• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ శాస్త్రం - పోషక వలయాలు

జీవనాధార వలయాలు

  భూమి మీద సమస్త జీవరాశులకు, జీవ పక్రియలకు సౌరశక్తి ప్రధాన ఆధారం. సౌరశక్తి వల్ల నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. తిరిగి వర్షించి చక్రీయ వలయంలో నీరుగానే మారుతుంది. ఆవరణ వ్యవస్థలోని కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్‌ లాంటి పోషకాలు నిరంతరం జీవులకు, వాటి పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడతాయి. అసలు ఈ వలయాలు జీవులకు ఎలా ఉపయోగపడుతున్నాయో పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

  ప్రతి జీవికి శ్వాసించడానికి, శారీరక ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి నిర్వహించడానికి నిరంతరం పోషక విలువలు కావాలి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్‌ మొదలైన ఖనిజ పోషకాలు నేలలో, నీటిలోనూ స్థిరంగా ఉంటాయి. వీటినే పోషకాల నిలకడ స్థితి అంటారు. అయితే ఇవి జీవులకు, వాటి పరిసరాలైన శిలావరణం, జలావరణం, వాతావరణాల మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడుతుంటాయి. దీన్నే జీవ-భూ-రసాయన వలయం అంటారు. ఈ వలయం సక్రమంగా కొనసాగడంలో విచ్ఛిన్నకారులు కీలకపాత్ర పోషిస్తాయి.

  చనిపోయిన వృక్ష, జంతు కళేబరాల నుంచి ఏర్పడిన సేంద్రియ పదార్థాల్లో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. బ్యాక్టీరియా చర్యల వల్ల సేంద్రియ పదార్థాలు చివరికి సరళమైన పోషక పదార్థాలుగా మారతాయి. ఆకుపచ్చని మొక్కలు ఈ ఖనిజ పదార్థాలను గ్రహించి వాటిని మళ్లీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు లాంటి సంక్లిష్ట ఆహార పదార్థాలుగా మార్చుకుంటాయి. అవి తిరిగి ఆహార గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థలోని జీవజాతులకు అందుతాయి. ఈ వలయం నిరంతరం కొనసాగుతుండటంతో ఆవరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. 

 

పోషక వలయాలను కింది విధంగా విభజించారు.

 

ఆక్సిజన్‌ వలయం: పరిసరాల్లోని జీవులకు, నిర్జీవ పదార్థాలకు మధ్య జరిగే ఆక్సిజన్‌ వినిమయాన్ని ఆక్సిజన్‌ వలయం అంటారు. చెట్లు గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, నీరు, సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరిపి తిరిగి ఆకుల ద్వారా ఆక్సిజన్‌ను గాలిలోకి విడుదల చేస్తుంటాయి. వాతావరణంలో 21% వరకు ఉండే ఆక్సిజన్‌ నీటిలోనూ కొంత కరిగి ఉంటుంది. అదేవిధంగా ఓజోన్‌ పొరలో కూడా ఆక్సిజన్‌ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్‌ పుష్కలంగా లభించి సమస్త ప్రాణుల శ్వాసక్రియకు సరిపోతుంది.

 

కర్బన వలయం: వృక్ష, జంతు కణజాలాల నిర్మాణానికి కార్బన్‌ వెన్నెముక లాంటిది. భూమి మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణంలో వాయు స్థితిలో లభించే కార్బన్‌ డై ఆక్సైడ్‌ని సూర్యకాంతి సమక్షంలో మొక్కలు శోషించుకుని కార్బోహైడ్రేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందిస్తాయి. ఈ పోషకం ఉత్పత్తిదారులు, వినియోగదారులకు బదిలీ అవుతూ చివరగా బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు లాంటి విచ్చిన్నకారుల వల్ల సరళ అకర్బన పదార్థాలుగా విడిపోతుంది. అంతిమంగా దీనిలోని కార్బన్‌ వాయుస్థితిలో వాతావరణంలోకి, కార్బోనేట్, బైకార్బోనేట్‌ల రూపంలో జలావరణం, శిలావరణంలోకి బదిలీ అవుతుంది. ఈవిధంగా కార్బన్‌ ఘన, ద్రవ, వాయు స్థితిలో చక్రీయంగా బదిలీ అవుతూ తిరిగి మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో కార్బోనేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందుతుంది.

 

నత్రజని వలయం: వాతావరణంలో నైట్రోజన్‌ వాయువు 78% వరకు ఉంటుంది. ఇది జడవాయువు. రసాయన చర్యల్లో పాల్గొనదు. జీవులకు, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు. ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాల నిర్మాణానికి నత్రజని మూలాధారం. అయినప్పటికీ జీవజాతులు నైట్రోజన్‌ని పరోక్షంగానే గ్రహిస్తాయి. రైజోబియం లాంటి బ్యాక్టీరియాల వల్ల వాతావరణంలోని నైట్రోజన్‌ వాయువు నేలలో నైట్రేట్లుగా స్థిరీకరణకు గురవుతుంది. దీన్నే నత్రజని స్థాపన అంటారు. ఈ నైట్రేట్లను వృక్షాలు నేల నుంచి గ్రహిస్తాయి. నత్రజని స్థాపన వల్ల వాతావరణంలోని అకర్బన నత్రజని, కర్బన నత్రజనిగా మారి మొక్కల్లోకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాల్లో కర్బన నత్రజని ప్రొటీన్లుగా మారుతుంది. మొక్కల కళేబరాల్లోని ఈ కర్బన నత్రజని సూడోమోనాస్‌ లాంటి నత్రీకరణ బ్యాక్టీరియా వల్ల వినత్రీకరణ (డీనైట్రిఫికేషన్‌) జరిగి కొంత నైట్రేట్లుగా నేలలోకి పోగా, మరికొంత స్వేచ్ఛా నత్రజని వాయువుగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ విధంగా జీవులకూ, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు.

 

ఫాస్ఫరస్‌ వలయం: శక్తి వాహకంగా వ్యవహరించే ఫాస్ఫరస్‌ అవక్షేప వలయాల్లో చాలా ముఖ్యమైంది. ఫాస్ఫరస్‌ మూలకం అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ATP) గా కణజాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది భౌమావరణ వ్యవస్థలోనూ, జలావరణ వ్యవస్థలోనూ కొద్దిమొత్తంలో లభిస్తుంది. ఫాస్ఫాటిక్‌ శిలల శైథిల్యం ద్వారా లభించిన ఆర్ధోఫాస్ఫేట్‌ అయాన్ల రూపంలో ఉన్న అకర్బన ఫాస్ఫేట్లు.. వృక్షాల జీవన ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి ఆహారపు గొలుసుల ద్వారా క్రమంగా వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు ప్రవహించి చివరకు నేలలో కలుస్తాయి. నేలలో విడుదలైన ఫాస్ఫేట్లు తిరిగి వృక్షాలకు వినియోగమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్‌ ఎరువుల వాడకం ఎక్కువవడంతో నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోయి యూట్రిఫికేషన్‌కు దారితీసి జలకాలుష్యం ఏర్పడుతోంది. 

 

జల వలయం: జీవులకు, వాటి చుట్టూ ఉన్న వాతావరణం, శిలావరణం, జలావరణం లాంటి భౌతిక పరిసరాలకు మధ్య నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని జలచక్రంగా పిలుస్తారు. సూర్యుడి నుంచి భూమికి చేరే సౌర వికిరణం ద్వారా జలాశయాలు, మంచు ప్రాంతాల నుంచి బాష్పీభవనం (నీరు ఆవిరవడం), ఉత్పతనం (ఘన పదార్థాలు నీరుగా ఆవిరవడం), బాష్పోత్సేకం (చెట్ల నుంచి విడుదలయ్యే నీటిఆవిరి) లాంటి ప్రక్రియల ద్వారా నీరు గాలిలోకి చేరి మేఘాలుగా మారుతుంది. తిరిగి మేఘాలు ద్రవీభవనం చెంది వర్షంగా, ఘనీభవనం చెంది మంచుగా భూమికి చేరతాయి. ఈవిధంగా భూమిపై ఉన్న సమస్త జీవజాలానికి కావాల్సిన నీటి అవసరాలు తీరుతున్నాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. జీవ సందీప్తి అంటే ఏమిటి?  

1) కొన్ని జీవులు కాంతి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం

2) కొన్ని జీవులు కాంతిని గ్రహించడం

3) కొన్ని జీవులు కాంతిని తీసుకోకపోవడం

4) గాలి, సూర్యరశ్మి సంయోగం చెందడం

 

2. సూర్యుడి నుంచి భూమికి చేరే సూర్యకాంతిని ఏమంటారు? 

1) సౌరవికిరణం 2) సూర్యపుటం 3) భూవికిరణం 4) పైవేవీకాదు

 

3. బాష్పోత్సేకం అంటే ఏమిటి?

1) చెట్లు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం           

2) చెట్లు ఆకుల ద్వారా నీటిని విడిచిపెట్టడం

3) చెట్లు ఆకు రాల్చడం                   

4) చెట్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకోవడం

 

4. ఘనపదార్థాలు నేరుగా ఆవిరవడాన్ని ఏమంటారు? 

1) బాష్పోత్సేకం 2) బాష్పీభవనం 3) ఉత్పతనం 4) హైడ్రేషన్‌

 

5. సౌర వికిరణం అంటే ఏమిటి?

1) సూర్యుడు బయటకు విడుదల చేసే శక్తి 

2) సూర్యుడి నుంచి భూమి గ్రహించే శక్తి

3) సూర్యుడి కేంద్రంలో ఉద్భవించే శక్తి 

4) సౌరశక్తి వల్ల నీరు ఆవిరవడం

 

6. వృక్ష, జంతు కణజాల నిర్మాణానికి వెన్నెముక లాంటిది? 

1) ఆక్సిజన్‌ 2) నైట్రోజన్‌ 3) కార్బన్‌ 4) హైడ్రోజన్‌

 

7. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి అకర్బన పోషకాల మొత్తం పరిమాణాన్ని ఏమని పిలుస్తారు?

1) నిలకడ స్థితి 2) బయోమ్‌ 3) జీవ ద్రవ్యరాశి 4) బయోట్‌

 

8. ఆవరణ వ్యవస్థలో జీవులకు, పరిసరాలకు మధ్య పోషకాల చక్రీయ బదిలీ విధానాన్ని ఏమంటారు?  

1) భూ - జీవ వలయం 2) భూ- రసాయన వలయం 

3) భూ విజ్ఞాన వలయం 4) జీవ- భూ- రసాయన వలయం

 

సమధానాలు

1-1, 2-2, 3-2, 4-3, 5-1, 6-3, 7-1, 8-4.

 

జల వలయం:

Condensation = ద్రవీభవనం

Precipitation = అవపాతం

Evaporation = బాష్పీభవనం

Rain=  వర్షం

Snow = మంచు

Surface Runoff = ఉపరితల నీరు

Ground Water  = భూగర్భ జలం

 

జల్లు సద్గుణరావు


 

Posted Date : 19-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌