద్వారా రుతువులు ఏర్పడతాయి. 

 

ఆయనాంతాలు


ఆయనాంతాలు (Solastices)  సంవత్సరంలో డిసెంబరు 22, జూన్‌ 21న సంభవిస్తాయి. 

 

డిసెంబరు 22: ఈ రోజున సూర్యకిరణాలు మకరరేఖపై నిట్టనిలువుగా పడటం వల్ల (నడినెత్తిన సూర్యుడు) దక్షిణార్ధ గోళంలో సుదీర్ఘమైన పగలు, హ్రస్వమైన రాత్రులు ఏర్పడతాయి. ఈ రోజునే ఉత్తరార్ధగోళంలో ‘శీతాకాల ఆయనాంతం లేదా ఉత్తరాయణ ప్రారంభ కాలం’ అంటారు. ఈ రోజు తర్వాత సూర్యుడు మకరరేఖను వదిలి కర్కటరేఖ వైపు పయనిస్తాడు. సూర్యుడి ఈ పయనాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో సంక్రాంతి పండగ నిర్వహిస్తారు.

 

జూన్‌ 21: ఈ రోజున సూర్యకిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడటం వల్ల (నడినెత్తిన సూర్యుడు) ఉత్తరార్ధగోళంలో సుదీర్ఘమైన పగలు, హ్రస్వమైన రాత్రులు ఏర్పడతాయి. ఈ రోజునే ఉత్తరార్ధగోళంలో ‘వేసవి ఆయనాంతం లేదా దక్షిణాయణ ప్రారంభ కాలం’ అంటారు. ఈ రోజు తర్వాత సూర్యుడు కర్కటరేఖను వదిలి మకర రేఖ వైపు పయనిస్తాడు.

 

విషవత్తులు

విషవత్తులు (Equinoxis) రోజుల్లో  భూమిపై అన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. కారణం సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడటమే. ఇది ఏడాదిలో మార్చి 21,  సెప్టెంబరు 22 లేదా 23న సంభవిస్తుంది. ఈ రోజుల్లో లేదా ఈ తేదీల్లో  భూమధ్యరేఖకు సూర్యుడు 90 డిగ్రీల కోణంలో ఉంటాడు. అంటే ఈ ప్రాంతాల్లో సూర్యుడు నిట్టనిలువుగా ప్రకాశిస్తాడు. భూమధ్యరేఖకు అటూఇటూ ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ సూర్యుడి ఉన్నతి క్రమంగా తగ్గుతూ ధ్రువాల వద్ద సున్నా డిగ్రీలుగా ఉంటుంది.. దీనివల్ల రెండు ధ్రువాల వద్ద సూర్యుడు ఆకాశం అంచువద్ద ఉన్నట్లు కనిపిస్తాడు ్బ‘్న( 90్థ్లº్శ. ఈ సూత్రాన్ని అనుసరించి మిగిలిన ఏ అక్షాంశం వద్దనైనా సూర్యుడి ఉన్నతిని లెక్కించవచ్చు. ఇక్కడ అక్షాంశం కోణాన్ని తెలియజేస్తుంది.

 

వసంతకాలపు విషవత్తు (Spring Equinoxis): ఇది మార్చి 21న ఏర్పడే విషవత్తు. 

 

శరత్‌ కాలపు విషవత్తు (Autumnal Equinoxis): ఇది సెప్టెంబరు 22 లేదా 23న సంభవిస్తుంది.

 

ముఖ్యాంశాలు

* ఉత్తర ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు మార్చి 21, అస్తమించే రోజు - సెప్టెంబరు 22 లేదా 23.

* దక్షిణ ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు - సెప్టెంబరు 22 లేదా 23. అస్తమించే రోజు మార్చి 21.

* అర్ధరాత్రి సూర్యుడు అని నార్వే దేశాన్ని పిలుస్తారు.  

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ ఖండచలన సిద్ధాంతం

‣ భూమి అంతర్భాగం​​​​​​​

‣ సౌర కుటుంబం​​​​​​​ 

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 14-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌