• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక వృక్షశాస్త్రం

మనిషికి మొక్కకు మనుగడ బంధం! 

 


అందరూ తినే తిండి, ధరించే వస్త్రాలు, నివసించే ఇల్లు, వేసుకునే ఔషధాలు, వాడే జీవ ఇంధనాలు తదితరాలన్నీ మొక్కలు ప్రసాదించినవే. అవి లేకపోతే మనిషి మనుగడ లేదు.  అన్ని రకాల వాణిజ్య అవసరాలు, ఉత్పత్తుల కోసం  ప్రధానంగా వాటిపైనే ఆధారపడాలి. మానవ జీవనానికి ఉపయోగకరమైన పదార్థాలను అందించే మొక్కల అధ్యయనమే ఆర్థిక వృక్షశాస్త్రం. ముఖ్యమైన మొక్కలు, వాటి నుంచి లభించే ఉత్పత్తులతో పాటు ఇతర ఆహార, ఔషధ, వాణిజ్య పంటల గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. మనుషులకు, మొక్కలకు మధ్య ఉన్న సంబంధాన్ని పోటీ పరీక్షల కోణంలో అర్థం చేసుకోవాలి.

మనిషి అనాదిగా మొక్కలపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఆహార, ఔషధ, వాణిజ్య ఉత్పత్తుల కోసం మొక్కలను సాగు చేస్తున్నాడు. కొన్ని ఉత్పత్తులను నేరుగా అటవీ మొక్కల నుంచి సేకరిస్తున్నాడు.

ధాన్యాలు: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభాకు ప్రధాన ఆహారం ధాన్యాలే. ధాన్యం మొక్కలు గడ్డిజాతికి (గ్రామీనే కుటుంబం) చెందినవి. వీటి నుంచి పిండిపదార్థాలు లభిస్తాయి. వరి, గోధుమ, మొక్కజొన్న లాంటి వాటి పెద్ద గింజలున్న వాటిని ప్రధాన ధాన్యాలు అంటారు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు లాంటి చిన్నగింజలున్న వాటిని చిరుధాన్యాలు అంటారు. చిరుధాన్యాల్లో పూర్తి గింజను ఆహారంగా తీసుకుంటారు. వీటిలో పోషక విలువలు, పీచు ఎక్కువ. 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి 2021లో ప్రకటించింది.

చిరుధాన్యాలు  ప్రత్యాయనామం  శాస్త్రీయనామం

జొన్నలు - సొర్గం మిల్లెట్‌ - సొర్గం బైకోలర్‌

సజ్జలు - పెరల్‌ మిల్లెట్‌ -పెన్నిసెటమ్‌ గ్లాకమ్‌ 

కొర్రలు - ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ - సెటారియా ఇటాలికా

రాగులు - ఫింగర్‌ మిల్లెట్‌ - ఇల్యుసిన్‌ కొరకానా  

అరికెలు - కోడో మిల్లెట్‌ - పాస్‌పాలమ్‌ స్కోరోబైక్యులేటమ్‌ 

ఊదలు - బార్న్‌యాడ్‌ మిల్లెట్‌ - ఎఖైనోకోలా ఎస్కులెంటా  

వరిగెలు - ప్రోసో మిల్లెట్‌ - పానికమ్‌ మిల్లియేసియమ్‌ 

సామలు - లిటిల్‌ మిల్లెట్‌ - పానికమ్‌ సుమట్రెన్స్‌ 

పప్పుధాన్యాలు: మానవుడి ఆహారంగా ధాన్యాల తర్వాత రెండో స్థానంలో ఉన్నది పప్పుధాన్యాలే. వీటినుంచి మనకు ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటినే లెగ్యూమ్స్‌ అంటారు. కందులు, శనగలు, మినుములు, పెసలు, వేరుశనగ, బఠానీ, చిక్కుడు, సోయాచిక్కుడు మొదలైనవి ముఖ్యమైన పప్పుధాన్యాలు. సోయాచిక్కుడులో అత్యధికంగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, లిపిడ్‌లు లభిస్తాయి.

నూనెనిచ్చే మొక్కలు: మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలను వృక్ష సంబంధ నూనెలు అంటారు. వివిధ రకాల మొక్కల గింజల నుంచి నూనెలను సంగ్రహిస్తారు. మొక్కల నూనెలను ఆహారంగా, సబ్బుల తయారీకి, దీపాలు వెలిగించడానికి, కొవ్వొత్తులు, కందెనగా, పెయింట్లు, వార్నిష్‌ల తయారీలో వాడతారు. నూనె మొక్కలను ఆహారయోగ్యమైనవి, ఆహారయోగ్యం కానివిగా విభజించవచ్చు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కొబ్బరి, కుసుమ, పత్తి నూనె, పామాయిల్, ఆలివ్‌ ఆయిల్, సోయా వంటివి ఆహారయోగ్యమైనవి. బియ్యపు గింజల పైపొర నుంచి తీసిన తవుడు నుంచి రైన్‌బ్రాన్‌ ఆయిల్‌ను వేరుచేస్తారు. ఆముదం, జట్రోఫా (అడవి ఆముదం), కానుగ మొక్కల నుంచి తీసిన నూనెలు ఆహారయోగ్యం కావు. వీటిలో జట్రోఫా, కానుగ మొక్కల నూనెలను బయోడీజిల్‌ తయారీకి ఉపయోగిస్తారు.


బాష్పశీల నూనెలు: కొన్ని మొక్కల పత్రాలు, పుష్పాలు, కాండం, కాయల నుంచి ఆవిరి గుణం ఉన్న నూనెలను డిస్టిలేషన్‌ ప్రక్రియ ద్వారా వేరుచేస్తారు. వీటిని సబ్బులు, అగరొత్తులు, అత్తరు (పెర్‌ఫ్యూమ్స్‌) తయారీలో వాడతారు. మల్లె, గులాబీ, నిమ్మగడ్డి, యూకలిప్టస్, జిరానియం, పామరోసా, లావెండర్‌ లాంటివి వీటికి ఉదాహరణ.


ఔషధ మొక్కలు: పూర్వకాలం నుంచి వివిధ రకాల మొక్కల భాగాలను ఔషధాలుగా వాడుతున్నారు. ఆయుర్వేదంలో మొక్క పూర్తిభాగాన్ని ఔషధంగా వాడితే, ఇతర వైద్య విధానంలో మొక్క భాగాల నుంచి పరిశుద్ధ స్థితిలో సంగ్రహించిన వాటిని ఔషధంగా వినియోగిస్తున్నారు. 


1) సింఖోనా: ఈ మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్‌ అనే ఔషధాన్ని మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తున్నారు.

2) రావుల్ఫియా సర్పైంటైనా: దీనినే సర్పగంధి అంటారు. దీని వేరు కషాయాన్ని మూర్చ రోగానికి, హృద్రోగాలకు, పాముకాటుకు, జీర్ణాశయంలో పురుగుల నివారణకు వాడతారు. ఈ మొక్క వేరులో ఉండే రిస్పరిన్‌ రక్తపోటుకు ఔషధ]ంగా పనిచేస్తుంది.

3) అట్రోఫా బెల్లడోనా: దీని ఆకులు, వేర్ల నుంచి తీసిన బెల్లడోనా ఔషధాన్ని కంటి పరీక్ష జరపడానికి అనువుగా కంటిపాపను పెద్దదిగా చేయడానికి, శ్వాసక్రియను, రక్తప్రసరణను ఉత్తేజం చేయడానికి వాడతారు.

4) వేప: వేపలోని అన్ని భాగాలను చర్మవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. వేప కషాయాన్ని బ్యాక్టీరియా నాశనిగా, జీర్ణాశయ వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. వేపలో నింబిన్‌ అజాడిరక్టస్‌ అనే రసాయనాలు కీటకనాశనులుగా ఉపయోగపడతాయి.

5) కథరాంథస్‌ రోజియస్‌: దీనిని బిళ్ల గన్నేరు అంటారు. ఈ మొక్క వేర్లు, పత్రాల్లోని విన్‌బ్లాస్టిన్, విన్‌క్రిస్టిన్‌ అనే రసాయనాలను తెల్లరక్తకణాల క్యాన్సర్‌ (ల్యుకేమియా) నివారణకు వాడతారు.

6) డిజిటాలిస్‌ పర్పూరియా: ఈ మొక్క నుంచి డిజిటాలిస్‌ ఔషధాన్ని సంగ్రహించి హృద్రోగానికి ఔషధంగా వాడతారు. కార్డియోటానిక్‌గా వినియోగిస్తారు.

7) ఆండ్రోగ్రాఫిస్‌ పానిక్యులేటా: ఈ మొక్క ఆకులు లేదా లేతకొమ్మల నుంచి ఆండ్రోగ్రాఫోలైడ్‌ లేదా కాల్‌మేఘ్‌ అనే ఔషధాన్ని సంగ్రహిస్తారు. దీన్ని జీర్ణకారిగా, పేగుల్లో క్రిమిసంహారక ఔషధంగా, జ్వరనివారిణిగా ఉపయోగిస్తారు.

8) ఎఫిడ్రా: దీని కాండం, శాఖల నుంచి ఎఫిడ్రిన్‌ లభిస్తుంది. దీన్ని ఉబ్బసం (ఆస్తమా), హే జ్వరం (Hay Fever), కోరింత దగ్గులకు ఔషధంగా వాడతారు.


రబ్బరునిచ్చే మొక్కలు: ప్రపంచవ్యాప్తంగా అనేక రబ్బరునిచ్చే మొక్కలున్నప్పటికీ కొన్ని జాతులే ప్రముఖమైనవి.

1) హీవియా బ్రెజిలియన్సిస్‌: దీన్ని పారా రబ్బరు అంటారు. బ్రెజిల్, మలేసియా, శ్రీలంక, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌ దేశాల్లో సాగు చేస్తారు.

2) ఫైకస్‌ ఇలాస్టికా: ఇండియన్‌ రబ్బరు లేదా అస్సాం రబ్బరు అంటారు. ఎక్కువగా అస్సాంలో సాగవుతుంది. రబ్బరు చెట్టు కాండానికి గాటు పెట్టి లేటెక్స్‌ను సంగ్రహిస్తారు. దీన్ని గంధకం (సల్ఫర్‌)తో కలిపి వేడి చేస్తారు. ఈ ప్రక్రియను వల్కనైజేషన్‌ అంటారు. ఇలా చేయడం వల్ల గట్టిగా, స్థితిస్థాపకంగా ఉండి విరిగిపోకుండా ఉంటుంది. ఈ ప్రక్రియను కనుక్కున్నవారు ఛార్లెస్‌ గుడ్‌ ఇయర్‌.


నార ఇచ్చే మొక్కలు: మానవుడు ఆహారం, ఔషధాల తర్వాత అధికంగా నార మొక్కలపై ఆధారపడతాడు.

1) పత్తి: దీన్ని గాసీపియం జాతుల మొక్కల విత్తనాల బాహ్య చర్మ కేశాల నుంచి సేకరిస్తారు. పత్తిని వస్త్రాలు, నూలు పరిశ్రమల్లో వాడతారు.

2) జనపనార: దీన్ని సన్‌హెంప్‌ అంటారు. ఇది బాస్ట్‌ఫైబర్‌ రకం నార. గోనె సంచులు, తాళ్ల తయారీకి వాడతారు.

3) గోణినార: దీన్ని బెంగాల్‌ జూట్‌ అంటారు. ఇది కార్ఖోరస్‌ జాతుల మొక్కల నుంచి లభిస్తుంది. ఇది బాస్ట్‌ ఫైబర్‌ రకం నార. సంచులు, కాన్వాస్‌ వస్త్రాల తయారీకి వాడతారు.

4) గోగునార: దీన్ని భీమిలిపట్నం జూట్‌ అంటారు. గోనె సంచులు, చాపలు, చేపల వలల తయారీకి ఉపయోగిస్తారు.

5) ఫ్లాక్స్‌ నార: అవిశ మొక్క నుంచి లభిస్తుంది.

6) రమీనార: బొహ్‌మెరియా నివియా మొక్క నుంచి సంగ్రహిస్తారు.

7) కిత్తనార: దీన్ని సిసాల్‌హెంప్‌ అంటారు. అగేవ్‌ జాతుల మొక్కల పత్రాల నుంచి లభిస్తుంది. ఇది దృఢమైన నార.


మనీలాహెంప్‌: దీన్ని సాధారణంగా అరటినారగా పిలుస్తారు. దృఢమైన నారలు, పత్రపీఠాల నుంచి వీటిని సంగ్రహిస్తారు. మ్యూసా జాతుల మొక్కలను ఈ నార కోసం ఉపయోగిస్తారు. తాళ్లు, బుట్టలు, అలంకరణ వస్తువులు, డోర్‌మ్యాట్స్‌ తయారీకి వినియోగిస్తారు.


కొబ్బరిపీచు: దీన్ని కోయర్‌ అంటారు. ఫలకవచం నుంచి ఈ నారను వేరుచేస్తారు. తాళ్లు, తివాచీలు, డోర్‌మ్యాట్స్‌ తయారీకి వాడతారు.

సుగంధ ద్రవ్యాలు, పోపు ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలను ఆహారానికి రంగు, రుచి, వాసన ఇవ్వడానికి, నిల్వకు వాడతారు. వీటికి వాణిజ్య విలువ ఎక్కువ.


కాండం నుంచి లభించేవి: అల్లం, పసుపు. ఇవి భూగర్భకాండమైన కొమ్ము నుంచి లభిస్తాయి.


పత్రాల నుంచి లభించేవి: కొత్తిమీర, పుదీనా 


వృక్షాల బెరడు నుంచి లభించేవి: దాల్చిన చెక్క


పుష్పాలు, మొగ్గల నుంచి లభించేవి: లవంగాలు (పుష్ప మొగ్గలు), కుంకుమ పువ్వు (పుష్పంలోని కీలం, కీలాగ్రం).


విత్తనాల నుంచి లభించేవి: ఆవాలు


ఫలాల నుంచి లభించేవి: ధనియాలు, జీలకర్ర, వాము, మిరప, ఏలకులు, మిరియాలు. వీటిలో మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు, బ్లాక్‌ గోల్డ్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. యాలకులను సుంగధ ద్రవ్యాల రాణిగా పిలుస్తారు.

జిగురునిచ్చే మొక్కలు 

వివిధ మొక్కల నుంచి లభించే జిగురులను జెల్లీ, చూయింగమ్, ఐస్‌క్రీం, సూప్స్, వస్త్ర పరిశ్రమల్లో, ఐస్‌క్రీమ్‌ తయారీ, మిఠాయి తయారీ లాంటి వాటిలో వాడతున్నారు. జిగురునిచ్చే మొక్కలు పలు రకాలుగా ఉన్నాయి.

అకాషియా సెనెగల్‌: ఈ మొక్క బెరడు నుంచి గ్రహించే జిగురును గమ్‌ అరాబిక్‌ అంటారు.

సిరాటోనియా సిలిక్వా: ఈ మొక్క విత్తనాల నుంచి లభించే జిగురును కారబ్‌గమ్‌ అని పిలుస్తారు.

అనగీసన్‌ లాటిఫోలియా: దీని నుంచి లభించే జిగురును ఘట్టిగమ్‌ అంటారు.

స్టెర్క్యూలియా యూరెన్స్‌: దీని నుంచి లభించే గమ్‌ను కరయగమ్‌గా వ్యవహరిస్తారు.

ఆస్ట్రాగలస్‌ గమ్మిఫెరా: ఈ మొక్క కాండం నుంచి లభించే జిగురును ట్రాగాకాంత్‌గమ్‌ అంటారు.

 

పానీయాలనిచ్చే మొక్కలు

తేయాకు: కెమిలియా మొక్కల జాతుల లేత ఆకులను నీటిలో మరిగించి తేనీటిని తయారుచేస్తారు.

కాఫీ: కాఫీయా జాతుల మొక్కల గింజల నుంచి వచ్చిన పొడిని కాఫీగా వాడతారు.

కోకో: థియోబ్రోమా కకోవో అనే మొక్క గింజల నుంచి గీసిన పదార్థాలను కోకో అంటారు. దీన్ని చాక్లెట్, పానీయాల తయారీలో ఉపయోగిస్తారు.

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 30-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌