• facebook
  • whatsapp
  • telegram

దృష్టి దోషాలు (కాంతి)

  దూరంగా.. దగ్గరగా.. అస్పష్టంగా!


కంటిచూపు సామర్థ్యం తగిపోవడాన్నే దృష్టి లోపం అంటారు. కంటిలోని కండరాల్లో తలెత్తే ఇబ్బందులను కటకాలను ఉపయోగించి సరిచేయవచ్చు. వివిధరకాల దృష్టి లోపాలు, తీవ్రత, వాటికి కారణాలు, సవరించే విధానాల గురించి ప్రాథమిక పరిజ్ఞానం పరీక్షార్థులకు ఉండాలి. అలాగే సహజమైన పరారుణ, అతినీలలోహిత కిరణాల ప్రభావాలతో పాటు లేసర్, మేసర్‌ వంటి కృత్రిమ కిరణాల ప్రత్యేకతలు, వాటికున్న విస్తృత అనువర్తనాలపై అవగాహన పెంచుకోవాలి. 

మనిషి కంటిలోని సిలియరీ కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వల్ల, కంటి కటక నాభ్యంతరాన్ని అవి సర్దుబాటు చేయలేనప్పుడు దృష్టిలోపాలు సంభవిస్తాయి. మానవుడి కన్ను కుంభాకార కటకం మాదిరిగా పనిచేస్తుంది.

 


1) హ్రస్వ దృష్టి(Myopia): ఈ లోపం ఉండే వ్యక్తులు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు. ఇలాంటి వారు దూరంగా ఉన్న వస్తువులను చూసినప్పుడు వాటి ప్రతిబింబాలు రెటీనాకు ముందు భాగానే ఏర్పడతాయి. ఈ లోపాన్ని నివారించడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు.


2) దీర్ఘదృష్టి (Hypermetropia): ఈ లోపం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు. వీరు దగ్గరగా ఉన్న వస్తువులను చూసినప్పుడు వాటి ప్రతిబింబాలు రెటీనా వెనుక భాగంలో ఏర్పడతాయి. ఈ లోపాన్ని నివారించడానికి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు.


3) చత్వారం(Presbyopia) : వయసు పెరిగే కొద్దీ కంటిలోని సిలియరీ కండరాలు పటుత్వం కోల్పోవడం వల్ల చత్వారం ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తులకు హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి రెండూ ఉంటాయి. ఈ లోపాన్ని నివారించడానికి ద్వినాభ్యంతర కటకాన్ని ఉపయోగిస్తారు. పుటాకార, కుంభాకార కటక సంయోగాన్ని కంటి అద్దాల్లో ఉపయోగిస్తారు.


4) అసమదృష్టి(Astigmatism): ఈ లోపం ఉన్న వ్యక్తులు ఒకేసారి అడ్డుగీతలు, నిలువు గీతలను స్పష్టంగా చూడలేరు. ఈ లోపాన్ని సవరించడానికి స్థూపాకార కటకాలను ఉపయోగిస్తారు.


5) వర్ణాంధత్వం : ఇదొక జన్యు సంబంధ వ్యాధి. దీనివల్ల వ్యక్తులు ప్రాథమిక వర్ణాలైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు. * ఎరుపు రంగును గుర్తించలేని లక్షణం - ప్రోటోనోపియా * నీలం రంగును గుర్తించలేని లక్షణం - ట్రయటోనోపియా * ఆకుపచ్చ రంగును గుర్తించలేని లక్షణం - డ్యుటిరోనోపియా


6) రేచీకటి(Night blindness): ఇది విటమిన్‌  'A' లోపం వల్ల సంభవించే వ్యాధి. దీన్ని నివారించడానికి ఎక్కువగా క్యారెట్, పసుపుపచ్చని పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 9 నెలల వయసులో విటమిన్‌  'A'చుక్కలు అందజేస్తారు.


7) కాటరాక్ట్‌ (కంటి శుక్లాలు): కంటి కటకంలోని ప్రొటీన్స్‌ గుంపుగా ఏర్పడటం వల్ల చివరికి అంధ]త్వం కలుగుతుంది. స్పష్ట దృష్టి కనీస దూరానికి, అనంత దూరానికి మధ్యలో ఏదో ఒక స్థానంలో వస్తువు ఉంటే కంటి కటకం తన నాభ్యంతరాన్ని 2.27 cmనుంచి 2.5 cmలకు మధ్యస్థంగా ఉండేలా సర్దుబాటు చేసుకుంటుంది. తద్వారా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు. కొన్ని సందర్భాల్లో కన్ను తన సర్దుబాటు సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంది. అలాంటి పరిస్థితుల్లో సదరు వ్యక్తి వస్తువును సులభంగా, స్పష్టంగా చూడలేడు. కంటి కటక సర్దుబాటు దోషాల వల్ల చూపు మసక బారినట్లు అవుతుంది.


లేసర్‌ కాంతి: LASERకు పూర్తిరూపం Light Amplification by Stimulated Emission of Radiation.  దీనినే ఉత్తేజిత కాంతి ఉద్గారం వల్ల కాంతి వర్ధనం అంటారు. లేసర్‌కు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించినవారు చార్లెస్‌ హెచ్‌ టౌన్స్‌.


* హీలియం - నియాన్‌ లేసర్‌ను కనుక్కున్నవారు అలీ జవాన్‌. ఇదొక వాయుస్థితి లేసర్‌. దీని నుంచి వచ్చే లేసర్‌ కాంతి తరంగ దైర్ఘ్యం 6328  A0.


* రూబీ లేసర్‌ - ఘనస్థితి లేసర్‌కు ఉదాహరణ. గ్జినాన్‌ కాంతిని ఉపయోగించి ఈ లేసర్‌లో ****జనాభా విలోమాన్ని పొందొచ్చు. దీని తరంగ దైర్ఘ్యం 6943 A0


లేసర్‌ కాంతి ప్రత్యేక లక్షణాలు:


1) సంబద్ధత: కాంతి జనకం నుంచి వచ్చే ప్రతి తరంగం ఇతర తరంగాలతో కాలం, స్థానం పరంగా స్థిరమైన దశా భేదాన్ని కలిగి ఉండటం.


2) ఏకదిశనీయత: లేసర్‌ కాంతి పక్కదిశలో ఎక్కువ విస్తరించకుండా ఒకే రేఖలా ప్రయాణిస్తుంది.


3) ఏకవర్ణీయత: లేసర్‌ నుంచి వచ్చేకాంతి తరంగాలన్నీ దాదాపు ఒకే తరంగ దైౖర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి.* తరంగదైర్ఘ్య వ్యాప్తి 10 A0 లోపు ఉంటుంది.


4) తీవ్రత: లేసర్‌ కాంతికి అధిక తీవ్రత ఉంటుంది. లేసర్‌ దిశనీయత వల్ల తక్కువ ప్రదేశంలో ఎక్కువ తీవ్రత వస్తుంది. లేసర్‌ కాంతి ఉత్పాదన నాలుగు దశల్లో జరుగుతుంది. అవి శోషణం, స్వచ్ఛంద ఉద్గారం, పంపింగ్, ***జనాభా విలోమం, ఉత్తేజిత ఉద్గారం. ఒక అణువులో భూస్థాయి కంటే ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ ఎలక్ట్రాన్‌లు ఉండటాన్ని ***జనాభా విలోమం అంటారు.


లేసర్‌ రకాలు:  లేసర్‌ ప్రక్రియ జరిగే యానకం ఆధారంగా 4 రకాలు. అవి 1) వాయు లేసర్‌ 2) ద్రవ లేసర్‌ 3) ఘనస్థితి లేసర్‌ 4) అర్ధవాహక లేసర్‌.


లేసర్‌ అనువర్తనాలు:


1) కొలతల రంగం: లేసర్‌ను ఉపయోగించి దూరం, కాలాన్ని కచ్చితంగా కొలవచ్చు. అతి తక్కువ దూరాలు, పరమాణువుల మధ్య దూరాలను కొలవడం ద్వారా పరమాణువుల అంతర్గత నిర్మాణాలను అధ]్యయనం చేయవచ్చు.


2) రక్షణ రంగం: క్షిపణులు, ఉపగ్రహాలకు మార్గనిర్దేశం చేయడంలో; శత్రు విమానాలను కనుక్కోవడానికి, అలాగే శత్రు విమానాలు, ట్యాంకులను నాశనం చేయడానికి లేసర్‌ కిరణాలను వాడతారు.


3) వైద్య రంగంలో: శుక్లాలను (కాటరాక్ట్‌) తొలగించడానికి, మూత్రపిండాలు (కిడ్నీలు), పిత్తాశయంలో ఏర్పడే రాళ్లను పగలగొట్టడానికి; క్యాన్సర్‌ రోగ నివారణకు, నిర్ధారణకు; నెత్తురు చిందకుండా చేసే శస్త్రచికిత్సలో వాడతారు. కాస్మోటిక్‌ సర్జరీల్లోనూ లేసర్‌ను ఉపయోగిస్తారు.


4) ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(IT): CD, DVD నిర్మాణంలో, డేటా సేకరణ, దాన్ని నిక్షిప్తం చేయడానికి లేసర్లను వినియోగిస్తారు.


5) పారిశ్రామిక రంగం: లేసర్‌లను అత్యంత సూక్ష్మమైన కాంతిపుంజంగా ఫోకస్‌ చేయవచ్చు. లోహాలతో రంధ్రాలు చేయడానికి, లోహాలను అతికించడానికి ఇది ఉపయోగపడుతుంది. సమాచార ప్రసారంలో, హోలోగ్రామ్‌ను నిర్మించడంలో లైబ్రరీల్లోనూ, పుస్తకాలు, ఇతర వుస్తువుల ఖరీదులను చదవడంలో లేసర్‌లను ఉపయోగిస్తారు.

మేసర్‌: MASERపూర్తి రూపం Microwave Amplification by Stimulated Emission of Radiation. గోర్డాన్, గీగర్, టౌన్స్‌ 1952లో కనుక్కున్నారు. దీన్ని ఉపయోగించి ఆకాశంలో ఎగురుతున్న, సముద్రంలో మునిగిఉన్న, ప్రయాణిస్తున్న వస్తువుల స్థానాన్ని, వాటి ప్రయాణ దిశను గుర్తించవచ్చు.


లైడార్‌: LIDAR పూర్తి రూపం Light Detection And Ranging. ఇది సర్వేకు సంబంధించిన ఒక సాంకేతిక పద్ధతి. లేసర్‌ కాంతిని ఉపయోగించి లక్ష్యాన్ని కనుక్కుని దూరాన్ని కొలిచే పద్ధతి. ఇటీవల గోదావరి నదిపై నిర్మించబోయే ప్రాజెక్టులకు సరైన ప్రదేశాల ఎంపికకు ప్రభుత్వం ఈ లైడార్‌ సర్వేను చేయించింది.

అతి నీలలోహిత కిరణాలు: వీటిని రిట్టర్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇవి మానవుడి చర్మంపై పడినప్పుడు చర్మవ్యాధులతో పాటు, క్యాన్సర్‌ కూడా వస్తుంది. ఈ కిరణాల నుంచి భూమిపై ఉండే జీవకోటిని ఓజోన్‌ పొర రక్షిస్తోంది. వేలిముద్రలను విశ్లేషించడానికి, నకిలీ పత్రాలను గుర్తించడానికి ఈ కిరణాలను ఉపయోగిస్తారు. క్రిమిసంహారిగానూ వాడతారు. సాధారణ ట్యూబ్‌లైట్లలో ఈ కిరణాలు ఉత్పత్తి అవుతాయి.


పరారుణ కిరణాలు: ఈ కిరణాలను హెర్షల్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. వీటి ఉనికిని గుర్తించడానికి రాతి ఉప్పుతో తయారు చేసిన పట్టకాలు అనుకూలం. ఎందుకంటే వీటి ద్వారా ఈ కిరణాలు చొచ్చుకుపోతాయి. చీకటిలో, పొగమంచులో ఫొటోలు తీయడానికి, రాత్రిపూట వాడే దృక్‌ సాధనాల్లో వీటిని ఉపయోగిస్తారు. రహస్య సంకేతాలను పంపడానికి, గోడలపై పాత చిత్రాలను తొలగించడానికి వీటిని వినియోగిస్తారు.

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో హ్రస్వ దృష్టి లోపాన్ని నివారించడానికి ఉపయోగించే పరికరం-

1) పుటాకార దర్పణం        2) పుటాకార కటకం

3) కుంభాకార దర్పణం       4) కుంభాకార కటకం

 

2. ఏ లోపం ఉన్న వ్యక్తులు దగ్గరగా ఉన్న వస్తువులను చూస్తే వాటి ప్రతిబింబాలు రెటీనా వెనుక భాగంలో ఏర్పడతాయి?

1) హ్రస్వ దృష్టి    2) దీర్ఘ దృష్టి    3) చత్వారం    4) అసమ దృష్టి

 

3. ఏ లోపం ఉన్న వ్యక్తులకు హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి రెండూ ఏర్పడతాయి?

1) చత్వారం       2) అసమ దృష్టి    3) వర్ణాంధత్వం    4) రేచీకటి

 


4. ఒకేసారి అడ్డుగీతలు, నిలువు గీతలను చూడలేని కంటి లోపం?

1) అసమ దృష్టి    2) వర్ణాంధత్వం   3) రేచీకటి      4) కాటరాక్ట్‌

 

5. కిందివాటిలో జన్యు సంబంధ కంటి లోపాన్ని గుర్తించండి.

1) చత్వారం    2) రేచీకటి    3) వర్ణాంధత్వం   4) కాటరాక్ట్‌


 

6. విటమిన్‌  'A' లోపం వల్ల ఏర్పడే కంటి లోపాన్ని ఏమంటారు?

1) వర్ణాంధత్వం  2) కాటరాక్ట్‌        3) రేచీకటి     4) అసమ దృష్టి


7. కంటి కటకంలో ప్రొటీన్స్‌ గుంపులుగా ఏర్పడటం వల్ల సంభవించే వ్యాధి?

1) రేచీకటి         2) అసమ దృష్టి    3) వర్ణాంధత్వం     4) కాటరాక్ట్‌

 

8. లేసర్‌కు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించినవారు?

1) హెర్షల్‌      2) సిహెచ్‌.టౌన్స్‌        3) అలీ జవాన్‌    4) గోర్దాన్‌

 

9. కండరాల నొప్పులను తొలగించడానికి, బ్రీత్‌ అనలైజర్‌లలో ఉపయోగించే కిరణాలు?

1) పరారుణ కిరణాలు    2) X- కిరణాలు   3)uv-క్రిరణాలు  4) గామా కిరణాలు

 

10. వేలిముద్రలు విశ్లేషించడానికి, నకిలీ పత్రాలను గుర్తించడానికి వాడే కిరణాలు

1)  X-  కిరణాలు  2) గామా కిరణాలు    3)  ir - కిరణాలు    4) uv- క్రిరణాలు

సమాధానాలు: 1-2; 2-2; 3-1; 4-1; 5-3; 6-3; 7-4; 8-2; 9-1; 10-4.




రచయిత: చంటి రాజుపాలెం

Posted Date : 26-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌