• facebook
  • whatsapp
  • telegram

జీవావరణ మండలాలు

సకల జీవ సమూహాలకు సంరక్షణ!

 

 జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి.  సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అందుకు తగిన సహజ, భౌగోళిక పరిస్థితులు ఉండాలి. అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు జరగాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా నిర్ణీత ప్రాంతాలను జీవావరణ మండలాలుగా గుర్తించారు. అంతరించి పోతున్న జాతులను అక్కడ రక్షిస్తారు. సహజ పర్యావరణ ప్రక్రియలను ప్రోత్సహిస్తారు. దాని కోసం భూమిని, వనరులను సమీకరిస్తారు. నిర్వహణ విధానాలను రూపొందిస్తారు. జీవావరణాన్ని సంరక్షిస్తారు. పర్యావరణ అంశాల అధ్యయనంలో భాగంగా ఆ విశిష్ట మండలాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


    విశాల ప్రపంచంలోని జీవులన్నింటినీ జీవావరణం అంటారు. ప్రతి జీవికి తన చుట్టూ ఉన్న సహజ, భౌగోళిక అంశాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మనిషితోపాటుగా అన్ని జీవజాతులకు అంతర్జాతీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు యునెస్కో కృషి చేస్తోంది. యునెస్కోలోని ఇంటర్నేషనల్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం మేరకు జీవావరణ మండలాల గుర్తింపు కోసం ‘మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌’ MAB ని 1974లో ఆమోదించింది. 1976 నుంచి అమలు ప్రారంభించింది. దేశాలు నిర్ణయించిన జీవావరణ మండలాల్లో ఆయా దేశాలు చేపట్టిన సుస్థిరాభివృద్ధి కార్యకలాపాల ఆధారంగా కొన్నింటిని యునెస్కో ఎంపికచేసి MAB లో చేర్చింది.


* అన్ని జీవజాతులతో పాటు, పర్యావరణంలో మనిషి మనుగడను కూడా పరిశీలనలోకి తీసుకుంటూ నిర్ణయించిన భూ, సముద్ర ప్రాంతాలు జీవావరణ మండలాల్లో భాగమవుతాయి. అంతర్జాతీయ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి పరిరక్షణకు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.


* జీవావరణ మండలాలు సహజ జీవ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అనేక జీవవైవిధ్య సమూహాల ఏకత్వాన్ని ఒక ప్రాంతంగా సంరక్షణ అవసరాన్ని తెలియజేస్తాయి.


* జీవావరణ మండలాల్లో మొత్తం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా పరిశోధన, విద్య, శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపడతారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల్లో ఇందుకు అవకాశం ఉండదు.


* ఈ ప్రాంతాల్లో సహజత్వాన్ని, ఆవరణ వ్యవస్థను, జాతులు, జెనిటిక్‌ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు.


* ప్రపంచం మొత్తంలో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ నెట్‌వర్క్‌లో 134 దేశాల నుంచి 738 ప్రాంతాలను యునెస్కో గుర్తించింది. వీటిలో భారత్‌ నుంచి 12 ప్రాంతాలున్నాయి.

భారతదేశంలో జీవావరణ మండలాలు: భారత ప్రభుత్వం జాతీయ జీవావరణ రిజర్వు ప్రోగ్రామ్‌ని 1986లో ప్రారంభించింది. మొదటి జీవావరణ మండలంగా నీలగిరి ప్రాంతాన్ని 1986లో ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 18 జీవావరణ మండలాలున్నాయి.జీవావరణ మండలాల ఎంపిక - లక్షణాలు:

* ఈ ప్రాంతాలు మృత్తికలు, సూక్ష్మ శీతోష్ణ పరిస్థితుల వైవిధ్యంతో ఉండి అనేక రకాల స్థానీయ జీవజాతులకు ఆలవాలమై ఉండాలి.


* కొద్దికాలంలో అంతరించిపోయేందుకు దగ్గరలో ఉన్న, అరుదైన, ప్రమాదపు అంచులో ఉన్న జీవులు నివసిస్తూ ఉండాలి.


* పర్యావరణంతో సామరస్యపూర్వక జీవనం సాగించే సంప్రదాయక గిరిజన జాతులు ఆ ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉండాలి.


* ఒక ఆవరణ వ్యవస్థలోని వృక్షజాతులు, జంతు జాతుల మధ్య వైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడటం ఈ ప్రాంతాల ప్రధాన లక్షణం.


* జాతుల జెనిటిక్‌ వైవిధ్యానికి రక్షణ కవచంగా ఉంటూ వాటి ప్రజన ప్రక్రియను కొనసాగించడానికి ఆటంకం లేకుండా చర్యలు చేపడతారు.


* ఈ ప్రాంతాల్లో జీవజాతుల సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన బహుముఖ పరిశోధన, విద్య, శిక్షణ కార్యకలాపాలు చేపడతారు.


* సుస్థిరాభివృద్ధితో కూడిన సరైన సాంకేతికత వినియోగం ద్వారా సహజ వనరులను స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా పర్యవేక్షిస్తారు.

 

జీవావరణం - విభాగాలు: జీవులు, జన్యు ఆధారాలు, గిరిజనుల జీవన శైలి, సహజసిద్ధ పరిసరాల పరిరక్షణ మొదలైన బహుళ ప్రయోజనకర పరిరక్షణ ప్రాంతాలైన బయోస్ఫియర్‌ రిజర్వులను మూడు మండలాలుగా విభజిస్తారు.

1) కోర్‌ జోన్‌: ఈ ప్రాంతం పూర్తిగా మానవ కార్యకలాపాల నిషిద్ధ ప్రాంతం. ప్రశాంతతను దెబ్బతీసే కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ ప్రాంతాల శిఖర స్థాయిలో వేట ద్వారా ఆహారాన్ని సేకరించే జీవులతో పాటు అనేక రకాల జంతు, వృక్ష జాతులు వాటి స్థలాలకు పరిమితమై జీవిస్తుంటాయి. సహజత్వానికి, అటవీ జీవన విధానానికి ఆటంకం కలగకుండా పరిశోధన, నిర్వహణ లాంటి అంశాలకు అవకాశం కల్పిస్తారు.


2) తటస్థ మండలం (Buffer Zone): ఈ ప్రాంతం కోర్‌ జోన్‌ చుట్టూ విస్తరించి ఉంటుంది. ఇందులో కోర్‌ జోన్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్యకలాపాలు చేపడతారు. ఈ ప్రాంతంలో పరిశోధన, విద్యా కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆవరణ వైవిధ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా సహజ మానవ కార్యకలాపాలకు అవకాశం ఇస్తారు. సహజవనరుల విలువను పెంచే విధంగా పునరుద్ధరణ, ప్రదర్శన, విహారం, వినోదం, చేపల పెంపకం, పశుగ్రాసం పెంపకం లాంటి కార్యకలాపాలు కోర్‌ జోన్‌ ప్రశాంతతను కాపాడుతూ చేపట్టే అవకాశం ఉంటుంది.


3) పరివర్తన మండలం (Transition Zone): ఇది జీవావరణ మండలంలో పూర్తిగా బయట విస్తరించి ఉన్న ప్రాంతం. నివాసాలు, వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. వినోద, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టవచ్చు. పరివర్తన మండలానికి సరిహద్దులు నిర్ణయించి ఉండవు. సంరక్షణ, నిర్వహణ సామరస్యపూర్వకంగా, సహకార స్ఫూర్తితో ఉంటుంది. జీవావరణ మండలాల ఆశయానికి అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు.


ప్రత్యేకతలు:

* జాతులు, జెనిటిక్స్, జీవులు, మానవసహిత సహజత్వాన్ని మొత్తంగా పర్యావరణాన్ని కాపాడే ప్రాంతాలివి.

 

* విశాలమైన జీవావరణ మండలాల్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్‌ పార్కులు అంతర్భాగంగా ఉంటాయి.

 

* స్నేహపూర్వక, పర్యావరణహిత అభివృద్ధితో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఉంటుంది.


* ఈ ప్రాంతాల అభివృద్ధికి, సంరక్షణకు మధ్య సమస్యలు తలెత్తకుండా తీవ్రతను తగ్గించే చర్యలు తీసుకుంటారు.

 

* ఈ ప్రాంతాల సంరక్షణ కోసం బహుళ భాగస్వామ్య వ్యవస్థలు కలిసి పనిచేయడమే కాకుండా విశాల దృక్పథంతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

 

* వీటిలో కొన్నింటిని సహజత్వమే ప్రపంచం అనే దృక్పథంతో యునెస్కో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్స్‌ నెట్‌వర్క్‌లో చేర్చడం ప్రపంచీకరణకు అద్దం పడుతోంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 18-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌